
ఎంవీఎస్ నాగిరెడ్డి
రాష్ట్ర విభజన జరిగిపోయింది. దేశ చరిత్రలోనే అత్యంత అభివృద్ధి చెందిన రాజధాని ఉన్న ప్రాంతాన్ని కొత్త రాష్ట్రంగా ఏర్పాటు చేశారు.
సందర్భం
రాష్ట్ర విభజన జరిగిపోయింది. దేశ చరిత్రలోనే అత్యంత అభివృద్ధి చెందిన రాజధాని ఉన్న ప్రాంతాన్ని కొత్త రాష్ట్రం గా ఏర్పాటు చేశారు. నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నూతన రాజధాని ఏర్పాటు చేసుకోవడం తప్పనిసరి. ఈ విషయంలో రాజకీయాలకు తావులే కుండా అన్ని వర్గాల ప్రజల సహకారం అవసరం. రాజ ధాని నిర్మాణం చంద్రబాబు వాస్తు కోసం కొత్త ఇంటిని నిర్మించుకోజూస్తున్న అంశం కాదు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అంశం అంతకంటే కాదు. ఈ అంశంపై అన్ని వర్గాల ప్రజలు, ప్రజా సంఘాలు, రైతు సంఘాలు అన్ని రాజకీయ పార్టీల ఉమ్మడి చర్చలు చాలా అవసరం. రాజధాని నిర్మాణానికి సలహా కోసం కేంద్రం నియమిం చిన శివరామకృష్ణన్ కమిటీ తన నివేదిక ఇవ్వకముందే చంద్రబాబు నాయుడు రాజధాని గుంటూరు - విజయ వాడల మధ్య ఉంటుందని ప్రకటించారు. తరువాత కేబి నెట్, కొంత మంది మంత్రులు రాజధాని కృష్ణా జిల్లాలో ఉంటుందని, ప్రత్యేకంగా నూజివీడు ప్రాంతంలోని ప్రభు త్వ భూమిలో ఉంటుందని రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెరతీశారు.
శివరామకృష్ణన్ కమిటీ నివేదికను ఏ మాత్రం పరిగ ణలోకి తీసుకోకుండా ప్రధాన ప్రతిపక్షాన్ని, ఏ ఒక్క రాజకీ య పార్టీని సంప్రదించకుండా, ‘ప్రపంచానికి పాఠాలు చెప్పిన వ్యక్తిని నేను... నాకు ఎవ్వరి సలహాలు అవసరం లేదు. రాజధానిని విజయవాడ పరిసర ప్రాంతాల్లో నిర్మి స్తామ’ని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించి కృష్ణా జిల్లాలో మరొ కసారి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తోడ్పాటునందించా రు. చట్ట సభలో ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్ కాంగ్రెస్ పారీ,్ట ముఖ్యమంత్రి అప్రజాస్వామిక విధానాన్ని నిరసిం చినదే తప్ప రాజధాని నిర్మాణానికి తమ పూర్తి సమ్మతిని ప్రకటించింది. ‘పంట భూముల్లో రాజధాని నిర్మాణం సరి కాదు, ప్రభుత్వ భూమిలో కేంద్ర ప్రభుత్వం విభజన చట్టంలో కల్పించిన వెసులుబాటుతో, లక్ష ఎక రాల వరకు అటవీ భూమిని ఢీ నోటిఫై చేసుకుని రాష్ట్ర రాజధాని, రాష్ట్రాభివృద్ధికి కావాల్సిన విద్యా సంస్థలు, పరి శోధనా సంస్థలు, పరిశ్రమలకు వాడుకోమ’ని శివరామ కృష్ణన్ కమిటీ నివేదిక చేసిన సూచనను పెడచెవిన పెట్టి రైతుల భూములలో రాజధానిని ప్రకటించారు.
30 వేల ఎకరాల్లో భూసేకరణ చేస్తాం. రైతుకు ఎకరా నికి 1000 గజాలు ఇస్తాం. అభివృద్ధి చేసిన తరువాత ఆ స్థలం.. గజం రూ.25వేల నుంచి 40 వేల వరకు అమ్ము తుంది. అప్పటి వరకు రైతుకు ఒక ఎకరాకు ఏడాదికి రూ.25 వేలు చెల్లిస్తాం, వ్యవసాయ కార్మికులకు సాంకేతిక పరిజ్ఞానం పెంచి మట్టి పిసుక్కునేవారిని ఏసీ గదుల్లో కూర్చోపెడతామని ఏ మాత్రం సహేతుకత లేని ప్రకటన లు చేశారు. పైగా 99 శాతం మంది రైతులు రాజధానికి భూమి ఇవ్వడానికి ఉవ్విళ్లూరుతున్నారని, ఒక వేళ రైతులు భూ సమీకరణకు ఒప్పుకోకపోతే తప్పనిసరిగా భూ సేకర ణ చేపడతామని ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడింది.
దీని వలన భయబ్రాంతులకు గురైన కొంత మంది సన్న, చిన్నకారు రైతులు తమ భూమిని విక్రయిం చేస్తున్నారు. గత నెలలో దేశంలోనే ఏ ప్రాంతంలోనూ జరగని విధంగా 3వేల ఎకరాలకుపైగా భూమిని రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అమ్ముకున్న పరిస్థితి చూస్తుంటే రైతులు ఎంత మానసిక సంఘర్షణకు గురవుతున్నారో అర్థమవుతుంది. ఉన్న భూమిని ప్రభుత్వానికి ఇస్తాం అనే వ్యక్తులను ఎవ్వరూ అడ్డగించలేరు. అలానే తుళ్లూరు మండలంలో రాజధాని నిర్మాణాన్ని ప్రజలు గాని, రాజకీ య పార్టీలుగాని వ్యతిరేకించడంలేదు. శతాబ్దాలుగా భూమినే నమ్ముకుని బతుకుతున్నాం, భూమిని అమ్ముకు ని కాదు, మా శవాలపై రాజధాని నిర్మిస్తారా... అని ప్రశ్ని స్తూ మా భూమిని మేము ఇవ్వం అనేవారికి ఆ హక్కు ఉన్నది. అలానే ఆ ప్రాంత పేదలకు మా పునరావాసం ఏమిటని ప్రశ్నించే హక్కు కూడా ఉన్నది. ఇలా ప్రశ్నిస్తున్న వ్యక్తులను... అలానే వారి హక్కుల పరిరక్షణకు అండగా నిలుస్తున్న ప్రజా సంఘాలు, రైతు సంఘాలు, రాజకీయ పార్టీలను రాజధాని నిర్మాణానికి వ్యతిరేకులని ప్రచారం చేయడం దిగజారుడు తనానికి నిదర్శనం. 13 జిల్లాల ప్రజలకు సంబంధించిన రాజధానికోసం 29 గ్రామాల రైతులు భూములను ఎందుకు ఇవ్వరని అధిక జీతాలు పొందుతున్న ప్రభుత్వ ఉద్యోగులు, లక్షలాది రూపాయల ఆదాయం వచ్చే వ్యాపారస్తులు మాట్లాడుతున్నారు. కానీ, రాజధాని నిర్మాణం పూర్తయ్యేవరకు తమ ఆదాయంలో 50 శాతాన్ని రాజధాని నిర్మాణానికి అందించి వాళ్ల చిత్త శుద్ధిని ప్రకటించవచ్చుకదా!
ప్రభుత్వం ఇస్తానని చెబుతున్న వెయ్యి గజాల భూమి, రూ.25 వేల నగదుకు ఒప్పుకుని భూమిని ఇస్తా మని రైతులు అంటే సంతోషం, ఎవరైనా 500 గజాలకే తమ భూమి ఇస్తామంటే మరింత సంతోషం. రాజధాని కోసం భూమిని ఇస్తామనే రైతులను ఎవరూ వ్యతిరేకిం చడం లేదు. కానీ ప్రభుత్వ ప్రతిపాదనకు చట్టబద్ధత కల్పించకుంటే భూమిని ఇవ్వలేమంటూ వ్యతిరేకిస్తున్న రైతులను భయభ్రాంతులకు గురిచేయడం, కౌలుదారుల, వ్యవసాయ కార్మికుల, కులవృత్తుల వారి ఆర్థిక అంశాన్ని తేల్చకుండా నడుస్తున్న అప్రజాస్వామిక విధానాన్నే ప్రజా సంఘాలు, రైతు సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. పేద వర్గా లకు అండగా నిలవడానికి తుళ్లూరులో జరుగుతున్న వామపక్ష ఐక్య కూటమి సదస్సుపై దాడి తలపెట్టే ఆలోచ నే అమానుషం. రైతుల భూమిలో సింగపూర్ తరహాలో ఆకాశ హర్మ్యాలు నిర్మిస్తే సుమారుగా 40 నుంచి 50 లక్షల మంది ప్రజలు రాజధానిలోకి నివాసానికి వెళ్తేనే అక్కడ రైతులకు ఇచ్చే భూమికి ధర వస్తుంది. కానీ ఇన్ని లక్షల మంది జనం ఎక్కడినుండి వస్తారు? గత పదేళ్లుగా విజయవాడ, విశాఖపట్టణాల్లో ఎన్ని లక్షల జనాభా పెరి గింది? తాము ఒక్క రూపాయి ఖర్చుపెట్టకుండా రైతుల భూమితో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలనుకును కుంటున్న ప్రభుత్వ విధానాన్ని పూర్తిగా ఖండిస్తున్నాం.
రాజధాని నిర్మాణానికి భూమి ఇస్తామనే వ్యక్తులకు మాటమీద విశ్వసనీయత లేని నేటి ప్రభుత్వం నుంచి రక్షణ కావాలంటే తప్పనిసరిగా ప్రజా సంఘాల, రాజకీయ పార్టీల అండ చాలా అవసరం. ఎందుకంటే వ్యవసాయ రుణాల మాఫీ, డ్వాక్రా రుణాల మాఫీ, చేనేత రుణాల మాఫీ విషయంలో ఏమి జరిగిందో అందరికీ తెలుసు. దేశానికి తిండి పెడుతూ, భూమిని భూమాతగా భావిస్తూ, భూమికి పూజ చేసే రైతును కన్నీరు కార్చేలా చేయడం రాష్ట్రానికి మంచిది కాదు. కౌలు రైతుల, వ్యవసాయ కార్మికుల, చేతి వృత్తుల వారికి ఇవ్వనున్న ప్యాకేజీలు ప్రకటించి తర్వాత ప్రజాభిప్రాయాన్ని సేకరించండి. మెజారిటీ ప్రజల అభిప్రాయం ఎలా ఉంటే అలా నడవండి. బెదిరింపులతో రైతుల భూమిని లాక్కోవాలనే విధానానికి స్వస్థి పలకండి. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంలో పారదర్శకతతో రాజధానిని నిర్మించండి.
(వ్యాసకర్త వైఎస్సార్‌సీపీ రైతు విభాగం అధ్యక్షులు)