
శ్రీధర్ బాబు శాఖ మార్పుపై రగడ
రాష్ట్ర శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబుకు స్థానచలనం కల్పించడంపై తెలంగాణ ప్రాంతానికి చెందిన ఇతర మంత్రులు సీఎం కిరణ్పై ఆగ్రహంతో ఊగిపోతున్నారు. రేపు తమ పరిస్థితి ఎంటో అన్న సందిగ్థత వారిని పట్టి పీడిస్తుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన మంత్రులంతా బుధవారం సాయంత్రం హైదరాబాద్లో భేటీ కానున్నారు. తమ ప్రాంతానికి చెందిన మంత్రులపై మొండివైఖరిని అవలంభిస్తున్నారని ఇప్పటికే కొందరు తెలంగాణ మంత్రులు సీఎం కిరణ్ కుమార్ రెడ్డిపై గుర్రుగా ఉన్నారు. శ్రీధర్ బాబుకు శాసన సభ వ్యవహారాలను తప్పించి, వాణిజ్య పన్నులు కేటాయించడం వారి ఆగ్రహన్ని మరింత పెంచింది.
తెలంగాణ బిల్లు అసెంబ్లీకి వచ్చిన నేపథ్యంలో ఇలాంటి చర్యలకు శ్రీకారం చుట్టడం భావ్యం కాదని వారు ఆరోపిస్తున్నారు. సీఎం కిరణ్ వ్యవహార శైలిపై గవర్నర్కు ఫిర్యాదు చేసేందుకు తెలంగాణ మంత్రులు సమాయత్తమయ్యారు. అందులోభాగంగా మరికాసేపట్లో వారు గవర్నర్ నర్సింహన్తో భేటీ కానున్నారు. తెలంగాణ బిల్లు అసెంబ్లీకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ ప్రాంతానికి చెందిన, తెలంగాణకు అనుకూలమైన శాసన సభ వ్యవహరాల శాఖ మంత్రి డి.శ్రీధర్ బాబు తనదైన శైలీలో దూసుకెళ్తున్నారు.
కొంతకాలంగా శ్రీధర్ బాబు అనుసరిస్తున్న శైలీ పట్ల కిరణ్ ఒకింత అసహనం వ్యక్తం చేస్తున్నారు. దాంతో శాసనసభ వ్యవహారాల శాఖను ఎస్.శైలజానాథ్కు బదిలీ చేశారు. అలాగే వాణిజ్య పన్నుల శాఖను శ్రీధర్ బాబుకు అప్పగించారు. అయితే వాణిజ్య శాఖను తీసుకునేందుకు తాను సిద్ధంగా లేనని శ్రీధర్ బాబు వెల్లడించిన సంగతి తెలిసిందే.