పేరు మార్చితే పిలుపు మారునా? | usage name never forgets even after changing the name | Sakshi
Sakshi News home page

పేరు మార్చితే పిలుపు మారునా?

Published Tue, Jan 12 2016 12:43 AM | Last Updated on Tue, Oct 16 2018 8:42 PM

పేరు మార్చితే పిలుపు మారునా? - Sakshi

పేరు మార్చితే పిలుపు మారునా?

విశ్లేషణ:
స్థలాల పేర్లు మార్చినంత మాత్రాన ప్రజలు వాటిని వాడుకగా ఎలా పిలుస్తుంటారో ఆ పేర్లు మారవు. ముంబైలోని మహాత్మాగాంధీ రోడ్డులోని ఒక భాగం పేరు సాధారణ వాడుకలో ఎప్పటికీ ‘మెరైన్ లైన్స్’ గానే ఉంటుంది. అలాగే సుభాష్ చంద్రబోస్ రోడ్డును ‘మెరైన్ డ్రైవ్’ అనే అంటారు. హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్ సరస్సు  పొడవునా ఉన్న కట్ట ట్యాంక్‌బండ్‌గానే ఉంటుంది.  
 
 భారత రైల్వే సర్వీసులు ప్రారంభమైన  స్టేషన్‌గా ఘనత వహించిన విక్టోరియా టెర్మినస్ (ముంబై) పేరును అప్పుడే ఛత్రిపతి శివాజీ టెర్మినస్‌గా మార్చేశారు. దానికి పొట్టి పేరైన ‘వీటీ’ స్థానంలో ‘సీఎస్‌టీ’ జనం వాడుకలోకి వచ్చేసింది. ఆ తర్వాత, అంతవరకు కేవలం ముంబై ఎయిర్‌పోర్ట్‌గానే ఉన్న డొమెస్టిక్ విమానాశ్రయానికి కూడా ఆ మహారాష్ట్ర యోధుని పేరు పెట్టారు.
 ఒక రోజున, నేను యూరప్ నుంచి ముంబైకి తిరిగి వస్తుండగా, విమానం ముంబైలో దిగుతున్నప్పుడు ఎప్పుడూ వినిపించే ప్రకటన కాస్తా ‘‘మనం త్వరలోనే ఛత్రపతి శివాజీ ఎయిర్‌పోర్ట్‌లో దిగబోతున్నాం’’ అని వచ్చింది. విమానంలో రాత్రి తాగిన వోడ్కా అయోమయానికి తెల్లారే ముందటి నిద్ర మబ్బుతోడై...  విమానం రైల్వే స్టేషన్‌లో దిగడమా? అని ఆశ్చర్యపోయాను. ఆ పేరు మార్పు ఎప్పుడో ఒకప్పుడు జరుగుతుందని నాకు తెలిసినా, మార్చిన విషయాన్ని యూరప్‌లోని పేపర్లు తెలుపలేదు.
 అయితే సంతోషకరమైన విషయం ఏమిటంటే, కనీసం మహారాష్ట్రలోనైనా ఇక ముందు అలాంటి గందరగోళం తలెత్తే అవకాశం తక్కువ. మహారాష్ట్ర ప్రభుత్వం ఇక మీదట ఏ రెండు స్మారక స్థలాలకు ఒకే పేరు పెట్టకూడదని నిర్ణయించింది. మున్నాభాయ్ కనిపెట్టినట్టు మహాత్మాగాంధీ పేరిట చాలానే స్మారక చిహ్నాలున్నాయి. కానీ నిజాయితీ, ధైర్యం అనే ఆయన సూత్రాలను ఒంటబట్టించుకున్నవాళ్లు మాత్రం లేరు. ఆ కారణంగానే దేశం నైతిక విలువల విషయంలో దిగజారిపోయింది.

 అదేసమయంలో, కేంద్ర పౌర విమానయాన శాఖ.... ఇకపై అన్ని విమానాశ్రయాలకు అవి ఏ  నగరాలు, పట్టణాలకు సేవలనందిస్తుంటే ఆ పేర్లతోనే గుర్తించాలనే ప్రతిపాదనను ముందుకు తెచ్చింది. ఆ కొలబద్ధతో చూస్తే హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ ఎయిర్‌పోర్ట్, హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ కావాలి. బేగంపేటలో ఉన్న చిన్న విమానాశ్రయం, ఎన్‌టీ రామారావు ఎయిర్‌పోర్ట్ కావడానికి ముందు ఆ పేరుతోనే ఉండేది. వాస్తవానికి, శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు ఎన్‌టీఆర్ పేరుపెట్టాలంటూ తలెత్తిన వివాదం గురించి అందరికీ తెలిసిందే.

