చిగురించే కళల ‘చిరు’నామా.. | Saptparni Cave or Sattaparnaguha Cave is located on a hill | Sakshi
Sakshi News home page

చిగురించే కళల ‘చిరు’నామా..

Published Mon, Jul 14 2014 4:27 AM | Last Updated on Sat, Sep 2 2017 10:15 AM

చిగురించే కళల ‘చిరు’నామా..

చిగురించే కళల ‘చిరు’నామా..

పేరులాగానే సంప్రదాయం, ఆహ్లాదం,
ఆనందం ప్రతిధ్వనించే ప్రదేశమది.
సంగీతం, నృత్యం, సాహిత్యం..
ఇలా పిల్లలకు మన సంప్రదాయ కళలను

అలవరిచే ఏ ఆలోచనకైనా అక్కడ సాదర స్వాగతం ఉంటుంది. బంజారాహిల్స్‌లో ఉన్న సప్తపర్ణి దశాబ్దకాలంగా  నగరంలోని చిన్నారుల ‘కళ’ల సాకారానికి బాటలు వేస్తోంది. పిల్లలు తమ సమయాన్ని కంప్యూటర్ల ముందు కాకుండా క్రియేటివ్‌గా స్పెండ్ చేయాలనే ఉద్దేశంతో సాగుతున్న చక్కటి పర్ణశాల సప్తపర్ణి. పిల్లలకు పుస్తకాలు, సంగీతం, కళలు పరిచయం చేయాలనే తపనతో 2003లో ప్రారంభమైన సప్తపర్ణి అనంతరం చిన్నారులే లక్ష్యంగా ఎన్నో చక్కటి సాంస్కృతిక కార్యక్రమాలకు వేదిక అయ్యింది. అత్యంత ఖరీదైన ప్రాంతంలో, వ్యాపారదృక్పథంతో కాకుండా భావి పౌరులకు బంగారు బాట వేయాలనే దృష్టితో దీనిని ఏర్పాటు చేశామంటారు నిర్వాహకురాలు అనురాధరెడ్డి.

విశేషాల వేదిక...
విశాలమైన ప్రాంగణం.. పచ్చటి చెట్లు, పచ్చ రంగుతో మెరిసే అందమైన భవనంలో సప్తపర్ణి ఏర్పాటైంది. సాయంత్రపు చల్లగాలి పరవళ్ల మధ్య నాట్య, సంగీత విభావరి ఏర్పాటు చేసుకోవడానికి వీలైన యాంపీ థియేటర్.. సంగీతంలో వర్క్‌షాప్స్, వాయిద్యాల అధ్యయనాల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గ్యాలరీ, ఓకల్, తబలా తదితర సంగీత తరగతులు కొనసాగే మ్యూజిక్ రూమ్, చిత్రలేఖనానికి అనువైన చక్కటి హాల్, పిల్లల్లో పఠనాసక్తిని పెంచేందుకు ఏర్పాటు చేసిన బుక్ స్టోర్.. ఇంకా ఇలాంటివెన్నో... సప్తపర్ణి ప్రాంగణంలో ‘చిరు’ప్రాయాన్ని మెరిపించేందుకు మొలకెత్తి ఎదిగినవే.     పిల్లల్లో సంగీతం, సాహిత్యం ఇతర కళల పట్ల ఆసక్తిని రేకెత్తించేందుకు ఇక్కడ పలు  కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు.  సప్తపర్ణి లక్ష్యాలకు అనుగుణంగా కార్యక్రమాలు నిర్వహించాలనుకున్న వారికి అవకాశం ఇస్తుంటారు. బాలల వికాసమే భవితకు ప్రకాశం అనే విశ్వాసం అక్కడి ప్రతి కార్యక్రమంలోనూ స్పష్టమవుతుంది.
 
పదేళ్లుగా... ప్రతి రోజూ పండుగ
సప్తపర్ణి పుట్టి పదేళ్లయినా.. పిల్లల సందడితో తనకు ప్రతి రోజూ పండుగే అంటారు అనురాధ. పుస్తకప్రియులకు.. సంగీతాన్ని ఆస్వాదించే, నేర్చుకోవాలనే తపన ఉన్న వారికి, సంప్రదాయ సందడికి తమ ప్రాంగణం నెలవుగా మార్చాలనే తన లక్ష్యం నెరవేరిందనే ఆనందం ఆమె మాటల్లో ధ్వనిస్తుంది. అయితే ఇదొక బిజినెస్ ప్లాన్‌గానో, ఎజెండాగానో నెలకొల్పింది కాదంటూ, ఈ ప్రాంగణంలో చిన్నారుల సందడిని చూస్తే అచ్చం ఇంట్లో ఉన్నట్టుగానే ఉంటుందంటారామె. అలాగని ఈ ప్లేస్‌ని కేవలం పిల్లలకు మాత్రమే పరిమితం చేయలేదని స్పష్టం చేస్తారు.

పిల్లల తల్లిదండ్రులు సైతం ఆహ్వానితులేనని వివరిస్తారు. పిల్లలు ఒకవైపు తరగతి గదుల్లో ఉంటే.. పెద్దలు ఆవరణలో ఉన్న ఖాళీ స్థలంలో కూర్చుని ల్యాప్‌టాప్ ద్వారా తమ పనుల్లో తాము ఉండొచ్చని అనురాధ చెప్పారు. దుర్వినియోగం చేయరని నమ్మితే ఎవరికైనా తాము ఈ ప్లేస్‌లో చోటిస్తామన్నారామె. చెన్నైలో ఓ బుక్‌స్టోర్‌ను చూసిన అనంతరం కలిగిన స్ఫూర్తితో ఈ ప్రాంగణానికి రూపకల్పన చేశానన్నారు. పదేళ్ల తన అనుభవాల్ని వివరిస్తూ... ఈ ప్రాంగణానికి రెగ్యులర్‌గా వచ్చే పిల్లలు ఇప్పుడు పెద్దవాళ్లయి తమకు దూరమైనా, వారితో వచ్చే పెద్దవాళ్లు తమకు మరింత దగ్గరయ్యారంటూ ఆనందం వ్యక్తం చేస్తారు.

తరచుగా కొత్త విశేషాలతో తమ ప్రాంగణాన్ని పరిపుష్టం చేసే అలవాటును కొనసాగిస్తూ... త్వరలోనే స్వరరాగనిధి పేరుతో మ్యూజికల్ లైబ్రరీ ఏర్పాటు చేయనున్నట్టు కొత్తగా సప్తపర్ణికి తోడవనున్న కళాకాంతిని వివరిస్తారామె. ప్రసిద్ధ సంగీత విద్వాంసులు పాలగుమ్మి విశ్వనాథమ్ విరాళంగా ఇచ్చిన పుస్తకాలు తమ వద్ద ఉన్నాయని,  ఓరల్ ట్రెడిషన్స్ అంశం మీద ఆయన 100 పాటల్ని కూడా పిల్లలతో రికార్డ్ చేయించారని చెప్పారు. పిల్లల కోసం, కళల కోసం, సంస్కృతీ సంప్రదాయాల కోసం.. సిబ్బంది, కుటుంబసభ్యుల సహకారంతో ఇప్పటిలాగే సప్తపర్ణిని విజయవంతంగా నిర్వహించాలనేదే తన ఆశయమని అనురాధరెడ్డి స్పష్టం చేశారు.
 సప్తపర్ణి, రోడ్ నం:8, బంజారాహిల్స్. ఫోన్స్: 66667707, 66821789

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement