స్లమ్ జర్నలిస్ట్స్
అది ఓ మురికివాడ. 14 ఏళ్ల చాందిని అప్పుడే లేచి తయారవుతోంది. అంతలోనే పక్కింటమ్మాయి వచ్చి తన చెవిలో ఏదో చెప్పింది. లోకల్ ఫోన్ దగ్గరికి చేరుకున్న చాందిని పోలీసులకు ఫోన్ చేసింది. వెంటనే స్పందించిన పోలీసులు... వచ్చి ఆ మురికివాడలో జరుగుతున్న ఓ బాల్య వివాహాన్ని ఆపేశారు. అంత చిన్న అమ్మాయి చెబితే పోలీసులు ఎలా విన్నారు?అన్న సందేహం కలుగుతోంది కదా! ఆ అమ్మాయి ఢిల్లీలోని బాలక్‌నామా అనే పత్రిక రిపోర్టర్. మురికివాడల బాలలను మోటివేట్ చేసి ‘బాలక్‌నామా’ను నడిపిస్తున్నది చేతన అనే స్థానిక స్వచ్ఛంద సంస్థ. ఇలాంటి సీన్లు... ఇప్పుడు హైదరాబాద్‌లోని మురికివాడల్లోనూ నిత్యకృత్యం కానున్నాయి. సిటీ స్లమ్స్‌లోని పిల్లలు ఇప్పుడు బాధ్యతాయుతమైన జర్నలిస్టులుగా మారిపోయారు. వారికి తోడ్పాటునందిస్తోంది ‘దివ్యదిశ’ స్వచ్ఛంద సంస్థ.
..:: చీకోటి శ్రీనివాస్, సికింద్రాబాద్
‘మా బస్తీలో దోమల మందు కొట్టట్లేదు. దీనివల్ల బస్తీవాళ్లం మలేరియా, డెంగ్యూ బారిన పడుతున్నాం. డ్రైనేజీ మురుగు వాసనను భరించలేకున్నాం. వెంటనే సమస్యను పరిష్కరించండి!’ ‘ఎవరికైనా ఆపద వస్తే 108 వెహికిల్ రాలేనంత ఇరుకుగా మా వీధులున్నాయి. విస్తరించే మార్గం చూడండి..’ ‘మా బస్తీలో అంగన్‌వాడి కేంద్రం లేదు. గర్భిణులు, బాలింతలు, పిల్లలు అనారోగ్యం పాలవుతున్నారు. వెంటనే ఏర్పాటు చేయండి!’... ఇవన్నీ చూస్తే మీకేమనిపిస్తోంది. ఏ బస్తీవాసులో అధికారులకు ఇచ్చిన వినతిపత్రంలా ఉంది కదా! కానీ అవి విజ్ఞాపనలు కాదు... నగరంలోని మురికివాడల్లో బుల్లి జర్నలిస్టులు వేసిన గోడపత్రికలోని వార్తలు.
మా బస్తీ-మా పత్రిక
మురికివాడల్లోని పిల్లల కోసం బచ్‌పన్ క్లబ్‌లను ఏర్పాటు చేసి చైతన్యాన్ని నింపుతున్న ‘దివ్యదిశ’ స్వచ్ఛంద సంస్థ మరో సరికొత్త కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. నగరవ్యాప్తంగా ఉన్న మురికివాడల్లో తొమ్మిది, పదో తరగతి చదువుతున్న విద్యార్థులను సబ్‌ఎడిటర్లు, రిపోర్టర్లుగా ఎంపిక చేసింది. ఒక్కో స్లమ్ నుంచి పది మంది చొప్పున నగరంలోని అరవై మురికివాడల నుంచి ఎంపిక చేసి వారిని బాల విలేకరులుగా మార్చింది. జర్నలిజం, బాధ్యతలు, వార్తల సేకరణపై అవగాహన కల్పించింది. స్థానిక సమస్యలను ఎంచుకొని ఇబ్బందులను వివరిస్తూ వార్తలు రాయడమెలా అనే అంశంపై సీనియర్ జర్నలిస్టులతో అవగాహన తరగతులు నిర్వహించింది. బస్తీల్లోని సమస్యలు మౌలికమైనవి. ఏళ్ల తరబడి అవి పీడిస్తున్నాయి. పిల్లల ద్వారా వాటిని వెలికితీయించడం, సమస్య తీవ్రతను ప్రభుత్వ విభాగాల దృష్టికి తీసుకెళ్లడం ముఖ్య లక్ష్యంగా ‘మా బస్తీ-మా పత్రిక’ పత్రికకు రూపకల్పన చేశారు. ఈనెల 26న సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఈ పత్రికను ఆవిష్కరించనున్నారు.
మంచీచెడుల విచక్షణ...
స్థానిక సమస్యలతో పాటు బాలలకు పరిసరాల పరిశుభ్రత, పిల్లలకు సకాలంలో వేయాల్సిన టీకాలు, ఉన్నత విద్య చదివేందుకు మార్గాలు, సంపూర్ణ ఆరోగ్యంవంటి అనేక అంశాలతో ఈ గోడ పత్రికలు రూపుదిద్దుకుంటున్నాయి. పూర్తిగా సమస్యల గురించే ప్రస్తావించడం కాక, కలిసికట్టుగా ఉంటే బస్తీలను ఎలా బాగుపర్చుకోవచ్చు, జనరల్ నాలెడ్జ్ వంటి అంశాలనూ ఈ గోడ పత్రికల ద్వారా బస్తీవాసులకు తెలియజే స్తున్నారు పిల్లలు. అయితే ‘ఇలా పిల్లలతో పత్రిక నడిపించడం వల్ల.. వాళ్లకు సమస్యలు తెలిసిరావడంతోపాటు, మంచేదో చెడేదో తెలుసుకునే అవకాశం కూడా లభిస్తుంది. బాలల సంక్షేమం, అభ్యున్నతి, బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనే మా ధ్యేయం. బస్తీల్లో బచ్‌పన్ క్లబ్‌లను ఏర్పాటు చేశాం. క్లబ్ ప్రతినిధులనే బాల జర్నలిస్టులను చేసి మా బస్తీ-మా వార్త నినాదంతో బాలరక్ష పత్రికను వెలువరిస్తున్నాం’ అని చెబుతున్నాడు దివ్యదశ నిర్వాహకుడు ఐసిడర్ ఫిలిప్స్. అయితే బాలలకోసం బాల జర్నలిజం పాఠశాలను కూడా ఏర్పాటు చేసే ఆలోచనలో ఉందీ సంస్థ. పదో తరగతిలోపు విద్యార్థులు ఏటా వంద మందికి ఇందులో అడ్మిషన్ ఇవ్వనుంది.
చిన్నారులకు అవగాహన
తొలిదశలో 60 మురికివాడల నుంచి బస్తీకి పది మంది చొప్పున విద్యార్థుల్ని ఎంపిక చేశారు. వీరికి ఇటీవలే సమస్యల్ని ఎలా రిపోర్ట్ చేయాలనే అంశంపై శిక్షణనిచ్చారు. ఈ శిబిరంలో శిక్షణ పొందిన అల్లూరి సీతారామరాజునగర్‌కి చెందిన కె.జ్యోతి.. ‘ఓవైపు చదువుకుంటూనే మరోవైపు సమస్యలపై అవగాహన కలిగించుకొని, నేను నేర్చుకున్న మంచి విషయాలను మా బస్తీలో విద్యార్థులందరికి పంచుతా’నంటోంది. ‘మేం నివసిస్తున్న ప్రాంతంలోని సమస్యల్ని చుట్టుపక్కల వాళ్లకు అర్థమయ్యే తరహాలో కథనాలు రాస్తా’ అంటోంది గురుబ్రహ్మనగర్‌కు చెందిన జీ.గాయత్రి. బాల విలేకరిగా పనిచేయడంవల్ల సమాజంలోని అన్ని విషయాలను తెలుసుకోవడానికి వీలవుతుందని, బస్తీ సంక్షేమం కోసం తామంతా పాటుపడతామని ఇక్కడ శిక్షణ పొందిన చిన్నారులు చెబుతున్నారు. బస్తీలు బాగుపడాలని, చిన్నారుల కలలు సాకారం కావాలని ఆశిద్దాం!