కిర్రాఖీ
అన్నా చెల్లెళ్ల, అక్కా తమ్ముళ్ల అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్. పేగుతో పంచుకున్న అనుబంధాన్ని దారంతో ముడివేసి తోబుట్టువు గుర్తు చేస్తే.. చిన్ని దారానికే వెన్నలా కరిగిపోయి అన్ని వేళల్లా తోడుంటానని సోదరుడు ఇచ్చే భరోసాకు సందర్భమే రాఖీపండుగ. అలాంటి పండుగకు నాలుగు రోజుల ముందునుంచే కళకళలాడుతోంది నగరం. కొనుగోలు దారులతో స్టాల్స్ సంద డిగా మారాయి. అయితే ఏయేటికాయేడు కొత్తదనాన్ని కోరుకుంటున్నారు కస్టమర్లు. వారి అభిరుచికి అనుగుణంగా రాఖీల తయారీలో క్రియేటివిటీని చూపిస్తున్నారు తయారీదార్లు. మార్కెట్లో ఈ యేడూ భిన్నమైన రాఖీలు తమ వైవిధ్యాన్ని చాటుకుంటున్నాయి.
ఆకట్టుకుంటున్న థాలీ
ఇదేదో భోజనం అని కంగారుపడిపోకండి. కొత్తదనాన్ని కోరుకునే హైదరాబాదీలకు కనువిందు చేస్తోంది ఈ రాఖీ. సాధారణంగా రాఖీ అనగానే... రాఖీలు ఒక చోట, అందుకు అవసరమైన కుంకుమ మరోచోట.. ఇక స్వీట్స్ ఇంకో చోట.. ఇలా షాపుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి. ఈ థాలీతో ఆ బెడద తప్పినట్లే. వెడల్పాటి ఆకర్షణీయమైన ప్లేటు(థాలీ), అందులో అందంగా అలంకరించిన డ్రై ఫ్రూట్స్, స్వీట్స్, కుంకుమ, రాఖీతో కలిపి తయారీదారులు ఒక ప్యాకేజీగా అందిస్తున్నారు. చూడగానే ఆకట్టుకునేలా ఉండటంతో పాటు, అన్నీ ఒకే చోట ఉండటంతో ఎంపిక సమయమూ కలిసి వస్తోంది. దీంతో ఈ థాలీ కోసం వాలిపోతున్నారు కస్టమర్లు. అందుబాటులో ఉండే విధంగా వీటి ధరలు 100 నుంచి 1,000 రూపాయల వరకు ఉన్నాయి.
పిల్లల కోసం..
మారుతున్న జనరేషన్‌తో పాటు పిల్లల రాఖీల్లో ట్రెండ్స్ మారిపోతున్నాయి. గతంలో టెడ్డీ బేర్ రాఖీలకు డిమాండ్ ఉండేది. పిల్లల మనసుకు దగ్గరగా వెళ్లి వారికి నచ్చేలా తయారుచేసిన రాఖీలెన్నో మార్కెట్లో కొలువుదీరాయి. వాటిలో రకరకాల కార్ల బొమ్మలు, లైట్ గన్స్, జంతువుల బొమ్మలు.. పిల్లలను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ బొమ్మ రాఖీలు 40 నుంచి 150 రూపాయల వరకు పలుకుతున్నాయి. టాయ్స్ తరువాత పిల్లలు అత్యధికంగా ప్రిఫర్ చేస్తున్న రాఖీలు కార్టూన్ క్యారెక్టర్స్‌వి. చోటాభీమ్, యాంగ్రీబర్డ్స్, బెన్‌టెన్, క్రిషర్ రాఖీలు కార్టూన్ రాఖీల కొనుగోలులో ముందు వరసలో ఉన్నాయి. వీటితోపాటు పిల్లలు ఇష్టపడుతున్న రాఖీల్లో మిక్కీ మౌస్, డోనాల్డ్‌డక్, ట్వీటీ, మోగ్లీ, క్యాస్పెర్, స్పైడర్‌మ్యాన్ కూడా ఉన్నాయి. ‘ప్రతి ఏడూ రాఖీ తయారీలో కొత్త దనం తీసుకురావడానికి ప్రయత్నిస్తుంటాం. నిజానికి ఈ రాఖీ థాలీని మార్వాడీల కోసం తయారు చేయించేవాళ్లం. ఆకర్షణీయంగా కనిపిస్తున్న వీటిని చూసి, మిగిలినవారూ ఆసక్తి చూపుతున్నారు. దీంతో రక్షాబంధన్‌కి థాలీ మార్కెట్ బాగుంది. పిల్లల రాఖీలు కావాలని రకరకాల బొమ్మలతో ప్రత్యేకంగా డిజైన్ చేయించాం.’ అంటూ సంతోషం వ్యక్తం చేశారు శ్రద్ధ ఎక్స్‌టెన్షన్ యజమాని ఉమాకాంత్.
మోస్ట్ పాపులర్.. మోడీ రాఖీ
అన్నింటినీ మించి ఈ ఏడాది ఆకట్టుకుంటున్న రాఖీ మరోటి ఉంది. అది ప్రధాని నరేంద్ర మోడీ రాఖీ. దేశవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడవుతున్న రాఖీల్లో ఇది ఒకటి. పార్లమెంటులో అడుగుపెడుతూనే ప్రధానిపీఠాన్ని అధిష్టించిన ఈ పొలిటికల్ హీరో రాఖీ కొనేందుకు జనం ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు.
- విజయారెడ్డి