బ్లాక్ బస్టర్ ఫ్రైడే ఫైట్!
ఢాకా: పొట్టి ప్రపంచకప్లో అసలు సిసలు సమరానికి ఈ శుక్రవారం తెర లేవనుంది. బంగ్లాదేశ్ వేదికగా జరగనున్న దాయాది దేశాల మధ్య పోరు క్రికెట్ అభిమానులను ఊర్రూతలూగించనుంది. టి20 ప్రపంచకప్లో బ్లాక్ బస్టర్ ఫ్రైడే సమరానికి భారత్, పాకిస్థాన్ జట్లు సమాయత్తమవుతున్నాయి. చిరకాల ప్రత్యర్థులైన భారత్-పాకిస్థాన్లు ఈనెల 21న ముఖాముఖి తలపడనున్నాయి. ఆసియాకప్లో పాక్ చేతిలో భంగపడిన టీమిండియా తన తొలి మ్యాచ్లో దాయాది జట్టును మట్టికరిపించి బదులు తీర్చుకోవాలని భావిస్తోంది.
తొలి మ్యాచ్‌కు ముందు ఆటతీరును సరిచూసుకోవడానికి శ్రీలంక, ఇంగ్లండ్లతో జరగనున్న వార్మప్ మ్యాచ్‌లను ఉపయోగించుకోవాలని ధోని సేన యోచిస్తోంది. ఆసియాకప్లో భారత్పై పేచేయి సాధించిన పాక్ ఇక్కడ కూడా అదే ఊపు కొనసాగించాలని భావిస్తోంది. అయితే టి20లో పాక్ కంటే భారత్ రికార్డు మెరుగ్గా ఉంది. భారత్తో ఐదుసార్లు తలపడిన పాక్ కేవలం ఒకసారి మాత్రమే విజయం సాధించింది. ప్రపంచకప్లో 8 సార్లు(5 వన్డేలు, మూడు టి20) తలపడినా పాక్ ఒక్కసారిగా విజయం సాధించలేకపోయింది.
ఈ రికార్డు నిలుపుకునేందుకు ప్రయత్నిస్తామని టీమిండియా స్టార్ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లి దీమా వ్యక్తం చేశాడు. ఆసియాకప్లో ఓడినప్పటికీ తమ ఆట పాక్ కంటే మెరుగ్గా ఉందన్నాడు. భారత్ బ్యాటింగ్లో, పాకిస్థాన్ బౌలింగ్లో మెరుగ్గా ఉన్నాయి. దీంతో ఈ మ్యాచ్ను భారత్ బ్యాటింగ్, పాక్ బౌలింగ్ మధ్య జరుగుతున్న పోటీగా వ్యవహరిస్తున్నారు. ఇక ఆసియా కప్కు దూరమైన ధోని, పొట్టి ఫార్మాట్ స్పెషలిస్టులు యువరాజ్ సింగ్, సురైనా రైనాలు జట్టులో చేరడంతో టీమిండియా బలం పెరిగింది.
ఇదే విషయాన్ని పాక్ కెప్టెన్ మహ్మద్ హఫీజ్ కూడా అంగీకరించాడు. ధోని తిరిగి రావడం భారత్ కచ్చితంగా అనుకూలించే అంశమని అన్నాడు. మొదటి మ్యాచ్లోనే ధోనిసేనను ఎదుర్కొవాల్సిరావడం కొద్దిగా ఒత్తిడితో కూడుకున్న అంశమని అంగీకరించాడు. అదే సమయంలో ఈ మ్యాచ్లో విజయం సాధిస్తే మిగతా వాటిలో ఒత్తిడి అంతగా ఉండదని అభిప్రాయపడ్డాడు. బ్యాటింగ్లో బలంగా ఉన్న భారత్ను తమ పదునైన బౌలింగ్ ఆయుధంతో ఎదుర్కొంటామని పేర్కొన్నాడు. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా లాంటి బలమైన జట్లు ఉన్నప్పటికీ భారత్-పాక్ మ్యాచ్పైనే ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది. ఈ మ్యాచ్తోనే టి20 వరల్డ్ కప్ సందడి మొదలవుతుందనడంలో అతిశయోక్తి లేదు.