
క్షమించకు బాపు..
అక్టోబర్ 2 నాడే..
అమర్ రహే గాంధీ !
‘ముష్టెత్తే జాతిపితలు’
ఏ ప్రగతికి నాంది ?
ముక్కుపచ్చలారనోళ్లు...
‘సిల్వర్’ గాంధీలా..!
పేదరికపు పంజరాన..
చిక్కిన బందీలా !
పచ్చ నోట్ల మీద చిందు..
గాంధీ చిరునవ్వు
బిచ్చమెత్తు బాల్యానికి
చెవ్వులోన పువ్వు !
అహింసతో స్వాతంత్రం
తెచ్చిన ఓ బాపు...
నీ రూపంతో సాగే
వ్యాపారాన్నాపు.
గాంధీ బొమ్మలు పెట్టాం..
గాంధీ గుడి కట్టాం..
అడుక్కునే వాణ్ని చేసి
నడివీధికి నెట్టాం !
ఈశ్వర, అల్లా అంటే
నిజమే అనుకున్నాం.
పైసాయే పరమాత్మని
ఇపుడు తెలుసుకున్నాం.
- తనికెళ్ల భరణి