ఆ సహానుభూతికి బాధితుల గోడు పట్టదేం? | victims in salman 'hit and run' case | Sakshi
Sakshi News home page

ఆ సహానుభూతికి బాధితుల గోడు పట్టదేం?

Published Mon, May 11 2015 1:32 AM | Last Updated on Sat, Apr 6 2019 8:55 PM

మహేష్ విజాపుర్కార్ - Sakshi

మహేష్ విజాపుర్కార్

 సందర్భం
  తమ అభిప్రాయాలను పంచుకోవడానికి వేదికలు అందుబాటులో ఉన్న వ్యక్తులు చాలా మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు. అలాంటి వారిలో అభిజిత్ ఒకరు. ఈ బాలీవుడ్ గాయకుడి ట్వీట్ ప్రకారం వీధుల్లో కుక్కల్లా నిద్రపోయేవారు కుక్కల్లాగే చస్తారట. నూరుల్లా షరీఫ్ కేసులో కారు స్పీడ్, ఆల్కహాల్ అనేవి చావుకు ఏమాత్రం కారణాలు కాదన్నమాట.
 
 నూరుల్లా షరీఫ్, రవీంద్ర పాటిల్, ముస్లిం షేక్ గురించి బహుశా ఇప్పుడెవరికీ అంతగా తెలిసి ఉండకపోవచ్చు. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్‌కు కోర్టు ఐదేళ్ల శిక్ష విధిం చడానికే ఈ ముగ్గురే కారకు లు. వీరిలో షరీఫ్... సల్మాన్ కారు గుద్దిన ఘటనలో మరణించాడు. పాటిల్ ఈ ఘటనపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన పోలీసు బాడీగార్డు. ఇతడిని కోర్టు సహజ, నిష్పాక్షిక సాక్షిగా పేర్కొన్నది. ఇక ముస్లిం షేక్ ఆ ఘటనలో తీవ్రంగా గాయపడగా శస్త్ర చికిత్స చేసి శరీరంలో స్టీల్ రాడ్ అమర్చారు. అయితే ఆ కేసులో పతాక శీర్షిక వార్త సల్మాన్‌ఖాన్ మాత్రమే. ఆ ఘటన అనంతరం పాటిల్ ఒత్తిళ్లనుంచి తప్పించుకోవ డానికి బహిరంగ జీవితం నుంచి కనుమరుగయ్యాడు.  అతడిని సర్వీసు నుంచి తొలగించారు కూడా. ఆ తరువాత ముంబైలో ఒక వీధిలో పడిపోయి, ఆసుపత్రి లో చనిపోయాడు. ఇక షేక్ యూపీలోని తన ఊరిలో కటిక దారిద్య్రంలో బతుకుతున్నాడు. సల్మాన్ ‘హిట్ అండ్ రన్’ కేసులో సెలబ్రిటీ ఫ్యాక్టర్ బాధితులను కనిపించకుండా చేసేసింది.

 మన సమాజం ఎంతగా చీలిపోయి ఉందనే విష యాన్ని ఈ ఉదంతం స్పష్టం చేస్తోంది. ప్రత్యేకించి ఇలాంటి అన్ని ఘటనల్లోనూ ఇతర అంశాల కంటే సెలబ్రిటీ ఫ్యాక్టర్‌నే మీడియా బలంగా ముందుకు తీసుకువస్తున్నది. ఆ వేదికలు అందుబాటులో ఉన్న వ్యక్తులు చాలా మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు. అలాంటి వారిలో బాలీవుడ్ గాయకుడు అభిజిత్ ఒకరు. వీధుల్లో కుక్కల్లా నిద్రపోయేవారు కుక్కల్లాగే చస్తారని సెలవిచ్చాడు. ఆ కేసులో కారు వేగం, మద్యం చావుకు ఏమాత్రం కారణాలు కాదన్నమాట.

 ఎందరో తీవ్రంగా దుయ్యబట్టినా అభిజిత్ తన వ్యాఖ్యలకు కట్టుబడటమే కాక టీవీ చానల్స్‌లో సమర్థించుకున్నాడు. పైగా అతడు కూడా మొదట్లో ముంబైకి వచ్చినప్పుడు సంవత్సరం పాటు వీధుల్లోనే గడిపాడట! వీధుల్లో నివసించడానికి అవి పేదవారి ఆస్తి కాదని అతగాడు ఇప్పుడంటున్నాడు. ఇలాంటి ఘటనల్లో చనిపోయినవారు, గాయపడినవారు వారి మూర్ఖత్వపు బాధితులని ఆయన వివరణ.

  చిన్న, పెద్ద తేడా లేకుండా మన ప్రతి నగరం లోనూ నిరాశ్రయులున్నారు. ఎండ, వాన, ఎముకలు కొరికే చలిలో బతికే దుర్భర జీవితాలకు మన నగరాలు ప్రత్యక్ష సాక్ష్యాలు. ఇలాంటి దుస్థితి నుంచి తప్పించు కోవడానికి అందరూ అభిజిత్ వంటి అదృష్టవంతులు కారు. ఇలాంటి వారి గురించి సమాజం అరుదుగా మాత్రమే పట్టించుకుంటుంది. ఎందుకంటే వారు మను షుల లెక్కలోకి రారు. కొందరు ప్రముఖులు వీధివాసు లకు ఓటుహక్కు రద్దు చేయించాలని ప్రయత్నించారు. అదృష్టవశాత్తూ, విజ్ఞతాయుతమైన వాదనకు కట్టుబడి చాలామంది వెనక్కు తగ్గారు. కానీ ఒకే ఒక న్యాయవాది మాత్రం ఈ సమస్యపై ఇప్పటికీ పోరాడుతూనే ఉన్నా డు. బాలీవుడ్ పేదలపై చాలానే సినిమాలు నిర్మించింది. కేఏ అబ్బాస్, రాజ్‌కపూర్ తీసిన ‘శ్రీ 420’, ‘ఆవారా’ సినిమాలు పేదలు, నిరాశ్రయుల జీవితాలకు సంబం ధించినవి. కానీ ఇదే పరిశ్రమ మురికివాడల్లోని జీవితాల గురించి, సమాజంలోని అధోజగత్ సహోదరులు ఉనికి కోసం పోరాడుతుండటం గురించి ‘స్లమ్‌డాగ్ మిలియనీర్స్’ సినిమాలో చూపించినప్పుడు దాన్ని ఏమంత పెద్దగా పట్టించుకోలేదు. అభిజిత్ ఉదంతంపై ఇతరులు మౌనం పాటించారు కానీ, రిషికపూర్ మాత్రం తనకు అవకాశం ఉంటే అభిజిత్‌పై విమర్శలను తటస్థం చేయడానికి ప్రయత్నించే వాడినని చెప్పారు.

 వ్యక్తిగత సంక్షోభంలో కూరుకునిపోయిన స్నేహితు డిని అతడి మిత్రులు గాలికి వదలేయాలని ఎవరూ భావించరు. సల్మాన్ ఖాన్ పట్ల వ్యవస్థ నిర్దయగా ఉంద నే అర్థం వచ్చేలా ట్వీటర్‌ను ఉపయోగించడం కాకుండా సంఘీభావ వ్యక్తీకరణ అనేది ప్రైవేట్‌గానే ఉండాలి. డ్రైవింగ్ లెసైన్స్ లేకున్నప్పటికీ ఆల్కహాల్ సేవించి మరీ కారు డ్రైవ్ చేసిన సల్మాన్ అనేక అబద్ధాలాడి తన్ను తా ను సమర్థించుకున్నట్లు న్యాయమూర్తి నిర్ధారించారు. ఈ వ్యవహారంలో రాజకీయవాదులు కూడా జోక్యం చేసు కున్నారు. రాజ్‌థాకరే సైతం సల్మాన్‌ను సందర్శించారు. ఒక మాజీ ఎమ్మెల్యే అయితే సల్మాన్‌పై తీర్పు అనంతరం అతడికి దారి కల్పించే ప్రయత్నం చేశాడు కూడా.

 అయితే ఈ యోగ్యతలేవీ బాధితుల గురించి ఏమీ చెప్పడం లేదు. ఎవరైనా వారి ప్రస్తావన చేశారు అను కుంటే బాధితుల ఉనికి పట్ల వారు ఫిర్యాదు చేసేవారే. గూడు లేకపోవడం అనే సమస్యను ఎలా చర్చించాలి అనే చర్చను వారు ప్రారంభించటం కాదిది. శరవేగంగా నగరీకరణ, రియల్ ఎస్టేట్ ధరల పెరుగుదల తీవ్ర స్థాయికి చేరుతున్న సందర్భంలో దీన్ని పరిష్కరించ డంలో దేశం ముందు ఎలాంటి మార్గమూ కనిపించటం లేదు. అభిజిత్ కూనిరాగాలు పెడుతున్నాడు. మరో వైపున సల్మాన్ ఖాన్ అభిమానులు అతడున్న భవంతి ముందు వరదలాగా గుమిగూడుతుంటారు. మరి పేదలవల్ల, దరిద్రుల వల్ల దేశానికి ఎంత ఇబ్బందో చూడండి మరి!
     (వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు
 ఈమెయిల్: mvijapurkar@gmail.com)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement