గ్రహబలమా.. ప్రజాబలమా! | Second Word | Sakshi
Sakshi News home page

గ్రహబలమా.. ప్రజాబలమా!

Published Tue, Feb 17 2015 1:54 AM | Last Updated on Fri, May 25 2018 6:35 PM

ఏబీకే ప్రసాద్, సీనియర్ సంపాదకులు - Sakshi

ఏబీకే ప్రసాద్, సీనియర్ సంపాదకులు

రెండోమాట

ఎత్తుగడల ద్వారా అందివచ్చిన అధికారాన్ని వినియోగించి, సొంత నమ్మకాల కోసం వాస్తు పేరిట సచివాలయాలను, అధికార నివాసాలను కూలగొడుతున్నారు. వాటి స్థానంలో మళ్లీ కొత్త నిర్మాణాలు చేపట్టి ప్రజా సంక్షేమానికి సంబంధించి తక్షణం చేపట్టవలసిన పథకాలను పక్కన పెడుతున్నారు. ఇంటి నుంచి కదిలితే వాస్తు. సచివాలయంలో తమ గదులలోకి ప్రవేశించడానికి వాస్తు. కుర్చీలో కూర్చోవడానికి ముందు వాస్తు, తరువాత ముహూర్తం.

‘‘నువ్వు భగవంతుడిని చూశావా? ఆయన్ను చూస్తే గుర్తు పట్టగలవా?’’ ‘నేను చూడలేదు. ఆయన కనిపించినా గుర్తు పట్టలేను!’’(డాక్టర్ వాల్పోల రాహుల గ్రంథం ‘వాట్ ది బుద్ధ టాట్’ నుంచి)

ఒక సంశయవాదికీ, ఒక తాత్వికునికీ మధ్య సాగిన ఈ సంభాషణకు తోడు ‘హైందవ ఉగ్రవాదంతో ప్రారంభమైన పచ్చి ఉన్మాదమే కులతత్వం’ అన్న వివేకానందుని ప్రవచనాన్ని కూడా జోడిస్తే నేటి పాలకలోకంలో, మేధా వులమని అనుకుంటున్న చాలామందిలో పేరుకుపోయిన మూఢ విశ్వాసా లకు కారణాలు తెలుస్తాయి. భారతీయులను దెబ్బతీసిన మూఢ విశ్వాసా లలో ‘జ్యోతిష్యం’ కూడా ఒకటి అని తెగేసి చెప్పినవారు కూడా వివేకానం దుడే. ‘తమసోమా జ్యోతిర్గమయ’ (చీకటి నుంచి వెలుగులోకి ప్రయాణించు) వంటి బోధలు ఉన్న ఉపనిషత్ సారాన్ని పక్కనపెట్టి మన పాలకులు, విద్యా వంతులు గతి తప్పి వెలుగు నుంచి చీకటిలోకి ఎందుకు ప్రయాణిస్తున్నట్టు?

నమ్మకాలే సర్వస్వం

గాంధీజీ 120 ఏళ్లు జీవిస్తారని ఒక ప్రపంచ స్థాయి జ్యోతిష్కుడు నిర్ణయిం చాడు. కానీ జాతకంతో నిమిత్తం లేకుండా కొన్ని దశాబ్దాలకు ముందే నాథూ రాం గాడ్సే ఆయనను హత్య చేశాడు. జాతకాలూ, జ్యోతిష్యాలూ బాగా నమ్మే వాళ్లనీ, వారి పిచ్చి ఆనందాన్నీ దృష్టిలో పెట్టుకుని వివేకానందుడే ఒక కథను ఉదహరించాడు. ఒక రాజు ఉన్నాడు. అతడి దగ్గరకొచ్చిన జ్యోతిష్కుడు ‘మీరు ఆరు మాసాల్లోనే చనిపోతా’రని చెప్పాడు. దీనితో కుదేలైన రాజుకు ధైర్యం చెప్పడంతో పాటు, ఈ మూఢనమ్మకాన్ని పటాపంచాలు చేయాలని మంత్రి అనుకున్నాడు. ‘ఇంతకూ మీ అంతిమ ఘడియలెప్పుడో మీ జాతకం చూసుకుని చెప్పగలరా?’ అన్నాడు మంత్రి, జ్యోతిష్కుడితో. ‘పన్నెండేళ్ల తరు వాత పరలోకం చేరతాను’ అన్నాడతడు నమ్మకంగా. మంత్రి మరుక్షణం తన మొల నుంచి కత్తి తీసి ఒక్క వేటున జ్యోతిష్కుడి తల నరికాడు. ‘చూశారా రాజా! ఇతడి అబద్ధాలు! పన్నెండేళ్లకు గాని చనిపోనని చెప్పినవాడు, ఈ క్షణంలోనే చనిపోయాడు’ అని అన్నాడు.

