Second Word
-
గుల్బర్గ్ తీర్పు నేర్పుతున్న గుణపాఠం
రెండో మాట గోద్రా అనంతర హింసాకాండను అదుపుచేయడానికి మోదీ మంత్రిమండలి ఎలాంటి నిర్ణయాత్మక చర్య తీసుకోలేదని రాజు రామచంద్రన్ సుప్రీంకోర్టుకు నోట్ పంపారు. దీనిపైనే సుప్రీంకోర్టు సిట్ (ప్రత్యేక దర్యాప్తు బృందం) అభిప్రాయాన్ని (మార్చి 15, 2011) కోరింది. ఎమికస్ క్యూరీ లేఖలో వెలుబుచ్చిన అభిప్రాయం దృష్ట్యా అవసరమైతే మరోసారి విచారణ చేపట్టవలసిందేనని కూడా అత్యున్నత న్యాయస్థానం సిట్‌ను ఆదేశించింది. అప్పుడు గాని సిట్ మోదీపై విచారణకు సిద్ధం కాలేదు. ‘న్యాయ చట్టాల ప్రకారం నడవాల్సిన పాలనా వ్యవస్థలో, చట్టాల్ని తు.చ. తప్పకుండా పాటించడంలో విఫలమైతే ఆ ప్రభుత్వం ఉనికికే చేటు. ప్రభుత్వ మనేది శక్తిమంతమైనది. సర్వాంతర్యామి. మంచి చేయడంలోనూ, చెడు తలపెట్టడంలోనూ తన ఆచరణ ద్వారా ప్రజలకు గురువుగా వ్యవహరిస్తుంది. నేరం, నేరభావన అంటువ్యాధులు. ప్రభుత్వమే చట్టాలను ఉల్లంఘించి చట్ట వ్యతిరేకిగా మారినప్పుడు అసలు చట్టం పట్లనే ద్వేషం, ధిక్కరణ భావాన్ని ప్రజలలో కల్పించి తీరుతుంది. ఈ పరిస్థితిలో ప్రతి పౌరుడు తానే చట్టంగా భావించి, చట్టం ధిక్కరించేవానిగా మారతాడు. తద్వారా ఈ పరిణామం కాస్తా సమాజంలో అరాచకానికి దారితీస్తుంది.’ -ప్రఖ్యాత న్యాయనిపుణుడు జస్టిస్ బ్రాండిస్ (ఆమ్స్టెడ్ వర్సెస్ అమెరికా కేసు డిసెంట్ పత్రంలో) ప్రపంచ పటం మీదకు చేరిన 2002 గుజరాత్ అరాచకాల దరిమిలా నమోదైన తొమ్మిది కిరాతకాలలో గుల్బర్గ్ సొసైటీ మూకుమ్మడి హత్యాకాండ (ఫిబ్రవరి 28, 2002) ఒకటి. కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ ఇషాన్ జాఫ్రీ సహా 69 మంది చనిపోయారు. కేసు విచారణ అనంతరం అహమ్మదాబాద్ స్పెషల్ కోర్టు 14 ఏళ్ల తరువాత ఇప్పుడు తీర్పును వెలువరించింది. 24 మందికి శిక్షలు విధించారు. 11 మందికి మరణశిక్ష విధించారు. 36 మంది నిందితుల మీద శిక్ష రద్దుచేశారు. సాక్ష్యం లేనందున కుట్రకేసు ఆరోపణను కూడా కొట్టివేశారు. ఈ కేసు మీద సిట్ విచారణను సుప్రీం కోర్టు పర్యవేక్షించింది. సిట్ విచారణ సంస్థలో గుజరాత్ పోలీసులు సభ్యులుగా ఉన్నందున జాతీయ స్థాయి సాధికార మానవహక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ), సుప్రీంకోర్టు సుప్రసిద్ధ రిటైర్డ్ న్యాయమూర్తి వీఆర్ కృష్ణయ్యర్ అధ్యక్షత న ఉన్న సిటిజన్స్ ఫర్ జస్టిస్ అండ్ పీస్ సంస్థ గుజరాత్ పోలీసులకు సిట్‌లో స్థానం కల్పించడాన్ని సవాలు చేశాయి. దానితో గుజరాత్లో హత్యాకాండపై దర్యాప్తునకు 2008లో నియమించిన సిట్‌ను పునర్ నిర్మించి, మొత్తం తొమ్మిది కేసులను తిరిగి విచారించమని సుప్రీంకోర్టు ఆదేశించవలసి వచ్చింది. అలాగే బాధితులకు న్యాయం చేయాలంటూ అల్లర్లలో మరణించిన ఇషాన్ జాఫ్రీ భార్య జకియా జాఫ్రీ పదకొండు సంవత్సరాలుగా పోరాడు తున్నారు. ఆది నుంచీ అరకొర న్యాయమే హత్యాకాండ తరువాత ఏడేళ్ల నాడు విచారణ ప్రారంభం కావడమే ఒక వింతగా న్యాయనిపుణులు భావించారు. ఫిబ్రవరి 27, 2002న సబర్మతి ఎక్స్‌ప్రెస్ రైలు ప్రారంభ ప్రయాణం సందర్భంగా రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగి చరిత్ర ప్రసిద్ధమైన ఒక దుర్మార్గపు ఘటన చోటు చేసుకుంది. దాదాపు 2,000 మంది ఊచకోతకు దారితీసిన గుజరాత్ దుర్మార్గంలో గుల్బర్గ్ సొసైటీ విధ్వంసంతో పాటు నరోడా పాటియా, నరోడాగామ్, బెస్ట్ బేకరీ, పండర్వాడా, పంచ్‌మల్ ప్రాంతాలు కూడా పాలు పంచుకున్నాయి. నరోడా విధ్వంసంలో బీజేపీ ఎమ్మెల్యే కొడాని మాయాబెన్ స్వయంగా పాల్గొని ప్రజలను రెచ్చగొట్టడాన్ని, అల్లర్లు అంతవరకు వచ్చే వరకు కూడా అరెస్టులు చేయకుండా తాత్సారం చేసిన పోలీసుల చర్యను సిట్ పునః సమీక్షించింది. ఫలితంగా గుజరాత్ పోలీసులే కొడానిని అరెస్టు చేయక తప్పలేదు. ఇలాంటి పలు కేసుల నేపథ్యంలో నాడు మోదీ ప్రభుత్వం, గుజరాత్ పాలనా వ్యవస్థ దేశవిదేశాలలో పరువు కోల్పోయింది. గుజరాత్లో నరోడా పాటియా, నరోడాగామ్ నియోజకవర్గాలకు చెందిన కొడాని మాయాబెన్ విధ్వంస కాండను ప్రోత్సహించడాన్ని ప్రజలు, న్యాయస్థానాలు మరచిపోలేదు. ఇలాంటి మార్గాల ద్వారా ఎన్నికలలో ఎలాంటి ప్రయోజనం పొందవచ్చునో తెలిసిన వ్యక్తిగా కొడానిని సుప్రసిద్ధ పత్రికా రచయిత మనోజ్ మిట్టా తన పరిశోధక గ్రంథంలో (మోదీ అండ్ గోద్రా)లో పేర్కొన్నారు. విచారణల తంతును కూడా బహిర్గతం చేశారు. ‘సమాజ శాంతిని చెదరగొట్టే దుండగు లకూ, దౌర్జన్యకారులకూ టైస్టులకూ తేడా లేదని ఒక సందర్భంలో సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యనే, కొడాని బెయిల్‌ను రద్దు చేసిన సందర్భంలో గుజరాత్ హైకోర్టు ఉదహరించడం విశేషం. విచారణాధికారులు సయితం సాక్షులు స్పష్టంగా పేర్కొన్న అంశాలను, ప్రతివాదులైన ప్రముఖుల పేర్లను రికార్డులకు ఎక్కకుండా తొక్కిపట్టారని కూడా హైకోర్టు వ్యాఖ్యా నించింది. జకియా జాఫ్రీ (ఇషాన్ భార్య) ఇచ్చిన ఫిర్యాదులను పక్కన పెట్టి, గుల్బర్గ్ విధ్వంసకాండ కేసు వైపు సిట్ దృష్టి పెట్టిందని మిట్టా పేర్కొన్నారు. ఇంకా, ‘సీఆర్పీసీ 161 సెక్షన్ కింద విధిగా రికార్డు కావలసిన మోదీ ప్రకటనను ఏదో కంటితుడుపుగా సీఆర్పీసీ చట్టాల పరిధికి వెలుపల నమోదు చేశారు. ఆ తరువాత జరిపిన సిట్ విచారణకు మోదీని సమన్ చేసి ఉన్నా ఈ సెక్షన్ కిందనే లీగల్‌గా మోదీ నిజం చెప్పక తప్పేది కాదు’ అని కూడా మిట్టా (పే. 100)లో పేర్కొన్నారు. అసలు కథ రాహుల్ శర్మ సీడీ సీబీఐ మాజీ డెరైక్టర్ ఆర్కే రాఘవన్ నాయకత్వంలో ఏర్పాటైన సిట్ జరుపుతున్న దర్యాప్తు తీరు గురించి సుప్రీంకోర్టు అనుమానం వ్యక్తం చే స్తూ, ప్రసిద్ధ న్యాయవాది రాజు రామచంద్రన్‌ను ప్రత్యేక అధికారిగా నియమిం చింది. గోద్రా అనంతర హింసాకాండను అదుపుచేయడానికి మోదీ మంత్రి మండలి ఎలాంటి నిర్ణయాత్మక చర్య తీసుకోలేదని రామచంద్రన్ సుప్రీంకోర్టుకు నోట్ పంపారు. దీనిపైనే సుప్రీంకోర్టు సిట్ అభిప్రాయాన్ని (మార్చి 15, 2011) కోరింది. ఎమికస్ క్యూరీ లేఖలో వెలుబుచ్చిన అభిప్రాయం దృష్ట్యా అవసరమైతే మరోసారి విచారణ చేపట్టవలసిందేనని కూడా అత్యున్నత న్యాయస్థానం సిట్‌ను ఆదేశించింది. అప్పుడు గాని సిట్ మోదీపై విచారణకు సిద్ధం కాలేదు. ఇక్కడే మనోజ్ మిట్టా ఒక రహస్యం విప్పాడు, ‘ఇద్దరు పోలీసు అధికారులు ఎం.కె. టాండన్, పి.బి.గోండియా లను మరోసారి ‘సిట్’ విచారించిందేగానీ, మోదీని మరోసారి విచారిం చాలన్న సుప్రీంకోర్టు ఆదేశానికి మూలమైన ఎమికస్ క్యూరీ లేఖలో ప్రస్తావించిన అంశాలలో ఏ ఒక్కదానిపైనా సిట్ మోదీని ప్రశ్నించడానికి ప్రయత్నించలేదు (పేజి : 115)! ఆ గాథ అలా ముగియగా - గుజరాత్ కిరాతకాలపై ఆదినుంచీ విచారణ జరుపుతున్న సీబీఐ అధికారిగా, నిజాయి తీకి పేరుమోసిన రాహుల్ శర్మ గోద్రా/గోద్రా అనంతర ఘటనలపై నిర్మొహ మాటంగా సాక్ష్యాలను ‘సి.డీలకు (సి.ఒ.ఆర్.) అక్షరబద్ధంగా ఎక్కించి ఉంచాడు. మొబైల్ కాల్స్ సంభాషణలను సేకరించాడు. నానావతి కమిషన్ ఆదేశంపైన ఈ సేకరణ జరిగింది. వీటి ఆధారంగా కమిషన్ ముందు (30.10.2004) రాహుల్ శర్మ వాంగ్మూలం ఇచ్చాడని మిట్టా పేర్కొన్నాడు. ఇది చరిత్రే కావచ్చు, కానీ ఇంత ఊచకోతకు తగిన పశ్చాత్తాప ప్రకటనగానీ, ప్రజా బాహుళ్యానికి క్షమాపణ చెప్పే ప్రాచీన భారత సంస్కృతిని గానీ ఆనాటి పాలకులు పాటించి ఉంటే మనసులు కొత్త చిగుళ్లు తొడుక్కోవడానికి అవకాశం ఉండేది. ఈలోగా సుప్రీం ఎమికస్ క్యూరీ రాజు రామచంద్రన్ ‘సిట్’ అర్థంతర నివేదికకు ఒక ‘హంసపాదు’ పెడుతూ ‘‘గుజరాత్ పరిణా మాలపై సుప్రీంకోర్టు తుది తీర్పు ఇంకా వెలువడవలసేఉంద’’ని ప్రకటిం చారనీ, శిక్షించడానికి సాక్ష్యం ఉందని ప్రకటించాడనీ మరో ప్రసిద్ధ పత్రికా సంపాదకుడు కింగ్షుక్ నాగ్ (‘‘ది నమో స్టోరీ’’ : 2013) రాశాడు. రాజకీయ భాష తీరే అంత అయినా ‘పాతకథలు తవ్వనేల, చారడేసి కళ్లయినా శవంవల్ల ఏం లాభం’ అని మనం కవితా న్యాయంగా చెప్పవచ్చు! కానీ తాజాగా క్యూబా పర్య టనలో ఒక సామ్రాజ్యవాద పెట్టుబడిదారీ వ్యవస్థ ప్రతినిధిగా అమెరికా అధ్యక్షుడు ఒబామా ఎవరిముందో కాదు సరాసరి అమెరికా సామ్రాజ్యవాద భయానక దాడులకు, హింసాకాండకు, దోపిడీకి గురైన క్యూబా విమోచన దాత, అధినేత ఫిడెల్ క్యాస్ట్రో ముందు ‘మనం గతాన్ని మరిచి పోదాం’ అన్నాడు. అంతేగాని క్యూబా ప్రజలకు క్షమాపణ చెప్పలేదు. వియత్నాంకూ చెప్పలేదు, జపనీస్ నగరం హిరోషిమాపై ఆటంబాంబు ప్రయోగించి లక్షలాదిమంది ప్రాణాలు తీసినందుకు అమెరికా తరఫున ఒబామా తన యాత్రలో క్షమాపణ చెప్పే పని తప్పించుకున్నాడు. అదేమంటే ఒక పాలకు డంటాడు - ‘ప్రయాణంలో నా కారుకు అడ్డువచ్చే కుక్కపిల్ల చస్తే అది నా తప్పు ఎలా అవుతుంది. నా తప్పుంటే నన్ను ఉరితీయండి’ అని. తప్పు కారుదేగానీ మనిషిది కాదని తప్పుకునేవాడు ఈషణ్మాత్రం వేదన, ఆవేదన లేనివాడు అవుతాడు. ఇలాంటి సందర్భాలను చూసే జార్జి ఆర్వెల్ అనే సుప్రసిద్ధ నవలాకారుడు నవనీతంలాంటి సత్యవాక్కుల్ని మనకు వదిలి వెళ్లాడు. ‘‘అబద్ధాల్ని సత్యాలు గానూ, హత్యల్ని గౌరవనీయమైనవిగానూ, తన కరుణా కటాక్షాలపైననే గాలి వీస్తున్నట్టుగానూ భావించుకుని పోజులు గొట్టడానికే రాజకీయ భాష పుట్టినట్టుంది’’. అవునా? సమాధానం మన చేతుల్లోనూ, చేతల్లోనే ఉంది. వేదాలు, పురాణాల ఆవశ్యక జ్ఞానాన్ని అందిస్తాయో లేదోగానీ కుహనా నేతల వల్ల ప్రాప్తించేది కుహనా సంస్కృతి మాత్రమే. గోదావరిలోగానీ, గంగోత్రిలోగానీ మునక వేసినంత మాత్రాన వంకర బుద్ధులు తొలగవు, తొలగవు! తొలగవు అనడానికి దేశంలో వర్తమాన పరిణామాలే నిదర్శనం! ఎవరినైతే నిందితులుగా కొన్ని సాధికార విచారణ సంస్థలు, చార్జిషీట్లూ పేర్కొన్నాయో ఆ నాయకులు, ఆఫీసర్లు, ఎన్కౌంటర్ నిర్వాహకులు కొత్త సంస్కృతిలో అకస్మాత్తుగా పెద్ద మనుషులైపోయారు! - ఏబీకే ప్రసాద్, సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
ఫిరాయింపుల పీచమణగాలి!
రెండో మాట ‘ఒక పార్టీ టికెట్ పైన ఎన్నికలలో గెలిచిన లెజిస్లేటర్లు మరో పార్టీలోకి ఉడాయించడం అనేది జాతీయ స్థాయిలో ప్రబలిపోతున్న జబ్బు. ఈ జబ్బు మన ప్రజాస్వామ్య వ్యవస్థ జవజీవాలను తోడేస్తున్నది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం రాజకీయ పక్షాలు నిర్దిష్ట ప్రవర్తనా నిబంధనావళికీ, నియమబద్ధ సంప్రదాయాలకూ బద్ధమై ఉండడం వల్లనే సాధ్యం. అలాగే ప్రజాస్వామ్య సంస్థలను, కార్యకలాపాలను శాసించగల మౌలికమైన యోగ్యతా మర్యాదల ను, ఔచిత్యాన్ని పరిగణనలోనికి తీసుకుని పార్టీలు వ్యవహరించేలా ఉండాలి.’ (ఫిబ్రవరి 18, 1969న నాటి కేంద్ర హోంమంత్రి వైబీ చవాన్ కమిటీ పార్లమెంట్‌కు సమర్పించిన నివేదిక) ఆనాటి లోక్‌సభలో సోషలిస్ట్ నాయకుడు మధు లిమాయే ప్రతిపాదించిన సవరణలతో ఏర్పడిన చవాన్ కమిటీ, ఒక పార్టీ టికెట్ మీద గెలిచి అనంతరం మరో పార్టీ ఒరలోకి దూరిపోయే జంప్ జిలానీల (ఆయారామ్ గయారామ్‌లు) ప్రవర్తన అరికట్టేందుకు తన నివేదికలో అనేక విలువైన ప్రతిపాదనలు చేసింది. అయినా, ‘బుద్ధి గడ్డి తినడానికి’ అలవాటు పడినప్పుడు ఈ గోడ దూకుడు గాళ్లకు ఏ రాజ్యాంగం గానీ, ఏ నిబంధన గానీ, ఏ చట్టం గానీ అడ్డంకాదని స్వతంత్ర భారత లె జిస్లేచర్లలో ఇన్నేళ్లుగానూ జరుగుతున్న పరిణామాలు నిరూపిస్తున్నాయి. లెజిస్లేచర్లలో (పార్లమెంట్/ అసెంబ్లీలు) మెజారిటీ ఉన్న అధికార పార్టీలు కూడా విద్వేషభావంతో ప్రతిపక్షాలకు శాసన వేదికలలో ప్రాతినిధ్యం అంటూ లేకుండా అందులో ఉన్న సభ్యులను కూడా రకరకాల ప్రలోభాలతో అధికార పార్టీలో చేర్చుకుంటున్నాయి. అలా ప్రతిపక్షాన్ని క్రమంగా నిశ్శేషం చేసే ఓ కొత్త రాజకీయ క్రీడకు పాల్పడుతున్నాయి. అధికార పార్టీలు (రెండు తెలుగు రాష్ట్రాలు సహా) ఆది నుంచి జంప్ జిలానీల మీదనే ఆధారపడుతూ వచ్చాయి. ఈ రెండు రకాల అధికార పార్టీలూ ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాలలోను అధికార పీఠాలను ఇలాగే కాపాడుకోజూస్తున్నాయి. ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న రాజకీయ పక్షం ఒక తెలుగు రాష్ట్రంలో ఏర్పడిన ప్రభుత్వంలో చిన్న భాగస్వామిగా కూడా ఉంది. అయితే రేపోమాపో ఏ మిషతో అయినా ఆ పార్టీ మద్దతు ఉపసంహరించుకుంటే తమ ఉనికి ప్రమాదంలో పడుతుందని ఈ ప్రాంతీయ పార్టీ మొదటి నుంచి భావిస్తూ బలమైన విపక్షంగా ఉన్న పార్టీ లెజిస్లేటర్లను ప్రలోభ పెట్టే దశకు చేరుకుంది. అదే రెండు తెలుగు రాష్ట్రాలలోను ప్రతిబింబిస్తున్నది. కప్పదాట్లు సాగుతూనే ఉన్నాయి ఈ నేపథ్యంలో ఒక్కసారి గతంలోకి వెళితే, లెజిస్లేటర్ల కప్పదాట్లను అరికట్టడం కోసం 1973లో ఆనాటి కేంద్రం రాజ్యాంగ సవరణ బిల్లును రాజ్యాంగంలో చేర్చడానికి సిద్ధంచేసిన ఎనిమిది అధికరణలకు అవకాశవాద రాజకీయాల వల్ల విలువ లేకుండా పోయింది. ఎందుకంటే పార్టీ విధానాలతో సంబంధం లేకుండా లెజిస్లేటర్లు జంప్ జిలానీలుగా మారుతున్న దశలో చవాన్ కమిటీ నివేదిక లోని సిఫారసులను బిల్లులో చేర్చకుండా స్వార్థం కొద్దీ తప్పించారు. 1977 వచ్చేసరికి ఎవరో కొందరు ధనవంతులు, అవకాశవాదుల కుట్ర వల్ల లోక్‌సభ రద్దయింది. అలా 395 అధికరణలతో 12 షెడ్యూల్స్‌తో పలు సవరణలతో కూడిన రాజ్యాంగం మనకు ఉండి కూడా ఆచరణలో ప్రజలు మోసాలకు గురి కావలసి వస్తున్నది. కమిటీలతో పాలకపక్షం, ప్రతిపక్షం చేస్తున్న కాలయాపన కారణంగా నివేదికలకు విలువ లేకుండా పోయింది. అయినా కమిటీల మీద కమిటీలు వస్తూనే ఉన్నాయి. జనతా పాలనలోనూ ఇదే తంతు నడిచింది. ఫిరాయింపులు అరికట్టడమనే మిషతో చరణ్‌సింగ్ హోంమంత్రిగా మరో రాజ్యాంగ సవరణ బిల్లు వచ్చింది. ఈ బిల్లు పార్టీ ఫిరాయించే లెజిస్లేటర్లపై అనర్హత వేటు వేయాలని సిఫారసు చేసింది (102,191 అధికరణల కింద). ఇది రాజ్యాంగం 10వ షెడ్యూల్ కింద అనివార్యమయింది. అయినా ప్రలోభాల ద్వారా ప్రతిపక్షం నుంచి లెజిస్లేటర్ల ఫిరాయింపులను బాహాటంగా ప్రోత్సహించి మొత్తం ప్రజాస్వామ్య ప్రక్రియనే అవహేళన చేసే దశకు పాలక పక్షాలు చేరుకున్నాయి. సభ్యుల భిన్నాభిప్రాయ ప్రకటనకు, పార్టీ ఫిరాయింపులకు తేడాను గుర్తించలేనంత గుడ్డివాళ్లుగా జంప్ జిలానీ లెజిస్లేటర్లు తయారవుతున్నారు. పార్టీనీ, పార్టీ విప్‌నూ లెక్క చేయకుండా ప్రలోభం మత్తులో గోడ దూకే లెజిస్లేటర్ లెజిస్లేచర్ సభ్యునిగా అనర్హుడని సుప్రీంకోర్టు తీర్పులు (1987/1992) తీర్పు ఇచ్చిందని మరచిపోరాదు. ‘ఒక రాజకీయ పార్టీ గుర్తు మీద ఎన్నికైన లెజిస్లేటర్ ఆ పార్టీ నిర్ణయం లేదా అనుమతి లేకుండా మరో పార్టీలోకి దూకేయడాన్ని విభీషణ పాత్రగా, లేదా కప్పగంతుగా పరిగణించాల్సిందే’నని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఫిరాయింపుదారు అనర్హుడే 1967-1977 మధ్య 542 ఫిరాయింపు కేసులు నమోదైనాయి. అందులో ఒక్క ఏడాది మాత్రం 438 కేసులు నమోదైనాయి. ఇండిపెండెంట్ అభ్యర్థులుగా గెలిచిన వారిలో 157 మందికి పైగా వివిధ పార్టీల తీర్థం పుచ్చుకున్నారు. 1985లో రాజ్యాంగానికి వచ్చిన 52వ సవరణ ప్రకారం ఇలాంటి ఫిరాయింపుల గురించి సుప్రీంకోర్టు ఇలా ఘాటైన హెచ్చరిక చేసింది: ‘మన ప్రజాస్వామిక వ్యవస్థ ఒక గర్వకారణమైన వ్యవస్థగా మాత్రమే మిగిలిపోకుండా, బాహ్య ప్రపంచానికి ఆదర్శనీయమైన పాలనా వ్యవస్థగా కూడా భావించేలా ఉండాలి’. బహుశా అందుకే బ్రిటిష్ రాజ్యాంగ వ్యవహారాల మీద సాధికార వ్యాఖ్యాతలలో ఒకరైన ఐవర్ జెన్నింగ్స్ కూడా ‘మధ్యలో ఒక పార్టీని విడనాడడమంటే తరువాతి ఎన్నికలలో ఆ పార్టీ మద్దతును కోల్పోవడమే’ అన్న స్పృహ ఉండాలన్నాడు. అంతేగాదు, ఓటు హక్కును వినియోగించుకునే సగటు సామాన్య ఓటరు పార్టీ గుర్తుకు మాత్రమే ఓటు వేస్తాడు. అంటే అంతకు ముందు ఆ పార్టీని అర్ధాంతరంగా ఫిరాయించిన లెజిస్లేటర్ ఇక ఎన్నిక కాబోడనే దాని అర్థం కూడా అని జెన్నింగ్స్ అన్నాడు. అందుకని భారత రాజ్యాంగానికి వచ్చిన 52వ సవరణ ఎందుకంత కీలకమైంది? లెజిస్లేటర్ లేదా ఫిరాయింపుదారు ఈ సవరణ ప్రకారం లెజిస్లేచర్ సభ్యత్వాన్ని వదులుకోవలసిందే, సీటు ఖాళీ చేయవలసిందే, లెజిస్లేటర్‌గా అనర్హుడు కావలసిందేనని ఆ సవరణ స్పష్టం చేసింది. అందుకే సుప్రీం కోర్టు లెజిస్లేటర్ల ఫిరాయింపుల నిషేధ చట్టం రాజ్యాంగ బద్ధతను ఖాయం చేస్తూ 1993లోనే విలువైన తీర్పు చెప్పింది. ఈ తీర్పు చెప్పిన ఐదుగురు సభ్యులుగల సుప్రీంకోర్టు ధర్మాసనంలో సుప్రసిద్ధ న్యాయమూర్తి వెంకటాచలయ్య కూడా ఉన్నారు (కిహోటా హల్లోహన్ జాబిల్హూ కేసు). చివరికి ఇలా ఫిరాయించే లెజిస్లేటర్లు స్వతంత్ర/ ఇండిపెండెంట్ అభ్యర్థులుగా సభలో కూర్చోవడానికి సిద్ధపడడం కూడా ‘ఓటర్లను మోసగించడం’గా ఆస్ట్రేలియా రాజ్యాంగ చట్టం, మరికొన్ని దేశాల రాజ్యాంగాలు పరిగణించాయి. మన దేశంలో కూడా ఎన్నికల కమిషన్లు, ప్రజాప్రాతినిధ్య చట్టం లాంటి అనేక రాజ్యాంగ సంస్థలు పదే పదే ఫిరాయింపులను గురించి హెచ్చరిస్తూ వచ్చినా రాజకీయాలలో నేరపూరిత వ్యూహాలు, పద్ధతులు పెరిగిపోతున్నాయి తప్ప, ఆగడం లేదని ప్రజల అనుభవం. ఇదే అంశాన్ని పాతికేళ్ల క్రితం ప్రస్తావించి నపుడు హోంశాఖ మాజీ కార్యదర్శి ఓరా కమిటీ పోలీసులు, రాజకీయులు, మాఫియా మధ్య బలమైన పీటముడి ఉందని హెచ్చరించ వలసి వచ్చింది. నేరమయ రాజకీయాలలో ఫిరాయింపులు ఒక భాగం. రాజకీయాలు నేరమయం కావడం గురించి కోర్టులు, సుప్రీంకోర్టులలో అనేక ఫిర్యాదులు అప్పీళ్ల రూపంలో పరిష్కారం కోసం ఎదురుచూస్తున్నాయి. అయితే కోర్టులు మాత్రం ఎన్ని పెండింగ్ కేసులని పరిష్కరిస్తాయి? బలవంతులకు, ధనవం తులకు కొమ్ము కాసే స్థితికి పాలకపక్షం, ప్రభుత్వాల రాజకీయ స్థాయి చేరకూ డదు. రైతుల, మధ్య తరగతి ప్రజల సమస్యలను పరిష్కరించే నాథుడు లేడు. నియంతృత్వ శక్తులకు ఊతం తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీకి రాజీనామా చేయకుండా మరో పార్టీలోకి గెంతి స్పీకర్స్ చాటున దాగి నెలల తరబడి గుర్తింపు పొందాలన్న తహతహను కూడా సుప్రీం నిరసించింది. ఒక పార్టీ అభ్యర్థి ఒకే రోజున మూడు పార్టీలు ఫిరాయించిన చరిత్ర కూడా ఇక్కడ ఉంది. స్పీకర్ నిర్ణయానికి తిరుగులేదనుకునే వారికి కూడా సమాధానంగా అత్యున్నత ధర్మాసనానికి స్పీకర్ల నిర్ణయాలను కూడా సమీక్షించే హక్కు ఉందని చెప్పవలసి వచ్చిందని మరువరాదు. అంతేగాదు, 2007లో లోక్‌సభలో ఆ తరువాత రాష్ట్ర శాసనసభలలో ఫిరాయింపులను ప్రోత్సహించడానికి లేదా సభలో ఫలానా ప్రశ్న వేస్తే ఇంత రొఖ్ఖం చెల్లిస్తామని బేరాలాడే సందర్భాలలో సుప్రీం ముందుకు ఒక కేసు విచారణకు వచ్చింది (రాజారాంపాల్ వర్సెస్ లోక్‌సభ స్పీకర్: క్యాష్ ఫర్ క్యారీ). ఆ కేసులో వాదించిన సుప్రీం న్యాయవాది డాక్టర్ చౌహాన్ ఒక సందర్భంలో ఫిరాయింపులలో ఎక్కువ భాగం తమను మంత్రులుగా నియమించవచ్చునన్న ఆశలతో ఉండి ఆ పదవులు రాకపోతే హతాశులైన సభ్యులని వెల్లడించాడు. ఇందుకు ఉదాహరణగా ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్, బహుజన సమాజ్‌వాది పార్టీల నుంచి వచ్చిన ఫిరాయింపుదారులతో (1997)బీజేపీ కల్యాణ్‌సింగ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే. అలాగే 2008లో కాంగ్రెస్‌పార్టీలో ఫిరాయింపులను ప్రోత్సహించడం ద్వారా కర్ణాటకలో బీఎస్ ఎడ్యూరప్ప (బీజేపీ) మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేశారు. ఇలా ఎన్నో ఉదాహరణలు ఇవ్వవచ్చు. లెజిస్లేటర్లలో వక్రీకరించే బుద్ధుల నుంచి పుట్టే ఫిరాయింపుల సంస్కృతికి ధనిక వర్గ రాజకీయ పక్షాలే ప్రధాన కారణం. ఈ సంస్కృతి వల్ల ప్రజాతంత్ర శక్తుల ఉదాసీనత వల్ల ఫిరాయింపుల ద్వారా విపక్షాన్ని నిశ్శేషం చేసి నియంతృత్వ శక్తులు పెట్రేగిపోయే ప్రమాదం ఉంది. - ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
భూ సేకరణకు కుదరని సమీకరణ
రెండోమాట ఆనాడు వలస పాలకుల ప్రయోజనాలకు అనువైన వ్యవసాయ విధానం కావలసి వచ్చింది. అందుకు అనుకూలించే, కంపెనీ దోపిడీని సుస్థిరం చేయగల ఆర్థిక సంబంధాలు కూడా అవసరమైనాయి. ఆ క్రమంలో ఏర్పడి, వృద్ధి చెందినవే జమిందారీ, ఫ్యూడల్ సంబంధాలు. అవి నూతన మార్కెట్‌కు అనుగుణంగా కంపెనీ పాలకులు రూపొందించినవే. అదే ఫక్కీలో ఇవాళ కూడా ప్రపంచ బ్యాంక్ వ్యవసాయ, పారిశ్రామిక వ్యతిరేక సంస్కరణల ద్వారా స్వతంత్ర భారత పాలకుల మెడలు వంచుతోంది. ‘ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానికి అనువైన ప్రాంతాన్ని ఎంపిక చేసే బాధ్య త కేంద్ర ప్రభుత్వానిదేనని పునర్విభజన చట్టంలోని సెక్షన్-6 నిర్దేశించింది. అందుకుగాను కేంద్రం శివరామకృష్ణన్ సాధికార సంఘాన్నీ నియమించింది. కోస్తా ప్రాంత వ్యవసాయ భూములకూ, జనావాస ప్రాంతాలకూ నష్టం జర గని పద్ధతిలో మాత్రమే రాజధాని నిర్మాణం జరగాలని ఆ కమిటీ కూడా పేర్కొన్నది. విజయవాడ-గుంటూరు-తెనాలి-మంగళగిరి (వీజీటీఎం) ప్రాంతాలలో రాజధాని నిర్మాణానికి కమిటీ సుముఖంగా లేదు. వివిధ ప్రభు త్వ శాఖలను రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో సర్దుబాటు చేయడం శ్రేయ స్కరమని చెప్పింది. కానీ, ఈ లోగా ఆదరాబాదరాగా, ఇందుకు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం రాజధాని ప్రాంత అభివృద్ధికి ప్రాధికార సంస్థను (సీఆర్ డీఏ) ఏర్పాటు చేస్తూ ఒక చట్టం తెచ్చింది. ఈ రాజ్యాంగ విరుద్ధ చర్య, ఆంధ్ర ప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్ట నిబంధలకే వ్యతిరేకం’ (గౌరవ న్యాయమూర్తు లు, న్యాయవాదులు, ఒక సీనియర్ పత్రికా రచయిత రాష్ట్ర హైకోర్టులో వేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) నుంచి). రైతులకే తొలి విజయం ఈ పిల్‌ను పరిశీలించిన తరువాత హైకోర్టు 9.3 ఫారాల పేరిట రాజధాని నిర్మాణం కోసమని ప్రభుత్వం ఒత్తిడి చేసి రైతాంగం నుంచి సేకరించిన పంట భూములలో సాగు కార్యకలాపాలను కొనసాగించుకోవచ్చునని (1-5- 2015) పేర్కొన్నది. ఈ పంట భూములను పూలింగ్ పేరిట ‘భూ సమీకరణ’ చర్య కింద ప్రభుత్వం సేకరించింది. ఆ ప్రయత్నం కొంత బెడిసికొట్టిన తరువాత చేసిన పని- భూసేకరణకు అవకాశం లేకపోవడం వల్ల ప్రభుత్వం పక్కదారులు పట్టి భూములను భూసేకరణ చట్టం కింద సేకరిస్తామనీ, ఇందుకు సంబంధించిన ప్రకటనను మే 14వ తేదీన జారీ చేస్తామనీ కోర్టుకు నివేదించుకుంది. అంతవరకు పిటిషనర్ల (రైతులు) వ్యవసాయ కార్యకలాపా లకు ఆటంకం కలిగించవద్దని’ ఆదేశించింది. అయితే కోర్టుకు సెలవులు కావడంతో పూర్తి విచారణ తరువాత ప్రారంభం కానున్నది. కానీ, రైతాంగం కుడుమిస్తే పండుగైనట్టు కోర్టు ఇచ్చిన వెసులుబాటును పూర్తి విజయంగా భావించరాదు. ఎందుకంటే- మెలికలు వేయడంలో, మాట మార్చడంలో సిద్ధహస్తులైన పాలకులు వ్యూహం మార్చుకుని దెబ్బతీయాలని చూస్తారు. సీఆర్డీఏ కింద భూసేకరణ సాధ్యం కాకుంటే రూటు మార్చి 1894 నాటి బూజు పట్టిన బ్రిటిష్ కాలపు చట్టాన్నే అమలుచేయాలని చూస్తారు. ఈ పాత సరీసృపానికి అరకొర సవరణలు చేసింది కూడా 1984లోనే. భూములు కోల్పోయిన వారికి అరకొర పునరావాసం లభించడం కూడా దాని ఫలితమే. నష్టపరిహారం కూడా భూస్వాధీన చట్టం కింద కంటి తుడుపుగానే అందు తోంది. 1984లో చేసిన సవరణ కూడా నష్టపోతున్న రైతులు ఫిర్యాదు చేసుకో వడానికి కొంత సమయం ఇచ్చినట్టు చూపడం కోసమే. తెలుగుగంగ ప్రాజెక్టు కోసం భూసేకరణ చేపట్టినప్పుడు వెలుగోడు రైతులకు చెందిన పంటభూము లు కాని భూములకు కూడా పూర్తి నష్టపరిహారం చెల్లించాకే ప్రభుత్వం స్వాధీ నం చేసుకుంది. ఈ రీతిలో నష్టపరిహారం పొందడం, అందుకు మడమ తిప్పని పోరాటం జరగడం స్వతంత్ర భారత చరిత్రలో మొదటిసారి. యూపీఏ నిర్వాకం 2005లో యూపీఏ పాలకుల నిర్వాకం మరొకటి. పారిశ్రామిక విస్తరణ పేరిట యూపీఏ సెజ్‌లు, స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్పీవీ) పేరిట స్వదేశీ, విదేశీ గుత్త పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం ప్రపంచ బ్యాంక్ ప్రజా వ్యతిరేక సంస్కరణల ముసుగులో బలవంతపు భూసేకరణకు ఒడిగట్టింది. దీనితో రైతాంగం ఆందోళన మిన్నంటింది. చివరకు సారవంతమైన పంటభూము లను ప్రజాప్రయోజనాల దృష్ట్యా సేకరించరాదని సెజ్ చట్టంలో చేర్చారు. అలాగే సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పులనూ వెల్లడించింది. కానీ కొందరు స్వప్రయోజనపరుల కోసం ఆ తీర్పులను పక్కన పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. బీజేపీ హయాంలో, అంతకుముందు కూడా 1894 చట్టం కిందనే రైతాంగం ప్రయోజనాలకు వ్యతిరేకంగానే భూసేకరణ జరిగింది. ఆ వలస చట్టం స్థానంలోనే 