గుల్బర్గ్ తీర్పు నేర్పుతున్న గుణపాఠం | Gulbarg judgment teaches a lesson | Sakshi
Sakshi News home page

గుల్బర్గ్ తీర్పు నేర్పుతున్న గుణపాఠం

Published Tue, Jun 7 2016 12:20 AM | Last Updated on Fri, May 25 2018 6:35 PM

గుల్బర్గ్ తీర్పు నేర్పుతున్న గుణపాఠం - Sakshi

గుల్బర్గ్ తీర్పు నేర్పుతున్న గుణపాఠం

రెండో మాట




గోద్రా అనంతర హింసాకాండను అదుపుచేయడానికి మోదీ మంత్రిమండలి ఎలాంటి నిర్ణయాత్మక చర్య తీసుకోలేదని రాజు రామచంద్రన్ సుప్రీంకోర్టుకు నోట్ పంపారు. దీనిపైనే సుప్రీంకోర్టు సిట్ (ప్రత్యేక దర్యాప్తు బృందం) అభిప్రాయాన్ని (మార్చి 15, 2011) కోరింది. ఎమికస్ క్యూరీ లేఖలో వెలుబుచ్చిన అభిప్రాయం దృష్ట్యా అవసరమైతే మరోసారి విచారణ చేపట్టవలసిందేనని కూడా అత్యున్నత న్యాయస్థానం సిట్‌ను ఆదేశించింది. అప్పుడు గాని సిట్ మోదీపై విచారణకు సిద్ధం కాలేదు.

 

 ‘న్యాయ చట్టాల ప్రకారం నడవాల్సిన పాలనా వ్యవస్థలో, చట్టాల్ని తు.చ. తప్పకుండా పాటించడంలో విఫలమైతే ఆ ప్రభుత్వం ఉనికికే చేటు. ప్రభుత్వ మనేది శక్తిమంతమైనది. సర్వాంతర్యామి. మంచి చేయడంలోనూ, చెడు తలపెట్టడంలోనూ తన ఆచరణ ద్వారా ప్రజలకు గురువుగా వ్యవహరిస్తుంది. నేరం, నేరభావన అంటువ్యాధులు. ప్రభుత్వమే చట్టాలను ఉల్లంఘించి చట్ట వ్యతిరేకిగా మారినప్పుడు అసలు చట్టం పట్లనే ద్వేషం, ధిక్కరణ భావాన్ని ప్రజలలో కల్పించి తీరుతుంది. ఈ పరిస్థితిలో ప్రతి పౌరుడు తానే చట్టంగా భావించి, చట్టం ధిక్కరించేవానిగా మారతాడు. తద్వారా ఈ పరిణామం కాస్తా సమాజంలో అరాచకానికి దారితీస్తుంది.’

 -ప్రఖ్యాత న్యాయనిపుణుడు జస్టిస్ బ్రాండిస్ (ఆమ్‌స్టెడ్ వర్సెస్ అమెరికా కేసు డిసెంట్ పత్రంలో)

 

ప్రపంచ పటం మీదకు చేరిన 2002 గుజరాత్ అరాచకాల దరిమిలా నమోదైన తొమ్మిది కిరాతకాలలో గుల్బర్గ్ సొసైటీ మూకుమ్మడి హత్యాకాండ (ఫిబ్రవరి 28, 2002) ఒకటి. కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ ఇషాన్ జాఫ్రీ సహా 69 మంది చనిపోయారు. కేసు విచారణ అనంతరం అహమ్మదాబాద్ స్పెషల్ కోర్టు 14 ఏళ్ల తరువాత ఇప్పుడు తీర్పును వెలువరించింది. 24 మందికి శిక్షలు విధించారు. 11 మందికి మరణశిక్ష విధించారు. 36 మంది నిందితుల మీద శిక్ష రద్దుచేశారు. సాక్ష్యం లేనందున కుట్రకేసు ఆరోపణను కూడా కొట్టివేశారు. ఈ కేసు మీద సిట్ విచారణను సుప్రీం కోర్టు పర్యవేక్షించింది. సిట్ విచారణ సంస్థలో గుజరాత్ పోలీసులు సభ్యులుగా ఉన్నందున జాతీయ స్థాయి సాధికార మానవహక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ), సుప్రీంకోర్టు సుప్రసిద్ధ రిటైర్డ్ న్యాయమూర్తి వీఆర్ కృష్ణయ్యర్ అధ్యక్షత న ఉన్న సిటిజన్స్ ఫర్ జస్టిస్ అండ్ పీస్ సంస్థ గుజరాత్ పోలీసులకు సిట్‌లో స్థానం కల్పించడాన్ని సవాలు చేశాయి. దానితో గుజరాత్‌లో హత్యాకాండపై దర్యాప్తునకు 2008లో నియమించిన సిట్‌ను పునర్ నిర్మించి, మొత్తం తొమ్మిది కేసులను తిరిగి విచారించమని సుప్రీంకోర్టు ఆదేశించవలసి వచ్చింది. అలాగే బాధితులకు న్యాయం చేయాలంటూ అల్లర్లలో మరణించిన ఇషాన్ జాఫ్రీ భార్య జకియా జాఫ్రీ పదకొండు సంవత్సరాలుగా పోరాడు తున్నారు.

