saptaparni
-
చిగురించే కళల ‘చిరు’నామా..
పేరులాగానే సంప్రదాయం, ఆహ్లాదం, ఆనందం ప్రతిధ్వనించే ప్రదేశమది. సంగీతం, నృత్యం, సాహిత్యం.. ఇలా పిల్లలకు మన సంప్రదాయ కళలను అలవరిచే ఏ ఆలోచనకైనా అక్కడ సాదర స్వాగతం ఉంటుంది. బంజారాహిల్స్‌లో ఉన్న సప్తపర్ణి దశాబ్దకాలంగా నగరంలోని చిన్నారుల ‘కళ’ల సాకారానికి బాటలు వేస్తోంది. పిల్లలు తమ సమయాన్ని కంప్యూటర్ల ముందు కాకుండా క్రియేటివ్‌గా స్పెండ్ చేయాలనే ఉద్దేశంతో సాగుతున్న చక్కటి పర్ణశాల సప్తపర్ణి. పిల్లలకు పుస్తకాలు, సంగీతం, కళలు పరిచయం చేయాలనే తపనతో 2003లో ప్రారంభమైన సప్తపర్ణి అనంతరం చిన్నారులే లక్ష్యంగా ఎన్నో చక్కటి సాంస్కృతిక కార్యక్రమాలకు వేదిక అయ్యింది. అత్యంత ఖరీదైన ప్రాంతంలో, వ్యాపారదృక్పథంతో కాకుండా భావి పౌరులకు బంగారు బాట వేయాలనే దృష్టితో దీనిని ఏర్పాటు చేశామంటారు నిర్వాహకురాలు అనురాధరెడ్డి. విశేషాల వేదిక... విశాలమైన ప్రాంగణం.. పచ్చటి చెట్లు, పచ్చ రంగుతో మెరిసే అందమైన భవనంలో సప్తపర్ణి ఏర్పాటైంది. సాయంత్రపు చల్లగాలి పరవళ్ల మధ్య నాట్య, సంగీత విభావరి ఏర్పాటు చేసుకోవడానికి వీలైన యాంపీ థియేటర్.. సంగీతంలో వర్క్‌షాప్స్, వాయిద్యాల అధ్యయనాల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గ్యాలరీ, ఓకల్, తబలా తదితర సంగీత తరగతులు కొనసాగే మ్యూజిక్ రూమ్, చిత్రలేఖనానికి అనువైన చక్కటి హాల్, పిల్లల్లో పఠనాసక్తిని పెంచేందుకు ఏర్పాటు చేసిన బుక్ స్టోర్.. ఇంకా ఇలాంటివెన్నో... సప్తపర్ణి ప్రాంగణంలో ‘చిరు’ప్రాయాన్ని మెరిపించేందుకు మొలకెత్తి ఎదిగినవే. పిల్లల్లో సంగీతం, సాహిత్యం ఇతర కళల పట్ల ఆసక్తిని రేకెత్తించేందుకు ఇక్కడ పలు కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. సప్తపర్ణి లక్ష్యాలకు అనుగుణంగా కార్యక్రమాలు నిర్వహించాలనుకున్న వారికి అవకాశం ఇస్తుంటారు. బాలల వికాసమే భవితకు ప్రకాశం అనే విశ్వాసం అక్కడి ప్రతి కార్యక్రమంలోనూ స్పష్టమవుతుంది. పదేళ్లుగా... ప్రతి రోజూ పండుగ సప్తపర్ణి పుట్టి పదేళ్లయినా.. పిల్లల సందడితో తనకు ప్రతి రోజూ పండుగే అంటారు అనురాధ. పుస్తకప్రియులకు.. సంగీతాన్ని ఆస్వాదించే, నేర్చుకోవాలనే తపన ఉన్న వారికి, సంప్రదాయ సందడికి తమ ప్రాంగణం నెలవుగా మార్చాలనే తన లక్ష్యం నెరవేరిందనే ఆనందం ఆమె మాటల్లో ధ్వనిస్తుంది. అయితే ఇదొక బిజినెస్ ప్లాన్గానో, ఎజెండాగానో నెలకొల్పింది కాదంటూ, ఈ ప్రాంగణంలో చిన్నారుల సందడిని చూస్తే అచ్చం ఇంట్లో ఉన్నట్టుగానే ఉంటుందంటారామె. అలాగని ఈ ప్లేస్‌ని కేవలం పిల్లలకు మాత్రమే పరిమితం చేయలేదని స్పష్టం చేస్తారు. పిల్లల తల్లిదండ్రులు సైతం ఆహ్వానితులేనని వివరిస్తారు. పిల్లలు