2013లో వేరే చట్టాన్ని తీసుకురావలసివచ్చింది. గ్రామీణ ప్రాంతాల నుంచి పేద రైతులూ, వ్యవసాయ కార్మికులూ, వ్యవసాయాధారిత వృత్తి పనుల వారూ సాగిస్తున్న భారీ వలసలకు అడ్డుకట్ట వేయాలంటే కొత్త రాజధానికి అనువైన నైసర్గిక భౌగోళిక అనుకూలతలు ఉన్న ప్రాంతాలకూ, వేల ఎకరాలు ప్రభుత్వ భూమి లభ్యం కాగల ప్రాంతాలకూ (వినుకొండ- దొనకొండ) తరలడమే పరిష్కారం. ప్లాసీ నుంచి ప్రపంచ బ్యాంక్ వరకు ప్లాసీ యుద్ధం (1757)తో భారతదేశాన్ని కబళించాలని ఆకాంక్షించిన ఈస్టిండి యా కంపెనీకి, ఆ వెంటనే ఉపఖండాన్ని పాదాక్రాంతం చేసుకోవాలన్న ఆశ కూడా పుట్టింది. అప్పుడే ఇంగ్లండ్ సహా ఐరోపా అంతటా పారిశ్రామిక విప్ల వం వెల్లువెత్తింది. దీనితో అంతవరకు ఇంగ్లండ్‌కు వస్తువులను ఎగుమతి చేసిన ఇండియా ఆ స్థానాన్ని త్వరలోనే కోల్పోయింది. పైగా బ్రిటిష్ పరి శ్రమల ఉత్పత్తులకు భారతదేశం ఒక మార్కెట్‌గా, వాటికి ముడిసరుకు సర ఫరా చేసి బతికే దేశంగా మారింది. ఈ పరిణామం దేనికి దారితీసింది? ఫ్రెంచ్ విప్లవ (1789) ఫలితంగా వలస దేశాలలో ఉన్న ఈస్టిండియా కం పెనీకి బ్రిటిష్ పెట్టుబడిదారుల నుంచి పోటీ వచ్చింది. ఇండియా వంటి దేశా లలో పెట్టుబడులు పెట్టి, లాభాలను మాతృదేశానికి తరలించే ప్రక్రియలో తమకూ సమానావకాశాలు కల్పించాలని బ్రిటిష్ పెట్టుబడిదారులు కోరారు. ఇప్పుడు సరిగ్గా ఇలాంటి ‘సమానావకాశాల’ కోసమే ప్రపంచ బహుళ జాతి గుత్త పెట్టుబడిదారీ సంస్థలు పోటీ పడుతున్నాయి. వీరికి ప్రపంచ బ్యాంక్ అండదండలు ఉన్నాయి. తాడుతోనే దబ్బనం అన్నట్టు దేశంలోని దళారీ గుత్త పెట్టుబడి వర్గాలు కూడా విదేశీ కంపెనీల స్థానే తమకూ లాభాల వేటలో సమానావకాశాలు ఉండాలని పల్లవి అందుకున్నాయి. ఆ విధంగా ఆనాడు వలస పాలకుల ప్రయోజనాలకు అనువైన వ్యవసాయ విధానం కావలసి వచ్చింది. అందుకు అనుకూలించే, కంపెనీ దోపిడీని సుస్థిరం చేయగల ఆర్థిక సంబంధాలు కూడా అవసరమైనాయి. ఆ క్రమంలో ఏర్పడి, వృద్ధి చెందినవే జమిందారీ, ఫ్యూడల్ సంబంధాలు. అవి నూతన మార్కెట్‌కు అనుగుణంగా కంపెనీ పాలకులు రూపొందించినవే. అంటే వలస ప్రభుత్వానికి మధ్య దళా రీలుగా వ్యవహరిస్తూ రాబడిని వివిధ రూపాలలో వసూలు చేసి పెట్టడానికి ఉపకరించిన బంట్లే జమిందారులు, రాజాలు, పాలెగాళ్లు. కష్టం రైతుదీ, కూలీలది. ఫలితం భూస్వాములదీ, జమిందార్లది. అదే ఫక్కీలో ఇవాళ కూడా ప్రపంచ బ్యాంక్ వ్యవసాయ, పారిశ్రామిక వ్యతిరేక సంస్కరణల ద్వారా స్వతంత్ర భారత పాలకుల మెడలు వంచుతోంది.ప్రభుత్వాల ద్వారా న్యాయ స్థానాలను అదుపు చేయాలని కూడా ప్రపంచ బ్యాంక్ చూస్తోంది. ఆవేదనకు అద్దం పట్టే లేఖ ఈ సందర్భంగా గుంటూరు ప్రాంతం నుంచి అనిసెట్టి నారాయణ అనే రైతు కుటుంబీకుడు కొద్దిరోజుల క్రితం నాకు రాసిన ఒక లేఖ గురించి ఇక్కడ ప్రస్తావిస్తాను. రాజధాని కోసం పాలకులు పడుతున్న పాట్లు గురించి ఆయన రాశారు. ఆలస్యమైనా, ఆంధ్రప్రదేశ్ రాజధానిని నిర్మించేది అమెరికానా, జపానా, సింగపూరా, చైనానా- ఏదీ తేలని స్థితిలో ‘రాజధానిగా దొనకొండ ఇప్పటికీ అన్ని విధాలా శ్రేష్టం. నీళ్లు లేవంటున్నారు. నాగార్జున సాగర్ నుంచి హైదరాబాద్‌కు 200 కిలోమీటర్ల దూరం నుంచి రోడ్డుకి ఇరువైపులా పెద్ద పెద్ద పైపులు వేసి నీటిని తరలించుకోలేదా? పదకొండు కిలోమీటర్ల దూరంలో కురిచేడు వద్ద సాగర్ కాల్వ నుంచి చందవరం చెరువులో నీటిని నింపి వాడుకోవచ్చు గదా! కర్నూలు-గుంటూరు జాతీయ రహదారికి లింకు రోడ్డు వేసుకోవచ్చు కదా! ఈ ప్రాంత ప్రజానీకంలో ఎక్కువ మంది బడుగు, బలహీనవర్గాల వారే. వీరు వలస జీవులైపోతున్నారు. ఇక్కడి జనమూ, ఇక్కడ భూములు కూడా పటిష్టంగానే ఉండటం వల్ల భవన నిర్మాణాలు కూడా పటిష్టంగానే ఉంటాయి. దొనకొండ ప్రాంతంలో విస్తారంగా ప్రభుత్వ అటవీ భూములున్నాయి. నిర్మాణంలో ఉన్న వెలుగోడు ప్రాజెక్టును త్వరగా పూర్తి చేసుకోలేమా? రెండవ ప్రపంచ యుద్ధ కాలం నాటి విమానాశ్రయం దొనకొండలోనే ఉంది. దాన్ని 600 ఎకరాలకు విస్తరించి అంతర్జాతీయ విమానాశ్రయంగా నిర్మించుకోవచ్చుగదా! రైలు మార్గాలు కూడా దగ్గర దగ్గర ఉండరాదు. అన్ని ప్రాంతాల ప్రజలకూ అవి అవసరమే గదా!’’ అన్నారా యన. ఇంకా ఈ లేఖకుడు రైలు, రవాణా మార్గాల గురించి కూడా వివరంగా పేర్కొన్నాడు! ముందుచూపు లేని నాయకుల వల్ల ప్రాంతాల మధ్య చోటు చేసుకున్న అసమాభివృద్ధిని ప్రస్తావిస్తూ ఇంకా ఇలా చెప్పాడు: ‘‘గుంటూ రు-గుంతకల్లు రైలు మార్గానికి విద్యుత్ సౌకర్యం ఎలాగు ఇప్పుడు కలగ జేస్తున్నారు. ప్రస్తుతం నర్సరావుపేట, అవతల సంతమాగులూరు స్టేషన్ దాక లైన్లు వేశారు. గుంటూరు నుంచి హైదరాబాద్‌కి మూడు విధాలుగా రైళ్లు వెళ్తాయి. 1. గుంటూరు-విజయవాడ - ఖమ్మం- వరంగల్ - బీబీనగర్ - సికింద్రాబాద్. 2. గుంటూరు-సత్తెనపల్లి- పిడుగురాళ్ల- మిర్యాలగూడ- నల్లగొండ- బీబీనగర్- సికింద్రాబాద్. 3. గుంటూరు-దొనకొండ- నంద్యా ల- ద్రోణాచలం- కర్నూలు - పాలమూరు - సికింద్రాబాద్. మరల కాళ హస్తి- నడికుడి మార్గం, వినుకొండ నుంచి నడికుడికి, అటు నుంచి బీబీ నగర్- సికింద్రాబాద్ అంటున్నారు. అయితే, దొనకొండను ఆంధ్రప్రదేశ్ రాజధానిని చేసి, కాళహస్తి- నడికుడి లైనును నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ప్రస్తుతం ఉన్న చెన్నై- విజయవాడ లైనుకు దూరంగా ఉదయగిరి- కనిగిరి- పొదిలి- దొనకొండ (జంక్షన్ చేసి), త్రిపురాంతకం- ఎర్రగొండపాలెం- మాచర్ల- సాగర్మాల్- మల్లెపల్లి- మలక్‌పేట- లేదా ఫలక్‌నుమా స్టేష్లన్ల మీదుగా లైను వేయాలి. ఇందువల్ల వెనుకబడిన రవాణా సౌకర్యాలు లేని ప్రాంతాలకు న్యాయం జరుగుతుంది. అప్పుడు భూసేకరణకు రైతుల నుంచి వ్యతిరేకత దాదాపుగా ఉండదు. దర్శి, వినుకొండ, కురిచేడు, ఈపూరు, కారెం పూడి- నడికుడి అయితే రైతులు మాగాణిని కోల్పోవలసి వచ్చి, వ్యతిరేకత వస్తుంది. ఇలా అన్ని మార్గాల నుంచి రైలు బళ్లు బీబీనగర్ వచ్చి రైళ్ల రద్దీ విప రీతమై, లైన్లు ఖాళీ లేక రేపల్లె నుంచి - సికింద్రాబాద్ వెళ్లే ప్యాసింజర్ రైలును మూడు గంటలు బీబీనగర్‌లో నిలుపుతారు. ఇలా మళ్లీ వేయకుండా దొన కొండను రైల్వే జంక్షన్ చేసి, దొనకొండ, ఎర్రగొండపాలెం, మాచర్ల సాగర్, మల్లెపల్లి నుంచి లైను వేస్తే నాలుగు జిల్లాల మెట్ట ప్రాంతం ద్వారా రైలు లైను ఏర్పడి ప్రజలకు సౌకర్యాలు కలుగుతాయి. రైల్వే వారికి కూడా దొనకొండలో చాలా స్థలాలు ప్రస్తుతం ఖాళీగా పడి ఉన్నాయి. ఈ దూరదృష్టి కొరవడితే మరోసారి రాష్ట్ర విభజనకి పాలకులు కారకులవుతారేమో’’నన్నది ఆ లేఖకుని ఆవేదన! ఇలాంటి ఆవేదనలు ఎలా ఉన్నా పైన పేర్కొన్న హైకోర్టు ఆదేశం తరువాత ఇతర రైతులూ కోర్టును ఆశ్రయించడానికి రావడం విశేషం. (వ్యాసకర్త మొబైల్: 9848318414) -
‘స్వప్న నగరం’ రైతు కన్నీటి తీరం
రెండోమాట ‘‘ఉద్యానవనాలు, పంట భూములు, అడవులూ క్షయమవటం వినాశహేతువు. పంట పొలాల విస్తీర్ణం తరగకూడదని, ఏయేటికాయేడు పెరగాలనీ శాకంబరీ మాతగా దర్శనమిచ్చే బెజవాడ కనక దుర్గమ్మకు విన్నపాలు చేస్తూంటాం. వాటి దుర్వినియోగం ముందుతరాల వారి పట్ల ద్రోహమే. రాజధాని కోసం పంట భూములను, నదీ పరీవాహక ప్రాంతాలనూ దుర్వినియోగం చేసి.. ఐదు, పదేళ్ల తర్వాత ‘అలా చేసి ఉండాల్సింది, ఇలా చేయకుండా ఉండాల్సింది’ అని సమీక్షలు, వ్యాసాలు, వ్యాసంగాలు, విద్వద్గోష్టులు నిర్వహించి చప్పట్లు కొట్టించుకుంటారా? ‘‘ఎలాంటి పాపాత్ముడనైనా భరిస్తాను, క్షమిస్తాను గాని, మాట తప్పిన వాడిని మోయజాలను, క్షమించలేను’’ - ‘బ్రహ్మ’తో భూదేవి ఉవాచ: పోతన భాగవతం, అష్టమస్కంధం ఆంధ్రప్రదేశ్ ‘రాజధాని నిర్మాణం’ సాకుతో ముక్కారు పంట భూముల్ని వేలకు వేల ఎకరాలు బలవంతంగా స్వాధీనం చేసుకొని, అస్మదీయ స్వప్ర యోజనపరులకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కట్టబెట్టడానికి వీలుగా టీడీపీ-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ముందు ఓ ఆర్డినెన్స్‌ను తెచ్చి, ఆపై దాన్ని చట్టంగా మార్చింది. కాబట్టే ఇక్కడ ‘భూదేవి’ మాటను ప్రస్తావించవలసి వచ్చింది. పైగా మంత్రి పుల్లారావు ఒక వెకిలి మాట వదిలారు. ప్రతిపక్ష నాయకుని (జగన్) మాటలు విని రైతులు నవ్వుకుంటున్నారని ఆయన ఉవాచ. కానీ తెలుగు రైతులు విరగబడి నవ్వుతున్నది ఇలాంటి ఉబుసుపోని మాటలకేనని, ఎగతాళి పట్టిస్తున్నది ఎన్నికల్లో గెలుపు కోసం నెరవేర్చలేని హామీలిచ్చి, అబద్ధాలాడిన వారినేనని చెవుల్లో సీసం నింపుకుని మరీ పాలక స్థానంలో ఉన్న వారికి తెలియకపోవచ్చు! భూస్వాధీన / సమీకరణ చట్టాన్ని, దానికి తోడు చేసిన కృత్రిమ నిబంధనలను తెలుగులో ప్రచురించకుండా ఇంగ్లిష్‌లో ముద్రించి రైతుల ముఖాల మీద కొట్టడమే మొదటి మోసం! రైతులు ‘స్వచ్ఛందంగానే భూములిచ్చార’న్న కోతలూ, ప్రకటనలూ అలాం టివే. కాగా రాజధాని ప్రాంత రైతులు ఈ మోసాన్ని గమనించి రోజుకొక తీరున చేస్తున్న నిరసన ప్రదర్శనలు, ఆందోళనలు పచ్చి నిజం. నిజానికి ఒక ముఖమే గాని రెండు ముఖాలుండవు. పంట భూముల బలవంతపు స్వాధీ నానికి సన్నాహంగా జరిగిన వికృత ఘటన ఎవరూ మరచిపోలేని నిజం. నిశి రాత్రి రెండు గంటలప్పుడు పండ్ల తోటలను తగలబెట్టవలసిన అవసరం ఎవరికి వచ్చిందన్న ప్రశ్న శేష ప్రశ్నగానే మిగిలిపోయింది. మంది మార్బలం తో ఉన్న ప్రభుత్వ యంత్రాంగం ఈ క్షణం దాకా ఆ దుర్మార్గానికి కారకులె వరో నిగ్గుతేల్చకపోవడాన్ని చూసి కూడా అంతా నవ్వుకుంటున్నారు! ‘‘ప్రజ లంటే భయభక్తులు, దూరదృష్టి లేని పాలకులవల్ల దేశం కరువు కాటకాలతో పీడనకు గురవుతుంది. పీడనకు గురయ్యే ప్రజలు ధైర్యం కోల్పోయి భయ భ్రాంతులకు లోనైపోతారు, పాలకులు ప్రజల్ని దోచుకుంటారు; అధర్మ పాలనకు పాల్పడతారు!’’ అని పోతన ఎప్పుడో చెప్పాడు. ధరిత్రీ సత్యాన్ని కానలేని అంధత్వం అధర్వణ వేదంలోని ‘భూమి సూక్తం’లో పాలకులకు, ప్రజలకు ఒక పాఠం, గుణపాఠం ఉంది. యావత్తు ప్రాణికోటికి ఆహారం ఎక్కడి నుంచి అందు తుందో అందులో పేర్కొన్నారు. మోదీ నుంచి మోడుబారి పోయిన రాష్ట్ర పాలకుల దాకా ఆ ‘సూక్తం’ శాశ్వత పారాయణం కావాలి! ఆ సూక్తంలో ఇలా ఉంది: ‘‘ఈ భూగర్భంలో అసంఖ్యాకంగా కొండలు, నదులు, ఆరోగ్య రక్ష కాలైన ఔషధాలూ, జలచర సంపదా ఉన్నాయి. ప్రజలకు అవసరమైన ఆహార మంతా ఈ భూమాత నుంచే పుడుతోంది. ఓ భూదేవీ! ... నీవు నా తల్లివి, మేము మీ బిడ్డలం. నా తండ్రి పర్జన్యుడు (వర్షించే మేఘం) నాకు సర్వదా క్షేమం కలిగించుగాక!’’ వైజ్ఞానిక శాస్త్రం అంతగా పరిఢవిల్లని రోజుల్లోనే ‘భూదేవి’ వాక్కులోని సత్యాన్ని... సాంకేతిక సమాచార వ్యవస్థ వడివడిగా దూసుకువచ్చిన ఈ ఆధునికయుగపు పాలకులు గుర్తించకపోవడం పెను విషాదం. దేశవాళీ, ప్రపంచ గుత్త సంస్థలకు రాష్ట్రాలను, దేశాన్ని టోకుగానూ, చిల్లరగానూ అమ్మజూపుతున్న పాలకులున్న చోట రేపు సంభవించనున్న వినాశకర పరిస్థితులకు రాజధాని ప్రాంతపు ఒక రైతు కుటుంబానికి చెందిన అక్షరాస్యుడైన రైతు బాధాతప్త హృదయంతో ఇటీవలనే నాకు రాసిన ఒక లేఖను పాఠకుల దృష్టికి తెస్తున్నాను. ప్రజల ఆహార భద్రతకు, ఉపాధికి ఏర్ప డనున్న ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకున్న వాడికే, ప్రకృతితో ఆ సాన్నిహిత్యం ఉన్న వాడికే రైతుకు భూమితో ఉన్న అనుబంధం, ఆ ఎద తీపులూ తెలు స్తాయి! ఆ రైతు తన కన్నీటి లేఖతో మనల్ని మేల్కొల్పుతున్నాడు. పుడమి తల్లికి ‘సేకరణ’ శృంఖలాలా? ‘‘అన్నం వలననే మానవులు సహా యావత్తు జంతుజాలం మనుగడ. ఊసర క్షేత్రాలలో, సముద్రాలలో కురిసే వర్షం వృథా! అందుకు తోడు కావలసినవి మంచి సారవంతమయిన, ఫలవంతమయిన భూములు. నా చిన్నతనంలో మా బామ్మ, నేను అన్నం తింటుండటం చూసి ‘కంచం చుట్టూ అలా ఎన్ని మెతుకులు పారేశావురా? ఎంత మందో అన్నం లేక ఇబ్బందులు పడుతు న్నారు, ఇలా వృథా చేయకూడదు నాయనా! రైతు ఆరుగాలం కష్టపడితే, మీ నాన్న సంపాదనతో ఆ బియ్యం కొంటే, వాటిని మీ అమ్మ శ్రద్ధతో వండి వార్చితే ఒక్కొక్క గింజ ఒక్కొక్క మెతుకై నీ కంచంలోకి వస్తోంది.’ ఇలా ఆమె అన్నం వృథా చేసినా, మొక్కలు, చెట్లు, లతలకు అహితం చేసినా మందలిం చేది. ఆ మెతుకులకు కారణమైన పంట భూముల వృథాను చూస్తూ ఊరుకో గలమా? ‘‘మన జన్మభూమి, బంగారుభూమి, పాడిపంటలతో పసిడి రాశులతో కళకళలాడే...’ అంటూ సాగుతుంది ఓ సినిమా పాట. ‘పచ్చి బాలిం తరాలు మన జననీ’ అంటూ ధరిత్రిని కవి మాతృమూర్తిగా భావన చేసి గొప్ప గీత రచన చేశాడు. సంక్రాంతి లక్ష్మికి ఆలవాలం నేలతల్లే. భూమి మీద ఆధారపడి బతికే రైతాంగం శాతం జనాభా రీత్యా పెరుగుతూనే ఉండాలి కాని పడిపోరాదు. అది ప్రమాద సంకేతం. వ్యవసాయమే వృత్తిగా ఉన్న వారితో అది మాన్పించి, వేరే జీవనాధారంపై బతికే ధోరణికి తావీయరాదు. వారిలో బద్దకం, వృత్తి మారిపోదామనే తలంపు పెరగనివ్వరాదు. చేతులు కాలాక ఆకులు పడతారా? ‘‘ఉద్యానవనాలు, పంట భూములు, అడవులూ క్షయమవటం వినాశ హేతువు. పంట పొలాల విస్తీర్ణం తరగకూడదని, ఏయేటికాయేడు పెరగా లనీ, శాకంబరి మాతగా దర్శనమిచ్చే బెజవాడ కనక దుర్గమ్మకు విన్నపాలు చేస్తూంటాం. పంట పొలాలను, ఉద్యానవనాలను దుర్వినియోగం చేస్తే ముం దు తరాల వారికి ద్రోహం చేసినట్లే. రాజధాని నిర్మాణానికి పంట భూము లను, ఉద్యాన వనాలనూ, నదీ పరీవాహక ప్రాంతాలనూ దుర్వినియోగం చేసి, ఐదు, పదేళ్ల తర్వాత ‘అలా చేసి ఉండాల్సింది, ఇలా చేయకుండా ఉండా ల్సింది’ అని సమీక్షలు, వ్యాసాలు, వ్యాసంగాలు, విద్వద్గోష్టులు నిర్వహించి చప్పట్లు కొట్టించుకుంటారా? ఈ లేఖను మీరు ప్రచురణార్థం ఉపయోగిస్తే దయచేసి నాకు ఏ రాజకీయ రంగులు పులమకుండా చూడండి.’’ ఇంతకూ ఈ రైతన్న (లేఖకుని) ఆవేదనంతా ఎందుకు? అని ప్రశ్నించే వారికి కలకాలం నిలిచిపోయే కాళోజీ మాటే శిలాక్షరం కావాలి: ‘‘పుట్టు గుణమో! మట్టి గుణమో! నీటి గుణమో! గాలి గుణమో! అన్నపూర్ణ నామాంకిత ఆంధ్రావని సౌభాగ్యమో! సేద్యమంటె సంబరపడు కాపు బిడ్డ తెలుగువాడు చెట్టు కొట్టి, మెట్ట తవ్వి, కంప పొదల నరికి కాల్చి పుడమి దున్ని పండించిన మొదటి వాడు తెలుగువాడు!’’ దగాకోరు భాష-ధనవంతుల బాట అందుకే నేటి ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత రైతులు దేశ ఆహార భద్రతకు దోహదపడే బహుకొలది రాష్ట్రాల్లో ఒకటిగా, అన్నపూర్ణగా అగ్రస్థానంలో లిఖి తమై ఉన్న తమ చెరిగిపోని, చెరపరాని చరిత్రను మరీ మరీ గుర్తు చేసుకుం టున్నారు. దారి తప్పిన పాలకుల్ని చూసి నిజంగానే విరగబడి ‘‘నవ్వుకుంటు న్నారు.’’ వ్యవసాయం దండుగ కాదు, పండుగలా మారుస్తాననీ, నేను మారాను, నన్ను నమ్మండి అనీ అంటూనే బాబు మమ్మల్నీ, మా కుటుం బాలను ఏమార్చడానికి సాహసించాడని ఎద్దేవా చేస్తున్నారు. బాబు ఊత పదంగా మారిన ‘‘నన్ను నమ్మండి, మీ నమ్మకాన్ని వమ్ము చేయను’’ అన్న అరిగిపోయిన నినాదాన్ని బీజేపీ సారథి, ప్రధాని మోదీ ఇప్పుడు అందిపుచ్చు కున్నారు. ‘‘నన్ను నమ్మండి, మీ నమ్మకాన్ని వమ్ము చేయను. భూసేకరణ బిల్లు మీ కోసమే, ప్రతిపక్షాల మాట నమ్మకండి’’ అని రైతులకు విన్నపాలు (22-3-2015) చేయడం ప్రారంభించారు! ఉభయులదీ ఒకే భాష... ధన స్వామ్య ప్రభువర్గాలందరి భాష, దగాకోరు భాష! ఇరువురిదీ ఒకే మాట, ఒకే బాట! కేంద్ర, రాష్ట్ర పాలకులు కూడబలుక్కునే రైతాంగపు భూముల బలవం తపు స్వాధీనానికి ఆర్డినెన్స్‌ను, చట్టాన్ని రైతులపై రుద్దారని మరవరాదు! (వ్యాసకర్త మొబైల్: 9848318414) -
గ్రహబలమా.. ప్రజాబలమా!
రెండోమాట ఎత్తుగడల ద్వారా అందివచ్చిన అధికారాన్ని వినియోగించి, సొంత నమ్మకాల కోసం వాస్తు పేరిట సచివాలయాలను, అధికార నివాసాలను కూలగొడుతున్నారు. వాటి స్థానంలో మళ్లీ కొత్త నిర్మాణాలు చేపట్టి ప్రజా సంక్షేమానికి సంబంధించి తక్షణం చేపట్టవలసిన పథకాలను పక్కన పెడుతున్నారు. ఇంటి నుంచి కదిలితే వాస్తు. సచివాలయంలో తమ గదులలోకి ప్రవేశించడానికి వాస్తు. కుర్చీలో కూర్చోవడానికి ముందు వాస్తు, తరువాత ముహూర్తం. ‘‘నువ్వు భగవంతుడిని చూశావా? ఆయన్ను చూస్తే గుర్తు పట్టగలవా?’’ ‘నేను చూడలేదు. ఆయన కనిపించినా గుర్తు పట్టలేను!’’(డాక్టర్ వాల్పోల రాహుల గ్రంథం ‘వాట్ ది బుద్ధ టాట్’ నుంచి) ఒక సంశయవాదికీ, ఒక తాత్వికునికీ మధ్య సాగిన ఈ సంభాషణకు తోడు ‘హైందవ ఉగ్రవాదంతో ప్రారంభమైన పచ్చి ఉన్మాదమే కులతత్వం’ అన్న వివేకానందుని ప్రవచనాన్ని కూడా జోడిస్తే నేటి పాలకలోకంలో, మేధా వులమని అనుకుంటున్న చాలామందిలో పేరుకుపోయిన మూఢ విశ్వాసా లకు కారణాలు తెలుస్తాయి. భారతీయులను దెబ్బతీసిన మూఢ విశ్వాసా లలో ‘జ్యోతిష్యం’ కూడా ఒకటి అని తెగేసి చెప్పినవారు కూడా వివేకానం దుడే. ‘తమసోమా జ్యోతిర్గమయ’ (చీకటి నుంచి వెలుగులోకి ప్రయాణించు) వంటి బోధలు ఉన్న ఉపనిషత్ సారాన్ని పక్కనపెట్టి మన పాలకులు, విద్యా వంతులు గతి తప్పి వెలుగు నుంచి చీకటిలోకి ఎందుకు ప్రయాణిస్తున్నట్టు? నమ్మకాలే సర్వస్వం గాంధీజీ 120 ఏళ్లు జీవిస్తారని ఒక ప్రపంచ స్థాయి జ్యోతిష్కుడు నిర్ణయిం చాడు. కానీ జాతకంతో నిమిత్తం లేకుండా కొన్ని దశాబ్దాలకు ముందే నాథూ రాం గాడ్సే ఆయనను హత్య చేశాడు. జాతకాలూ, జ్యోతిష్యాలూ బాగా నమ్మే వాళ్లనీ, వారి పిచ్చి ఆనందాన్నీ దృష్టిలో పెట్టుకుని వివేకానందుడే ఒక కథను ఉదహరించాడు. ఒక రాజు ఉన్నాడు. అతడి దగ్గరకొచ్చిన జ్యోతిష్కుడు ‘మీరు ఆరు మాసాల్లోనే చనిపోతా’రని చెప్పాడు. దీనితో కుదేలైన రాజుకు ధైర్యం చెప్పడంతో పాటు, ఈ మూఢనమ్మకాన్ని పటాపంచాలు చేయాలని మంత్రి అనుకున్నాడు. ‘ఇంతకూ మీ అంతిమ ఘడియలెప్పుడో మీ జాతకం చూసుకుని చెప్పగలరా?’ అన్నాడు మంత్రి, జ్యోతిష్కుడితో. ‘పన్నెండేళ్ల తరు వాత పరలోకం చేరతాను’ అన్నాడతడు నమ్మకంగా. మంత్రి మరుక్షణం తన మొల నుంచి కత్తి తీసి ఒక్క వేటున జ్యోతిష్కుడి తల నరికాడు. ‘చూశారా రాజా! ఇతడి అబద్ధాలు! పన్నెండేళ్లకు గాని చనిపోనని చెప్పినవాడు, ఈ క్షణంలోనే చనిపోయాడు’ అని అన్నాడు. షేక్స్పియర్ నాటకరాజం ‘కింగ్ లియర్’ ద్వారా కూడా ఇలాంటి ఓ గొప్ప సత్యాన్ని ఆవిష్కరించాడు. ‘మనం చేసే చెడ్డపనులన్నిటికీ దైవమే కార ణమని అనుకుంటాం. కానీ ఒక వేశ్యావాటికనో లేదంటే పేకాట కేంద్రాన్నో నిర్వహించే దళారి ఎలా ఆత్మవంచనతో పబ్బం గడుపుకుంటాడో అలాగే మన తప్పిదాలకూ, నేరాలకూ గ్రహబలం పేరిట ఆడిపోసుకుంటూ ఉంటాం!’ దుర్వినియోగమవుతున్న ప్రజాధనం ఈ అనుభవాలూ, ఈ సూక్తులూ మరచిపోయిన నేటి పాలకులు మన ఉభయ రాష్ట్రాలలోనూ తమ స్వశక్తికి విలువ లేదని భావిస్తున్నారు. అందుకే వాస్తుకు అర్థాలు తెలియక, వాస్తు‘దోషం’ కోరలలో తలదూర్చి కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఎత్తుగడల ద్వారా అందివచ్చిన అధికారాన్ని వినియోగించి, సొంత నమ్మకాల కోసం వాస్తు పేరిట సచివాల యాలను, అధికార నివాసాలను కూలగొడుతున్నారు. వాటి స్థానంలో మళ్లీ కొత్త నిర్మాణాలు చేపట్టి ప్రజా సంక్షేమానికి సంబంధించి తక్షణం చేపట్టవల సిన పథకాలను పక్కన పెడుతున్నారు. ఇంటి నుంచి కదిలితే వాస్తు. సచివాల యంలో తమ గదులలోకి ప్రవేశించడానికి వాస్తు. కుర్చీలో కూర్చోవడానికి ముందు వాస్తు, తరువాత ముహూర్తం. ఒకాయన తెలుగు జాతిని చీల్చడా నికి ఢిల్లీలో లిఖితపూర్వక ఆమోదం తెలిపి వచ్చారు. ‘వాస్తుదోషం’ వెంటా డుతూ ఉండడంతో ఒక విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన భారత యువ శాస్త్రవేత్తల మహాసభకు హాజరు కాకుండా తప్పించుకున్నారు. తరువాత సభా వేదికను విశ్వవిద్యాలయం ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలోకి మార్చవలసి వచ్చింది. ఎందుకు? రాక రాక వచ్చిన ముఖ్యమంత్రి పదవి ఊడిపోతుందన్న భయం. లేదా అయవార వృత్తిలోని జ్యోతిష్కులు అలాంటి విపత్తు గురించి భయపెట్టడం వల్ల కూడా కావచ్చు. మొత్తానికి శాస్త్రవేత్తల సమావేశానికి ఆయన హాజరుకాలేదు. దీనితో ఆ ప్రారంభోత్సవానికి వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్‌తో పాటు, కేంద్ర శాస్త్ర, సాంకేతిక జూనియర్ మంత్రి హాజరై కార్యక్రమాన్ని పూర్తి చేయవలసి వచ్చింది. మరొక ముఖ్యమంత్రి మంత్రుల కార్యాలయాలనే కాకుండా, మొత్తం సచివాలయాన్నే ఎర్రగడ్డకు మార్చాలని నిర్ణయించారు. ఎర్రగడ్డ పిచ్చాసు పత్రికి ప్రసిద్ధి. రాజధాని నగరంలోనే శుభ్రంగా నడుస్తున్న ఛాతీ రోగాల చికిత్సాలయాన్ని మరో ఊళ్లోకి మార్చేందుకు కూడా ప్రయత్నాలు ఆరంభిం చారు. మళ్లీ ఇందులో మరో ఉప ప్రహసనం- సచివాలయంలో ఆంధ్ర ప్రదేశ్‌కు కేటాయించిన ‘ఎల్’ బ్లాక్‌కు వాస్తు బాగాలేదని తెలంగాణ ముఖ్య మంత్రి ఏపీ ముఖ్యమంత్రి చెవిలో ఊది, చెదరగొట్టడం. విచిత్రం ఏమిటంటే ముఖ్యమంత్రులు ఉభయులూ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చలేక, విభజన ఫలితంగా ఉభయత్రా ప్రజలకు కలిగే నష్టాలనూ, ఇబ్బందులనూ, కొత్త సమస్యలనూ గమనించకుండా అధికార అందలాల మీద, అది ఇచ్చే హోదా మీద దృష్టంతా కేంద్రీకరించే సరికి, పరిస్థితులు ముంచుకొచ్చి వాస్తునూ, నక్షత్ర బలాన్నీ నమ్ముకోవలసి వచ్చింది. వాస్తు అంటే ఏమిటి? దేశ పాలకులు విజ్ఞులని ప్రజల నమ్మకం. కానీ ‘వాస్తు’ అంటే ‘వస్తువు’ అని గాని, వస్తువు అంటే ఇల్లు అని లేదా నివాస భూమి అనిగాని వీరికి తెలి యదు. పెద్ద భవనాల నిర్మాణానికి గానీ, ఇళ్ల నిర్మాణంలో గానీ గాలి, వెలు తురు, నీరు ముఖ్యావసరాలు. ఈ సూత్రం మీద ఆధారపడే నిర్మాణ నిపు ణులు ‘ప్లాన్’ రూపొందిస్తారు. అదే ఆర్కిటెక్చర్. ఈ ప్లాన్లు గీసేవాడు వాస్తు శిల్పి. అతడికి గ్రహగతులతో గాని, రాశిఫలాలతో గాని నిమిత్తం లేదు. నిర్మా ణ ప్రక్రియలో అతడికి తోడ్పడే ప్రధాన ముడిసరుకు నిర్మాణానికి అనువైన గాలి, వెలుతురు, నీరు. వేసే పునాది కూడా ఆ మూడింట ఆధారంగానే ఉం టుంది. ఇంకా లభ్యత, సౌలభ్యత, నేల వంటి వాటిని ఆధారంగా చేసుకుని జరిగే నిర్మాణ ప్రక్రియకు నిర్దేశమే వాస్తు. నేల ఒక వాస్తవం. దీని మీద ఆధార పడినదే వాస్తు. అందుకే ఇంటిని వాస్తవ్యం, వాస్తకం, వాసగృహం, వాసము అని పిలుస్తుంటారు. ఇంతటి వ్యావహారిక సత్యాన్ని గాలికి వదిలిపెట్టి గాలీ, వెలుతురూ, నీరూ ఆధారంగా సాగే నిర్మాణ కార్యక్రమాన్ని కొందరి ఉదర పోషణకు మార్గంగా మార్చారు. పాలకులు, వారి వందిమాగధులు ఆర్థిక ప్రయోజనాల కోసం ఆ ధోరణిని పెంచిపోషిస్తూ, ఈ వ్యవహారాన్ని పక్క తోవ పట్టిస్తున్నారు. శాస్త్రీయమైన వాస్తు అలా పెడదారులు కూడా పట్టింది. రాజ్యాంగ ఉల్లంఘన కాదా! పాలకులంతా భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తారు. రాజ్యాంగం పౌర బాధ్యతగా నిర్దేశిస్తున్నట్టు, ‘‘మత, ప్రాంతీయ, వేర్పాటువాద, భాషపరమైన, సంకుచిత భావాలకు అతీతంగా’’(51-ఎ-ఇ) వారంతా నడుచుకోవాలి. ‘‘శాస్త్రీయ దృక్పథాన్నీ, మానవతావాదాన్నీ, జిజ్ఞాసనూ, సంస్కరణ వాదాన్నీ ప్రజలలో పెంపొందించే విధంగా’’ (51-ఎ-హెచ్ క్లాజ్) వారు వ్యవహరిం చాలి. ఈ రాజ్యాంగ విధిని వారు నిర్వర్తించడం లేదు. కాబట్టి నాయకుల నమ్మకాల మీద జరిగే కార్యకలాపాలు, ఖర్చులు రాజ్యాంగ ఉల్లంఘన కిందకే వస్తాయి. ఈ వరస తప్పిన వ్యవస్థలో కొందరు న్యాయవాదులు, న్యాయమూ ర్తులు కూడా ఉండడం మరింత శోచనీయం. వ్యక్తుల విశ్వాసాలను రాజ్యాంగ విరుద్ధమైన బహిరంగ విన్యాసాలుగా మలచకూడదు. సార్వకాలిక పునాది ‘అధికారానికి పునాది ప్రజలు ఉంచిన విశ్వాసమే. ప్రజలు తాము నమ్మి ఎన్నుకున్న వాడి చేతుల్లో అధికారం ఉంచారు. దానికి జవాబుదారీతనం గద్దె నెక్కి కూర్చున్నవాళ్లదే. కాబట్టి ప్రజల కోసమే ఆ అధికారాన్ని వినియోగిం చాలి’ అంటాడు ఇంగ్లండ్ అలనాటి ప్రధాని డి జ్రే యిల్. ‘‘ప్రతి సాధికార గణ తంత్ర వ్యవస్థకూ ఇదే సార్వకాలికమైన పునాది’’ అని జస్టిస్ వీఆర్ కృష్ణయ్యర్ చెప్పిన మాటలలో ఎంతో వాస్తవం ఉంది. రాజ్యాంగం ఇచ్చిన పరిధిలో పాలన సాగించడానికి పాలకులకు కొన్ని హక్కులు ఉన్నాయి. ఇవన్నీ పరిపా లన సవ్యంగా సాగించడానికి ఇచ్చిన హక్కులు. వీటితో పాటు రాజ్యాంగం ఆదేశించిన బాధ్యతలను కూడా పక్కన పెట్టి ఇష్టం వచ్చినట్టు గదులను మార్చుకోవడం, గుమ్మాలూ కిటికీలు మార్చడం, వాస్తు పేరిట ఉన్నవాటిని ధ్వంసం చేయడం, వాటి స్థానంలో కొత్తవాటిని నిర్మించడం, ఆ పనికి ప్రజా ధనాన్ని వెచ్చించడం సరికాదు. వివేకానందులే అన్నమాటలను ఒక్కసారి ఇక్కడ గుర్తుచేసుకుందాం. ‘నీ జాతి జవజీవాలతో నిలదొక్కుకోవాలంటే మూఢ విశ్వాసాల నుంచి బయటపడాలి. ఈ భూమ్మీద నాకు ఇంత అన్నం పెట్టలేని దేవుడిని నేను నమ్మలేను. ఈ పేద భారతదేశాన్ని సనాతన శక్తిగా మలచాలి. నిరుపేదల పొట్ట నింపాలి. వారికి విద్య అందాలి. మతాచారాల పురోహితవర్గం మనకొద్దు.’ (వ్యాసకర్త మొబైల్: 9848318414)