ఉల్లిపాయకు ఒళ్లు మండింది | Onion prices sour, Rs.100 a kilo in new delhi | Sakshi
Sakshi News home page

ఉల్లిపాయకు ఒళ్లు మండింది

Published Thu, Sep 19 2013 12:19 PM | Last Updated on Sat, Jul 6 2019 3:20 PM

ఉల్లిపాయకు ఒళ్లు మండింది - Sakshi

ఉల్లిపాయకు ఒళ్లు మండింది

ఉల్లిపాయకు మళ్లీ ఒళ్లు మండింది. ఒక్కసారిగా నెత్తికెక్కి కూర్చుంది. నిన్న మొన్నటి వరకు కూడా సామాన్యులెవ్వరికీ అందుబాటులో లేకుండా చెట్టెక్కి కూర్చున్న ఉల్లిపాయల ధరలు ఏదో.. కాస్త అదుపులోకి వస్తున్నాయని సంతోషించినంత సమయం పట్టలేదు. మళ్లీ అవి ఎక్కడెక్కడికో వెళ్లిపోతున్నాయి. మనకు ప్రధానంగా మహారాష్ట్ర నుంచి ఉల్లిపాయలు వస్తుంటే, అక్కడే కొండెక్కేశాయి. నాసిక్ మార్కెట్లో కిలో 70 రూపాయల చొప్పున ఉల్లిపాయలు అమ్ముతున్నారట. ముంబై మార్కెట్లోకి వచ్చిన ఈజిప్టు ఉల్లి కూడా ధరలపై ప్రభావం చూపించలేకపోయింది. ఈ ఉల్లి కేజీ రూ.47కు లభిస్తున్నప్పటికీ ఇక్కడ మాత్రం రూ.50-52 చొప్పున విక్రయిస్తున్నారు.

ఆగస్టు నెలలో ద్రవ్యోల్బణం ఆరు మాసాల గరిష్ఠ స్థాయికి చేరడానికి ఉల్లి ప్రధాన దోహదకారి. హైదరాబాద్‌లోనూ, ఢిల్లీలో కూడా కిలో ఉల్లి చారిత్రక రికార్డు 80 రూపాయలు పలికింది. హైదరాబాద్ టోకు మార్కెట్లో క్వింటాలు ఉల్లి ధర 6,100 పలుకుతున్నదని, ఇంత ధర ఎప్పుడూ లేదని వ్యాపారులంటున్నారు. రిటైల్ మార్కెట్లో 70 - 80 మధ్యన విక్రయిస్తున్నారు. హైదరాబాద్ కు ఉల్లి ప్రధానంగా కర్నూలు జిల్లా నుంచి వస్తుంది. భారీ వర్షాల ధాటికి ఉల్లి పంట నీట మునిగిపోయి సరఫరా తగ్గిపోయింది. కర్నూలు నుంచే హైదరాబాద్ మార్కెట్‌కు రోజుకు 50 నుంచి 60 లారీలు ఉల్లి రావలసి ఉండగా ఇప్పుడది పంట నష్టం కారణంగా 20 నుంచి 30 లారీలకు పడిపోయింది. మహారాష్ట్ర నుంచి కూడా సరఫరా తగ్గడంతో ఉల్లి ధర కొండెక్కి కూర్చుంది. సాధారణ ప్రజల కోసం మార్కెటింగ్‌శాఖ అధికారులు రైతు బజార్లలో సబ్సిడీ ధరలకే కిలో ఉల్లిని 32 రూపాయలకూ విక్రయిస్తామని ప్రకటించినప్పటికి, పెరుగుతున్న ధరలను చూసి వారు కూడా చేతులెత్తేశారు.

ఇక దేశ రాజధాని ఢిల్లీ మహానగరం విషయం చెప్పనే అక్కర్లేదు. అక్కడైతే ఏకంగా కిలో వంద రూపాయలు దాటేసింది. కానీ, ఇంత జరుగుతున్నా పాలకులకు మాత్రం ఈ విషయం పడితే ఒట్టు. గతంలో దీనివల్ల ప్రభుత్వాలే తలకిందులైనా కూడా ఇప్పటికీ వీళ్లకు బుద్ధి రావట్లేదు. ఎందుకంటే, కేంద్ర మంత్రులకు ఉల్లిపాయ ఘాటు ఇంకా సరిగ్గా తగల్లేదు. ఇక్కడి మార్కెట్లలో ఉల్లిపాయలు కేజీ  100 రూపాయిల చొప్పున అమ్ముతున్నారని ప్రజలు లబోదిబోమంటూ కేంద్రమంత్రివర్యుడు కపిల్ సిబల్ గారికి మొర పెట్టుకుంటే ఆ మహాశయుడు మాత్రం, ‘‘దానికి నేనేం చెయ్యను? వెళ్లి ఎక్కువ ధరలకు అమ్మేవాళ్లనడగండి ’’ అని చిర్రుబుర్రులాడారట.

కానీ మరోవైపు సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో మాత్రం ఉల్లిపాయ మీద బీభత్సంగా సెటైర్లు నడుస్తున్నాయి.
‘రాఖీ కట్టిన చెల్లికి ఉల్లిపాయలు గిఫ్ట్‌గా ఇవ్వండి.. ఆమె కళ్లలో ఆనంద బాష్పాలు చూడండి..’
 ‘బ్రేకింగ్ న్యూస్... ఆనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ‘ఆనియన్ లోన్స్’పై వడ్డీ రేట్లు తగ్గించింది.’
 ‘కారు కొంటే.. కేజీ ఉల్లిపాయలు ఫ్రీ’
‘డాలర్ ఎస్కలేటర్ పైన.. రూపాయి వెంటిలేటర్ పైన... ఉల్లిపాయలు షోరూంలో.. మనం కోమాలో... ఈ దేశాన్ని దేవుడే కాపాడాలి..’
ఇలాంటి కామెంట్లు ఫేస్ బుక్, ట్విట్టర్లలో వెల్లువెత్తుతున్నాయి. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ అందరి మధ్యా  ఇదే హాట్ టాపిక్‌గా మారింది. ఢిల్లీ నుంచి గల్లీ దాకా నడుస్తున్న ఉల్లి లొల్లి ట్విట్టర్, ఫేస్‌బుక్‌లకూ విస్తరించింది.

‘ఉల్లిపాయలకు... ఎన్నికలకు ఏదో సంబంధం ఉన్నట్లుంది. ఎందుకంటే ఎన్నికలొచ్చిన ప్రతిసారీ ఉల్లి ధరలు మండుతున్నాయి’ అంటూ కిరణ్‌బేడీ ట్విట్టర్‌లో స్పందించారు. ఈ ఏడాది చివర్లో ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి.
ఫేస్‌బుక్‌లో పెద్ద సంఖ్యలో ఉల్లి ధరలపై కార్టూన్లూ షేర్ చేసుకుంటున్నారు. ‘ఉంగరంలో డైమండ్ బదులు ఉల్లిపాయని అమర్చిన ఫోటో’ ‘దేవుడు ప్రత్యక్షమై ఉల్లిధరలు తగ్గించమనీ.. రూపాయి విలువ పెంచటం లాంటి పిచ్చిపిచ్చి కోరికలు కాకుండా మంచివి కోరమంటూ భక్తుడి మీద చిరాకుపడతాడు’ ఈ రెండు ఫోటోలు ఫేస్‌బుక్‌లో బాగా పాపులర్. వీటితో పాటు బోలెడు ఉల్లిజోకులతో కూడిన కార్టూన్‌లు సోషల్ సైట్స్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. ట్విట్టర్‌లో ఉల్లి కోసం ప్రత్యేకంగా అకౌంట్ కూడా ఓపెన్ చేశారు.
‘మరో సారి యూపీఏని గెలిపించండి..‘రైట్ టు ఆనియన్’ యాక్ట్ బిల్లుని పార్లమెంట్‌లో ప్రవేశపెడతారు.’
 ‘ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారా.. అయితే ఉల్లినారు తీసుకెళ్లి ఇవ్వు.. స్వంతంగా పెరట్లో ఉల్లిపాయల పెంపకం ఎలా పుస్తకం కూడా ఇవ్వచ్చు.’
 ‘ఒకటి కంటే ఎక్కువ కిలోల ఉల్లిపాయలు కలిగి ఉండటం నేరం. త్వరలోనే పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టనున్నారు.’
 ‘రుచిని బట్టి ఉప్పు... జీతాన్ని బట్టి ఉల్లిపాయలు..’
 ‘వంటకు ఉల్లిపాయలు వాడే వారు జాగ్రత్త.. సీబీఐ గానీ చూసిందంటే.. ఇంట్లో ఐటీ రైడ్‌లు చేసే అవకాశం ఉంది.’
 ‘ఉల్లిపాయలు కొనాలి లోన్ ఇస్తారా..’
ఇన్ని రకాలుగా సర్కారును విమర్శిస్తున్నా, పాలకులు మాత్రం యథాప్రకారం చేద్దాం, చూద్దాం అంటూ నిమ్మకుంటున్నారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement