
ఆడపిల్లని..
సరోజ..(పేరు మార్చాం) ముగ్గురు ఆడపిల్లల్లో ఆఖరిది! ఆడపిల్లగా పుట్టినందుకు కళ్లు తెరిచిన నాటి నుంచే నిర్లక్ష్యానికి గురైంది! ఎంతగా అంటే తల్లిపాలకూ నోచుకోలేనంతగా!
సరోజ పుట్టినప్పటి నుంచే ఆ పిల్లను వదిలించుకునే ప్రయత్నం చేశారు ఆమె తండ్రి, నానమ్మ. తల్లిని పాలివ్వనివ్వకుండా కట్టడి చేశారు. పాపకు మూడో నెల రాగానే అనాథాశ్రమంలో చేర్పించి కొడుకును కనాలని.. సరోజ నానమ్మ కోడలిని ఆజ్ఞాపించింది. కాళ్లు పట్టుకొని బతిమాలి ఆ గండం గట్టెక్కించుకుంది సరోజ తల్లి. ఆరో నెల రాగానే మళ్లీ అదే నస.. ఆ పిల్లను వదిలించుకొమ్మని. కొడుకును కనమని. అక్కను, పిల్లల్ని చూద్దామని వచ్చిన సరోజ మేనమామకు మొత్తం విషయం అర్ధమైంది.
ఇదేం పద్ధతి అని బావని నిలదీస్తే.. ముగ్గురు ఆడపిల్లల్ని కని పెంచడానికి మీరేమీ మణులు, మాన్యాలు నాకు కట్టబెట్టలేదని బావమరిది మీదికి మీసాలు తిప్పాడు. పోషించుకోలేనప్పుడు కనడమెందుకని బావమరిదీ మాటమీరాడు. బావ గారికి కోపమొచ్చింది. ‘ఈ క్షణమే మీ అక్కను, పిల్లల్ని తీసుకొని నా ఇంట్లోంచి వెళ్లిపో. నెల తిరక్కుండానే ఇంకో పిల్లను పెళ్లి చేసుకొని.. పండంటి కొడుకుని కంటాను’ అని మర్యాద తప్పాడు.
విషయం సరోజ అమ్మమ్మ తాతయ్యలు, నానమ్మ తాతయ్యల వరకు, అట్నుంచి పోలీస్‌స్టేషన్ దాకా వెళ్లింది. పోలీసులు సరోజ నాన్న, నానమ్మ, తాతయ్యలకు కౌన్సెలింగ్ ఇచ్చి బుద్ధిగా ఉండాలని చెప్పారు. పోలీసుల భయంతో భార్యాపిల్లలను తీసుకుని ఇంటికెళ్లాడు సరోజ తండ్రి. బావ బుద్ధి ఎరిగిన బావమరిది ఒకరోజు సరోజను తనింటికి తెచ్చేసుకున్నాడు. అప్పుడు ఆ చంటిదాని వయసు యేడాది. ఇంటి విషయాన్ని ఠాణా దాకా తీసుకెళ్లారని సరోజ తల్లిని, మిగిలిన పిల్లలను గడప తొక్కనివ్వలేదు సరోజ తండ్రి... ఈ రోజుకీ!.
మేనమామ ఇంట్లో..
అప్పటికే సరోజ మేనమామకు మూడేళ్ల ఆడపిల్ల. భార్య మనసు తెలుసుకోకుండానే మేనకోడలిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టాడు. కన్న కూతురిని ఒకలా.. మేనకోడలిని ఒకలా చూడ్డం మొదలుపెట్టిందామె. ఇక్కడా ఆ పసిదానికి పాలకు కరువే. భర్త ఉన్నప్పుడు బాగా చూసుకునేది. అతను ఆఫీస్‌కి వెళ్లగానే ఆ పిల్లను పట్టించుకునేది కాదు. ఈలోపే సరోజ మేనమామ భార్య మళ్లీ గర్భవతి అయింది. పిల్లలను చూసుకోవడానికి కష్టమవుతుంది అంటే సరోజ అమ్మమ్మ వచ్చింది. అప్పుడు తెలిసింది ఆమెకు సరోజను కోడలెలా చూస్తుందో. అయినా కిమ్మనలేదు. ‘కన్నతండ్రే కాదనుకొని వదిలేసిండు.. కోడలైతే పరాయింటి పిల్ల.. ఈమాత్రం చూడ్డం గొప్పే’ అని సర్దుకుంది. కోడలికీ రెండో కాన్పులో ఆడపిల్లే పుట్టింది. సరోజ తమింట్లో కాలు పెట్టడం వల్లే బిడ్డ పుట్టిందని కోడలు గగ్గోలు పెట్టింది. ఆ పిల్ల ఉన్న ఇంట్లో తానుండనని భర్తతో గొడవ పెట్టుకుంది. భవిష్యత్ అర్థమైన అమ్మమ్మ.. సరోజను తనతో తీసుకెళ్లిపోయింది.
ఇప్పుడు..
సరోజకు పదకొండేళ్లు. 65 ఏళ్ల అమ్మమ్మ, 70 ఏళ్ల తాతయ్య దగ్గర చిన్నప్పుడు కోల్పోయిన సుఖాన్ని ఆస్వాదిస్తోంది. అమ్మమ్మనే అమ్మా అని పిలుస్తుంది. తాతను పేరుపెట్టి గదమాయిస్తుంది. అయిదో తరగతి చదువుతోంది. అమ్మమ్మ, తాతయ్యలు కొంచెం ఖాళీగా కనిపించినా.. ఇద్దరికీ చెరో బలపం ఇచ్చి నేల మీద ఏబీసీడీలు రాయిస్తుంది చేతిలో బెత్తం పట్టుకొని. ‘మేమున్నంత వరకు ఈ పిల్లకు ఫరవాలేదు. మా తర్వాత ఎలా?
అనుకున్నప్పుడే గుబులయితది’ అంటారు ఆ వృద్ధులు!.
..:: శరాది