ఆది నుంచీ అరకొర న్యాయమే
హత్యాకాండ తరువాత ఏడేళ్ల నాడు విచారణ ప్రారంభం కావడమే ఒక వింతగా న్యాయనిపుణులు భావించారు. ఫిబ్రవరి 27, 2002న సబర్మతి ఎక్స్‌ప్రెస్ రైలు ప్రారంభ ప్రయాణం సందర్భంగా రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగి చరిత్ర ప్రసిద్ధమైన ఒక దుర్మార్గపు ఘటన చోటు చేసుకుంది. దాదాపు 2,000 మంది ఊచకోతకు దారితీసిన గుజరాత్ దుర్మార్గంలో గుల్బర్గ్ సొసైటీ విధ్వంసంతో పాటు నరోడా పాటియా, నరోడాగామ్, బెస్ట్ బేకరీ, పండర్‌వాడా, పంచ్‌మల్ ప్రాంతాలు కూడా పాలు పంచుకున్నాయి. నరోడా విధ్వంసంలో బీజేపీ ఎమ్మెల్యే కొడాని మాయాబెన్ స్వయంగా పాల్గొని ప్రజలను రెచ్చగొట్టడాన్ని, అల్లర్లు అంతవరకు వచ్చే వరకు కూడా అరెస్టులు చేయకుండా తాత్సారం చేసిన పోలీసుల చర్యను సిట్ పునః సమీక్షించింది. ఫలితంగా గుజరాత్ పోలీసులే కొడానిని అరెస్టు చేయక తప్పలేదు. ఇలాంటి పలు కేసుల నేపథ్యంలో నాడు మోదీ ప్రభుత్వం, గుజరాత్ పాలనా వ్యవస్థ దేశవిదేశాలలో పరువు కోల్పోయింది. గుజరాత్‌లో నరోడా పాటియా, నరోడాగామ్ నియోజకవర్గాలకు చెందిన కొడాని మాయాబెన్ విధ్వంస కాండను ప్రోత్సహించడాన్ని ప్రజలు, న్యాయస్థానాలు మరచిపోలేదు. ఇలాంటి మార్గాల ద్వారా ఎన్నికలలో ఎలాంటి ప్రయోజనం పొందవచ్చునో తెలిసిన వ్యక్తిగా కొడానిని సుప్రసిద్ధ పత్రికా రచయిత మనోజ్ మిట్టా తన పరిశోధక గ్రంథంలో (మోదీ అండ్ గోద్రా)లో పేర్కొన్నారు.

విచారణల తంతును కూడా బహిర్గతం చేశారు. ‘సమాజ శాంతిని చెదరగొట్టే దుండగు లకూ, దౌర్జన్యకారులకూ టైస్టులకూ తేడా లేదని ఒక సందర్భంలో సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యనే, కొడాని బెయిల్‌ను రద్దు చేసిన సందర్భంలో గుజరాత్ హైకోర్టు ఉదహరించడం విశేషం. విచారణాధికారులు సయితం సాక్షులు స్పష్టంగా పేర్కొన్న అంశాలను, ప్రతివాదులైన ప్రముఖుల పేర్లను రికార్డులకు ఎక్కకుండా తొక్కిపట్టారని కూడా హైకోర్టు వ్యాఖ్యా నించింది. జకియా జాఫ్రీ (ఇషాన్ భార్య) ఇచ్చిన ఫిర్యాదులను పక్కన పెట్టి, గుల్బర్గ్ విధ్వంసకాండ కేసు వైపు సిట్ దృష్టి పెట్టిందని మిట్టా పేర్కొన్నారు. ఇంకా, ‘సీఆర్‌పీసీ 161 సెక్షన్ కింద విధిగా రికార్డు కావలసిన మోదీ ప్రకటనను ఏదో కంటితుడుపుగా సీఆర్‌పీసీ చట్టాల పరిధికి వెలుపల నమోదు చేశారు. ఆ తరువాత జరిపిన సిట్ విచారణకు మోదీని సమన్ చేసి ఉన్నా ఈ సెక్షన్ కిందనే లీగల్‌గా మోదీ నిజం చెప్పక తప్పేది కాదు’ అని కూడా మిట్టా (పే. 100)లో పేర్కొన్నారు.

అసలు కథ రాహుల్ శర్మ సీడీ
సీబీఐ మాజీ డెరైక్టర్ ఆర్కే రాఘవన్ నాయకత్వంలో ఏర్పాటైన సిట్ జరుపుతున్న దర్యాప్తు తీరు గురించి సుప్రీంకోర్టు అనుమానం వ్యక్తం చే స్తూ, ప్రసిద్ధ న్యాయవాది రాజు రామచంద్రన్‌ను ప్రత్యేక అధికారిగా నియమిం చింది. గోద్రా అనంతర హింసాకాండను అదుపుచేయడానికి మోదీ మంత్రి మండలి ఎలాంటి నిర్ణయాత్మక చర్య తీసుకోలేదని రామచంద్రన్ సుప్రీంకోర్టుకు నోట్ పంపారు. దీనిపైనే సుప్రీంకోర్టు సిట్ అభిప్రాయాన్ని (మార్చి 15, 2011) కోరింది. ఎమికస్ క్యూరీ లేఖలో వెలుబుచ్చిన అభిప్రాయం దృష్ట్యా అవసరమైతే మరోసారి విచారణ చేపట్టవలసిందేనని కూడా అత్యున్నత న్యాయస్థానం సిట్‌ను ఆదేశించింది. అప్పుడు గాని సిట్ మోదీపై విచారణకు సిద్ధం కాలేదు. ఇక్కడే మనోజ్ మిట్టా ఒక రహస్యం విప్పాడు, ‘ఇద్దరు పోలీసు అధికారులు ఎం.కె. టాండన్, పి.బి.గోండియా లను మరోసారి ‘సిట్’ విచారించిందేగానీ, మోదీని మరోసారి విచారిం చాలన్న సుప్రీంకోర్టు ఆదేశానికి మూలమైన ఎమికస్ క్యూరీ లేఖలో ప్రస్తావించిన అంశాలలో ఏ ఒక్కదానిపైనా సిట్ మోదీని ప్రశ్నించడానికి ప్రయత్నించలేదు (పేజి : 115)! ఆ గాథ అలా ముగియగా - గుజరాత్ కిరాతకాలపై ఆదినుంచీ విచారణ జరుపుతున్న సీబీఐ అధికారిగా, నిజాయి తీకి పేరుమోసిన రాహుల్ శర్మ గోద్రా/గోద్రా అనంతర ఘటనలపై నిర్మొహ మాటంగా సాక్ష్యాలను ‘సి.డీలకు (సి.ఒ.ఆర్.) అక్షరబద్ధంగా ఎక్కించి ఉంచాడు.

మొబైల్ కాల్స్ సంభాషణలను సేకరించాడు. నానావతి కమిషన్ ఆదేశంపైన ఈ సేకరణ జరిగింది. వీటి ఆధారంగా కమిషన్ ముందు (30.10.2004) రాహుల్ శర్మ వాంగ్మూలం ఇచ్చాడని మిట్టా పేర్కొన్నాడు. ఇది చరిత్రే కావచ్చు, కానీ ఇంత ఊచకోతకు తగిన పశ్చాత్తాప ప్రకటనగానీ, ప్రజా బాహుళ్యానికి క్షమాపణ చెప్పే ప్రాచీన భారత సంస్కృతిని గానీ ఆనాటి పాలకులు పాటించి ఉంటే మనసులు కొత్త చిగుళ్లు తొడుక్కోవడానికి అవకాశం ఉండేది. ఈలోగా సుప్రీం ఎమికస్ క్యూరీ రాజు రామచంద్రన్ ‘సిట్’ అర్థంతర నివేదికకు ఒక ‘హంసపాదు’ పెడుతూ ‘‘గుజరాత్ పరిణా మాలపై సుప్రీంకోర్టు తుది తీర్పు ఇంకా వెలువడవలసేఉంద’’ని ప్రకటిం చారనీ, శిక్షించడానికి సాక్ష్యం ఉందని ప్రకటించాడనీ మరో ప్రసిద్ధ పత్రికా సంపాదకుడు కింగ్‌షుక్ నాగ్ (‘‘ది నమో స్టోరీ’’ : 2013) రాశాడు.

రాజకీయ భాష తీరే అంత
అయినా ‘పాతకథలు తవ్వనేల, చారడేసి కళ్లయినా శవంవల్ల ఏం లాభం’ అని మనం కవితా న్యాయంగా చెప్పవచ్చు! కానీ తాజాగా క్యూబా పర్య టనలో ఒక సామ్రాజ్యవాద పెట్టుబడిదారీ వ్యవస్థ ప్రతినిధిగా అమెరికా అధ్యక్షుడు ఒబామా ఎవరిముందో కాదు సరాసరి అమెరికా సామ్రాజ్యవాద భయానక దాడులకు, హింసాకాండకు, దోపిడీకి గురైన క్యూబా విమోచన దాత, అధినేత ఫిడెల్ క్యాస్ట్రో ముందు ‘మనం గతాన్ని మరిచి పోదాం’  అన్నాడు. అంతేగాని క్యూబా ప్రజలకు క్షమాపణ చెప్పలేదు. వియత్నాంకూ చెప్పలేదు, జపనీస్ నగరం హిరోషిమాపై ఆటంబాంబు ప్రయోగించి లక్షలాదిమంది ప్రాణాలు తీసినందుకు అమెరికా తరఫున ఒబామా తన యాత్రలో క్షమాపణ చెప్పే పని తప్పించుకున్నాడు. అదేమంటే ఒక పాలకు డంటాడు - ‘ప్రయాణంలో నా కారుకు అడ్డువచ్చే కుక్కపిల్ల చస్తే అది నా తప్పు ఎలా అవుతుంది. నా తప్పుంటే నన్ను ఉరితీయండి’ అని. తప్పు కారుదేగానీ మనిషిది కాదని తప్పుకునేవాడు ఈషణ్మాత్రం వేదన, ఆవేదన లేనివాడు అవుతాడు. ఇలాంటి సందర్భాలను చూసే జార్జి ఆర్వెల్ అనే సుప్రసిద్ధ నవలాకారుడు నవనీతంలాంటి సత్యవాక్కుల్ని మనకు వదిలి వెళ్లాడు. ‘‘అబద్ధాల్ని సత్యాలు గానూ, హత్యల్ని గౌరవనీయమైనవిగానూ, తన కరుణా కటాక్షాలపైననే గాలి వీస్తున్నట్టుగానూ భావించుకుని పోజులు గొట్టడానికే రాజకీయ భాష పుట్టినట్టుంది’’. అవునా? సమాధానం మన చేతుల్లోనూ, చేతల్లోనే ఉంది.

వేదాలు, పురాణాల ఆవశ్యక జ్ఞానాన్ని అందిస్తాయో లేదోగానీ కుహనా నేతల వల్ల ప్రాప్తించేది కుహనా సంస్కృతి మాత్రమే. గోదావరిలోగానీ, గంగోత్రిలోగానీ మునక వేసినంత మాత్రాన వంకర బుద్ధులు తొలగవు, తొలగవు! తొలగవు అనడానికి దేశంలో వర్తమాన పరిణామాలే నిదర్శనం! ఎవరినైతే నిందితులుగా కొన్ని సాధికార విచారణ సంస్థలు, చార్జిషీట్లూ పేర్కొన్నాయో ఆ నాయకులు, ఆఫీసర్లు, ఎన్‌కౌంటర్ నిర్వాహకులు కొత్త సంస్కృతిలో అకస్మాత్తుగా పెద్ద మనుషులైపోయారు!

- ఏబీకే ప్రసాద్,  సీనియర్ సంపాదకులు

abkprasad2006@yahoo.co.in

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement