స్కిల్ ఉండాలి గురూ | skill leads to success, says actor pradeep | Sakshi
Sakshi News home page

స్కిల్ ఉండాలి గురూ

Published Sat, Aug 2 2014 12:28 AM | Last Updated on Sat, Sep 2 2017 11:14 AM

స్కిల్ ఉండాలి గురూ

స్కిల్ ఉండాలి గురూ

మీ.. ప్రదీప్
పక్కా లోకల్ కుర్రోడు. పుట్టింది.. పెరిగిందీ ఇక్కడే.  ఉదయం పూర్ణా టిఫిన్ సెంటర్‌లో ఉపహారం.. రాత్రి గోషామహల్లో దోశ తినడం మనోడి టేస్ట్. రద్దీగా ఉండే పాతబస్తీ అంటే మరీ ఇష్టం. ఊర్లెన్ని తిరిగినా.. సిటీకొస్తేనే ఊపిరాడుతుంది. ఇప్పుడు బుల్లితెరపై యాంకరింగ్‌తో రచ్చ చేస్తూ ఇంట గెలిచిన ప్రదీప్, స్కిల్స్ ఉంటే సక్సెస్ వస్తుందని చెబుతున్నాడు.
 
నాన్న రియల్ ఎస్టేట్. అమ్మ గృహిణి. వాళ్లకు అక్క, నేను ఇద్దరం.  నా ఫ్రెండ్స్ ఇక్కడి వాళ్లే. ఇప్పటికీ వాళ్లతో రిలేషన్ కంటిన్యూ చేస్తున్నాను. హైటెక్ సిటీ ఉన్న ఏరియా అంటే చాలా ఇష్టం. ఇప్పుడున్నట్టు కాదు.., 20 ఏళ్ల కిందట కాలుష్యం సోకని స్వచ్ఛమైన ప్రాంతం అది. ఇప్పుడు అటుగా వెళ్తుంటేనే బాధనిపిస్తుంది. చిన్నతనంలో మా ఫేవరేట్ స్పాట్ దుర్గం చెరువు. వారంలో మూడుసార్లు వెళ్లే వాళ్లం. అప్పుడెటూ చూసినా పచ్చదనం.. ఇప్పుడెటు చూసినా కాంక్రీట్ వనం.
 
 మిస్సింగ్ స్టోరీ
 అప్పుడు నాకు నాలుగైదేళ్లు అనుకుంటా. కూరగాయల బండి దగ్గర మా అమ్మ బేరమాడుతోంది. నేను బండి కింద బుట్టలోకి దూరిపోయా. కట్ చేస్తే.. కూరగాయలమ్మి బండిని తోసుకుంటూ వెళ్లి పోయింది. నేను ఏడ్చే దాకా ఆమె నన్ను చూడలేదు. అడ్రస్ చెబుదామంటే మాటలు సరిగ్గా రావు. ఆమె నన్ను పోలీస్ స్టేషన్లో అప్పగించింది. నేను తప్పిపోయాననుకుని అమ్మానాన్నలు పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. అలా నా మిస్సింగ్ స్టోరీ సుఖాంతమైంది.
 
 మొదట్నుంచీ లాస్ట్ బెంచే
 ఆరో తరగతి వరకు నా సీటు లాస్ట్ బెంచే. చదువులోనూ లాస్ట్ నుంచి ఫస్ట్ ర్యాంకే. ఏడో తరగతిలో మా మాస్టార్ ఓ క్లాస్ పీకారు. అంతే మ్యాథ్స్ అంటే భయంతో స్కూల్‌కు డుమ్మా కొట్టాలనుకునే నేను.. లెక్కల కోసమే క్లాస్‌కు వెళ్లేది. చదువులో ముందుకొచ్చినా.. లాస్ట్ బెంచీని వదల్లేదు. కాలేజ్ డేస్‌లో సినిమాలే సినిమాలు. సినిమాల్లో హీరో రోల్ చూసి అలా అవ్వాలనుకునే వాణ్ని. ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌లో తమ్ముడు సినిమా తొమ్మిది సార్లు చూశా. ఆ సినిమా చూసి ఏ లక్ష్యం పెట్టుకోవద్దని డిసైడ్ అయ్యాను.
 
 కమిట్‌మెంట్ ఉండాలి..
 ఇంజనీరింగ్ అయిపోగానే విదేశాలకు పంపి మాస్టర్స్ చేయించాలనుకున్నారు మా పేరెంట్స్. నాకేమో వెళ్లాలని లేదు. మొదట పోస్టర్స్, పాంప్లెట్స్ అంటించే ఉద్యోగం చేశాను. ఈ ఉద్యోగమేంటని అడిగితే.. పనిలో కమిట్‌మెంట్ ఉండాలి.. స్కిల్స్ ఉండాలి. సక్సెస్ ఆటోమేటిగ్గా వస్తుందన్నాను. రెండో రోజే రూ.20 వేల జీతంతో ఓ జాబ్ ఆఫర్ వచ్చింది. తర్వాత ఆర్జేగా చాన్స్ వచ్చింది. సుమ, ఝాన్సీ నాకు స్ఫూర్తి. యాంకరింగ్‌లో నిలబడగలిగానంటే నా జీల్‌తో పాటు పేరెంట్స్ సపోర్ట్ చేశారు.
 
 హైదరాబాద్ అద్దం లాంటిది
 ‘గడసరి అత్త సొగసరి కోడలు’ షూటింగ్‌లో భాగంగా 150 ప్రదేశాలు తిరిగాను. విదేశాలకూ వెళ్లాను. ఎక్కడికి వెళ్లినా.. మళ్లీ హైదరాబాద్ చేరుకుంటేనే హాయిగా ఉంటుంది. నాకు జీవితమంటే ఏంటో నేర్పించింది ఈ నగరమే. హైదరాబాద్ అద్దం లాంటిది. మనం ఏమిస్తే తిరిగి అది మనకిస్తుంది. మనం ప్రేమిస్తే, ప్రేమించే వ్యక్తులు ఎదురవుతారు. కోపంగా ఉంటే అవతలి వ్యక్తి కూడా మనపై కోపం ప్రదర్శిస్తాడు.
 
 పూర్ణ టిఫిన్ సెంటర్...
 కృష్ణానగర్‌లోని పూర్ణ టిఫిన్ సెంటర్‌లో టిఫిన్ చాలా ఇష్టం. ఇప్పుడు తెప్పించుకోవడం కూడా అక్కడినుంచే. పానీపూరి ఎక్కడ కనిపించినా ఓ పట్టు పట్టేస్తాను. లేట్‌నైట్‌లో ఓల్డ్ సిటీ గోషామహల్‌లో బండి మీద దోశ తినడం ఇంకా ఇష్టం. ఓల్డ్ సిటీ ఎంత రద్దీగా ఉంటుందో అంతే లైవ్లీగా ఉంటుంది.
 - శిరీష చల్లపల్లి

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement