కేరళ 'డ్రై'.. పర్యాటకులు బై బై!
'దేవుడి సొంత దేశం'గా పేరొందిన కేరళ.. ఇప్పుడు వెలవెలబోతోంది. పర్యాటకుల రాక ఉన్నట్టుండి ఒక్కసారిగా తగ్గిపోయింది. బ్యాక్ వాటర్స్, బోట్లు, కొండలు, జలపాతాలు, ఇలా ప్రకృతి రమణీయ దృశ్యాలకు పెట్టింది పేరయిన కేరళ అంటే పర్యాటకుల స్వర్గం. జమ్ము కాశ్మీర్ లాంటి ప్రాంతాలతో సమానంగా పర్యాటక ఆదాయం పొందే రాష్ట్రం అది. కానీ ఇప్పుడు మాత్రం పర్యాటకులు వేరే రాష్ట్రాలు చూసుకుంటూ కేరళను చిన్నచూపు చూస్తున్నారట. దీనంతటికీ కారణం ఏంటా అని చూస్తే.. అక్కడి ప్రభుత్వం తాజాగా విధించిన మద్యనిషేధమేనని తేలింది.
వచ్చే శుక్రవారం నాటికల్లా కేరళలో దాదాపు 700 బార్ల లైసెన్సులు రద్దవుతాయి. కేవలం ఫైవ్ స్టార్ హోటళ్లలో మాత్రమే మద్యం సరఫరాకు అనుమతినిస్తున్నారు. అది కూడా ఆదివారాలు మాత్రం పూర్తి డ్రైడే పాటించాల్సిందే. ఈ విషయంలో కోర్టు నుంచి సానుకూల నిర్ణయం వస్తుందని బార్ యజమానులు ఆశిస్తున్నారు. సాధారణంగా పర్యాటకులు వచ్చారంటే.. మద్యపానం పట్ల ఆసక్తి చూపిస్తారు. అందులోనూ బీచ్లు, హౌస్బోట్ల లాంటి చోట్ల మద్యం లేదంటే చాలామందికి నిరాశ కలుగుతుంది. ఇప్పుడు సరిగ్గా ఇదే అంశం అక్కడి పర్యాటకానికి పెద్ద దెబ్బగా మారింది.
మద్యం అమ్మకాలపై పన్ను రూపేణా రాష్ట్ర ప్రభుత్వం 2012-13 సంవత్సరంలో దాదాపు 6వేల కోట్ల రూపాయం ఆర్జించింది. అంతా బాగుంటే ఇది ఈసారి మరింత పెరిగేది. కానీ.. ప్రభుత్వం నిషేధం విధించడంతో దాదాపుగా ఇందులో చాలా భాగాన్ని కోల్పోతుంది. ఇప్పుడు దీంతోపాటు పర్యాటక ఆదాయం కూడా తగ్గుతుంది. ఎందుకంటే.. మద్యం లేకపోతే తాము కేరళ కాకుండా మరో రాష్ట్రాన్ని చూసుకుంటామని దాదాపు 58 శాతం మంది ఓ సర్వేలో తెలిపారు. ఇలాంటి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సంపూర్ణ మద్య నిషేధానికి మాత్రం గట్టిగా కట్టుబడి ఉండాల్సిందేనని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ అంటున్నారు.