ఒకవైపు తరగతి గదుల్లో ఉంటే.. పెద్దలు ఆవరణలో ఉన్న ఖాళీ స్థలంలో కూర్చుని ల్యాప్‌టాప్ ద్వారా తమ పనుల్లో తాము ఉండొచ్చని అనురాధ చెప్పారు. దుర్వినియోగం చేయరని నమ్మితే ఎవరికైనా తాము ఈ ప్లేస్‌లో చోటిస్తామన్నారామె. చెన్నైలో ఓ బుక్‌స్టోర్‌ను చూసిన అనంతరం కలిగిన స్ఫూర్తితో ఈ ప్రాంగణానికి రూపకల్పన చేశానన్నారు. పదేళ్ల తన అనుభవాల్ని వివరిస్తూ... ఈ ప్రాంగణానికి రెగ్యులర్‌గా వచ్చే పిల్లలు ఇప్పుడు పెద్దవాళ్లయి తమకు దూరమైనా, వారితో వచ్చే పెద్దవాళ్లు తమకు మరింత దగ్గరయ్యారంటూ ఆనందం వ్యక్తం చేస్తారు. తరచుగా కొత్త విశేషాలతో తమ ప్రాంగణాన్ని పరిపుష్టం చేసే అలవాటును కొనసాగిస్తూ... త్వరలోనే స్వరరాగనిధి పేరుతో మ్యూజికల్ లైబ్రరీ ఏర్పాటు చేయనున్నట్టు కొత్తగా సప్తపర్ణికి తోడవనున్న కళాకాంతిని వివరిస్తారామె. ప్రసిద్ధ సంగీత విద్వాంసులు పాలగుమ్మి విశ్వనాథమ్ విరాళంగా ఇచ్చిన పుస్తకాలు తమ వద్ద ఉన్నాయని, ఓరల్ ట్రెడిషన్స్ అంశం మీద ఆయన 100 పాటల్ని కూడా పిల్లలతో రికార్డ్ చేయించారని చెప్పారు. పిల్లల కోసం, కళల కోసం, సంస్కృతీ సంప్రదాయాల కోసం.. సిబ్బంది, కుటుంబసభ్యుల సహకారంతో ఇప్పటిలాగే సప్తపర్ణిని విజయవంతంగా నిర్వహించాలనేదే తన ఆశయమని అనురాధరెడ్డి స్పష్టం చేశారు. సప్తపర్ణి, రోడ్ నం:8, బంజారాహిల్స్. ఫోన్స్: 66667707, 66821789 -
కథల పండుగ
స్టోరీ ఆర్ట్స్ ఇండియా, నివాసిని పబ్లిషర్స్ సంయుక్తంగా బంజారాహిల్స్ సప్తపర్ణిలో పిల్లలు, పెద్దల కోసం నిర్వహించిన స్టోరీ ఫెస్టివల్ చివరి రోజైన ఆదివారం కూడా విభిన్న అంశాలతో ఉల్లాసంగా సాగింది. సైన్ లాంగ్వేజ్... నీతా గోపాలకృష్ణ ఆధ్వర్యంలో ఈ సెషన్ జరిగింది. బధిరులైన ఆమె తల్లిదండ్రులు గోపాలకృష్ణ, లేఖా గోపాల కృష్ణతో సహా ఆమె ఈ సెషన్లో పాల్గొన్నారు. స్వతహాగా మాట్లాడగలిగిన, వినగలిగిన నీతా... సైన్ లాంగ్వేజ్ ద్వారా ఆ లాంగ్వేజ్‌ను పిల్లలకూ, పెద్దలకూ ఓ కథలా పరిచయుం చేశారు. ఉర్దూ... బెంగాలీ... ఫ్రొఫెసర్ ఖాలిద్ ఖేల్ కహావత్ (ఉర్డూ స్టోరీ టెల్లింగ్)లో ఖవ్వాలీ, కథలు, సామెతలు, మంజు దాస్‌గుప్తా బెంగాలీలో వన్ వరల్డ్ మెనీ స్టోరీస్ (బెంగాలీ స్టోరీ టెల్లింగ్), అబ్బారుు- వూమిడి చెట్టు కథను ఉవూ చల్లా ఆసక్తికరంగా చెప్పారు. పిల్లలు రాసిన పుస్తకం... ‘ఎ బెటర్ వరల్డ్’ పేరుతో 33 మంది (10-15 మధ్య వయస్కులు) చిన్నారులు కలసి రాసిన పుస్తకాన్ని నివాసిని పబ్లిషర్స్ ప్రచురించారు. ఆటిజంపై... ఆటిజం అవేర్నెస్ గురించి మాధవి ఆదిమూలం ప్రత్యేక సెషన్ నిర్వహించారు. ఆటిజం పిల్లలు మీ జీవితంలోకి వస్తే వారితో మీరు ప్రేమలో పడిపోతారంటూ సాగిన ఈ సెషన్ విలువైన విషయాలతో సాగింది. క్రియేటివ్ రైటింగ్... చెరిల్ రావ్, నందినీరావ్ నిర్వహణలో క్రియేటివ్ రైటింగ్ వర్క్‌షాప్ ఆసక్తికరంగా సాగింది. పిల్లల్లో క్రియేటివ్ రైటింగ్‌ను పెంచేలా ఉన్నారుు. నగరంలో తొలిసారి నిర్వహించిన ఈ తరహా కార్యక్రమం విజయవంతం కావడంతో నిర్వాహకులు దీపాకిరణ్, నివేదిత సంతోషం వ్యక్తం చేశారు. సాక్షి, సిటీ ప్లస్ -
అదొక ‘కథా’ కళ
ఆర్టిజం.. అదొక ‘కథా’ కళ. కథలంటే చెవి కోసుకునే చిన్నారుల కోసం పుట్టుకొచ్చిన కళోత్సవం... బంజారాహిల్స్‌లోని ‘సప్తపర్ణి’ వేదికగా స్టోరీ ఆర్ట ఫెస్టివల్ శనివారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా చిన్నారులకు దీపా కిరణ్, సలీల్ ఖాదిర్‌లు సాంప్రదాయ జానపద వాద్యపరికరాలను పరిచయం చేసినప్పుడు వారి ఉత్సాహం చూడాల్సిందే. తెల్లని శంఖాన్ని చూపించి, ఇదెక్కడుంటుందని అడిగితే, మహాభారత్‌లో అని కొందరు, గుడిలో అని మరికొందరు బదులిచ్చారు. చివరకు సముద్రంలో ఉంటుందని ఒక బుజ్జాయి చెప్పాడు. చిడతలు చూపిస్తే, నారదుడి పేరు చెప్పారు గానీ, వాటి పేరు చెప్పలేకపోయారు. డోలు చూపించగానే పిల్లలంతా డోలు అని చెప్పారు. ఒక బుడతడు ముందుకొచ్చి ఏకంగా ఆ డోలు వాయించడం మొదలుపెట్టాడు. తాళాలు, డప్పు, సింగింగ్ బౌల్, ఏక్తారా, ప్రపంచవ్యాప్తంగా గిరిజనులు వాయించే ‘రెయిన్ మేకర్’ వంటి వాద్యాలను దీపా, సలీల్ ఖాదిర్‌లు పిల్లలకు పరిచయం చేశారు. ఆదివారం కూడా ఈ ఫెస్ట్ కొనసాగుతుంది. అంగ్రేజీ ఖవ్వాలీ: నగరం గురించి పిల్లలకు అర్థమయ్యే రీతిలో సంఘమిత్రా మల్లిక్ ఇంగ్లిష్‌లో చక్కని ఖవ్వాలీ రాసి, పిల్లల చేత పాడించారు. చార్మినార్, ఫలక్‌నుమా వంటి చారిత్రక కట్టడాలను, ఉస్మానియా బిస్కట్లు, ఇరానీ చాయ్, బిర్యానీ వంటి హైదరాబాదీ ఆహార పానీయాలను, మతాలు, పండుగలు, సంప్రదాయాలను ఈ ఖవ్వాలీలో ప్రస్తావించారు. ‘కమ్ వన్ అండ్ ఆల్ టు హైదరాబాద్...’ అంటూ హైదరాబాద్ నగరాన్ని కళ్లకు కట్టించిన ఈ ఖవ్వాలీని పిల్లలు ఆద్యంతం ఆస్వాదించారు. అంధబాలల చిత్రకళ: లలితా దాస్ స్వయంగా పరిశోధించి రూపొందించిన పద్ధతి ద్వారా అంధ బాలలకు చిత్రలేఖనంలో శిక్షణ ఇచ్చారు. అంధులైన పలువురు బాలలు కుంచెలకు పనిచెప్పి గంట వ్యవధిలోనే చక్కని చిత్రాలు గీసి, అందరినీ అబ్బురపరిచారు. మైమ్ అండ్ స్టోరీ టెల్లింగ్ మైమ్‌లో అంతర్జాతీయ గుర్తింపు పొందిన మధు నిర్వహించిన మైమ్ సెషన్ సరదాగా సాగింది. ఇష్టమైన చెట్టును ఊహించుకుని పండు కొయ్యడం, చేతిలో ఏమీ లేకుండానే ఐస్‌క్రీమ్ తిన్నట్లు అభినయించడం, చేతిలో, మోచేతిలో, కాలిలో బ్రష్ ఉన్నట్లు ఊహించుకుని పేర్లు రాయడం వంటి అంశాలను పిల్లల చేత అభినయింపజేశారు. అనంతరం మాధవి ఆదిమూలం ఆటిజం అవేర్నెస్ సెషన్ నిర్వహించారు.