లగడపాటి రాజగోపాల్
విజయవాడ లోక్సభ మాజీ సభ్యుడు లగడపాటి రాజగోపాల్ రాజకీయ సన్యాసం స్వీకరించి నాలుగు రోజులైనా గడవక ముందే ఆయన మళ్లీ రాజకీయాలలోకి వస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ బిల్లు (తెలంగాణ బిల్లు)కు లోక్సభలో ఆమోదం లభించగానే ఆయన కళ్ల నీళ్లు పెట్టుకున్నారు. ఆ తరువాత రాజ్యసభలో బిల్లుకు ఆమోదం లభించగానే రాజకీయ సన్యాసం తీసుకుంటున్నట్లు ప్రకటించారు. లోక్సభ సభ్యత్వానికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. అవి ఆమోదం పొందాయి. సమైక్యవాదినని చెప్పుకుంటూ లగడపాటి చాలా కాలం పోరాడారు. కాంగ్రెస్ అధిష్టానం మాత్రం సీమాంధ్ర కేంద్ర మంత్రులను, ఎంపిలను తమ చెప్పుచేతలలో పెట్టుకుంది. తను చేయాలనుకున్నది చేసేసింది. అయితే మొదటి నుంచి చెప్పినట్టే రాష్ట్రవిభజన జరిగితే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానన్న రాజగోపాల్ అన్నమాట ప్రకారమే రాజకీయ సన్యాసం తీసుకున్నారు. అంతవరకు బాగానే ఉంది. మళ్లీ ఆ తరువాత జరిగే సంఘటనలే ఆయన మళ్లీ రాజకీయాలలోకి వస్తున్నట్లు తెలియజేస్తున్నాయి.
లగడపాటి ఓ త్యాగమూర్తి అంటూ కీర్తిస్తూ కృష్ణా జిల్లాలో భారీ ప్లెక్సీలు, పోస్లర్లు వెలిశాయి. ఆ ప్లెకీలు, పోస్లర్లపైన లగడపాటిని ఉద్దేశించి “పోరాటమే ఊపిరిగా పోరుబాట పట్టావు. నీ సత్తా చూపావు. రాజకీయ త్యాగివై నిలిచావు. ఆరు కోట్ల ఆంధ్రులకు ఆరాధ్యనీయుడైనావు...ఇట్లు మిత్రుడు, వసంత కృష్ణప్రసాద్” అని ఉంది. విజయవాడ ప్రధాన కూడళ్లలో ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. సీనియర్ రాజకీయ నేత, మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు కుమారుడు వసంత కృష్ణప్రసాద్ వీటిని ఏర్పాటు చేశారు. కృష్ణప్రసాద్కు లగడపాటికి మంచి సాన్నిహిత్యం ఉంది. ప్లెక్సీలు ఏర్పాటు చేయడంతో మంచి దిట్టగా లగడపాటికి పేరుంది. దాంతో ఈ ప్లెక్సీలు చర్చకు దారి తీశాయి.
ఒక్క లగడపాటివే కాకుండా సీమాంధ్ర ఎంపీలతో కూడా అక్కడక్కడ ఫ్లెక్సీలు వెలిశాయి. రాష్ట్ర విభజన జరుగుతుంటే ఏం చేయలేక చివరిక్షణం వరకు పదవుల్లో వేలాడిన వీరు త్యాగమూర్తులు ఎలా అవుతారని పలువురు ప్రశ్నిస్తున్నారు. వారి పోరాటంలో విజయం సాధించి, రాజకీయాల నుంచి నిష్క్రమిస్తే త్యాగశీలురని గానీ, పోరాటయోధులని గానీ అనవచ్చు. ప్రజలు కూడా వారిని నెత్తిన పెట్టుకునే వారు. ఏమీ సాధించలేనివారిని త్యాగమూర్తుగా ఏలా గుర్తించగలం అని అడుగుతున్నారు. అసలే విభజనతో రగిలిపోతున్న జనానికి ఈ ప్లెక్సీలు ఎక్కడలేని కోపాన్ని తెప్పిస్తున్నాయి. కాంగ్రెస్ అన్నా, కాంగ్రెస్ నేతలన్నా జనం మండిపడుతున్నారు. ఈ ప్లెక్సీల వ్యవహారం అంతా లగడపాటి మళ్లీ రాజకీయ పునరాగమనం కోసమేనని పలువురు అంటున్నారు.