
పొన్నం ప్రభాకర్
రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీల కన్వీనర్ - ఢిల్లీలో మంచి హొదా - కాంగ్రెస్ అధిష్టానంతో సాన్నిహిత్యం - కేంద్ర మంత్రులతో పరిచయాలు - అధిష్టానం దృష్టిలో మంచి బాలుడుగా గుర్తింపు పొందారు కరీంనగర్ ఎంపీ పొన్నం ప్రభాకర్ గౌడ్. 2014 ఎన్నికలలో పొన్నం చూపు ఢిల్లీ వైపా? హైదరాబాద్ వైపా? అంటే హైదరాబాద్ వైపే అంటున్నారు. ఈ సారి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఆయన అనుకుంటున్నట్లు తెలుస్తోంది. దేశ రాజధానిలో కొనసాగుతున్న హవాను వదులుకొని ఆయన హైదరాబాద్ రావాలని ఎందుకు అనుకుంటున్నారు?. లోక్సభ నుంచి స్థాయి దిగి రాష్ట్ర శాసనసభకు రావాలన్న ఆలోచనలకు కారణాలు ఏమిటి?
ఢిల్లీలో ఎంత గుర్తింపు ఉన్నప్పటికీ ఆయన హైదరబాద్పై మోజుపడుతున్నారు. దాంతో రాష్ట్రంలో శాసనసభ్యుడిగా ఎన్నికయ్యేందుకు తన వ్యూహం సిద్దం చేసుకున్నట్లు తెలుస్తోంది. మొట్టమొదటిసారిగా ఎంపీగా ఎన్నికైనా, చిన్న వయసైనప్పటికీ పొన్నం ప్రభాకర్‌కు మంచి హోదా లభించింది. రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీల కన్వీనర్గా ఎంపికయ్యారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం పొన్నం నైజం. అధిష్టానం అడుగుజాడల్లో నడుచుకోవడం ఆయనకు అలవాటైపోయింది. మారిన రాజకీయ పరిస్థితుల్లో అధిష్టానం ఆదేశాలకు అనుగుణంగా నడుచుకుంటూ మంచి మార్కులే కొట్టేశారు. అధిష్టానం కూడా ఆయనను నమ్మదగిన వ్యక్తిగా గుర్తించింది. అందుకే మరోసారి కరీంనగర్ లోక్సభ స్థానం నుంచి బరిలోకి దింపుతామని భరోసా కూడా ఇచ్చింది. అయితే మళ్లీ లోక్సభకు పోటీ చేయడానికి పొన్నం సుముఖంగా ఉన్నట్లు లేరు.
లోక్సభకు కాకుండా, శాసనసభకు పోటీ చేయడానికే పొన్నం ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. అందు కోసం ముందుగానే ఆయన రెండు శాసనసభ నియోజకవర్గాలను కూడా ఎంపిక చేసుకున్నట్లు కరీంనగర్ జిల్లాలో ప్రచారం జరుగుతోంది. ఉన్నట్టుండి ఆయన ఇటువంటి నిర్ణయం తీసుకోవడం ఏమిటని అందరూ ఆశ్ఛర్యపోతున్నారు. అందుకు రెండు ప్రధాన కారణాలు చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడటానికి అన్ని అవకాశాలు అనుకూలంగా ఉన్న క్రమంలో ప్రజలు ఆదరించే అవకాశం ఉంది. అయితే ప్రభుత్వంపై వ్యతిరేకత, బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీపై ఉన్న మోజుతో ప్రజలు ఎంపిగా ఓడిస్తారేమోనన్న భయం పొన్నంను వెంటాడుతున్నట్లు భావిస్తున్నారు. అందుకే ఉన్నంతలో శాసనసభ్యునిగా పోటీ చేయడం మంచిదన్న ఆలోచనకు వచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా తెలంగాణ ఏర్పడితే అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీయేనని ఆయన గట్టి నమ్మకం. దాంతో తనకు మంత్రి పదవి దక్కకపోతుందా అన్న ఆలోచనలో పొన్నం ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ నేపధ్యంలో వచ్చే ఎన్నికలలో ఆయన వేములవాడ, కరీంనగర్ అసెంబ్లీ స్థానాల్లో ఏదో ఒక స్థానం నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. ఆ ఆలోచనతోనే ఎంపీ నిధులను ఎక్కవగా ఈ రెండు నియోజకవర్గాల్లోనే ఖర్చు చేస్తున్నారు. అలాగే ఈ రెండు నియోజకవర్గాల కాంగ్రెస్ నాయకులతో తరచూ సమావేశమవుతున్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తున్నారు.