 మన రైల్వే స్టేషన్లకు అవి ఉన్న స్థలాల పేర్లనే పెట్టాలి అనేది కేంద్ర ప్రభుత్వ తాజా ప్రతిపాదన వెనుకనున్న వాదన. ప్రయాణికులకు, ప్రత్యేకించి మొదటిసారి ప్రయాణికులకు ఎక్కడ దిగాలో తెలిపే అద్భుతమైన, సరళమైన పద్ధతి అదే. కానీ నిజానికి అన్ని స్టేషన్లకు అలా అవి ఉన్న స్థలాల పేర్లే లేవు. నేను కనీసం ఒక ఉదాహరణనైనా చెప్పగలను. అది, మహారాష్ట్రలోని నాందేడ్.

 నాందేడ్ రైల్వే స్టేషన్ అసలు పేరు ‘‘హుజూర్ సాహెబ్ నాందేడ్’’. సిక్కు గురువులలో ఒకరైన గురు గోవింద్‌సింగ్ 18వ శతాబ్ది మొదట్లో ఆ పట్టణాన్ని సందర్శించారు. ఆయన అక్కడ ఉండగా లంగర్‌ను (తరతమ భేదాల్లేకుండా అందరికీ భోజనాన్ని వండి వడ్డించే సిక్కు పవిత్ర స్థలం) ఏర్పాటు చేసి వెళ్లారు. తర్వాత ఆ ప్రదేశంలో గురుద్వారాను నిర్మించారు. అది సిక్కు మతస్తులకేగాక, ఇతరులకు కూడా పవిత్ర ప్రార్థనా స్థలం. కేవలం ‘నాందేడ్’ అంటే సరిపోదని మీకు ముందే తెలిసి ఉంటే తప్ప, ఐఆర్‌టీసీ వెబ్‌సైట్ ద్వారా మీరు నాందేడ్‌కు టిక్కెట్టు కొనాలని చూస్తే అదో పెద్ద పనే అవుతుంది.

 స్థలాల పేర్లు మార్చినంత మాత్రాన ప్రజలు వాటిని వాడుకగా ఎలా పిలుస్తుంటారో అది మాత్రం మారదు. ముంబైలోని మహాత్మాగాంధీ రోడ్డులోని ఒక భాగం పేరు సాధారణ వాడుకలో ఎప్పటికీ ‘మెరైన్ లైన్స్’ గానే ఉంటుంది. అలాగే సుభాష్‌చంద్రబోస్ రోడ్డును ‘మెరైన్ డ్రైవ్’ అనే అంటారు. అధికారికమైన పేరు ఏమైనాగానీ హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్ సరస్సు  పొడవునా ఉన్న కట్ట ట్యాంక్‌బండ్‌గానే ఉంటుంది తప్ప మారదు.

 కొన్ని పేర్లు ప్రజల ఆదిమ జ్ఞాపకంలో పాతుకుపోతాయి. వాటికి కొత్త పేర్లు తగిలించినంత మాత్రాన అవి మారవు. ఢిల్లీలో ఎంత మంది ఆటో రిక్షావాలాను  ‘డాక్టర్ అబ్దుల్ కలాం రోడ్డు’కు తీసుకుపొమ్మని అడుగుతారో, ఎందరు తుగ్లక్ రోడ్టుకు తీసుకుపొమ్మని అడుగుతారో మీరే గమనించండి. పేర్లను మార్చడం ఎంత వ్యర్థ ప్రయాసో మీకే విశదమౌతుంది. తుగ్లక్ రోడ్డు అనేదే ప్రజల వాడుకలో ఉంటుందని నేను పందెం కాస్తాను. అందుకు కారణం తుగ్లక్ గొప్పవాడు కావడం, కలాం తక్కువవాడు కావడం కాదు. ప్రజల వాడుకలో ఉండటమే అందుకు కారణం.     
http://img.sakshi.net/images/cms/2015-06/41435518537_625x300.jpg
వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు: మహేష్ విజాపుర్కార్
ఈమెయిల్: mvijapurkar@gmail.com
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement