భూ సేకరణకు కుదరని సమీకరణ | Unfamiliar to mobilization of land acquisition | Sakshi
Sakshi News home page

భూ సేకరణకు కుదరని సమీకరణ

Published Tue, May 5 2015 2:21 AM | Last Updated on Sat, Aug 18 2018 5:48 PM

ఏబీకే ప్రసాద్,  సీనియర్ సంపాదకులు - Sakshi

ఏబీకే ప్రసాద్, సీనియర్ సంపాదకులు

 రెండోమాట
 
 ఆనాడు వలస పాలకుల ప్రయోజనాలకు అనువైన వ్యవసాయ విధానం కావలసి వచ్చింది. అందుకు అనుకూలించే, కంపెనీ దోపిడీని సుస్థిరం చేయగల ఆర్థిక సంబంధాలు కూడా అవసరమైనాయి. ఆ క్రమంలో ఏర్పడి, వృద్ధి చెందినవే జమిందారీ, ఫ్యూడల్ సంబంధాలు.
 అవి నూతన మార్కెట్‌కు అనుగుణంగా కంపెనీ పాలకులు రూపొందించినవే. అదే ఫక్కీలో ఇవాళ కూడా ప్రపంచ బ్యాంక్ వ్యవసాయ, పారిశ్రామిక వ్యతిరేక సంస్కరణల ద్వారా  స్వతంత్ర భారత పాలకుల మెడలు వంచుతోంది.

 
 ‘ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానికి అనువైన ప్రాంతాన్ని ఎంపిక చేసే బాధ్య త కేంద్ర ప్రభుత్వానిదేనని పునర్విభజన చట్టంలోని సెక్షన్-6 నిర్దేశించింది. అందుకుగాను కేంద్రం శివరామకృష్ణన్ సాధికార సంఘాన్నీ నియమించింది. కోస్తా ప్రాంత వ్యవసాయ భూములకూ, జనావాస ప్రాంతాలకూ నష్టం జర గని పద్ధతిలో మాత్రమే రాజధాని నిర్మాణం జరగాలని ఆ కమిటీ కూడా పేర్కొన్నది. విజయవాడ-గుంటూరు-తెనాలి-మంగళగిరి (వీజీటీఎం) ప్రాంతాలలో రాజధాని నిర్మాణానికి కమిటీ సుముఖంగా లేదు. వివిధ ప్రభు త్వ శాఖలను రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో సర్దుబాటు చేయడం శ్రేయ స్కరమని చెప్పింది. కానీ, ఈ లోగా ఆదరాబాదరాగా, ఇందుకు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం రాజధాని ప్రాంత అభివృద్ధికి ప్రాధికార సంస్థను (సీఆర్ డీఏ) ఏర్పాటు చేస్తూ ఒక చట్టం తెచ్చింది. ఈ రాజ్యాంగ విరుద్ధ చర్య, ఆంధ్ర ప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ చట్ట నిబంధలకే వ్యతిరేకం’ (గౌరవ న్యాయమూర్తు లు, న్యాయవాదులు, ఒక సీనియర్ పత్రికా రచయిత రాష్ట్ర హైకోర్టులో వేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) నుంచి).

 రైతులకే తొలి విజయం
 ఈ పిల్‌ను పరిశీలించిన తరువాత హైకోర్టు 9.3 ఫారాల పేరిట రాజధాని నిర్మాణం కోసమని ప్రభుత్వం ఒత్తిడి చేసి రైతాంగం నుంచి సేకరించిన పంట భూములలో సాగు కార్యకలాపాలను కొనసాగించుకోవచ్చునని (1-5- 2015) పేర్కొన్నది. ఈ పంట భూములను పూలింగ్ పేరిట  ‘భూ సమీకరణ’ చర్య కింద ప్రభుత్వం సేకరించింది. ఆ ప్రయత్నం కొంత బెడిసికొట్టిన తరువాత చేసిన పని- భూసేకరణకు అవకాశం లేకపోవడం వల్ల ప్రభుత్వం పక్కదారులు పట్టి భూములను భూసేకరణ చట్టం కింద సేకరిస్తామనీ, ఇందుకు సంబంధించిన ప్రకటనను మే 14వ తేదీన జారీ చేస్తామనీ కోర్టుకు నివేదించుకుంది. అంతవరకు పిటిషనర్ల (రైతులు) వ్యవసాయ కార్యకలాపా లకు ఆటంకం కలిగించవద్దని’ ఆదేశించింది. అయితే కోర్టుకు సెలవులు కావడంతో పూర్తి విచారణ తరువాత ప్రారంభం కానున్నది. కానీ, రైతాంగం కుడుమిస్తే పండుగైనట్టు కోర్టు ఇచ్చిన వెసులుబాటును పూర్తి విజయంగా భావించరాదు. ఎందుకంటే- మెలికలు వేయడంలో, మాట మార్చడంలో సిద్ధహస్తులైన పాలకులు వ్యూహం మార్చుకుని దెబ్బతీయాలని చూస్తారు.

 సీఆర్‌డీఏ కింద భూసేకరణ సాధ్యం కాకుంటే రూటు మార్చి 1894 నాటి బూజు పట్టిన బ్రిటిష్ కాలపు చట్టాన్నే అమలుచేయాలని చూస్తారు. ఈ పాత సరీసృపానికి అరకొర సవరణలు చేసింది కూడా 1984లోనే. భూములు కోల్పోయిన వారికి అరకొర పునరావాసం లభించడం కూడా దాని ఫలితమే. నష్టపరిహారం కూడా భూస్వాధీన చట్టం కింద కంటి తుడుపుగానే అందు తోంది. 1984లో చేసిన సవరణ కూడా నష్టపోతున్న రైతులు ఫిర్యాదు చేసుకో వడానికి కొంత సమయం ఇచ్చినట్టు చూపడం కోసమే. తెలుగుగంగ ప్రాజెక్టు కోసం భూసేకరణ చేపట్టినప్పుడు వెలుగోడు రైతులకు చెందిన పంటభూము లు కాని భూములకు కూడా పూర్తి నష్టపరిహారం చెల్లించాకే ప్రభుత్వం స్వాధీ నం చేసుకుంది. ఈ రీతిలో నష్టపరిహారం పొందడం, అందుకు మడమ తిప్పని పోరాటం జరగడం స్వతంత్ర భారత చరిత్రలో మొదటిసారి.

 యూపీఏ నిర్వాకం
 2005లో యూపీఏ పాలకుల నిర్వాకం మరొకటి. పారిశ్రామిక విస్తరణ పేరిట యూపీఏ సెజ్‌లు, స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్‌పీవీ) పేరిట స్వదేశీ, విదేశీ గుత్త పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం ప్రపంచ బ్యాంక్ ప్రజా వ్యతిరేక సంస్కరణల ముసుగులో బలవంతపు భూసేకరణకు ఒడిగట్టింది. దీనితో రైతాంగం ఆందోళన మిన్నంటింది. చివరకు సారవంతమైన పంటభూము లను ప్రజాప్రయోజనాల దృష్ట్యా సేకరించరాదని సెజ్ చట్టంలో చేర్చారు. అలాగే సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పులనూ వెల్లడించింది. కానీ కొందరు స్వప్రయోజనపరుల కోసం ఆ తీర్పులను పక్కన పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. బీజేపీ హయాంలో, అంతకుముందు కూడా 1894 చట్టం కిందనే రైతాంగం ప్రయోజనాలకు వ్యతిరేకంగానే భూసేకరణ జరిగింది. ఆ వలస చట్టం స్థానంలోనే 2013లో వేరే చట్టాన్ని తీసుకురావలసివచ్చింది. గ్రామీణ ప్రాంతాల నుంచి పేద రైతులూ, వ్యవసాయ కార్మికులూ, వ్యవసాయాధారిత వృత్తి పనుల వారూ సాగిస్తున్న భారీ వలసలకు అడ్డుకట్ట వేయాలంటే కొత్త రాజధానికి అనువైన నైసర్గిక భౌగోళిక అనుకూలతలు ఉన్న ప్రాంతాలకూ, వేల ఎకరాలు ప్రభుత్వ భూమి లభ్యం కాగల ప్రాంతాలకూ (వినుకొండ- దొనకొండ) తరలడమే పరిష్కారం.

 ప్లాసీ నుంచి ప్రపంచ బ్యాంక్ వరకు
 ప్లాసీ యుద్ధం (1757)తో భారతదేశాన్ని కబళించాలని ఆకాంక్షించిన ఈస్టిండి యా కంపెనీకి, ఆ వెంటనే ఉపఖండాన్ని పాదాక్రాంతం చేసుకోవాలన్న ఆశ కూడా పుట్టింది. అప్పుడే ఇంగ్లండ్ సహా ఐరోపా అంతటా పారిశ్రామిక విప్ల వం వెల్లువెత్తింది. దీనితో అంతవరకు ఇంగ్లండ్‌కు వస్తువులను ఎగుమతి చేసిన ఇండియా ఆ స్థానాన్ని త్వరలోనే కోల్పోయింది. పైగా బ్రిటిష్ పరి శ్రమల ఉత్పత్తులకు భారతదేశం ఒక మార్కెట్‌గా, వాటికి ముడిసరుకు సర ఫరా చేసి బతికే దేశంగా మారింది. ఈ పరిణామం దేనికి దారితీసింది? ఫ్రెంచ్ విప్లవ (1789) ఫలితంగా వలస దేశాలలో ఉన్న ఈస్టిండియా కం పెనీకి బ్రిటిష్ పెట్టుబడిదారుల నుంచి పోటీ వచ్చింది. ఇండియా వంటి దేశా లలో పెట్టుబడులు పెట్టి, లాభాలను మాతృదేశానికి తరలించే ప్రక్రియలో తమకూ సమానావకాశాలు కల్పించాలని బ్రిటిష్ పెట్టుబడిదారులు కోరారు. ఇప్పుడు సరిగ్గా ఇలాంటి ‘సమానావకాశాల’ కోసమే ప్రపంచ బహుళ జాతి గుత్త పెట్టుబడిదారీ సంస్థలు పోటీ పడుతున్నాయి. వీరికి ప్రపంచ బ్యాంక్ అండదండలు ఉన్నాయి. తాడుతోనే దబ్బనం అన్నట్టు దేశంలోని దళారీ గుత్త పెట్టుబడి వర్గాలు కూడా విదేశీ కంపెనీల స్థానే తమకూ లాభాల వేటలో సమానావకాశాలు ఉండాలని పల్లవి అందుకున్నాయి. ఆ విధంగా ఆనాడు వలస పాలకుల ప్రయోజనాలకు అనువైన వ్యవసాయ విధానం కావలసి వచ్చింది. అందుకు అనుకూలించే, కంపెనీ దోపిడీని సుస్థిరం చేయగల ఆర్థిక సంబంధాలు కూడా అవసరమైనాయి. ఆ క్రమంలో ఏర్పడి, వృద్ధి చెందినవే జమిందారీ, ఫ్యూడల్ సంబంధాలు. అవి నూతన మార్కెట్‌కు అనుగుణంగా కంపెనీ పాలకులు రూపొందించినవే. అంటే వలస ప్రభుత్వానికి మధ్య దళా రీలుగా వ్యవహరిస్తూ రాబడిని వివిధ రూపాలలో వసూలు చేసి పెట్టడానికి ఉపకరించిన బంట్లే జమిందారులు, రాజాలు, పాలెగాళ్లు. కష్టం రైతుదీ, కూలీలది. ఫలితం భూస్వాములదీ, జమిందార్లది. అదే ఫక్కీలో ఇవాళ కూడా ప్రపంచ బ్యాంక్ వ్యవసాయ, పారిశ్రామిక వ్యతిరేక సంస్కరణల ద్వారా స్వతంత్ర భారత పాలకుల మెడలు వంచుతోంది.ప్రభుత్వాల ద్వారా న్యాయ స్థానాలను అదుపు చేయాలని కూడా ప్రపంచ బ్యాంక్ చూస్తోంది.  

 ఆవేదనకు అద్దం పట్టే లేఖ
 ఈ సందర్భంగా గుంటూరు ప్రాంతం నుంచి అనిసెట్టి నారాయణ అనే రైతు కుటుంబీకుడు కొద్దిరోజుల క్రితం నాకు రాసిన ఒక లేఖ గురించి ఇక్కడ ప్రస్తావిస్తాను. రాజధాని కోసం పాలకులు పడుతున్న పాట్లు గురించి ఆయన రాశారు. ఆలస్యమైనా, ఆంధ్రప్రదేశ్ రాజధానిని నిర్మించేది అమెరికానా, జపానా, సింగపూరా, చైనానా- ఏదీ తేలని స్థితిలో ‘రాజధానిగా దొనకొండ ఇప్పటికీ అన్ని విధాలా శ్రేష్టం. నీళ్లు లేవంటున్నారు. నాగార్జున సాగర్ నుంచి హైదరాబాద్‌కు 200 కిలోమీటర్ల దూరం నుంచి రోడ్డుకి ఇరువైపులా పెద్ద పెద్ద పైపులు వేసి నీటిని తరలించుకోలేదా? పదకొండు కిలోమీటర్ల దూరంలో కురిచేడు వద్ద సాగర్ కాల్వ నుంచి చందవరం చెరువులో నీటిని నింపి వాడుకోవచ్చు గదా! కర్నూలు-గుంటూరు జాతీయ రహదారికి లింకు రోడ్డు వేసుకోవచ్చు కదా! ఈ ప్రాంత ప్రజానీకంలో ఎక్కువ మంది బడుగు, బలహీనవర్గాల వారే. వీరు వలస జీవులైపోతున్నారు. ఇక్కడి జనమూ, ఇక్కడ భూములు కూడా పటిష్టంగానే ఉండటం వల్ల భవన నిర్మాణాలు కూడా పటిష్టంగానే ఉంటాయి. దొనకొండ ప్రాంతంలో విస్తారంగా ప్రభుత్వ అటవీ భూములున్నాయి. నిర్మాణంలో ఉన్న వెలుగోడు ప్రాజెక్టును త్వరగా పూర్తి చేసుకోలేమా? రెండవ ప్రపంచ యుద్ధ కాలం నాటి విమానాశ్రయం దొనకొండలోనే ఉంది. దాన్ని 600 ఎకరాలకు విస్తరించి అంతర్జాతీయ విమానాశ్రయంగా నిర్మించుకోవచ్చుగదా! రైలు మార్గాలు కూడా దగ్గర దగ్గర ఉండరాదు. అన్ని ప్రాంతాల ప్రజలకూ అవి అవసరమే గదా!’’ అన్నారా యన.  ఇంకా ఈ లేఖకుడు రైలు, రవాణా మార్గాల గురించి కూడా వివరంగా పేర్కొన్నాడు! ముందుచూపు లేని నాయకుల వల్ల ప్రాంతాల మధ్య చోటు చేసుకున్న అసమాభివృద్ధిని ప్రస్తావిస్తూ ఇంకా ఇలా చెప్పాడు: ‘‘గుంటూ రు-గుంతకల్లు రైలు మార్గానికి విద్యుత్ సౌకర్యం ఎలాగు ఇప్పుడు కలగ జేస్తున్నారు. ప్రస్తుతం నర్సరావుపేట, అవతల సంతమాగులూరు స్టేషన్ దాక లైన్లు వేశారు. గుంటూరు నుంచి హైదరాబాద్‌కి మూడు విధాలుగా రైళ్లు వెళ్తాయి. 1. గుంటూరు-విజయవాడ - ఖమ్మం- వరంగల్ - బీబీనగర్ - సికింద్రాబాద్.  2. గుంటూరు-సత్తెనపల్లి- పిడుగురాళ్ల- మిర్యాలగూడ- నల్లగొండ- బీబీనగర్- సికింద్రాబాద్. 3. గుంటూరు-దొనకొండ- నంద్యా ల- ద్రోణాచలం- కర్నూలు - పాలమూరు - సికింద్రాబాద్.  మరల కాళ హస్తి- నడికుడి మార్గం, వినుకొండ నుంచి నడికుడికి, అటు నుంచి బీబీ నగర్- సికింద్రాబాద్ అంటున్నారు. అయితే, దొనకొండను ఆంధ్రప్రదేశ్ రాజధానిని చేసి, కాళహస్తి- నడికుడి లైనును నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ప్రస్తుతం ఉన్న చెన్నై- విజయవాడ లైనుకు దూరంగా ఉదయగిరి- కనిగిరి- పొదిలి- దొనకొండ (జంక్షన్ చేసి), త్రిపురాంతకం- ఎర్రగొండపాలెం- మాచర్ల- సాగర్‌మాల్- మల్లెపల్లి- మలక్‌పేట- లేదా ఫలక్‌నుమా స్టేష్లన్ల మీదుగా లైను వేయాలి. ఇందువల్ల వెనుకబడిన రవాణా సౌకర్యాలు లేని ప్రాంతాలకు న్యాయం జరుగుతుంది. అప్పుడు భూసేకరణకు రైతుల నుంచి వ్యతిరేకత దాదాపుగా ఉండదు. దర్శి, వినుకొండ, కురిచేడు, ఈపూరు, కారెం పూడి- నడికుడి అయితే రైతులు మాగాణిని కోల్పోవలసి వచ్చి, వ్యతిరేకత వస్తుంది. ఇలా అన్ని మార్గాల నుంచి రైలు బళ్లు బీబీనగర్ వచ్చి రైళ్ల రద్దీ విప రీతమై, లైన్లు ఖాళీ లేక రేపల్లె నుంచి - సికింద్రాబాద్ వెళ్లే ప్యాసింజర్ రైలును మూడు గంటలు బీబీనగర్‌లో నిలుపుతారు. ఇలా మళ్లీ వేయకుండా దొన కొండను రైల్వే జంక్షన్ చేసి, దొనకొండ, ఎర్రగొండపాలెం, మాచర్ల సాగర్, మల్లెపల్లి నుంచి లైను వేస్తే నాలుగు జిల్లాల మెట్ట ప్రాంతం ద్వారా రైలు లైను ఏర్పడి ప్రజలకు సౌకర్యాలు కలుగుతాయి. రైల్వే వారికి కూడా దొనకొండలో చాలా స్థలాలు ప్రస్తుతం ఖాళీగా పడి ఉన్నాయి. ఈ దూరదృష్టి కొరవడితే మరోసారి రాష్ట్ర విభజనకి పాలకులు కారకులవుతారేమో’’నన్నది ఆ లేఖకుని ఆవేదన! ఇలాంటి ఆవేదనలు ఎలా ఉన్నా పైన పేర్కొన్న హైకోర్టు ఆదేశం తరువాత ఇతర రైతులూ కోర్టును ఆశ్రయించడానికి రావడం విశేషం.

 (వ్యాసకర్త మొబైల్: 9848318414)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement