ప్రశాంతి, యాలంగి రమేష్(ఫైల్ ఫొటోలు)
ఔను! వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు. యువతి ఓ ప్రైవేటు స్కూల్లో టీచర్ అయితే.. యువకుడు అదే ప్రైవేటు స్కూల్లో బస్ డ్రైవర్.. ఇద్దరి మనసులు కలిశాయి. ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యారు. అయితే వారి ప్రేమను పెద్దలకు చెప్పలేక.. తీవ్ర మానసిక సంఘర్షణ మధ్య ఆత్మహత్యలకు పాల్పడ్డారు. వారి ప్రేమ కథకు వారికి వారే ముగింపు పలుకుతూ.. వారి రెండు కుటుంబాలను విషాదంలోకి నెట్టారు.
సాక్షి, మలికిపురం(తూర్పుగోదావరి జిల్లా): మండలంలోని తూర్పుపాలెం గ్రామానికి చెందిన పద్మశాలి సామాజికవర్గానికి చెందిన చిక్క రాముడు, సూర్యకుమారి భార్యాభర్తలు. వీరికి వీరవెంకట నాగ సత్య దుర్గా ప్రశాంతి కుమార్తె, సాయి వీరేంద్ర కుమారుడు. వీరిది నిరుపేద కుటుంబం. చేనేత వృత్తితో ఆదాయం సరిపోక తండ్రి రాముడు తాపీపని చేస్తుంటారు. భర్త చేనేతలో పాలు పంచుకుంటూ భార్య కూడా నేత నేస్తుంది. తమ సంతానం తమ మాదిరిగా కాకుండా ఉన్నత చదువులు చదివి ఉన్నత ఉద్యోగాలు సాధించాలని ఆ పేదింటి తల్లిదండ్రుల పట్టుదల. అందుకు తగ్గట్టుగానే కుమార్తెను పీజీ వరకు చదివించారు. కుమారుడు కూడా పీజీ పదువుతున్నాడు. పీజీ అనంతరం ప్రశాంతి మండలంలోని గూడపల్లి వెంకటసత్య కాన్సెప్ట్ స్కూల్ టీచర్‌గా పనిచేస్తూ కుటుంబానికి చేదుడు వాదోడుగా నిలుస్తూ వచ్చింది.
శోక సముద్రంలో ప్రశాంతి తల్లిదండ్రులు
తీవ్ర మానసిక సంఘర్షణతో..
రాజోలు మండలంలో కాట్రేనిపాడుకు చెందిన మరో సామాజిక వర్గానికి చెందిన యాలంగి రమేష్‌తో ఆమెకు పరిచయమై అది ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుందామని ఇద్దరూ భావించారు. పదో తరగతి చదివిన యాలంగి రమేష్ ప్రశాంతి పనిచేసే కాన్వెంట్ స్కూల్ వ్యాన్‌లో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. వీరిద్దరూ ఒకరికొకరు ఇష్టపడ్డారు పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఇంతలో ఈనెల 8న ప్రశాంతికి కుటుంబ సభ్యులు అదే గ్రామానికి చెందిన యువకుడితో పెళ్లి నిశ్చయం చేశారు. అయితే ప్రశాంతి తన ప్రేమ సంగతిని కుటుంబ సభ్యులకు చెప్పలేక, ప్రేమించిన యువకుడిని వదల్లేక తీవ్ర మానసిక సంఘర్షణకు లోనైంది. అయితే తల్లిదండ్రులు ఆమెకు ముందుగా కుదిర్చిన యువకుడితో ఇటీవల నిశ్చితార్థం జరిపించేశారు.
ఆ మరుసటి రోజు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో చదువుకున్న కళాశాల నుంచి సర్టిఫికెట్లు తెచ్చుకుంటానని చెప్పి బయల్దేరిన కుమార్తెను ఆ తల్లి ఉదయమే బస్సు ఎక్కించి దగ్గరుండి మరీ సాగనంపింది. అవే ఆ తల్లీ, కుమార్తెలకు కడసారి చూపులు అవుతాయని ఆరోజు వారు అనుకోలేదు. సర్టిఫికెట్ల కోసమని వెళ్లిన కుమార్తె చీకటిపడినా రాకపోవడంతో తల్లిదండ్రులకు కుటుంబ సభ్యుల్లో ఆందోళన మొదలైంది. ఈనెల 12న యానాం వద్ద గోదావరిలో కుమార్తె ప్రశాంతి, ఆమె ప్రేమికుడు రమేష్‌ల మృతదేహాలను పోలీసులు గుర్తించారు. కుమార్తె ప్రేమ వ్యవహారం తమకు తెలియదని తెలిస్తే సహకరించే వారమని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. చాలా సున్నితమనస్కురాలైన ప్రశాంతి చదువులో ఎప్పుడూ ఫస్ట్‌లోనే ఉంటానని చెబుతూ అలానే చదువుకుందని, పెద్ద ఉద్యోగం చేసి తమకు కష్టాలు లేకుండా చేస్తానని ఎప్పుడూ చెప్పే చిట్టి తల్లి కళ్లెదుటే కనిపించకుండా పోయిందని ఆ తల్లిదండ్రులు కుమార్తె ఫొటోను చూసుకుంటూ గుండెలవిసేలా రోధిస్తున్నారు. మరో వైపు యాలంగి రమేష్ తల్లిదండ్రులు కృష్ణమూర్తి, సీతలను ఎవరైనా పలకరిస్తే చాలు దుఃఖం పొంగుకువచ్చేస్తోంది. ఆ ప్రేమజంట అర్ధాంతరంగా తనువు చాలించడం రెండు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది.
Comments
Please login to add a commentAdd a comment