షేక్‌స్పియర్ నాటకరాజం ‘కింగ్ లియర్’ ద్వారా కూడా ఇలాంటి ఓ గొప్ప సత్యాన్ని ఆవిష్కరించాడు. ‘మనం చేసే చెడ్డపనులన్నిటికీ దైవమే కార ణమని అనుకుంటాం. కానీ ఒక వేశ్యావాటికనో లేదంటే పేకాట కేంద్రాన్నో నిర్వహించే దళారి ఎలా ఆత్మవంచనతో పబ్బం గడుపుకుంటాడో అలాగే మన తప్పిదాలకూ, నేరాలకూ గ్రహబలం పేరిట ఆడిపోసుకుంటూ ఉంటాం!’

దుర్వినియోగమవుతున్న ప్రజాధనం

ఈ అనుభవాలూ, ఈ సూక్తులూ మరచిపోయిన నేటి పాలకులు మన ఉభయ రాష్ట్రాలలోనూ తమ స్వశక్తికి విలువ లేదని భావిస్తున్నారు. అందుకే వాస్తుకు అర్థాలు తెలియక, వాస్తు‘దోషం’ కోరలలో తలదూర్చి కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఎత్తుగడల ద్వారా అందివచ్చిన అధికారాన్ని వినియోగించి, సొంత నమ్మకాల కోసం వాస్తు పేరిట సచివాల యాలను, అధికార నివాసాలను కూలగొడుతున్నారు. వాటి స్థానంలో మళ్లీ కొత్త నిర్మాణాలు చేపట్టి ప్రజా సంక్షేమానికి సంబంధించి తక్షణం చేపట్టవల సిన పథకాలను పక్కన పెడుతున్నారు. ఇంటి నుంచి కదిలితే వాస్తు. సచివాల యంలో తమ గదులలోకి ప్రవేశించడానికి వాస్తు. కుర్చీలో కూర్చోవడానికి ముందు వాస్తు, తరువాత ముహూర్తం. ఒకాయన తెలుగు జాతిని చీల్చడా నికి ఢిల్లీలో లిఖితపూర్వక ఆమోదం తెలిపి వచ్చారు. ‘వాస్తుదోషం’ వెంటా డుతూ ఉండడంతో ఒక విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన భారత యువ శాస్త్రవేత్తల మహాసభకు హాజరు కాకుండా తప్పించుకున్నారు. తరువాత సభా వేదికను విశ్వవిద్యాలయం ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలోకి మార్చవలసి వచ్చింది. ఎందుకు? రాక రాక వచ్చిన ముఖ్యమంత్రి పదవి ఊడిపోతుందన్న భయం. లేదా అయవార వృత్తిలోని జ్యోతిష్కులు అలాంటి విపత్తు గురించి భయపెట్టడం వల్ల కూడా కావచ్చు. మొత్తానికి శాస్త్రవేత్తల సమావేశానికి ఆయన హాజరుకాలేదు. దీనితో ఆ ప్రారంభోత్సవానికి వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్‌తో పాటు, కేంద్ర శాస్త్ర, సాంకేతిక జూనియర్ మంత్రి హాజరై కార్యక్రమాన్ని పూర్తి చేయవలసి వచ్చింది.

మరొక ముఖ్యమంత్రి మంత్రుల కార్యాలయాలనే కాకుండా, మొత్తం సచివాలయాన్నే ఎర్రగడ్డకు మార్చాలని నిర్ణయించారు. ఎర్రగడ్డ పిచ్చాసు పత్రికి ప్రసిద్ధి. రాజధాని నగరంలోనే శుభ్రంగా నడుస్తున్న ఛాతీ రోగాల చికిత్సాలయాన్ని మరో ఊళ్లోకి మార్చేందుకు కూడా ప్రయత్నాలు ఆరంభిం చారు. మళ్లీ ఇందులో మరో ఉప ప్రహసనం- సచివాలయంలో ఆంధ్ర ప్రదేశ్‌కు కేటాయించిన ‘ఎల్’ బ్లాక్‌కు వాస్తు బాగాలేదని తెలంగాణ ముఖ్య మంత్రి ఏపీ ముఖ్యమంత్రి చెవిలో ఊది, చెదరగొట్టడం. విచిత్రం ఏమిటంటే ముఖ్యమంత్రులు ఉభయులూ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చలేక, విభజన ఫలితంగా ఉభయత్రా ప్రజలకు కలిగే నష్టాలనూ, ఇబ్బందులనూ, కొత్త సమస్యలనూ గమనించకుండా అధికార అందలాల మీద, అది ఇచ్చే హోదా మీద దృష్టంతా కేంద్రీకరించే సరికి, పరిస్థితులు ముంచుకొచ్చి వాస్తునూ, నక్షత్ర బలాన్నీ నమ్ముకోవలసి వచ్చింది.

వాస్తు అంటే ఏమిటి?

దేశ పాలకులు విజ్ఞులని ప్రజల నమ్మకం. కానీ ‘వాస్తు’ అంటే ‘వస్తువు’ అని గాని, వస్తువు అంటే ఇల్లు అని లేదా నివాస భూమి అనిగాని వీరికి తెలి యదు. పెద్ద భవనాల నిర్మాణానికి గానీ, ఇళ్ల నిర్మాణంలో గానీ గాలి, వెలు తురు, నీరు ముఖ్యావసరాలు. ఈ సూత్రం మీద ఆధారపడే నిర్మాణ నిపు ణులు ‘ప్లాన్’ రూపొందిస్తారు. అదే ఆర్కిటెక్చర్. ఈ ప్లాన్‌లు గీసేవాడు వాస్తు శిల్పి. అతడికి గ్రహగతులతో గాని, రాశిఫలాలతో గాని నిమిత్తం లేదు. నిర్మా ణ ప్రక్రియలో అతడికి తోడ్పడే ప్రధాన ముడిసరుకు నిర్మాణానికి అనువైన గాలి, వెలుతురు, నీరు. వేసే పునాది కూడా ఆ మూడింట ఆధారంగానే ఉం టుంది. ఇంకా లభ్యత, సౌలభ్యత, నేల వంటి వాటిని ఆధారంగా చేసుకుని జరిగే నిర్మాణ ప్రక్రియకు నిర్దేశమే వాస్తు. నేల ఒక వాస్తవం. దీని మీద ఆధార పడినదే వాస్తు. అందుకే ఇంటిని వాస్తవ్యం, వాస్తకం, వాసగృహం, వాసము అని పిలుస్తుంటారు. ఇంతటి వ్యావహారిక సత్యాన్ని గాలికి వదిలిపెట్టి గాలీ, వెలుతురూ, నీరూ ఆధారంగా సాగే నిర్మాణ కార్యక్రమాన్ని కొందరి ఉదర పోషణకు మార్గంగా మార్చారు. పాలకులు, వారి వందిమాగధులు ఆర్థిక ప్రయోజనాల కోసం ఆ ధోరణిని పెంచిపోషిస్తూ, ఈ వ్యవహారాన్ని పక్క తోవ పట్టిస్తున్నారు. శాస్త్రీయమైన వాస్తు అలా పెడదారులు కూడా పట్టింది.

రాజ్యాంగ ఉల్లంఘన కాదా!

పాలకులంతా భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తారు. రాజ్యాంగం పౌర బాధ్యతగా నిర్దేశిస్తున్నట్టు, ‘‘మత, ప్రాంతీయ, వేర్పాటువాద, భాషపరమైన, సంకుచిత భావాలకు అతీతంగా’’(51-ఎ-ఇ) వారంతా నడుచుకోవాలి. ‘‘శాస్త్రీయ దృక్పథాన్నీ, మానవతావాదాన్నీ, జిజ్ఞాసనూ, సంస్కరణ వాదాన్నీ ప్రజలలో పెంపొందించే విధంగా’’ (51-ఎ-హెచ్ క్లాజ్) వారు వ్యవహరిం చాలి. ఈ రాజ్యాంగ విధిని వారు నిర్వర్తించడం లేదు. కాబట్టి నాయకుల నమ్మకాల మీద జరిగే కార్యకలాపాలు, ఖర్చులు రాజ్యాంగ ఉల్లంఘన కిందకే వస్తాయి. ఈ వరస తప్పిన వ్యవస్థలో కొందరు న్యాయవాదులు, న్యాయమూ ర్తులు కూడా ఉండడం మరింత శోచనీయం. వ్యక్తుల విశ్వాసాలను రాజ్యాంగ విరుద్ధమైన బహిరంగ విన్యాసాలుగా మలచకూడదు.

సార్వకాలిక పునాది

‘అధికారానికి పునాది ప్రజలు ఉంచిన విశ్వాసమే. ప్రజలు తాము నమ్మి ఎన్నుకున్న వాడి చేతుల్లో అధికారం ఉంచారు. దానికి జవాబుదారీతనం గద్దె నెక్కి కూర్చున్నవాళ్లదే. కాబట్టి ప్రజల కోసమే ఆ అధికారాన్ని వినియోగిం చాలి’ అంటాడు ఇంగ్లండ్ అలనాటి ప్రధాని డి జ్రే యిల్. ‘‘ప్రతి సాధికార గణ తంత్ర వ్యవస్థకూ ఇదే సార్వకాలికమైన పునాది’’ అని జస్టిస్ వీఆర్ కృష్ణయ్యర్ చెప్పిన మాటలలో ఎంతో వాస్తవం ఉంది. రాజ్యాంగం ఇచ్చిన పరిధిలో పాలన సాగించడానికి పాలకులకు కొన్ని హక్కులు ఉన్నాయి. ఇవన్నీ పరిపా లన సవ్యంగా సాగించడానికి ఇచ్చిన హక్కులు. వీటితో పాటు రాజ్యాంగం ఆదేశించిన బాధ్యతలను కూడా పక్కన పెట్టి ఇష్టం వచ్చినట్టు గదులను మార్చుకోవడం, గుమ్మాలూ కిటికీలు మార్చడం, వాస్తు పేరిట ఉన్నవాటిని ధ్వంసం చేయడం, వాటి స్థానంలో కొత్తవాటిని నిర్మించడం, ఆ పనికి ప్రజా ధనాన్ని వెచ్చించడం సరికాదు. వివేకానందులే అన్నమాటలను ఒక్కసారి ఇక్కడ గుర్తుచేసుకుందాం. ‘నీ జాతి జవజీవాలతో నిలదొక్కుకోవాలంటే మూఢ విశ్వాసాల నుంచి బయటపడాలి. ఈ భూమ్మీద నాకు ఇంత అన్నం పెట్టలేని దేవుడిని నేను నమ్మలేను. ఈ పేద భారతదేశాన్ని సనాతన శక్తిగా మలచాలి. నిరుపేదల పొట్ట నింపాలి. వారికి విద్య అందాలి. మతాచారాల పురోహితవర్గం మనకొద్దు.’

(వ్యాసకర్త మొబైల్: 9848318414)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement