పక్కా హైదరాబాదీని
యాంకర్ ప్రశాంతి.. ఆన్‌స్క్రీన్ ఎంత హుషారుగా కనిపిస్తుందో... ఆఫ్ స్క్రీన్‌లోనూ అంతే యాక్టివ్. ఒక్క యాంకరింగ్‌కే పరిమితం కాక వయా రియాలిటీ షోస్... సినిమాలకూ మూవ్ అయ్యింది. చివరి వరకు హైదరాబాదీగా ఉండటానికే ఇష్టపడతానంటున్న ఈ డ్యాన్సింగ్ డాల్ పరిచయం..
- శిరీష చల్లపల్లి
నేను పక్కా ైెహ దరాబాదీని. మా అమ్మమ్మ, నానమ్మ అందరిదీ ఇక్కడే. నాన్న కేంద్ర ప్రభుత్వోద్యోగి. అమ్మ హోం మేకర్. అక్క, తమ్ముడు, చెల్లి ఉన్నారు. ఇంట్లో నాన్న స్ట్రిక్ట్ కానీ.. నే నంటే గారాబం. ఇంట్లో ఎవరికేం కావాలన్నా నాతోనే రాయబారం.. నేను ఇంటర్ చదువుతుండగా అనారోగ్యంతో అమ్మ చనిపోయింది. స్ట్రిక్ట్‌గా ఉండే నాన్న ఆ తర్వాత ఫ్రెండ్లీగా ఉండటం స్టార్ట్ చేశారు.
నాన్న డ్రీమ్...
మేం ఉండేది కూకట్‌పల్లిలో. స్కూలింగ్, ఇంటర్ అంతా ఇంటికి దగ్గరలోనే. నేను యావరేజ్ స్టూడెంట్‌ని. లెక్కలంటే భయం. కల్చరల్ యాక్టివిటీస్‌లో మాత్రం ముందుండేదాన్ని. స్కూల్లో, కాలేజీలో స్పోర్ట్స్ అండ్ యాక్టివిటీస్ ఉన్నాయంటే చాలు జ్వరం ఉన్నా కూడా రెడీ అయ్యేదాన్ని. కాలేజ్ వరకూ టీం లీడర్‌ని నేనే. వాలీబాల్, షటిల్, కోకో బాగా ఆడేదాన్ని. నాన్న మాత్రం నన్నో కలెక్టర్‌గా చూడాలని అనుకునేవారు. దాంతో నేనూ నాన్న డ్రీమ్‌నే ఫాలో అయ్యేదాన్ని!
సుమను చూశాక ఓకే..
నేను ఇంటర్‌లో ఉన్నప్పుడు ఓ టీవీ ఛానల్ వాళ్లు మా కాలేజ్‌లో ఓ ప్రోగ్రాం చేయడానికి వచ్చారు. ఆ ప్రోగ్రామ్‌కి అవసరమైన విద్యార్థుల్ని నేను చొరవగా సమీకరించడం చూసి.. ప్రోగ్రాం డెరైక్టర్ నన్ను యాంకరింగ్ చేయమని అడిగారు. నాన్న అందుకు ఒప్పుకోలేదు. నేను డిగ్రీలో ఉన్నప్పుడు అదే డెరైక్టర్ మళ్లీ అడిగారు. అప్పుడు నేను పంజగుట్టలోని గీతాంజలి ఉమెన్స్ కాలేజీలో బీకామ్ చదువుతున్నాను. నాక్కూడా ఎంటర్‌టైన్‌మెంట్ వైపు ఆసక్తి ఉండటంతో నాన్నను ఒప్పించాను. ఆడిషన్స్‌కు నాతోపాటు నాన్న కూడా స్టూడియోకి వచ్చారు. అక్కడ యాంకర్ సుమను చూసిన నాన్న.. నేను యాంకరింగ్ చేయడానికి ఒప్పుకొన్నారు.
బుల్లితెరకే ఓటు...
అలా నా ఫస్ట్‌ప్రోగ్రాం ‘సినీరంజని’తో ప్రారంభమైంది. తరువాత మనోరంజని, డాన్సు షోస్, రియాలిటీ షోస్, హోస్టింగ్ వరకు సాగింది. ‘అనగనగా’ అనే సినిమాలో మొదటిసారి హీరోయిన్‌గా కూడా చేశాను. ప్రస్తుతం బాలకృష్ణ ‘లయన్’ సినిమాలో ఓ మంచి రోల్ చేస్తున్నాను. అయితే నాకు జీవితాన్నిచ్చిన బుల్లి తెర అంటేనే ఇష్టం. నాకు అన్ని రకాల డ్రెస్‌లు నప్పుతాయి అంటారు... అందుకే మార్కెట్‌లోకి వచ్చిన ప్రతి డ్రెస్ వేసుకొని ప్రయోగం చేస్తుంటాను.
మేరా హైదరాబాద్ మహాన్!
హైదరాబాద్ గురించి చెప్పాలంటే.. ఇదో మల్టీ కల్చరల్ సిటీ. ఆసక్తి ఉండాలేగానీ... పుస్తకాలు చదవకుండానే నేర్చుకునే విషయాలు ఇక్కడ బోలెడు. అందుకే ‘మేరా హైదరాబాద్ మహాన్!’ అని గర్వంగా చెప్పగలను. చీకటి-వెలుతురులో చార్మినార్‌లో షాపింగ్, వెన్నెల రాత్రుల్లో హుస్సేన్‌సాగర్‌లో బోటింగ్, ఇరానీ చాయ్ గుబాళింపులు, సాయంత్రాల్లో నెక్లెస్ రోడ్‌లో ప్రేమికుల గుసగుసలు... ఇవన్నీ ఒక్క హైదరాబాద్‌లో తప్ప ఇంకెక్కడా చూడలేం. అందుకే నేను చివరివరకూ హైదరాబాదీగా ఉండటానికే ఇష్టపడతాను!