మేషం రాశి ఫలాలు | Ugadi Panchangam 2019 | Aries Horoscope 2019-20 in Telugu - Sakshi
Sakshi News home page

వికారినామ సంవత్సర (మేషం) రాశిఫలాలు

Published Sun, Mar 31 2019 12:01 AM | Last Updated on Tue, Apr 2 2019 6:26 PM

2019 To 2020 Aries Zodiac Sign Horoscope - Sakshi

మేషరాశివారికి ఈ సంవత్సరం చాలా బాగుంది. భాగ్యంలో గురు, శని, కేతువుల సంచారం, మూడింట రాహుగ్రహ సంచారం, గురువు భాగ్యదశమ రాశి సంచారం, మూఢమి, గ్రహణాలు ప్రధానౖ ఫలితాలను నిర్దేశిస్తున్నాయి. ఈ రాశివారికి ఆర్థికంగా బాగుంది. ఆరోగ్యం బాగుపడుతుంది. రాజకీయ విషయాలు బాగుండవు. డబ్బులతో అన్నీ సాధించలేమని గుుర్తిస్తారు. మీ వ్యూహానికి ప్రత్యర్థులు అంతకంటే గొప్ప వ్యూహాన్నే రచించి అమలు చేస్తారు. రాజకీయ నిర్ణయాలు అగ్నిపరీక్షలా నిలుస్తాయి. వర్గాన్ని కూడగట్టలేరు. ప్రజాకర్షణ తగ్గుతుంది. గ్రూపురాజకీయాలు ఫలించవు. పోటీపరీక్షల్లో అనుకూల ఫలితాలు వస్తాయి. మధ్యవర్తిత్వం అంగీకరించరు. ఇందువల్ల ఇరువర్గాలకు దూరమవుతారు. అదే సమయంలో ఇంట్లోవాళ్ళు సన్నిహితమవుతారు. నూతన వ్యాపారం లాభిస్తుంది. స్పెక్యులేషన్, ఎగుమతి, దిగుమతి వ్యవహారాలలో మెలకువ అవసరం. క్రెడిట్‌ కార్డులు, బ్యాంకు వ్యవహారాలు, పొదుపు డిపాజిట్‌లు తదితర వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండటం మంచిది. బెట్టింగ్‌లలో నష్టపోతారు. ఇతరుల బరువుబాధ్యతలు మీపై వేసుకోవద్దు. బంధువులకు సహాయం చేయడం వల్ల ఇంట్లో చికాకులు ఎదురవుతాయి.  వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తలు అవసరం. వ్యాపారంలో అధునాతనమైన పద్ధతులను అవలంబించి అభివృద్ధి సాధిస్తారు. ప్రభుత్వ ఉత్తర్వులు, కాంట్రాక్టులు మీ అంచనాల మేరకు ఫలిస్తాయి. మీరు కొన్న స్థిరాస్తుల విలువ అనూహ్యంగా పెరుగుతుంది. మీ సంస్థలోని భాగస్వాములు, కార్యాలయంలోని సహోద్యోగులు, ఓర్వలేని వారై ఉంటారు. ఆరోగ్యపరంగా స్వల్ప జాగ్రత్తలు అవసరం. పార్శ్వపు నొప్పి బాధించే అవకాశం ఉంది. ఈఎన్‌టీ సమస్యలు రావచ్చు. సంవత్సర ద్వితీయార్ధంలో ఆర్థికప్రణాళికలు కొత్త రూపురేఖలు దిద్దుకుంటాయి. స్త్రీల వలన కొన్ని ప్రయోజనాలు లభిస్తాయి. ఇంటి ఖర్చు తగ్గించడానికి చేసే ప్రయత్నాలు బెడిసికొడతాయి. స్థలాలు, కట్టడాలు, జలసంబంధిత వ్యాపారాలు కలిసివస్తాయి. స్వయం పర్యవేక్షణ లేక ఇతరుల మీద పూర్తిగా బాధ్యతలు వదిలి వేయడం వల్ల కొన్ని అనుభవాలు నేర్చుకుంటారు.

