‘గిటార్’ మ్యూజిక్
భక్తి లేని సంగీతం జ్ఞానం, ముక్తినొసగదని వాగ్గేయకారుడు త్యాగరాజు చెప్పారు. ఇదే సూత్రాన్ని కాస్త మార్చి మానవ సేవకు సంగీతాన్ని ఎంచుకుంటున్నాయి బడా ఆస్పత్రులు. రోగులకు, వారి బంధువులకు వీనుల విందైన సంగీతాన్ని అందిస్తూ వాళ్లను టెన్షన్ ఫ్రీ చేస్తున్నాయి. వైద్యంతో పాటు సరిగమలు వినిపిస్తూ రోగులకు స్వస్తత చేకూరుస్తున్నాయి. గిటార్ మ్యూజిక్ థెరపీ ద్వారా ఆస్పత్రిపాలైన వారికి కాస్తంత రిలీఫ్ అందిస్తున్నాయి.
- వాంకె శ్రీనివాస్
ఎంటర్‌టైన్‌మెంట్ కోరుకునే వారికి డబుల్ హ్యాపీని అందించే ‘గిటార్’ మ్యూజిక్.. ఇప్పుడు ఆస్పత్రుల్లో కూడా వినిపిస్తోంది. బడా హోటళ్లు, రెస్టారెంట్లు, పెళ్లిళ్లు, ప్రత్యేక విందుల్లో మాత్రమే వినిపించే ఈ సాఫ్ట్ మ్యూజిక్.. బాధతో ఆస్పత్రికి వచ్చేవారికి ఉపశమనం కలిగిస్తోంది. రోగులతో పాటు వారి వెంట వచ్చిన వారికి కూడా గిటార్ మ్యూజిక్ వినిపిస్తున్నారు. తమవారికి ఏమవుతుందోనన్న బాధ, టెన్షన్‌ను తగ్గించడానికి గిటార్ ప్లే చేస్తున్నందుకు సంతోషంగా ఉందని జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో గిటార్ మ్యుజీషియన్ విజయ్ రాజ్ అంటున్నారు.
అందుకే లైవ్ మ్యూజిక్...
విదేశాల్లో ఆస్పత్రుల్లో గిటార్ మ్యూజిక్ సాధారణం. కొన్ని ఆస్పత్రుల్లోనైతే రోగుల వద్దకు వెళ్లి వారికి నచ్చిన మ్యూజిక్ వినిపిస్తుంటారు. అదే ట్రెండ్ ఇప్పుడు సిటీలో మొదలైంది. నెలన్నర కిందట అపోలో ఆస్పత్రి గిటార్ ప్లేకు శ్రీకారం చుట్టింది. ‘మొదట్లో లైట్ మ్యూజిక్‌ను స్పీకర్ల ద్వారా వినిపించినా రోగుల వెంట వచ్చినవారి నుంచి ఎలాంటి స్పందన కనిపించలేదు. మ్యూజిక్‌ను ఎంజాయ్ చేయకుండా ఎవరి బిజీలో వారు ఉండటం కనిపించింది. దీంతో లైవ్ మ్యూజిక్ వినిపించాలని నిర్ణయించాం. దీని కోసం ‘బ్లూ కీ ప్రొడక్షన్’ మ్యుజీషియన్‌లతో ఒప్పందం కుదుర్చుకున్నాం.
వాళ్లు రోజూ ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల మధ్య గిటార్ మ్యూజిక్‌ను అందిస్తున్నారు’ అని అపోలో ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. లైవ్ మ్యూజిక్ స్టార్ట్ అయిన తర్వాత పరిస్థితిలో మార్పు కనిపించింది. మ్యుజీషియన్ కళ్లెదుటే గిటార్ ప్లే చేస్తుండటంతో అందరూ ఆసక్తిగా వింటున్నారు. మనసుకు ఆహ్లాదం కలిగించే మ్యూజిక్‌తో.. ఒత్తిడిలో ఉన్న వారి మూడ్‌ను మారుస్తూ బాధతో భారంగా ఉన్న హృదయాలను తేలికపరుస్తున్నారు.