లిటిల్ వండర్స్ | Little Wonders | Sakshi
Sakshi News home page

లిటిల్ వండర్స్

Published Thu, Sep 4 2014 12:57 AM | Last Updated on Fri, Mar 22 2019 1:41 PM

లిటిల్ వండర్స్ - Sakshi

లిటిల్ వండర్స్

ఓ కుర్రాడి కుంచె రిపబ్లిక్ ఆఫ్ మాసిడోనియా నుంచి ‘గోల్డెన్ బ్రష్’ అవార్డు సొంతం చేసుకుంది. చెక్ రిపబ్లిక్ నుంచి ‘రోజ్ ఆఫ్ లిడిస్’ పురస్కారం దక్కించుకుంది. మరో బుడతడి బొమ్మలు రెక్కలు కట్టుకుని వెళ్లి పోలండ్ కాన్వాస్‌పై బహుమతులు ఎత్తుకొచ్చాయి. ఇంకో చిన్నారి చిత్రరాజాలకు పలు దేశాల సంస్థలు సలాం చేశాయి. ఇలా.. ఎందరో చిన్నారులు తమ సృజనతో దేశ, విదేశాల్లో ప్రశంసలు అందుకుంటున్నారు. అయితే ఈ అవార్డులు పొందిన చిత్రకారులు సిరిగల వారి పిల్లలు కాదు.. వేలు వెచ్చించి చిత్రకళలో రాటుదేలిన వాళ్లు అంతకన్నా కాదు. వీళ్లంతా పేదరికంలో పుట్టి, పెరుగుతున్న చిన్నారులు. అయితేనేం నేర్చుకోవాలనే తపన.. ఈ పేదబిడ్డల ప్రతిభను ఎల్లలు దాటించింది.
 
ప్రకృతి సోయగం, నిత్య జీవనం, క్రీడలు, క్రీనీడలు.. ఇలా విషయం ఏదైనా సరే ఈ చిన్నారుల ప్రతిభతో అవి సహజత్వానికి ప్రతీకలుగా మారిపోతాయి.  సృజనాత్మకతకు మారు పేరైన వారే.. మాధురి, ప్రహ్లాద్, సోనీ, రాజేశ్. పేదరికం చీకట్లను చీలుస్తూ.. పెయింటింగ్స్‌తో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంటున్నారు.
 
కష్టంలోనూ సడలని ఇష్టం..
ఎర్రబోలీలోని కవిత, సత్యనారాయణల కూతురు మాధురి. అమ్మ నాలుగిళ్లలో పని చేస్తుంది. నాన్న కార్పెంటర్. చిన్నప్పటి నుంచి మాధురికి
 
చిత్రలేఖనం అంటే ఆసక్తి. భారంగా
బతుకీడుస్తున్న ఆ తల్లిదండ్రులు ఎంత కష్టమైనా.. కూతురి ఇష్టంపై నీళ్లు చల్లలేదు. వారి
 ప్రోత్సాహంతో ప్రముఖ చిత్రకారుడు బీఏ రెడ్డి ఆర్ట్ సెంటర్‌లో చేరింది. ఎర్రబోలి నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న హైదర్‌గూడలోని పాఠశాలకు సోదరుడు ప్రభుతో కలసి ప్రతి ఆదివారం కాలినడకనే వెళ్లేది. తొమ్మిదో తరగతి చదువుతున్న మాధురి ఇటు చదువులోనూ.. అటు పెయింటింగ్‌లోనూ రాణిస్తోంది. ఆమె గీసిన చిత్రాలు 20 దేశాల్లో జరిగిన పోటీల్లో బహుమతులు గెలుచుకున్నాయి. పలు అవార్డులు సొంతం చేసుకున్నాయి. అంతేకాదు ఆ చిట్టితల్లికి సెంటర్ ఫర్ కల్చరల్ రిసోర్సెస్ అండ్ ట్రైనింగ్ (సీసీఆర్‌ఏ) స్కాలర్‌షిప్ కూడా లభించింది. మాధురి తమ్ముడు ప్రభు కూడా చిత్రలేఖనంలో రాణిస్తున్నాడు.
 
కళల దారిలో..
జీహెచ్‌ఎంసీలో స్వీపర్‌గా పనిచేస్తున్న కృష్ణవేణి కుమారుడు ప్రహ్లాద్.. పెన్సిల్‌తో అబ్బురపరిచే చిత్రాలు గీస్తున్నాడు. చిన్నప్పుడే తండ్రిని కోల్పోయిన ప్రహ్లాద్ చెక్ రిపబ్లిక్ నుంచి ‘రోజ్ ఆఫ్ లిడిస్’ అవార్డు సొంతం చేసుకున్నాడు. 2014లో రిపబ్లిక్ ఆఫ్ మాసిడోనియా నుంచి ‘గోల్డెన్ బ్రష్’ అవార్డుతో పాటు సీసీఆర్‌టీ (సెంటర్ ఫర్ కల్చరల్ రీసోర్సెస్ అండ్ ట్రైనింగ్) స్కాలర్‌షిప్‌నూ సాధించాడు. బాల్యంలోనే తండ్రిని కోల్పోయిన సోనీ కూడా చిత్రలేఖనంలో ఎన్నో అవార్డులు సొంతం చేసుకుంది.

ఆటోడ్రైవర్ నరసింహ, పని మనిషి లక్ష్మిల కుమారుడు రాజేశ్ హయాక్ కూడా అబ్బురపరిచే పెయింటింగ్స్‌తో దూసుకుపోతున్నాడు. ఎనిమిదో తరగతి చదువుతున్న రాజేశ్ గీసిన చిత్రాలు పోలండ్‌లో జరిగిన పోటీల్లో ప్రథమ బహుమతి గెలుచుకున్నాయి. భవిష్యత్‌లో ప్రఖ్యాత చిత్రకారుడిగా ఎదుగుతానని ధీమా వ్యక్తం చేస్తున్నాడు ఈ చిన్నోడు. ఇలా ఎంతోమంది అట్టడుగు వర్గాలకు చెందిన పిల్లలు పెయింటింగ్‌లో అద్భుతమైన ప్రతిభ చూపిస్తూ అందరి ప్రశంసలు పొందుతున్నారు.
 
ఎన్వాయ్స్ కాన్వాస్
ఆసక్తి, అంతకుమించి ఆత్మవిశ్వాసం నిండిన ఈ చిన్నారుల జీవితాలకు కొత్త రంగులద్దుతున్నవారు సంస్కృతి రూరల్ ఆర్ట్ సెంటర్ వ్యవస్థాపకుడు బీఏ రెడ్డి. ఆయన సారథ్యంలోని యంగ్ ఎన్వాయ్స్‌లో తర్ఫీదు పొందిన ఈ పేదబిడ్డలు ఆద్భుతాలు ఆవిష్కరిస్తున్నారు. యంగ్ ఎన్వాయ్స్‌లో ప్రతి ఆదివారం ఉదయం 9 నుంచి 11.30 గంటల వరకు శిక్షణ తరగతులు నిర్వహిస్తుంటారు. ఏవైనా పోటీలున్నపుడు ముందు మూడురోజులు వరుసగా తరగతులుంటాయి. విద్యార్థులందరితో పెయింటింగ్స్ వేయించి వాటిని పోటీలు జరిగే దేశానికి పోస్ట్‌లో పంపిస్తుంటారు. ఏటా వేసవిలో 50 రోజుల పాటు వర్క్‌షాప్‌ను కూడా నిర్వహిస్తున్నారు. ప్రముఖ ఆర్టిస్టులు సుభాష్ బాబు, కుసుమ విశ్వనాథన్, నరేందర్ రాయ్, సూర్య ప్రకాశ్ తదితరులు వచ్చి గెస్ట్ క్లాస్‌లు ఇస్తుంటారు.
-  వాంకె శ్రీనివాస్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement