తెలంగాణ ఏర్పాటు దేశభద్రతకి ముప్పు?
రాష్ట్ర విభజన ప్రక్రియపై ఈ రోజు (మంగళవారం) నివేదిక అందించనున్న కేంద్ర హోం శాఖ టాస్క్ ఫోర్స్ బృందం ప్రత్యేక తెలంగాణా ఏర్పడితే దేశ భద్రతకి కూడా ముప్పు వాటిల్లవచ్చనే హెచ్చరిక చేయనుందని విశ్వసనీయంగా తెలిసింది.
రాష్ట్ర విభజన ప్రక్రియ సందర్భంగా తలెత్తే పలు అంశాల మీద కేంద్ర హోం శాఖ టాస్క్ ఫోర్స్ బృందం ఇటీవల హైదరాబాదులో మూడ్రోజుల పాటు పలు సమీక్షా సమావేశాలు జరిపిన విషయం తెలిసిందే.. హోం శాఖ సీనియర్ భద్రతా సలహాదారు, రిటర్డ్ ఐపీఎస్ అధికారి విజయ్ కుమార్ సారథిగా ఉన్న 9 మంది సభ్యుల బృందంలో ఒక్క ఐఏఎస్ తప్ప అందరూ ఐపీఎస్ ఆఫీసర్లే కావడం వల్ల ఆ బృందం ప్రత్యేక తెలంగాణా వల్ల తలెత్తే సమస్యల్లో భద్రతా అంశాలమీద ఎక్కువ దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది (ఆ ఒక్క ఐ ఎ ఎస్, రాజీవ్ శర్మ కూడా నక్సలైట్ మేనేజ్‌మెంట్ - అదనపు కార్యదర్శిగా రక్షణ బాధ్యతలే నిర్వహిస్త్తున్నారు.). రాష్ట్రాన్ని విభజించి తెలంగాణ ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నందు వల్ల, ఈ టాస్క్ ఫోర్స్ కి బలగాల పంపకాలు, వ్యవస్థ బలోపేతంపై రాష్ట్ర ఉన్నతాధికారుల నుంచి అందిన నివేదికలు, వాటిపై విజయ్ కుమార్ బృందం చేస్తున్న కసరత్తూ కేవలం లాంఛనప్రాయమే.
అయితే, విభజనకి అనుకూలంగా తమ అడుగులు వేయక తప్పని టాస్క్‌ఫోర్సు బృందం తమ బాధ్యతగా దేశ భత్రతకి సంబంధించిన కీలకాంశంపై కేంద్రాన్ని అప్రమత్తం చేయాలని భావించినట్టు తెలిసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం, టాస్క్‌ఫోర్సు నివేదికలో దేశభద్రతపై పొందుపరిచిన వివరాలు ఇలా ఉన్నాయి.
హైదరాబాదు రక్షణ శాఖకి చెందిన ఎన్నో పరిశోధనా సంస్థలకి ముఖ్య కేంద్రం. డిఆర్‌డిఓతో పాటు, ఇన్‌స్టిట్యూట్ ఆప్ కెమికల్ టెక్నాలజీ, సెంటర్ ఆఫ్ ఆటమిక్ మినరల్స్ డైరెక్టొరేట్ ఫర్ ఎక్స్‌ప్లొరేషన్ అండ్ రీసెర్చి, భారత్ డైనమిక్స్ లిమిటెడ్, సెంటర్ ఆఫ్ సెల్లులర్ అండ్ మాలిక్యులర్ బయోలజీ, నేషనల్ జియో ఫిజికల్ రీసెర్చి ఇనిస్టిట్యూట్, ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, సెంటర్ ఆఫ్ ప్లాంట్ మాలెక్యూలర్ బయోలజీ, నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజన్సీ ఇండియాస్ సేటలైట్ మానిటరింగ్ సిస్టమ్స్, ది అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లాబొరేటరీ, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ లాబొరేటరీ, డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ రీసెర్చ్ లాబొరేటరీ, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ వంటి ఎన్నో ముఖ్యమైన సమ్షలకి హైదరాబాదు కేంద్రం.
