సీమాంధ్ర మ్యాప్
పార్లమెంటు ఉభయసభల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ బిల్లు (తెలంగాణ బిల్లు)ను ఆమోదించారు. విభజన జరిగిపోయింది. రాష్ట్రపతి సంతకంతో 29వ రాష్ట్రంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినట్లు ప్రకటన వెలువడుతుంది. ఇక రాజధాని ఎక్కడనేదే పెద్ద సమస్య. ఇది చిన్నాచితకా సమస్య కాదు. ఈ విషయంలో జుట్లుపట్టుకోవలసిన పరిస్థితి ఏర్పడుతుందని మాజీ మంత్రి జెసి దివాకర రెడ్డి ఎమంటారా అన్నారో అది అక్షరాల నిజం. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఒక రాయి ఇస్తే, ఆమె దానిని విసిరితే, అది ఎక్కడపడితే అదే కొత్తరాజధాని అని ఆయన చెప్పారు. ఆయన వ్యంగ్యంగా ఆ మాట చెప్పినా అదే నిజమవుతుందా? ఏదిఏమైనా కొత్త రాజధాని ఎంపిక కొత్త వివాదాలకు దారి తీసే ప్రమాదం ఉంది.
ఇప్పుడు కొత్త రాజధానిపైనే సర్వత్రా జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా సీమాంధ్రలో ఈ విషయంమే ప్రస్తుతం ప్రధాన టాపిక్గా ఉంది. ప్రధానంగా విజయవాడ - గుంటూరు, ఒంగోలు, కర్నూలు పేర్లు వినవస్తున్నాయి. అందరూ ఈ నగరాలపైనే దృష్టి పెట్టారు. విజయవాడ - గుంటూరు మధ్య అయితే అన్నివిధాల అనుకూలంగా ఉంటుంది. గన్నవరం విమానాశ్రయం, 5వ నెంబరు జాతీయరహదారి, రైల్వే, స్టార్హొటల్స్తోపాటు అటు ఉత్తరాంధ్రకు, ఇటు సీమాంధ్రకు మధ్యలో ఉండటం ఈ జంట నగరాలకు కలసివచ్చే అంశం. అంతేగాక ఈ ప్రాంతం ఇప్పటికే విస్తరించి హైటెక్ హంగులు సంతరించుకుంది. అటు,ఇటూ అందరికి సమదూరంలో ఉంటుంది. సీమాంధ్రకు మధ్యలో ఉంటుంది. రాజధానికి కావలసిన అన్ని హంగులు ఉన్నాయి. అయితే ఈ ప్రాంతంలో రాజధానికి కావలసినన్ని ఎకరాల భూమి లభించడం కష్టం. అదీగాక ఇక్కడ ఎక్కువగా పంట పొలాలే ఉన్నాయి. మాగాణి భూములు ఎక్కువ.
ఒంగోలులో అయితే కావలసినన్ని భూములు లభించే అవకాశం ఉంది. దీనికి 5వ నెంబరు జాతీయ రహదారి, రైల్వేలు అందుబాటులో ఉంటాయి. దొనకొండ వద్ద పాత విమానాశ్రయం ఉంది. మెట్ట భూమికి కొదవలేదు. ఆ విధంగా ఈ జిల్లా కూడా కొత్తరాజధానికి పరిశీలనలో ఉంది.
అయితే గతంలో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు కర్నూలు రాజధానిగా ఉంది. తాము రాజధానిని కోల్పోయినందున, ఇప్పుడు మళ్లీ ఆ నగరాన్నే రాజధాని చేయడం న్యాయం అని అక్కడివారు వాదిస్తున్నారు. అయితే విజయవాడ - గుంటూరు, ఒంగోలులతో పోల్చుకుంటే ఈ నగరం అంతసౌకర్యవంతమైనదికాదు. అదీగాక ఉత్తరాంధ్రవారికి దూరం అవుతుంది. కేంద్రం నియమించే కమిటీ ఈ ప్రాంతాలన్నింటిని, అక్కడ లభించే మౌలిక సదుపాయాలను పరిశీలించి కొత్త రాజధానిని ఎంపిక చేస్తుంది. అయితే ఈ విషయంలో మళ్లీ గొడవలు వచ్చే అవకాశం ఉంది.
s.nagarjuna@sakshi.com