మడ్ రన్
రోడ్లపై పరుగు, కొలనుల్లో ఈత.. ఎప్పుడూ ఉండేదే. కాస్త కొత్తగా, ఇంకాస్త విభిన్నంగా.. అదీ వీకెండ్‌ల్లో అయితే.. ఆ మజానే వేరు. అటు స్విమ్మింగ్‌ను తలపిస్తూ, ఇటు పరుగును మరిపిస్తూ.. చిన్నప్పడు పాకిన రోజులను గుర్తు చేసుకుంటూ.. అబ్బో అబ్బో.. వింటుంటేనే భలేగా ఉంది కదూ..! ఇక చూస్తే... పార్టిసిపేట్ చేస్తే.. వారానికి సరిపడా రీఫ్రెష్.. ఎప్పటికీ మరిచిపోలేని థ్రిల్! నగరవాసులకు ఇలాంటి వినూత్న అనుభూతిని అందించింది ‘గ్రేటర్ హైదరాబాద్ ఎడ్వంచర్ క్లబ్’.
పటాన్‌చెరు లహరి రిసార్ట్స్‌లో ఆదివారం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం వరకు సాగిన ‘మడ్ రన్’ను సీనియర్ సిటిజన్స్ నుంచి బుడతల వరకు తెగ ఎంజాయ్ చేశారు. సిటీజనులే కాదు.. ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి వచ్చిన వారు కూడా బురదలో మునిగి తేలారు. బురదతో నిండిన రెండు కిలోమీటర్ల ట్రాక్‌లో నీటి గుంతలు దాటి.. సొరంగాలు చేధించి.. గోడలు దూకేసి.. వంతెనలు ఎక్కేసి.. పాకేసి... ఎన్నెన్నో చిత్ర విచిత్రాలతో కుటుంబ సమేతంగా ఆస్వాదించేసి అలసిపోయారు.
టార్జన్ స్వింగ్, బెల్లీ క్రాల్, కమెండో నెట్, రోప్, టైర్ ఫీల్డ్ వంటి పాతికకు పైగా అడ్డంకులను అధిగమిస్తూ లక్ష్యం వైపు దూసుకుపోయారు. పతకాలు, ప్రశంశాపత్రాలు అందుకున్నారు.
ఆ మజానే వేరు..
‘బురదలో పడుతూ లేస్తూ పరుగులు. ఒళ్లంతా బురదే. ఏదేమైనా రొటీన్‌కు భిన్నంగా తెగ ఎంజాయ్ చేశాం’ అంటున్నారు అమెరికాకు చెందిన టబోలోవ్, మారియా.
వాంకె శ్రీనివాస్