సార్.. బిజీగా ఉన్నారా? కాసేపు మాట్లాడచ్చా? అంటూ వచ్చాడు మాకు బాగా అలవాటైన ప్లంబర్ శంకర్.
చాలారోజులైంది శంకర్, నిన్ను చూసి. లోనికి రా.. చాయ్ తాగుదాం అంటూ పిలిచాను.
పర్వాలేదు సార్, ఇక్కడే మాట్లాడదాం అంటూ గుమ్మంలోనే నిలబడిపోయాడు.
ఏంటి విశేషాలు శంకర్, పనులు బాగానే నడుస్తున్నాయా అని అడిగేసరికి ఒక్కసారి శంకర్ కళ్లలో నీళ్లు సుడులు తిరిగాయి. నేనెక్కడ చూస్తానోనని ముఖం పక్కకు తిప్పేసుకుని, గొంతు సరిచేసుకుని మళ్లీ చెప్పాడు.
25 దినాలైంది సార్.. ఒక్క పని ముట్టక. చేతిలో రూపాయి ఆడట్లేదు. ఇంట్లో నల్లలు ఏమైనా రిపేర్లు గిట్ట ఉన్నయేమోనని వచ్చినా సార్ అన్నాడు.
నాకు అది పెద్ద షాక్. ఎందుకంటే, ఒకే రోజు సిటీ నాలుగు మూలలా ఎక్కడైనా సరే చిన్న పని ఉన్నా వదిలిపెట్టకుండా వెళ్లి వందో రెండొందల చొప్పున సంపాదించుకుని గానీ రాని మనిషి శంకర్. ఇంట్లో ఏ నల్లా సరిలేకపోయినా, పైపులైన్లు లీకవుతున్నా.. ఎంత చిన్న, పెద్ద సమస్య అయినా సరే ఫోన్ చేస్తే చాలు.. రెక్కలు కట్టుకుని వాలిపోయి, పని పూర్తి చేసి ఆ తర్వాత టైమును బట్టి చాయ్ తాగడమో, మరీ మేం బలవంతపెడితే భోజనం చేయడమో చేసి, పనికి డబ్బులు తీసుకుని వెళ్లేవాడు. సమస్య మళ్లీ రాకుండా చేయడం, రూపాయి దగ్గర రాజీ పడకపోవడం తన నైజం. అలాంటి శంకర్, ఒక్కరోజు కూడా పని చేయకుండా పడుకోని శంకర్.. ఏకంగా 25 రోజుల్నించి పని ముట్టలేదంటే నాకు నమ్మబుద్ధి కాలేదు. కానీ, ఎదురుగా సజీవ సాక్ష్యం ఉంది.
ఎందుకు శంకర్, అంత దారుణంగా ఉందా అని అడిగేసరికి చిల్లుపడ్డ ఆకాశంలా భోరుమన్నాడు. ఎప్పుడూ నవ్వుతూ పనిచేసుకుని, నాలుగు కబుర్లు చెప్పి, చకచకా ఉత్సాహంగా ఉండే శంకర్ అలా బేలగా అయిపోయి కళ్లనీళ్లు కార్చేసరికి నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఇగ నువ్వు లోనికి రా.. అంటూ లోపల కూర్చోబెట్టి, ఇంట్లో శ్రీమతికి చెప్పి వేడివేడి చాయ్ చేయించి ఇచ్చా.
వచ్చిన దాదాపు అరగంట తర్వాత అప్పుడు బయటపడ్డాడు. తెలంగాణ గురించి ప్రకటన రాగానే ఇక్కడ ఇళ్లు కట్టించే మేస్త్రీలు దాదాపు అందరూ వాళ్ల సొంతూళ్లు (ఎక్కువగా ఒంగోలు చుట్టుపక్కల ప్రాంతాలు) వెళ్లిపోయారట. నగరంలో నిర్మాణ పనులు చాలావరకు ఒక్కసారిగా ఉన్నట్టుండి ఆగిపోయాయట. దాంతో శంకర్ లాంటి ప్లంబర్లకే కాదు, ఎలక్ట్రీషియన్లు, సెంట్రింగ్ మేస్త్రీలు, లేబర్.. ఇలా అందరికీ చేతిలో పని లేక దాదాపు నెల రోజుల నుంచి నోట్లోకి నాలుగువేళ్లు కూడా పోవట్లేదు.
అన్నీ బాగున్న రోజుల్లో శంకర్ సంపాదన కూడా బాగానే ఉండేది. దాంతో కుటుంబం మొత్తం కలిసి బయటకు వెళ్లాలంటే బాగుంటుందని ఓ కారు కూడా కొన్నాడు. కానీ ఇప్పుడు చేతిలో సంపాదన లేక, ఇంకా దాదాపు 10 నెలల వరకు దానికి వాయిదాలు కట్టాల్సి రావడంతో ఏం చేయాలో తెలియక అతడి పరిస్థితి ఘోరంగా ఉంది.
హైదరాబాద్, చుట్టుపక్కల ప్రాంతాలలో ఎక్కడ ఇళ్లు కట్టాలన్నా చాలావరకు ఆ ప్రాంతానికి చెందిన మేస్త్రీలే వస్తుంటారు. వాళ్ల దగ్గర పనితనం ఉండటం, ముందునుంచి వాళ్లు ఆ పనికి అలవాటు పడి ఉండటంతో.. వీళ్లు కూడా బాగానే ఉందిలే అని మిగిలిన పనులకు పరిమితం అయిపోయారు. పైపెచ్చు, రాష్ట్రం ఏమవుతుందో, ఎన్నాళ్లు ఇక్కడ ఉంటామో, వెళ్లిపోవాల్సి వస్తుందేమోనన్న అయోయమ పరిస్థితి ఉండటంతో ఎవ్వరూ స్థలాలు కొని, ఇళ్లు కట్టించడం లేదా ఇప్పటికే కడుతున్న ఇళ్లు కొనడం లాంటి సాహసాలు చేయలేకపోతున్నారు. దీనికి తోడు సీమాంధ్ర ప్రాంతంలో కొత్త రాజధాని వస్తుందని, అక్కడ నిర్మాణాలకు డిమాండు ఉంటుందని వార్తలు రావడంతో చాలామంది మేస్త్రీలు అటువైపు వెళ్లిపోయి అక్కడ నిర్మాణ పనులు మొదలుపెట్టారు. ఒక్కసారిగా పనులన్నీ ఆగిపోవడంతో వివిధ ప్రాంతాల నుంచి పనుల కోసం హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలకు వలస వచ్చినవారికి నెలరోజుల నుంచి ఉపాధి లేకుండా పోయింది.
హైదరాబాద్ గురించి ఒక్కక్కళ్లూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. మాట్లాడే నాయకులెవ్వరికీ పైసలకు ఫికర్ లేదు సార్. మాలాంటోళ్లకు మాత్రం కూడు దొరకట్లేదు అంటూ శంకర్ లాంటి చాలామంది వాపోతున్నారు. రెండువైపులా నాయకులు ఒకరినొకరు రెచ్చగొట్టేలా మాట్లాడటంతో రోజురోజుకూ ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయే తప్ప ఏమాత్రం తగ్గడంలేదు. ఇలాంటి పరిస్థితుల్లో భవన నిర్మాణ రంగంతోపాటు అన్ని రకాల వ్యాపారాలు కూడా కుదేలైపోయాయి. ఇంత చిచ్చు పెట్టిన వాళ్లు మాత్రం రెండువైపులా వినోదం చూస్తూ కాలం గడిపేస్తున్నారు. కలికాలం అంటే ఇదేనేమో!!
పాతిక దినాలైంది.. పని ముట్టక!!
Published Tue, Aug 27 2013 11:56 PM | Last Updated on Mon, Jun 18 2018 8:10 PM
Advertisement
Advertisement