
మళ్లీ తెరపైకి రాయలతెలంగాణ
విభజించడానికి తెగబడిన కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని ఏ విధంగానైనా, ఎన్ని భాగాలగానైనా చిల్చివేస్తుంది.
విభజించడానికి తెగబడిన కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని ఏ విధంగానైనా, ఎన్ని భాగాలగానైనా చిల్చివేస్తుంది. కాంగ్రెస్ అధిష్టానానికి కావలసింది సీట్లు, ఓట్లేగానీ ప్రజాప్రయోజనాలు కాదని తేలిపోయింది. ప్రాతిపదిక ఏమీ లేకుండా రాష్ట్రాన్ని విభజించడానికి సిద్దపడింది. ఇప్పుడు ఆ చీలికలో రాయలసీమను చేర్చింది. రాజకీయ ప్రయోజనాలే పరమావధిగా ప్రారంభించిన విభజన ప్రక్రియను మరింత ప్రహసనంగా మార్చేసింది. రాయల తెలంగాణ కావాలని ప్రజలు ఎన్నకూ కోరలేదు. ఎప్పుడూ ఉద్యమించలేదు. మంత్రి శైలజానాథ్ వంటి వారు అసలు రాయల తెలంగాణ ఎవరు అడిగారని ప్రశ్నిస్తున్నారు. రాయలసీమను రెండుగా చీల్చడానికి అక్కడి ప్రజలు అంగీకరించరని సిపిఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర రెడ్డి అన్నారు. ఒకే సంస్కృతి గల రాయలసీమను చీల్చడం భావ్యంకాదన్నారు. అయినా రాయల తెలంగాణా అంశాన్ని పరిశీలిస్తోంది. ఒక వేళ అదే జరిగితే ఏమౌతుంది? సమస్యలు తీరిపోతాయా? మరింత పెరుగుతాయా? ఎన్నడైనా ఆలోచించారా?
తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను శరవేగంగా సాగిస్తున్న కేంద్రం చివరి నిమిషంలో మళ్లీ తెరపైకి రాయలతెలంగాణ అంశాన్ని తీసుకొచ్చింది. సమస్యను సృష్టించి, జనాన్ని రెచ్చగొట్టడంలో సిద్ధహస్తులైన హస్తం పెద్దలే ఇప్పుడీ ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. ఆంధ్ర ప్రదేశ్ చరిత్రలో ఒక్కసారి కూడా రాయలతెలంగాణ డిమాండ్ వినిపించలేదు. కానీ ఇప్పుడు యుపీఏ విభజనను వ్యతిరేకిస్తున్న సమైక్య ఉద్యమాన్ని చీల్చడానికి కొత్త నాటకానికి తెరతీసింది. అనంతపురం, కర్నూలు జిల్లా కాంగ్రెస్ నేతలే ఇందులో ప్రధాన పాత్రదారులు. తెలంగాణ నేతలు కూడా ఈ ప్రతిపాదనను ప్రస్తుతానికి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా కేంద్రం మాత్రం సీరియస్గానే ఆలోచిస్తోంది. ప్రజాభిప్రాయం, రాజకీయ అభిప్రాయంతో సంబంధంలేకుండా కేంద్రం ఆలోచనకు పదును పెట్టింది.అయితే ఈ ప్రతిపాదన పర్యవసానాలు మాత్రం చాలా తీవ్రంగా ఉండబోతున్నాయి. విభజన వలన కాంగ్రెస్కు కలిసొచ్చే రాజకీయ ప్రయోజనాలెలా ఉన్నా తెలుగు ప్రజల ప్రయోజనాలు మాత్రం సమిధ కానున్నాయి.
ఇప్పటికీ నదీ జలాల పంపిణీ చిక్కువీడని పీటముడిగా మారింది. ఇప్పుడు పది జిల్లాల తెలంగాణతో పాటు కర్నూలు, అనంతపురం జిల్లాలను కలిపితే నీటి యుద్ధాలు మరింత తీవ్రం కానున్నాయి. శ్రీశైలం రిజర్వాయర్, సుంకేసుల బ్యారేజ్, పోతిరెడ్డి పాడు రెగ్యులేటర్, ఇలా అన్నింటినీ తెలంగాణ ప్రాంతంలో కలిపితే కిందున్న రాష్ట్రం సాగునీటి కోసం అల్లాడిపోక తప్పదు. తరతరాలుగా అన్నదమ్ముల్లా ఒకే సంస్కృతితో మెలిగిన రాయలసీమ నాలుగు జిల్లాల మధ్య దారుణమైన ఘర్షణలు తలెత్తే ప్రమాదం ఉంది. ఎందుకంటే రాయలసీమ జిల్లాలకు సాగునీరు, తాగునీరందించే వనరులన్నీ కర్నూలు, అనంతపురం జిల్లాల్లోనే ఉన్నాయి. కెసి కెనాల్, తుంగభద్ర కెనాల్, తెలుగుగంగల నుంచి దిగువన ఉన్న కడప, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు నీళ్లు అందకుండాపోయే ప్రమాదం ఉంది. ప్రకాశం జిల్లాలోని అత్యంత వెనుకబడ్డ ప్రాంతంలోని ఐదు లక్షల మందికి తాగు నీరు, లక్షల ఎకరాలకు సాగునీరందించే వెలిగోడు ప్రాజెక్టు కూడా ప్రశ్నార్థకం కానుంది.
రాయలతెలంగాణ వలన కర్నూలు, అనంతరం జిల్లాల్లోని కృష్ణా మిగులు జలాలపై నిర్మిస్తున్న ప్రాజెక్టులపై కూడా తీవ్రమైన ప్రభావం చూపనుంది. మిగులు జలాల ఆధారంగానే 225 టిఎంసీల సామర్థ్యంతో ప్రాజెక్టులను రూపకల్పన చేశారు. రాష్ట్ర విభజన జరిగితే ఈ మిగులు జలాల కోసం నిర్మిస్తున్న ప్రాజెక్టులు అధోగతి పాలవుతాయి. దిగువకు కృష్ణా జలాలు రావడం సాధ్యం కాదు. అలాంటప్పుడు ప్రస్తుతం రాయలసీమలో నిర్మిస్తున్న ఏడు ప్రాజెక్టుల రైతులకు తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. నాలుగు జిల్లాల్లో విస్తరించి ఉన్న ఈ ప్రాజెక్టుల నీటి విడుదల భవిష్యత్లో కర్నూలు, అనంతపురం, కడపతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాల మధ్య తీవ్రమైన అగాధాన్ని పెంచనున్నాయి. గాలేరు నగరి, హంద్రీ నీవా, వెలిగొండ, వెలిగోడు, కండలేరు, చిత్రావతి, లింగాల, సోమశిల ప్రాజెక్టుల పరిస్థితి ప్రశార్థకంగా మారుతుంది. వీటి రిజర్వాయర్లు, ఆయకట్టులు, ముంపు ప్రాంతాలు అన్నీ చీలిపోయి అస్తవ్యస్తంగా మారతాయి.
ఇక ఉద్యోగుల విభజన, భవిష్యత్ లో ప్రభుత్వ ఉద్యోగాల విషయం కూడా చాలా వివాదంగా మారుతుంది. ఇప్పటికే 371(డి) కేంద్రానికి పెద్ద సవాల్గా మారింది. రాష్ట్రంలోని జోనల్ వ్యవస్థను రద్దు చేయాలా? లేదా? కొత్త రాష్ట్రాల్లో ఎలా ఉండాలన్నదానిపై స్పష్టత లేదు. ఇప్పుడు రాయలసీమను విభజిస్తే ఈ సమస్య మరింత జటిలమవుతుంది. ఎందుకంటే ప్రస్తుతం రాయలసీమలోని నాలుగు జిల్లాలు జోన్ 4 లో అంతర్భాగం. ఇందులో రెండు జిల్లాలను తెలంగాణ, మరో రెండింటినీ ఆంధ్రాలో కలపాలంటే చాలా సమస్యలు వచ్చిపడతాయి. అంతేకాదు భవిష్యత్లో తెలంగాణలోని రెండు జోన్ల విద్యార్థులు, సీమాంధ్రలోని రెండు జిల్లాల అభ్యర్థులు రెండు రాష్ట్రాల్లోనూ అన్యాయమైపోతారు. రాజకీయ ప్రయోజనాలు కానీ, యూనివర్సిటీలు, విద్యాసంస్థల కేటాయింపుల్లోనూ వీరి వాయిస్ బలహీనపడుతుంది. జోన్ ఛిన్నాభిన్నమైపోతే అక్కడి విద్యార్థులకు ప్రభుత్వ ఉద్యోగాలు తీవ్రంగా నష్టపోతారు. ఇది భవిష్యత్ రాయలసీమ విద్యార్థుల ఉనికికే ప్రశ్నార్థకంగా మారుతుంది.
ఇక విద్యుత్ సమస్య రాయలతెలంగాణ వలన మరింత తీవ్రతరం కాబోతుంది. ఇప్పటికే 10 జిల్లాల తెలంగాణలోనే విద్యుత్ డిమాండ్ 52 శాతం ఉంది. ఇప్పుడు ఈ రెండు జిల్లాలు చేరితే అది 56 శాతం అవుతుంది. కానీ విద్యుత్ ఉత్పత్తి మాత్రం ఆ స్థాయిలో లేదు. ప్రస్తుతం ఏపీ జెన్కో ఆధీనంలో థర్మల్, హైడల్ కలిపి 8,921.9 మోగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం గల ప్లాంట్లున్నాయి. ఇందులో థర్మల్ ప్లాంట్ల ద్వారా 5,092.5 మెగావాట్లు, జలకేంద్రాల ద్వారా 3,829.4 మెగావాట్ల ఉత్పత్తి జరుగుతోంది. తెలంగాణలో ప్రస్తుతం 2282.5 మెగావాట్ల థర్మల్, 2541.8 మెగావాట్ల హైడల్ విద్యుత్ ఉత్పత్తయ్యే ప్లాంట్లున్నాయి. కర్నూలు , అనంతపురం కలపడం వలన మరో 770 మెగావాట్ల జల విద్యుత్ సామర్థ్యం మాత్రమే పెరుగుతుంది. సీమాంధ్రలో 2,810 మెగావాట్ల థర్మల్, 517.6 మెగావాట్ల హైడల్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లున్నాయి. అంటే మొత్తం ఉత్పత్తిలో 5,594 మెగావాట్ల ప్లాంట్లు తెలంగాణలోను, 3329 మెగావాట్ల ప్లాంట్లు సీమాంధ్రలో ఉన్నాయి. కానీ గ్యాస్ ప్లాంట్లు, ప్రైవేటు ఒప్పందాలు, కేంద్ర కేటాయింపులతో సీమాంధ్రకు విద్యుత్ సమృద్ధిగా ఉంటుంది కానీ రాయలతెలంగాణకు మాత్రం తీవ్రమైన కొరత ఉంటుంది. ఫలితంగా విద్యుత్ నిర్వహణ కష్టమై తెలంగాణ రైతాంగానికి, పరిశ్రమలకు, హైదరాబాద్ నగరవాసులకు తీవ్రమైన కష్టాలు ఎదురవుతాయి. అలాగే ఉచిత విద్యుత్ బోర్లు ఇప్పటికే 18 లక్షలుండగా మరో రెండు లక్షలు అదనంగా చేరి సబ్సిడీ భారాన్ని, విద్యుత్ డిమాండ్ను కూడా పెంచనున్నాయి.
ఇక సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం రాయలతెలంగాణలో తలకుమించిన భారం కానుంది. ప్రతిపాదిత తెలంగాణ ప్రాజెక్టులకు 67,433 కోట్ల రూపాయలు అవసరం అవుతుంది. అంటే 66 శాతం నిధులు అవసరం. ఇవికాకుండా తెలంగాణలోని ఎత్తిపోతల పథకాలకు 2017-18 నాటికి 6,489 మెగావాట్ల విద్యుత్తు అవసరం అవుతుంది. ఆ ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించడానికి 38,937 కోట్ల రూపాయలు అవసరం. అంటే రాష్ట్ర విభజన జరిగాక ప్రాజెక్టుల కోసం సీమాంధ్ర ప్రభుత్వంపై 34 వేల కోట్ల భారం పడితే , తెలంగాణ రాష్ట్రానికి 1,06,370 కోట్ల రూపా్యల నిధులు అవసరం. దీనికితోడు ఇప్పుడు కర్నూలు, అనంతపురం వలన మరో 3,500 కోట్ల రూపాయల అదనపు భారం పడనుంది. రాష్ట్ర విభజన జరిగాక రాయలతెలంగాణా అయినా సరే ఇరు ప్రాంతాలకు తేరుకోలేని దెబ్బ తగలకతప్పదు.