ఏబీకే ప్రసాద్, సీనియర్ సంపాదకులు
రెండోమాట
‘‘ఉద్యానవనాలు, పంట భూములు, అడవులూ క్షయమవటం వినాశహేతువు. పంట పొలాల విస్తీర్ణం తరగకూడదని, ఏయేటికాయేడు పెరగాలనీ శాకంబరీ మాతగా దర్శనమిచ్చే బెజవాడ కనక దుర్గమ్మకు విన్నపాలు చేస్తూంటాం. వాటి దుర్వినియోగం ముందుతరాల వారి పట్ల ద్రోహమే. రాజధాని కోసం పంట భూములను, నదీ పరీవాహక ప్రాంతాలనూ దుర్వినియోగం చేసి.. ఐదు, పదేళ్ల తర్వాత ‘అలా చేసి ఉండాల్సింది, ఇలా చేయకుండా ఉండాల్సింది’ అని సమీక్షలు, వ్యాసాలు, వ్యాసంగాలు, విద్వద్గోష్టులు నిర్వహించి చప్పట్లు కొట్టించుకుంటారా?
‘‘ఎలాంటి పాపాత్ముడనైనా భరిస్తాను, క్షమిస్తాను గాని, మాట తప్పిన వాడిని మోయజాలను, క్షమించలేను’’
- ‘బ్రహ్మ’తో భూదేవి ఉవాచ: పోతన భాగవతం, అష్టమస్కంధం
ఆంధ్రప్రదేశ్ ‘రాజధాని నిర్మాణం’ సాకుతో ముక్కారు పంట భూముల్ని వేలకు వేల ఎకరాలు బలవంతంగా స్వాధీనం చేసుకొని, అస్మదీయ స్వప్ర యోజనపరులకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కట్టబెట్టడానికి వీలుగా టీడీపీ-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ముందు ఓ ఆర్డినెన్స్‌ను తెచ్చి, ఆపై దాన్ని చట్టంగా మార్చింది. కాబట్టే ఇక్కడ ‘భూదేవి’ మాటను ప్రస్తావించవలసి వచ్చింది. పైగా మంత్రి పుల్లారావు ఒక వెకిలి మాట వదిలారు. ప్రతిపక్ష నాయకుని (జగన్) మాటలు విని రైతులు నవ్వుకుంటున్నారని ఆయన ఉవాచ. కానీ తెలుగు రైతులు విరగబడి నవ్వుతున్నది ఇలాంటి ఉబుసుపోని మాటలకేనని, ఎగతాళి పట్టిస్తున్నది ఎన్నికల్లో గెలుపు కోసం నెరవేర్చలేని హామీలిచ్చి, అబద్ధాలాడిన వారినేనని చెవుల్లో సీసం నింపుకుని మరీ పాలక స్థానంలో ఉన్న వారికి తెలియకపోవచ్చు! భూస్వాధీన / సమీకరణ చట్టాన్ని, దానికి తోడు చేసిన కృత్రిమ నిబంధనలను తెలుగులో ప్రచురించకుండా ఇంగ్లిష్‌లో ముద్రించి రైతుల ముఖాల మీద కొట్టడమే మొదటి మోసం! రైతులు ‘స్వచ్ఛందంగానే భూములిచ్చార’న్న కోతలూ, ప్రకటనలూ అలాం టివే. కాగా రాజధాని ప్రాంత రైతులు ఈ మోసాన్ని గమనించి రోజుకొక తీరున చేస్తున్న నిరసన ప్రదర్శనలు, ఆందోళనలు పచ్చి నిజం. నిజానికి ఒక ముఖమే గాని రెండు ముఖాలుండవు. పంట భూముల బలవంతపు స్వాధీ నానికి సన్నాహంగా జరిగిన వికృత ఘటన ఎవరూ మరచిపోలేని నిజం. నిశి రాత్రి రెండు గంటలప్పుడు పండ్ల తోటలను తగలబెట్టవలసిన అవసరం ఎవరికి వచ్చిందన్న ప్రశ్న శేష ప్రశ్నగానే మిగిలిపోయింది. మంది మార్బలం తో ఉన్న ప్రభుత్వ యంత్రాంగం ఈ క్షణం దాకా ఆ దుర్మార్గానికి కారకులె వరో నిగ్గుతేల్చకపోవడాన్ని చూసి కూడా అంతా నవ్వుకుంటున్నారు! ‘‘ప్రజ లంటే భయభక్తులు, దూరదృష్టి లేని పాలకులవల్ల దేశం కరువు కాటకాలతో పీడనకు గురవుతుంది. పీడనకు గురయ్యే ప్రజలు ధైర్యం కోల్పోయి భయ భ్రాంతులకు లోనైపోతారు, పాలకులు ప్రజల్ని దోచుకుంటారు; అధర్మ పాలనకు పాల్పడతారు!’’ అని పోతన ఎప్పుడో చెప్పాడు.
ధరిత్రీ సత్యాన్ని కానలేని అంధత్వం
అధర్వణ వేదంలోని ‘భూమి సూక్తం’లో పాలకులకు, ప్రజలకు ఒక పాఠం, గుణపాఠం ఉంది. యావత్తు ప్రాణికోటికి ఆహారం ఎక్కడి నుంచి అందు తుందో అందులో పేర్కొన్నారు. మోదీ నుంచి మోడుబారి పోయిన రాష్ట్ర పాలకుల దాకా ఆ ‘సూక్తం’ శాశ్వత పారాయణం కావాలి! ఆ సూక్తంలో ఇలా ఉంది: ‘‘ఈ భూగర్భంలో అసంఖ్యాకంగా కొండలు, నదులు, ఆరోగ్య రక్ష కాలైన ఔషధాలూ, జలచర సంపదా ఉన్నాయి. ప్రజలకు అవసరమైన ఆహార మంతా ఈ భూమాత నుంచే పుడుతోంది. ఓ భూదేవీ! ... నీవు నా తల్లివి, మేము మీ బిడ్డలం. నా తండ్రి పర్జన్యుడు (వర్షించే మేఘం) నాకు సర్వదా క్షేమం కలిగించుగాక!’’ వైజ్ఞానిక శాస్త్రం అంతగా పరిఢవిల్లని రోజుల్లోనే ‘భూదేవి’ వాక్కులోని సత్యాన్ని... సాంకేతిక సమాచార వ్యవస్థ వడివడిగా దూసుకువచ్చిన ఈ ఆధునికయుగపు పాలకులు గుర్తించకపోవడం పెను విషాదం. దేశవాళీ, ప్రపంచ గుత్త సంస్థలకు రాష్ట్రాలను, దేశాన్ని టోకుగానూ, చిల్లరగానూ అమ్మజూపుతున్న పాలకులున్న చోట రేపు సంభవించనున్న వినాశకర పరిస్థితులకు రాజధాని ప్రాంతపు ఒక రైతు కుటుంబానికి చెందిన అక్షరాస్యుడైన రైతు బాధాతప్త హృదయంతో ఇటీవలనే నాకు రాసిన ఒక లేఖను పాఠకుల దృష్టికి తెస్తున్నాను. ప్రజల ఆహార భద్రతకు, ఉపాధికి ఏర్ప డనున్న ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకున్న వాడికే, ప్రకృతితో ఆ సాన్నిహిత్యం ఉన్న వాడికే రైతుకు భూమితో ఉన్న అనుబంధం, ఆ ఎద తీపులూ తెలు స్తాయి! ఆ రైతు తన కన్నీటి లేఖతో మనల్ని మేల్కొల్పుతున్నాడు.
పుడమి తల్లికి ‘సేకరణ’ శృంఖలాలా?
‘‘అన్నం వలననే మానవులు సహా యావత్తు జంతుజాలం మనుగడ. ఊసర క్షేత్రాలలో, సముద్రాలలో కురిసే వర్షం వృథా! అందుకు తోడు కావలసినవి మంచి సారవంతమయిన, ఫలవంతమయిన భూములు. నా చిన్నతనంలో మా బామ్మ, నేను అన్నం తింటుండటం చూసి ‘కంచం చుట్టూ అలా ఎన్ని మెతుకులు పారేశావురా? ఎంత మందో అన్నం లేక ఇబ్బందులు పడుతు న్నారు, ఇలా వృథా చేయకూడదు నాయనా! రైతు ఆరుగాలం కష్టపడితే, మీ నాన్న సంపాదనతో ఆ బియ్యం కొంటే, వాటిని మీ అమ్మ శ్రద్ధతో వండి వార్చితే ఒక్కొక్క గింజ ఒక్కొక్క మెతుకై నీ కంచంలోకి వస్తోంది.’ ఇలా ఆమె అన్నం వృథా చేసినా, మొక్కలు, చెట్లు, లతలకు అహితం చేసినా మందలిం చేది. ఆ మెతుకులకు కారణమైన పంట భూముల వృథాను చూస్తూ ఊరుకో గలమా? ‘‘మన జన్మభూమి, బంగారుభూమి, పాడిపంటలతో పసిడి రాశులతో కళకళలాడే...’ అంటూ సాగుతుంది ఓ సినిమా పాట. ‘పచ్చి బాలిం తరాలు మన జననీ’ అంటూ ధరిత్రిని కవి మాతృమూర్తిగా భావన చేసి గొప్ప గీత రచన చేశాడు. సంక్రాంతి లక్ష్మికి ఆలవాలం నేలతల్లే. భూమి మీద ఆధారపడి బతికే రైతాంగం శాతం జనాభా రీత్యా పెరుగుతూనే ఉండాలి కాని పడిపోరాదు. అది ప్రమాద సంకేతం. వ్యవసాయమే వృత్తిగా ఉన్న వారితో అది మాన్పించి, వేరే జీవనాధారంపై బతికే ధోరణికి తావీయరాదు. వారిలో బద్దకం, వృత్తి మారిపోదామనే తలంపు పెరగనివ్వరాదు.