భారీగా పెరిగిన రక్షణవ్యయంలో ఒక్క డిఆర్‌డిఓకే రూ 10,635.56 కోట్లు కేటాయించడం ద్వారా దేశ రక్షణ విషయంలో డిఆర్‌డిఓ పోషిస్తున్న పాత్ర ఎంత కీలకమో తెలుస్తుంది. మరీ ముఖ్యంగా, డిఆర్‌డిఓకి అనుబంధంగా ఉన్న రీసెర్చ్ సెంటర్ ఇమ్‌రాట్(ఐ.ఎం.ఎ.ఆర్.ఎ.టి.). లాంగ్ రేంజ్ అగ్ని 5 క్షిపణ రూపకల్పనలో హైదరాబాద్ కీలక పాత్ర పోషించింది. అగ్ని 5 క్షిపణకి సంబంధించిన చాలా విడిభాగాల రూపకల్పన, తయారీ హైదరాబాదులోనే జరిగింది.
హైదరాబాద్‌లోని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థకు చెందిన పలు లాబొరేటరీలు ఇందులో పాలు పంచుకున్నాయి. ఈ కార్యక్రమాలకి రీసెర్చ్ సెంటర్ ఇమ్‌రాట్ కేంద్రం. భారత దేశ అధునాతన క్షిపణి పరిశోధనలకి రీసెర్చ్ సెంటర్ ఇమ్‌రాట్ ఎంతో ముఖ్యమైన పాత్ర నిర్వహిస్తోంది. షంషాబాదు మండలం, విజ్ఞాన కంచ లో 2000 ఎకరాల సువిశాల ప్రదేశంలో ఉన్న రీసెర్చ్ సెంటర్ ఇమ్‌రాట్ ప్రఖ్యాత న్యూక్లియర్ శాస్త్రవేత్తలు హోమీబాబా, అయ్య గారి సాంబశివ రావు (ఎ ఎస్ రావు - ఇ సి ఐ ఎల్ సృష్టికర్త)ల పరిశోధనల ఫలంగా అబ్దుల్ కలాం స్థాపించారు.
నక్సల్స్ గుప్పెట్లోకి రక్షణ సంస్థలు?
ప్రత్యేక తెలంగాణాలో మళ్లీ బలపడవచ్చునంటూ నిషేధిత సిపిఎం (మావోయిస్టు) తన నాల్గవ సెంట్రల్ కమిటీ సమావేశంలో చేసుకున్న తీర్మానాల కాపీలు ఇటీవల పోలీసు బలగాలకి దొరికాయి. కాబట్టి , తెలంగాణాలోని 10 జిల్లాలలో 8 జిల్లాలు నక్సల్ ప్రభావిత ప్రాంతాలు కావడం వల్ల, నక్సల్స్ తెలంగాణా రాష్ట్రంలో తిరిగి పట్టు సాధించడమే కాకుండా, హైదరాబాదుని కూడా తమ ప్రాబల్యంలోకి తీసుకునే అవకాశం ఎంతైనా ఉందని టాస్క్‌ఫోర్సు తన నివేదికలో హెచ్చరించినట్టు తెలిసింది. అత్యంత కీలకమైన రక్షణ వ్యవస్థ నక్సల్స్ గుప్పెట్లోకి వెళ్లిపోతే, నేపాల్‌లో ‘నక్సల్ ప్రచండ ఫార్ములా’ ఇక్కడా రిపీటై, చైనా ప్రాబల్యం పెచ్చరిల్లి, దేశ భద్రతకే పెను ముప్పు దాపరిస్తుందని ఆ నివేదికలో విజయ్ కుమార్ బృందం కరాఖండిగా తేల్చి చెప్పినట్టు తెలిసింది.
అయితే, కేవలం ఓట్ల రాజకీయంతో తెలంగాణ ఏర్పాటు చేయాలని కంకణం కట్టుకున్న కాంగ్రెస్స్ ఈ హెచ్చరికల్ని పెడచెవిన ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు.