లవ్ టూ వర్క్
లక్ష్యం ఏదైనా... పట్టుదలగా కృషి చేయాలి. దీక్షగా ముందుకు సాగాలి. అదీ పోటీవున్న బాలీవుడ్ లాంటి బడా ఇండస్ట్రీలో ఎదగాలంటే..! రెండింతలు శ్రమించాలి. అప్పుడే గమ్యం చేరువవుతుంది. దాన్ని రుజువు చేసి చూపారు ప్రముఖ కాస్ట్యూమ్స్ డిజైనర్ డాలీ అహ్లూవాలియా. బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్‌గా, ఉత్తమ సహాయ నటిగా జాతీయ అవార్డులు గెలుచుకున్న ఆమె శుక్రవారం నగరానికి వచ్చారు. విఖ్యాత థియేటర్ ఆర్టిస్ట్ ఖాదర్ అలీబేగ్ స్మారకార్థం ఆయన తనయుడు మహ్మద్ అలీబేగ్ బేగంపేట్ హోటల్ తాజ్ వివంతాలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న డాలీని ‘సిటీ ప్లస్’ పలకరించింది...
చిన్నతనం గురించి చెప్పాలంటే 1970లో నాటి పరిస్థితుల గురించి చెప్పాలి. అప్పట్లో ఆడ పిల్లలు థియేటర్‌లో ప్రదర్శనలు ఇవ్వడానికి తల్లిదండ్రులు ససేమిరా అనేవారు. నా సోదరి హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సు చేసింది. నా కజిన్ ఎయిర్ హోస్టర్‌గా ఉద్యోగం సంపాదించింది. నాకేమో భవిష్యత్ మీద ఎలాంటి ఆలోచనలు లేవు. అప్పుడే మా నాన్న నేషనల్ స్కూల్
ఆఫ్ డ్రామాలో నన్ను చేరమని గప్రోత్సహించారు.
సినిమా వైపు...
సినిమా రంగంపై ఆసక్తితో అప్పట్లోనే ఎంతోమంది అష్టకష్టాలు పడడం చూశా. భగవంతుడి దయ వల్ల నా కుటుంబ ప్రోత్సాహం ఉన్నది కాబట్టి తిండి, బట్ట, ఇల్లు విషయంలో ఇబ్బంది కలగలేదు. యాక్టింగ్‌తో పాటు కాస్ట్యూమ్ డిజైనింగ్‌పై కూడా బాగా ఆసక్తి. నాటకాల్లో వచ్చే సంపాదన ఎందుకూ సరిపోయేది కాదు.
ఆ తరువాత శేఖర్‌కపూర్ రూపొందిస్తున్న ‘బాండిట్ క్వీన్’ సినిమాలో కాస్ట్యూమ్ డెరైక్టర్‌గా చాన్స్ వచ్చింది. తెలిసిన పనే కదా అని ప్రయత్నించా. కానీ ఊహించని విధంగా... దానికి ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనింగ్ విభాగంలో నేషనల్ అవార్డ్ వచ్చింది. ఆపై 2003లో తొలిసారిగా టీవి సీరియల్‌లో నటించా. ఆపై సినిమాల్లో కూడా విభిన్న రోల్స్ చేశా. ‘విక్కీ డోనార్’లో నా పాత్రకు ఉత్తమ సహాయ నటిగా జాతీయ అవార్డు దక్కింది.
‘భాగ్ మిల్కా భాగ్, హైదర్’ చిత్రాలకు ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్‌గా ఫిలింఫేర్ పురస్కారం అందుకున్నా. మొత్తానికి నటిగా ఎదగాలనుకున్నా యాథృచ్ఛికంగా కాస్ట్యూమ్ డిజైనర్ అయ్యా. తొలి చిత్రంతోనే జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకున్నా. ఆపై టీవీ సీరియల్‌లో నటించే అవకాశం వచ్చింది. అటునుంచి సినిమాల్లో చాన్సులు వరుసపెట్టాయి. మంచి నటిగా, కాస్ట్యూమ్స్ డిజైనర్‌గా గుర్తింపు వచ్చింది. చక్కని భర్త, ఇల్లు... కోరుకున్న దానికంటే మంచి జీవితం. ఇంతకన్నా ఏం కావాలి. ఎవరైనా సరే ఎదగాలంటే పనిని ప్రేమించడం నేర్చుకోవాలన్నదే నా థియరీ.