'ఆంధ్రా అక్టోపస్'కు ఆగ్రహం
'చేయి చేసుకోవడానికి వెనుకాడను. మీ అంతు చూస్తా' ఈ మాటలన్నది మామూలు వ్యక్తి కాదు. ప్రజలకు ఆదర్శంగా నిలవాల్సిన ప్రజా ప్రతినిధి నోటి నుంచి వెలువడిన ఆణిముత్యాలివి. దేశంలో అత్యంత పురాతన పార్టీకి ప్రాతినిథ్యం వహిస్తున్న నాయకుడి నోటి దరుసుతనానికి రుజువులీ వ్యాఖ్యలు. ఆయనెరో కాదు విజయవాడ లోక్సభ సభ్యుడు లగడపాటి రాజగోపాల్. నిత్య వివాదాలతో ఆయన జగడపాటిగా ప్రసిద్ధి చెందారు. దురుసు ధోరణితో సార్థక నామధేయగా ఆయన నడుచుకుంటున్నారు.
ఆంధ్రా అక్టోపస్గా పేరున్న లగడపాటి మరోసారి పాత్రికేయులపై విరుచుకుపడ్డారు. గతంలో 'సాక్షి' మీడియా ప్రతినిధులపై చిందులేసిన ఈ సర్వేల సర్వారాయుడు తాజాగా తెలంగాణ జర్నలిస్టులపై ఒంటికాలిపై లేచారు. నన్నే ప్రశ్నిస్తారా అంటూ పెట్రేగిపోయారు. జీఓఎం తాను నివేదిక సమర్పించానని చెప్పడానికి లగడపాటి బుధవారం ఢిల్లీలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఎంపీగారు నోటికి పని చెప్పారు. తెలంగాణ జర్నలిస్టుల సంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక నోటికి వచ్చినట్టు దుర్బాషలాడారు. మీ అంతు చూస్తానంటూ హెచ్చరించారు. చేయి చేసుకోవడానికి కూడా వెనుకాడబోనంటూ వీధి రౌడీలా బెదిరించారు.
లగడపాటికి వివాదాలు కొత్త కాదు. గతంలోనూ పలుమార్లు ఆయన వివాదాలకు కేంద్ర బిందువుగా మారారు. మీడియాలో ప్రచారం కోసం ఆయన ఎన్నో విన్యాసాలు చేశారు. తాను పార్లమెంట్ సభ్యుడినన్న విషయం మర్చిపోయి నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు తీరుగా వ్యవహరించారు. రాష్ట్ర విభజనకు సొంత పార్టీ పచ్చ జెండాతో ఊపడంతో లగడపాటికి ఊపిరి సలపడం లేదు. దీంతో ఇన్నాళ్లు సమైక్యం పాట పాడిన ఆయన దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయారు.
ఓవరాక్షన్ కారణంగా అధిష్టానం కూడా ఆయనను దూరం పెట్టింది. సమైక్యాంధ్ర అంటూ గొంతు చించుకుంటున్నా ప్రజలూ ఆయనను నమ్మడం లేదు. వ్యాపారపరంగా కూడా నష్టాల్లో చిక్కుకున్నారని రాజకీయ ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. దిక్కుతోచని స్థితిలో పడిపోయిన లగడపాటి నిరాశ, నిస్పృహతోనే దిగజారి ప్రవరిస్తున్నారని విమర్శిస్తున్నారు. ఇక నుంచైనా హుందాగా నడుచుకోవాలని సలహాయిస్తున్నారు. మరీ లగడపాటి మారతారా?