అదొక ‘కథా’ కళ
ఆర్టిజం..
అదొక ‘కథా’ కళ. కథలంటే చెవి కోసుకునే చిన్నారుల కోసం పుట్టుకొచ్చిన కళోత్సవం... బంజారాహిల్స్‌లోని ‘సప్తపర్ణి’ వేదికగా స్టోరీ ఆర్‌ట ఫెస్టివల్ శనివారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా చిన్నారులకు దీపా కిరణ్, సలీల్ ఖాదిర్‌లు సాంప్రదాయ జానపద వాద్యపరికరాలను పరిచయం చేసినప్పుడు వారి ఉత్సాహం చూడాల్సిందే.
తెల్లని శంఖాన్ని చూపించి, ఇదెక్కడుంటుందని అడిగితే, మహాభారత్‌లో అని కొందరు, గుడిలో అని మరికొందరు బదులిచ్చారు. చివరకు సముద్రంలో ఉంటుందని ఒక బుజ్జాయి చెప్పాడు. చిడతలు చూపిస్తే, నారదుడి పేరు చెప్పారు గానీ, వాటి పేరు చెప్పలేకపోయారు. డోలు చూపించగానే పిల్లలంతా డోలు అని చెప్పారు. ఒక బుడతడు ముందుకొచ్చి ఏకంగా ఆ డోలు వాయించడం మొదలుపెట్టాడు. తాళాలు, డప్పు, సింగింగ్ బౌల్, ఏక్‌తారా, ప్రపంచవ్యాప్తంగా గిరిజనులు వాయించే ‘రెయిన్ మేకర్’ వంటి వాద్యాలను దీపా, సలీల్ ఖాదిర్‌లు పిల్లలకు పరిచయం చేశారు. ఆదివారం కూడా ఈ ఫెస్ట్ కొనసాగుతుంది.
అంగ్రేజీ ఖవ్వాలీ: నగరం గురించి పిల్లలకు అర్థమయ్యే రీతిలో సంఘమిత్రా మల్లిక్ ఇంగ్లిష్‌లో చక్కని ఖవ్వాలీ రాసి, పిల్లల చేత పాడించారు. చార్మినార్, ఫలక్‌నుమా వంటి చారిత్రక కట్టడాలను, ఉస్మానియా బిస్కట్లు, ఇరానీ చాయ్, బిర్యానీ వంటి హైదరాబాదీ ఆహార పానీయాలను, మతాలు, పండుగలు, సంప్రదాయాలను ఈ ఖవ్వాలీలో ప్రస్తావించారు. ‘కమ్ వన్ అండ్ ఆల్ టు హైదరాబాద్...’ అంటూ హైదరాబాద్ నగరాన్ని కళ్లకు కట్టించిన ఈ ఖవ్వాలీని పిల్లలు ఆద్యంతం ఆస్వాదించారు.
అంధబాలల చిత్రకళ: లలితా దాస్ స్వయంగా పరిశోధించి రూపొందించిన పద్ధతి ద్వారా అంధ బాలలకు చిత్రలేఖనంలో శిక్షణ ఇచ్చారు. అంధులైన పలువురు బాలలు కుంచెలకు పనిచెప్పి గంట వ్యవధిలోనే చక్కని చిత్రాలు గీసి, అందరినీ అబ్బురపరిచారు.
మైమ్ అండ్ స్టోరీ టెల్లింగ్
మైమ్‌లో అంతర్జాతీయ గుర్తింపు పొందిన మధు నిర్వహించిన మైమ్ సెషన్ సరదాగా సాగింది. ఇష్టమైన చెట్టును ఊహించుకుని పండు కొయ్యడం, చేతిలో ఏమీ లేకుండానే ఐస్‌క్రీమ్ తిన్నట్లు అభినయించడం, చేతిలో, మోచేతిలో, కాలిలో బ్రష్ ఉన్నట్లు ఊహించుకుని పేర్లు రాయడం వంటి అంశాలను పిల్లల చేత అభినయింపజేశారు. అనంతరం మాధవి ఆదిమూలం ఆటిజం అవేర్‌నెస్ సెషన్ నిర్వహించారు.