చేతులు కాలాక ఆకులు పడతారా?
‘‘ఉద్యానవనాలు, పంట భూములు, అడవులూ క్షయమవటం వినాశ హేతువు. పంట పొలాల విస్తీర్ణం తరగకూడదని, ఏయేటికాయేడు పెరగా లనీ, శాకంబరి మాతగా దర్శనమిచ్చే బెజవాడ కనక దుర్గమ్మకు విన్నపాలు చేస్తూంటాం. పంట పొలాలను, ఉద్యానవనాలను దుర్వినియోగం చేస్తే ముం దు తరాల వారికి ద్రోహం చేసినట్లే. రాజధాని నిర్మాణానికి పంట భూము లను, ఉద్యాన వనాలనూ, నదీ పరీవాహక ప్రాంతాలనూ దుర్వినియోగం చేసి, ఐదు, పదేళ్ల తర్వాత ‘అలా చేసి ఉండాల్సింది, ఇలా చేయకుండా ఉండా ల్సింది’ అని సమీక్షలు, వ్యాసాలు, వ్యాసంగాలు, విద్వద్గోష్టులు నిర్వహించి చప్పట్లు కొట్టించుకుంటారా? ఈ లేఖను మీరు ప్రచురణార్థం ఉపయోగిస్తే దయచేసి నాకు ఏ రాజకీయ రంగులు పులమకుండా చూడండి.’’ ఇంతకూ ఈ రైతన్న (లేఖకుని) ఆవేదనంతా ఎందుకు? అని ప్రశ్నించే వారికి కలకాలం నిలిచిపోయే కాళోజీ మాటే శిలాక్షరం కావాలి:
‘‘పుట్టు గుణమో! మట్టి గుణమో!
నీటి గుణమో! గాలి గుణమో!
అన్నపూర్ణ నామాంకిత ఆంధ్రావని సౌభాగ్యమో!
సేద్యమంటె సంబరపడు కాపు బిడ్డ తెలుగువాడు
చెట్టు కొట్టి, మెట్ట తవ్వి, కంప పొదల నరికి కాల్చి
పుడమి దున్ని పండించిన మొదటి వాడు తెలుగువాడు!’’
దగాకోరు భాష-ధనవంతుల బాట
అందుకే నేటి ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత రైతులు దేశ ఆహార భద్రతకు దోహదపడే బహుకొలది రాష్ట్రాల్లో ఒకటిగా, అన్నపూర్ణగా అగ్రస్థానంలో లిఖి తమై ఉన్న తమ చెరిగిపోని, చెరపరాని చరిత్రను మరీ మరీ గుర్తు చేసుకుం టున్నారు. దారి తప్పిన పాలకుల్ని చూసి నిజంగానే విరగబడి ‘‘నవ్వుకుంటు న్నారు.’’ వ్యవసాయం దండుగ కాదు, పండుగలా మారుస్తాననీ, నేను మారాను, నన్ను నమ్మండి అనీ అంటూనే బాబు మమ్మల్నీ, మా కుటుం బాలను ఏమార్చడానికి సాహసించాడని ఎద్దేవా చేస్తున్నారు. బాబు ఊత పదంగా మారిన ‘‘నన్ను నమ్మండి, మీ నమ్మకాన్ని వమ్ము చేయను’’ అన్న అరిగిపోయిన నినాదాన్ని బీజేపీ సారథి, ప్రధాని మోదీ ఇప్పుడు అందిపుచ్చు కున్నారు. ‘‘నన్ను నమ్మండి, మీ నమ్మకాన్ని వమ్ము చేయను. భూసేకరణ బిల్లు మీ కోసమే, ప్రతిపక్షాల మాట నమ్మకండి’’ అని రైతులకు విన్నపాలు (22-3-2015) చేయడం ప్రారంభించారు! ఉభయులదీ ఒకే భాష... ధన స్వామ్య ప్రభువర్గాలందరి భాష, దగాకోరు భాష! ఇరువురిదీ ఒకే మాట, ఒకే బాట! కేంద్ర, రాష్ట్ర పాలకులు కూడబలుక్కునే రైతాంగపు భూముల బలవం తపు స్వాధీనానికి ఆర్డినెన్స్‌ను, చట్టాన్ని రైతులపై రుద్దారని మరవరాదు!
(వ్యాసకర్త మొబైల్: 9848318414)