పవన్ కళ్యాణ్ 'ఈల' వేస్తాడా?
పవన్ కళ్యాణ్ రాజకీయ రంగ ప్రవేశంపై సోషల్ మీడియాలో ప్రచారం హూరెత్తుతోంది. ఆయన సొంత పార్టీ పెడతారని, ఎంపీగా పోటీ చేస్తారని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. పవన్ కళ్యాణ్ పార్టీ పేరు, లోగో వివరాలు త్వరలోనే వెల్లడవుతాయని సామాజిక మాధ్యమం హూరెత్తింది. అయితే దీనిపై వివరణ ఇచ్చేందుకు పవన్ కళ్యాణ్ స్వయంగా మీడియా ముందుకు రానున్నారు. మార్చి రెండవ వారంలో ప్రెస్మీట్ పెట్టనున్నట్టు పవన్ వెల్లడించారు.
మరోవైపు పవన్ కళ్యాణ్కు లోక్సత్తా పార్టీ ఆహ్వానం పలికింది. పవన్ తమ పార్టీలో చేరతామంటే స్వాగతిస్తామని లోక్సత్తా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ జయప్రకాష్ నారాయణ పేర్కొన్నారు. ప్రజాసేవ చేయాలనుకునే వారికి లోక్సత్తా బహిరంగ వేదిక అని ఆయన చెప్పారు. సమాజాన్ని సానుకూల మార్పు దిశగా నడిపించాలనుకునే వారిని తమ పార్టీ ఎల్లప్పుడూ స్వాగతిస్తుందని అన్నారు. పవన్ కళ్యాణ్ తన సామర్థ్యాన్ని ఎలాగైనా తమ పార్టీకి వినియోగింవచ్చన్నారు. అభ్యర్థుల తరపున ప్రచారం చేయడం, ప్రజా చైతన్య కార్యక్రమాల్లో పాల్గొనడం వంటివి చేయొచ్చని సూచించారు.
పవన్ కళ్యాణ్ లాంటి మంచి వ్యక్తి తమ పార్టీలో స్వాగతిస్తామని కొద్ది రోజుల క్రితం టీడీపీ నాయకులు పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే ఏ పార్టీలో చేరబోవడం లేదంటూ అప్పట్లో నాగబాబు వివరణయిచ్చారు. మరోవైపు దేశ రాజధాని ఢిల్లీలో కాంగ్రెస్ కంచుకోటను బద్దలు కొట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ పార్టీ(ఆప్)లోనూ చేరతారన్న ప్రచారం జరిగింది. రాష్ట్రంలో 'ఆప్' పగ్గాలు పవన్ చేపడతారన్న చర్చలు కూడా నడిచాయి. అయితే అవన్నీ ఊహాగానాలుగానే మిగిలిపోయాయి.
గత ఎన్నికల సమయంలో తన అన్నయ్య చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ రాష్ట్రమంతా పర్యటించి పీఆర్పీ తరపున విస్తృతంగా ప్రచారం చేశారు. తదనంతర కాలంలో పీఆర్పీని కాంగ్రెస్లో విలీనం చేయడంతో చిరు, పవన్ మధ్య దూరం పెరిగింది. మళ్లీ ఇప్పుడు ఎన్నికలు వస్తుండడంతో పవన్ రాజకీయ ప్రవేశంపై ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఆయన పార్టీ పెట్టే అవకాశాల్లేవని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఓ పార్టీ తరపున ఎంపీ పోటీ చేస్తారనే దానిపై ఏమీ చెప్పలేకపోతున్నారు. పవన్ కళ్యాణ్.. చీపురు(ఆప్ సింబల్) పడతారా, ఈల(లోక్సత్తా గుర్తు) వేస్తారా అనేది మరికొద్ది రోజుల్లో తేలిపోనుంది.