మంచితనం, కుటుంబ, వంశ గౌరవం చాలా సందర్భాలలో ఆదుకుంటుంది. సామర్థ్యం లేని వ్యక్తులను ప్రోత్సహించడం ద్వారా కార్యనష్టం, కాలహరణం జరుగుతుంది. ఎవరిని ఏ పనికి ఉపయోగించుకోవాలో అంచనా వేయడంలో పొరబడతారు. స్వజనులు, బంధువర్గం లేక కులవర్గానికి చెందిన ఓ వ్యక్తి వల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. నిష్కారణ శత్రుత్వం ఏర్పడుతుంది. మనుషుల మనోభావాలను స్పష్టంగా చదవగలరు. సంతానం విషయంలో కఠినమైన నిర్ణయాలు అనివార్యం అవుతాయి. ప్రేమవివాహాలు విఫలం అవుతాయి. విద్యారంగంలో కృషి చేసేవారికి ఆరంభంలోనే ఉద్యోగం వస్తుంది. కుల మత వర్గాలకు అతీతంగా శక్తి సామర్థ్యాలకు పెద్దపీట వేస్తారు. మధ్యవర్తిత్వం చేయడం వల్ల కొన్ని చట్టపరమైన ఇబ్బందులు రావచ్చు. వ్యక్తిగత, కుటుంబ అవసరాలకు ఖర్చులు ఎక్కువవుతాయి. కుల రాజకీయాలు చోటుచేసుకుంటాయి. ఇతరుల సలహాలు నచ్చేవి అమలు చేయండి. ఇతరులు సలహాలు చెప్పడానికి భయపడే వాతావరణం కలిగించవద్దు. పట్టుదలతో పాటు, పట్టువిడుపులు కూడా మంచికి దారితీస్తాయని గ్రహించండి. ప్రభుత్వపరంగా, ప్రైవేట్‌పరంగా రావలసిన బిల్లులు ఆలస్యం అవుతాయి. ఆర్థికసంస్థల నుండి, బ్యాంకుల నుండి లోనులు తీసుకుంటారు. అతికష్టం మీద ఉద్యోగంలో ప్రమోషన్‌ లభిస్తుంది. ప్రాధాన్యతలేని సీటుకు తాత్కాలికంగా బదిలీ అవుతారు. ఒక పదవికి సంబంధించి మీ పేరు పరిశీలనలో ఉంటుంది. వైరివర్గం గురించిన రహస్య సమాచారం మీ చేతికి అందుతుంది. తొందరపడకుండా సమయ సందర్భాల కోసం ఎదురు చూస్తారు. ప్రేమపెళ్లిళ్లకు సంబంధించిన వ్యవహారాలు చికాకు కలిగిస్తాయి. పునర్వివాహం చేసుకోవాలనుకునేవారి ప్రయత్నాలు ఫలిస్తాయి. కొన్ని అమ్మకాలకు సంబంధించిన విషయాలలో లాభపడతారు. ఋణాలు తీరుస్తారు. తనఖాలు విడిపిస్తారు. విలువైన వస్తువులను, ఆభరణాలను కొనుగోలు చేస్తారు. అనుకూలమైన ఫలితాలు మొత్తం మీకే దక్కవు. వ్యవహారాలకు ఏమాత్రం సంబంధించని వ్యక్తులకు వాటాలు పంచవలసి వస్తుంది. పన్నులు వసూలు చేసే అధికారుల వల్ల ఇబ్బందులు ఎదురుకావచ్చు. చిన్నచిన్న వ్యాపారాలు చేసుకునేవారికి కాలం అనుకూలంగా ఉంది. ఉపయోగంలేని వ్యక్తుల సాంగత్యం ఇబ్బందికరంగా మారుతుంది. మేలు చేస్తారని భావించిన వ్యక్తులు ముఖం చాటేస్తారు. కీడు చేస్తారనుకున్న వ్యక్తులు మేలు చేస్తారు. మోకాళ్ళ నొప్పులు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. స్త్రీ సంతానం పురోగతి బాగుంటుంది. మీ విలువ అందరికీ తెలిసివస్తుంది. స్త్రీలతో ఏర్పడిన సమస్యలు సమసిపోతాయి. అసత్య ప్రచారం చేస్తున్న ప్రత్యర్థులు మీకన్నా బలవంతులైనా లెక్కచేయరు. పరిస్థితులను అంచనావేసి తగిన వ్యూహాలను అమలుచేస్తారు. సాంకేతిక పోటీపరీక్షలలో విజయం సాధిస్తారు. 

భూ వ్యవహారాలు, మరికొన్ని ముఖ్య వ్యవహారాలు మీకు అనుకూలంగా మారడం వల్ల సాటివారికి అసూయ పెరుగుతుంది. కొన్ని సందర్భాలలో చదివిన చదువుకు, చేసే ఉద్యోగానికి సంబంధం ఉండదు. బిజినెస్‌ మేనేజ్‌మెంట్, ఐటీ, సాఫ్ట్‌వేర్‌ రంగాలలో రాణిస్తారు. నమ్మకద్రోహులు అడుగడుగునా ఎదురవుతారు. జలక్రీడలు, ఈతలకు దూరంగా ఉండటం మంచిది. పార్ట్‌టైమ్, టెంపరరీ ఉద్యోగాలు చేస్తున్నవారికి పర్మినెంట్‌ ఉద్యోగం లభిస్తుంది. ప్రాంతీయ విభేదాలు మీపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయి. ఏకపక్ష నిర్ణయాలు తీసుకోకుండా ఏదైనా పని చేసేటప్పుడు సన్నిహితులను, నిపుణులను సంప్రదించండి. ప్రతి విషయంలోనూ జీవితభాగస్వామికి సంజాయిషీ ఇవ్వవలసి రావటం మీ మనోవేదనకు కారణం అవుతుంది. లాభాలు పంచుకునే విషయంలో పనిచేయని వ్యక్తులకు, సోమరిపోతులకు భాగాలు ఇవ్వవలసిన పరిస్థితిని జీర్ణించుకోలేకపోతారు. వివాహాది శుభకార్యాల విషయంలో కుటుంబపరంగా సమష్టి నిర్ణయం తీసుకుంటారు. పార్టీ మారడం వల్ల మంచి రాజకీయ ఫలితాలు పొందగలుగుతారు. చిన్నాచితకా వ్యాపారాలు, చేతివృత్తులు, ఆధ్యాత్మిక వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. అరిష్ట ఉద్వాసనకు నల్లవత్తులతో దీపారాధన చేయండి. సర్పదోష నివారణ కంకణం ధరించండి. ఎగుమతి, దిగుమతి వ్యాపారాలు లాభిస్తాయి. సువర్ణాభరణాల భద్రత విషయంలో జాగ్రత్తలు అవసరం. సొంతవారితో మాట్లాడడానికి తీరికలేని పని ఒత్తిడి చికాకు కలిగిస్తుంది. సంవత్సర ద్వితీయార్ధంలో వ్యక్తిగత శ్రమ, జీవితభాగస్వామి అదృష్టం తోడై మంచితనంతో ఆస్తి, ధనం సంపాదిస్తారు. సంతానం వల్ల కుటుంబానికి కీర్తిప్రతిష్ఠలు వస్తాయి. మీ వ్యక్తిగత పరపతి పెరగడంతో పాటు శత్రువులు కూడా పెరుగుుతారు. సమాజంలో ఒక స్థాయి కలిగినవారు మీపై నిష్కారణ ద్వేషం పెంచుకుంటారు. స్త్రీల వల్ల కొన్ని ఉపయోగాలు ఏర్పడతాయి.

స్త్రీలకు ప్రత్యేకం: ఈ రాశిలో జన్మించినవారికి ఈ సంవత్సరం బాగుంది. విద్యార్థినులకు మెరిట్‌ మార్కులు, స్కాలర్‌షిప్స్‌ వస్తాయి. రీవాల్యుయేషన్, రీకౌంటింగ్‌ లాభిస్తాయి. ఉద్యోగం చేసేవారికి ప్రమోషన్‌ లభిస్తుంది. సివిల్స్‌ స్థాయి పోటీ పరీక్షల కోసం పట్టుదలతో శ్రమించి, విజయం సాధిస్తారు. మెడిసిన్‌ సీటు లభిస్తుంది. పునర్వివాహ ప్రయత్నాలు చేసేవారికి మధ్యవర్తుల వల్ల మేలు జరుగుుతుంది. అవివాహితులకు వివాహం జరుగుతుంది. సంతానంలేని వారికి సంతానప్రాప్తి కలుగుుతుంది. కొందరికి జీవితభాగస్వామి లేదా తత్సమానమైన వ్యక్తితో విభేదాలు తీవ్రతరం అవుతాయి. వ్యాపారంలో మీరు ప్రవేశపెట్టిన కొత్త ఉత్పత్తులు ప్రజాదరణకు నోచుకుంటాయి. సన్నిహితులు, స్నేహితులు, బంధువుల దగ్గర మంచి పేరు తెచ్చుకుంటారు. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి. పొదుపు పథకాల ద్వారా లబ్ధి పొందుతారు. విలువైన వస్తువుల భద్రత గురించి ఎక్కువ శ్రద్ధ చూపండి. బ్యూటీ పార్లర్స్, అలంకార సామాగ్రి వ్యాపారాలు లాభిస్తాయి. కళా, సాంస్కృతికరంగాలలో రాణిస్తారు. పరిమళగంధంతో, సుగుంధ సిద్ధగంధాక్షతలతో పూజ చేయండి. చలనచిత్ర, టీవీ రంగాలలో అవకాశాలు లభిస్తాయి. పిల్లలను అతి గారాబం చేయడం వల్ల చేదు అనుభవాలు ఎదురవుతాయి. సంతాన సాఫల్యకేంద్రాల వల్ల, దొంగ స్వామీజీల వల్ల మోసపోతారు. సంతాన విద్యా విషయమైన ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. వాళ్ళ మీద ఇతరుల ప్రభావం పడకుండా జాగ్రత్తపడండి. సన్నిహితులతో, ముఖ్యమైన వ్యక్తులతో సంప్రదించి ఏ కార్యక్రమాలలోనైనా నిర్ణయం తీసుకోండి. ఎవరికీ లొంగి ఉండాల్సిన అవసరం లేదని భావిస్తారు. మిమ్మల్ని నియంత్రించి గుప్పెట్లో పెట్టుకోవాలనే వారికి భంగపాటు తప్పదు. గతించిపోయిన ఆత్మీయుల జ్ఞాపకాలు మనసుని బాధిస్తాయి. సౌందర్య చిట్కాలు, యోగాభ్యాసాలు, మెడిటేషన్‌ మొదలైన వాటి వల్ల ప్రయోజనం పొందుతారు. మీ సిద్ధాంతాలను పక్కన పెట్టవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల కొంతకాలం అంతరాత్మ సాక్షికి విరుద్ధంగా ఇష్టంలేని వ్యక్తులతో కలసి పనిచేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అక్కడ కూడా మీ శక్తిసామర్థ్యాలు గుర్తింపబడతాయి. మీ పట్ల హేళన భావన కలిగిన వారికి మీ ఉన్నతస్థితితో తగిన సమాధానం చెప్పగలరు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు సుబ్రహ్మణ్య పాశుపత కంకణం ధరించాలి, సర్పదోష నివారణ రూపు మెడలో ధరించాలి. ఇతరుల పేరు మీద చేసే వ్యాపారాలు బాగుంటాయి. కాంట్రాక్టులు, వర్క్‌ఆర్డర్లు, సబ్‌కాంట్రాక్టులు లాభదాయకంగా ఉంటాయి. రాజకీయరంగంలో రాణిస్తారు, పదవి లభిస్తుంది. సొంతవాళ్ళుగా భావించిన వ్యక్తులు మీ దగ్గరే రహస్యాలు దాచిపెట్టడం మీ కోపానికి కారణం అవుతుంది. ప్రతి శుక్రవారం అరావళి కుంకుమతో, లకీ‡్ష్మచందనంతో శ్రీ మహాలకీ‡్ష్మదేవిని పూజించండి. కొత్త కొత్త ఆహార నియమాలు పాటించడం వలన ప్రయోజనం కలగకపోగా ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది. జాగ్రత్త వహించండి. బిజినెస్‌ మేనేజ్‌మెంట్, ఐటీ రంగాలలోనివారు రాణిస్తారు. ఆధ్యాత్మికత పట్ల శ్రద్ధ కనబరుస్తారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement