జీవితంలో ఇంతటి ప్రేమ కూడా ఉంటుందా? | acid attack survivor Pramodini Roul finds love while in hospital | Sakshi
Sakshi News home page

జీవితంలో ఇంతటి ప్రేమ కూడా ఉంటుందా?

Published Thu, Nov 9 2017 4:31 PM | Last Updated on Fri, Aug 17 2018 2:10 PM

acid attack survivor  Pramodini Roul finds love while in hospital - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఎంతటి అందమైన ముఖమైన యాసిడ్‌ పోస్తే ఎంత అందవికారంగా, వికతంగా మారుతుందో ఎవరైనా ఊహించలరు. యాసిడ్‌ దాడికి గురైనా బాధితులను ఇక ప్రత్యక్షంగా చూస్తే అందవికారం ఎంత వికృతంగా ఉంటుందో అనుభవపూర్వకంగా తెలుసుకోవచ్చు. అలాంటి బాధితులను ప్రత్యక్షంగా చూడాలంటే గుండె ఎంతో దిటువుగా ఉండాలి. గుండెలో ఎంతో నిబ్బరం ఉండాలి. యాసిడ్‌ దాడి బాధితుల పట్ల ఎంత సానుభూతి ఉన్నా వారైనా బాధితుల వంక ఒక్కసారి చూస్తే అబ్బా! అంటూ ముఖం తిప్పేసుకుంటాం. మరోసారి అటువైపు చూడాలంటే మన ముఖం అష్ట వంకరలు తిరగడమే కాకుండా కడుపులో కూడా దేవేస్తుంది.

ఓ యాసిడ్‌ దాడిలో ముఖమంతా వికృతంగా మారిన 26 ఏళ్ల బాధితురాలు ప్రమోదిని రౌల్‌ను సరోజ్‌ కుమార్‌ సాహు చూసి అందరిలాగే ముందుగా సానుభూతి చూపించారు. కాలిన గాయాలతో కాళ్లన్ని తొడల వరకు చీము పట్టి పడకకే పరిమితమైన రౌల్‌ లేచి నడిచేందుకు మరో నాలుగేళ్లు పడుతుందని వైద్యులు చెప్పినప్పుడు పిచ్చిదానిలా ఏడుస్తున్న ఆమె తల్లిని చూసి చలించి పోయారు. మనవంతు కర్తవ్యం నిర్వర్తిస్తే మనకళ్లముందే అమ్మాయి ఆశ్చర్యంగా కోలుకుంటుందని ఆ తల్లికి హితబోధ చేశారు. రెండు కళ్లుకూడా కనించక జీవితమంతా చీకటైందని తల్లి ఒడిలో తలపెట్టుకు ఏడుస్తున్న రౌల్‌ను కూడా తన శక్తిమేరకు ఓదార్చారు. అంగవైకల్యాన్నీ, మొత్తంగా జీవితాన్నే ఓ చాలెంజ్‌గా తీసుకొని నిలబడాలని మనోధైర్యాన్ని నూరిపోశారు.

ప్రమోదిని రౌల్‌ త్వరగా కోలుకునేలా చేయడం కోసం సరోజ్‌ కుమార్‌ తాను చేస్తున్న ఉద్యోగాన్ని కూడా వదిలేసి రోజు ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఆస్పత్రిలో ఆమె పడక పక్కనే కూర్చొని ఆమెకు జీవితం పట్ల ఓ అందమైన భావం కలిగేలా కబుర్లు చెబుతూ వచ్చారు. ఇలా ఆయన మూడున్నర ఏళ్లపాటు అందించిన సేవలు ఫలించి ఆమె ఇప్పుడు తన కాళ్లమై నడవగలుగుతున్నారు. గత సెప్టెంబర్‌లో ఎడమ కంటికి ఆపరేషన్‌ కూడా చేయడంతో కొద్దిగా ఆమెకు చూపు కూడా వచ్చింది. ఇప్పటికీ ఆమె ముఖానికి ఐదు సర్జరీలు అయ్యాయి. మరో నాలుగు సర్జరీలు అవసరం అవుతాయని వైద్యులు చెబుతున్నారు.

కంటి చూపు కొద్దిగా రావడంతో ఆమె తన ముఖాన్ని అద్దంలో చూసుకునేందుకు ధైర్యం చేశారు. సరోజ్‌ కుమార్‌ ఇచ్చిన స్ఫూర్తితో కూడదీసుకున్న మనోధైర్యం ఒక్క సారిగా పగిలిన అద్దం వలే ముక్కలయింది. కుప్పకూలిపోయారు. ఇంత వికారంగా ఉన్న తనను ఎందుకు ప్రేమిస్తున్నావని ప్రశ్నించారు. వద్దంటూ బతిమాలారు. తోటి మనిషి పట్ల సానుభూతి, ప్రేమ ఉండడం సహజమన్నారు. ప్రేమకు చిహ్నమైన ఆగ్రాలోని తాజ్‌మహల్‌ వద్దకు రౌల్‌ను తీసుకెళ్లినప్పుడు (2016, జనవరి 14న) చేసిన బాసల గురించి గుర్తు చేశారు.  మొదట్లో  సానుభూతి మాత్రమే ఉండేదని, ఇప్పుడు అది బలమైన ప్రేమగా మారిందని  సరోజ్‌ కుమార్‌ సాహు చెప్పారు. అయినా ఆమె పెళ్లికి ఒప్పుకోలేదు. జీవితాన్ని నిలబెట్టిన ఓ వ్యక్తి జీవితాన్ని తాను నాశనం చేయలేనని చెప్పారు. అయినా ఆమెకు నచ్చచెప్పిన సరోజ్, ఒడిశాలో ఒంటరైన తన తల్లితో ఇంతకాలం జీవిస్తూ వచ్చిన రౌల్‌ను తదుపరి చికిత్స కోసం తన వెంట ఢిల్లీ తీసుకొచ్చారు. ఇద్దరు కలిసి ఏడాదిపాటు ఒకే ఇంటి కప్పు కింద జీవిస్తున్నారు. ఇప్పుడు వారు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.

‘అసలు నా జీవితంలో ఇంత ఔన్నత్యం కలిగిన వ్యక్తిని నేను చూడడం ఇదే మొదటిసారి. నేను 15వ ఏట పదో తరగతి చదువుతున్నప్పుడు నాపై ఓ 28 ఏళ్ల యువకుడు యాసిడ్‌ దాడి చేశాడు. అప్పటి నుంచి మగాళ్లంటే మృగాళ్లగా ఊహించుకొని ద్వేషం పెంచుకున్నాను. నేను అప్పుడు ఎంతో అందంగా ఉండేదాన్ని. అందుకనే మా అమ్మ నన్ను రాణి అని పిలిచేది. అందుకనే ఆ యువకుడు నా వెంట పడ్డాడు. నేను ఛీత్కరించడంతో నా అందంపై పగబట్టి యాసిడ్‌ దాడి జరిపాడు. దాడి జరిగిన తర్వాత నాలుగు నెలల పాటు ఒడిశా ఆస్పత్రి ఐసీయులో ఉన్నాను.

నాలుగేళ్లపాటు ఆస్పత్రిలో ఉండాల్సి వచ్చింది. ఆస్పత్రిలో ఉన్నప్పుడు అంటే, 2014, మార్చి నెలలో ఓ నర్సును చూడడం కోసం వచ్చిన సరోజ్‌తో పరిచయం అయింది. మొదట్లో ఆయన నన్ను చూసి చూడనట్లు వెళ్లిపోయేవారు. ఓ రోజున మా అమ్మ, నేను ఏడుస్తున్నప్పుడు తానే చొరవ తీసుకొని మమ్మల్ని ఓదార్చారు.  2016, జనవరిలో నన్ను తాజ్‌మహల్‌ తీసుకెళ్లినప్పుడు పెళ్లి చేసుకుంటానని ప్రపోజ్‌ చేశారు. నేను ఒప్పుకోకున్నా ఒప్పించారు. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నానన్న ఆనందం నాకు జీవితం పట్ల రెట్టింపు ధైర్యాన్ని ఇస్తోంది’ అని రౌల్‌ తన కథను క్లుప్తంగా వివరించారు.

దాదాపు 11 ఏళ్ల క్రితం రౌల్‌పై యాసిడ్‌ దాడి జరిగింది. ఆమెకు చిన్పప్పుడే తండ్రి చనిపోవడంతో ఛాన్వ్‌ ఫౌండేషన్‌లో పనిచేస్తున్న ఆమె తల్లి ఆమెను పెంచింది. పదవ తరగతిలోనే ఆమెపై యాసిడ్‌ జరగడంతో  చదువు అంతటితోనే ఆగిపోయింది. ఛాన్వ్‌ ఫౌండేషన్‌ అందించిన ఆర్థిక సహాయంతో ఆమె ఇంతకాలం ఖరీదైన శస్త్ర చికిత్సలు చేయంచుకున్నారు. ఇప్పుడు ఆమెకు ఢిల్లీలో అయ్యే వైద్య ఖర్చులను సరోజ్‌ కుమార్‌ ఎక్కడి నుంచి తెస్తారో ఆయనకే తెలియాలి. చేస్తున్న ఉపకారాన్ని చెప్పుకునే మనస్తత్వం కాదు ఆయనది. యాసిడ్‌ దాడితో మృగాళ్లను మగాళ్లుగా పిలుస్తున్న సమాజంలో మంచి మనస్తత్వంతో నిజమైన మగాడిగా ముందుకొచ్చి సరోజ్‌ కుమార్‌ మృగాళ్లకూడా కనువిప్పు కలిగిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement