కుంభం రాశి ఫలాలు | Ugadi Panchangam 2019 | Aquarius Horoscope 2019-20 in Telugu - Sakshi
Sakshi News home page

వికారినామ సంవత్సర (కుంభ రాశి) రాశిఫలాలు

Published Sun, Mar 31 2019 12:33 AM | Last Updated on Tue, Apr 2 2019 6:39 PM

2019 To 2020  Aquarius Zodiac Sign Horoscope - Sakshi

ఈ రాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఏకాదశంలో శని కేతువుల సంచారం, పంచమంలో రాహు గ్రహ సంచారం, ఏకాదశంలో, వ్యయంలో గురుగ్రహ సంచారం, గురు శుక్ర మౌఢ్యమిలు, గ్రహæణాలు ప్రధానమైన ఫలితాలను నిర్దేశిస్తున్నాయి. ఉద్యోగపరంగా ప్రాధాన్యత లేనటువంటి స్థానాలలో కొంతకాలం పనిచేసినప్పటికీ తరువాత మెరుగైన స్థానాన్ని సంపాదిస్తారు. మీ ప్రాధాన్యతను తగ్గించే ప్రయత్నాలు తాత్కాలికంగానే ఫలిస్తాయి. మిమ్మల్ని నిష్కారణంగా విమర్శిస్తున్న వారికి పరోక్షంగా సమాధానమిస్తారు. పెద్దలు, వృద్ధులు, తల్లిదండ్రుల అభిమతానికి అనుగుణంగా నడుచుకుంటారు. ఉన్నంతలో మానసిక ప్రశాంతత ఏర్పరచుకోవడంలో ఆనందం ఉన్నదని గ్రహిస్తారు. మీ వ్యవహారశైలిలో అనేకమైన మార్పులు తెచ్చుకుంటారు. పరస్పర విరుద్ధ భావాలతో కొట్టుమిట్టాడుతున్న ఇద్దరు   మొండివాళ్ళని కలపడానికి మీ వంతు ప్రయత్నాలు చేస్తారు. మీ సమస్యల కంటే అధికంగా ఇతరుల సమస్యలను పరిష్కరించడానికి సమయం కేటాయించవలసి వస్తుంది. ఫర్నిచర్‌ వ్యాపారం, ఫాస్ట్‌ఫుడ్‌ వ్యాపారం, బేకరీలు, హాస్టల్‌ మొదలైనవి అనుకూలంగా ఉంటాయి. మీ మనస్తత్వానికి విరుద్ధంగా ఇష్టం లేకపోయినా కొన్ని పైరవీలు చేయవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. మొండి బాకీలు వసూలవుతాయి. ప్రభుత్వపరంగా, ప్రైవేటుపరంగా రావలసిన ధనం అతికష్టం మీద చేతికి వస్తుంది. పగ ప్రతీకారాలకు అతీతంగా పెద్దమనిషిగా వ్యవహరిస్తారు. సమాజంలో వివిధ రంగాలలో పేరుప్రఖ్యాతులు ఉన్న వ్యక్తులను మీ   స్వహస్తాలతో సత్కరించి మంచి పేరు తెచ్చుకుంటారు. మీరు ఏ విషయం చెప్పినా వద్దు, కాదు అని అపశకునాలు పలికి మిమ్మల్ని నిరుత్సాహపరిచే వ్యక్తులు మీ కార్యక్రమాలు విజయవంతం కావడం చూసి సిగ్గు విడిచి మళ్ళీ మీతోనే నడుస్తారు. భ్రాంతితో, భయంతో జీవనం వెళ్ళదీస్తున్న వ్యక్తులను చేరదీసి ధైర్యం చెబుతారు. ఆస్తి కోసం, ధనం కోసం తల్లిదండ్రులతో కూడా విరోధం కల్పించే ప్రయత్నం చేస్తారు. అయితే సహోదరవర్గం అండగా నిలిచి దుష్పరిణామాలు సంభవించకుండా అండగా నిలబడతారు. నియమ నిబంధనలకు వ్యతిరేకంగా మీ సాటివాళ్ళు మీ కన్నా అధికంగా లాభం పొందుతారు. మీ దగ్గర మధ్యవర్తులు ఇతరుల పేర్లు చెప్పి డబ్బు గుంజుతారు. కాంట్రాక్టులు, సబ్‌ కాంట్రాక్టులు, లైసెన్సులు లీజులు లాభిస్తాయి. అఖండమైన రాజకీయ రాజయోగం సంప్రాప్తం. శత్రువర్గంపై అఖండ విజయం. భాగస్వాముల అత్యుత్సాహం వలన కొన్ని నష్టాలు, రావలసిన లాభాలు రాకపోవడం, అధికారులతో వివాదాలు ఏర్పడతాయి. వాస్తవికత ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటారు. పురాతన వస్తుసామగ్రి సేకరిస్తారు.

వినూత్నమైన కార్యక్రమాలు, సరికొత్త వ్యాపారాలు చేసే వారు మీకు సన్నిహితం అవుతారు. మిమ్ములను భాగస్వాములుగా చేరమని ఒత్తిడి తెస్తారు. అనుభవంలేని రంగాలలో కొత్తవారిని నమ్మి వ్యాపారంలోకి దిగుతారు. ప్రభుత్వ కార్యాలయాలలో మీ పరపతి పెరుగుతుంది. చెల్లించిన సొమ్మును చెల్లించలేదని, తీసుకోని ధనం తీసుకున్నారని మొదలైన నిందలు అసౌకర్యానికి గురిచేస్తాయి. సామాజిక చర్చలలో నూతన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. వారితో కావలసిన వనరులను, ప్రయోజనాలను సమకూర్చుకుంటారు. ప్రజాసంబంధాలను అభివృద్ధిపరచుకునే ప్రయత్నాలను అధికం చేస్తారు. విందులు, వినోదాలలో కొత్త విషయాలు తెలుసుకుంటారు. స్త్రీల వల్ల సమస్యలు రాకుండా జాగ్రత్తపడాలని నిర్ణయించుకుంటారు. స్థిరాస్తులు అమ్మే సమయంలో మోసపోయే అవకాశం ఉంది. కళా, సాంస్కృతిక వ్యవహారాలలో, క్రీడలలో నూతన అవకాశాలు అందివస్తాయి. కీర్తిప్రతిష్ఠలు సూచిస్తున్నాయి. కుటుంబ విషయాలను నిర్లక్ష్యం చేయవద్దు. మీ పర్యవేక్షణ అవసరం. వృత్తి ఉద్యోగాలకు సంబంధించిన ఒక ముఖ్య విషయాన్ని రహస్యంగా చక్కబెడతారు. కొందరి ప్రోత్సాహం, సహకారం వల్ల మీలో నిద్రాణమైన ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. మీ మనోభావాలను వ్యక్తం చేయకుండా ఇతరుల అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నాలు చేస్తారు. విదేశాలలో ఉన్న మీ ఆత్మీయవర్గం ఆకస్మికంగా రావడం జరుగుతుంది. కొన్ని విషయాలు పట్టించుకోకుండా ఉంటేనే మనశ్శాంతి లభిస్తుందన్న నిజాన్ని మీరు గ్రహిస్తారు. ఎన్నికలలో శత్రువర్గం కన్నా స్నేహితులే ఎక్కువగా నష్టం చేస్తారు. ఇరుగు పొరుగు వారితో పరుష సంభాషణలు భేదాభిప్రాయాలు సంభవిస్తాయి. అందరినీ వ్యతిరేకించి మీరు పట్టుబట్టి ఉన్నతస్థానంలో ఉంచిన వ్యక్తులు మీకు మేలు చేయరు.  మీది అహంకార వైఖరి అని ముద్రవేయడం జరుగుతుంది. ఒకవర్గానికి చెందిన వ్యక్తిగా మీపై ముద్రపడే అవకాశం ఉంది. భూములు, ఫ్లాట్స్, బంగారం కొనుగోలు చేస్తారు. మిత్రవర్గం, సన్నిహిత, సేవకవర్గం వారితో  కొంత ఆలస్యంగా అయినా పనులు చేయించుకోగలుగుతారు. బంధువుల వల్ల, సన్నిహిత, రక్తసంబంధీకుల వల్ల, పరస్త్రీల వల్ల నష్టం జరుగుతుంది. శిరోవేదన, పార్శ్వపు నొప్పి, కీళ్ళనొప్పులు ఇబ్బంది కలిగిస్తాయి. సంస్థల విస్తరణే ధ్యేయంగా కృషి చేస్తారు. అనేకమంది ఉద్యోగుల పట్ల, వారి వారి విధుల పట్ల స్పష్టమైన అవగాహన కలిగి ఉంటారు. కుటుంబ విషయాల కారణంగా కొంతమంది వాలంటరీ రిటైర్మెంట్‌ తీసుకుంటారు. మధ్యమధ్యలో జీవితభాగస్వామితో విభేదాలు ఏర్పడతాయి. స్త్రీ సంతానం పురోగతి బాగుంటుంది. భూమి, భవనాల రూపంలో ధనాన్ని మదుపు పెడతారు. జీవితంలో ఇది మీరు అనుకున్న వ్యక్తులకు ఉపయోగపడాలని ఆశిస్తారు. కాలం సజావుగా సాగుతున్నప్పటికీ వర్గవైషమ్యాలు, రాయబారాలు విసుగు కలిగిస్తాయి. వాటిని వదిలించుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం వల్ల లాభపడతారు.

మీ ఓర్పు చాలా విజయాలకు కారణం అవుతుంది. విద్యార్థినీ విద్యార్థులకు విదేశాలలో చదువుకునే అవకాశాలు లభిస్తాయి. సంవత్సర ద్వితీయార్ధంలో ట్యాక్సులు వసూలు చేసే అధికారుల ద్వారా మీ ప్రత్యర్థులు వ్యూహ ప్రతివ్యూహాలు చేసి కొంతమేరకు నష్టాన్ని కలిగిస్తారు. రాజకీయ పరపతిని ఉపయోగించి చాలావరకు నష్టాన్ని నివారించుకోగలుగుతారు. ప్రత్యర్థులను తక్కువగా అంచనా వేసినందుకు చింతిస్తారు. కోర్టు సమస్యలు సంవత్సర ప్రథమార్ధంలో ఇబ్బందిపెట్టినా ద్వితీయార్ధంలో సానుకూలపడతాయి. బంధువర్గం వారు స్వప్రయోజనాల కోసం మిమ్మల్ని ఉపయోగించుకుంటారు. వారికి మీరు సహాయ నిరాకరణ చేస్తే, మీ ఇంట్లోని వారి ద్వారా మీపై ఒత్తిడి పెంచుతారు. సినీ, కళా పరిశ్రమలోని వారికి మంచి రోజులు గోచరిస్తున్నాయి. టీవీ రంగంలోని వారికి మంచి ఫలితాలు లభిస్తాయి. ఎంతమంది పక్కన ఉన్నా, ఎన్నివిధాలుగా కలిసి వచ్చినా ఒంటరిగా ఉన్నామన్న భావన మీ మనస్సులో ప్రబలంగా నాటుకుంటుంది. కొన్ని పరిస్థితుల వల్ల మీ తోడబుట్టిన వాళ్ళకు అండగా నిలువవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. జ్యేష్ఠ కుమారుడిని అతిగారాబం చేయటం వల్ల ఇంట్లో విమర్శలు వస్తాయి. ఎవరు ఎన్ని మాట్లాడుకున్నా పెద్దకొడుకు పట్ల మీ ప్రేమాస్పద వైఖరి మారదు. కుటుంబసభ్యుల సౌకర్యం కోసం విశేషంగా ధనాన్ని ఖర్చు చేస్తారు. వ్యాపార విషయాలలో కొత్త కోణాలను ఆవిష్కరిస్తారు. వ్యాపారంలో రొటేషన్, లాభాలు బాగుంటాయి. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. పాత బాకీలు తీర్చేస్తారు. మొండి బకాయిలు చేతికి అందివస్తాయి. తల్లిదండ్రులకు, పెద్దలకు అత్యంత ప్రాధాన్యతనిస్తారు. వాళ్ళకి చెప్పనిదే ఏ పనీచేయరు. ప్రతి విషయంలోనూ స్వప్రయోజనాలకే ప్రాముఖ్యతనివ్వాలని నిర్ణయించుకుంటారు. ముఖ్యమైన వ్యక్తులతో సంబంధ బాంధవ్యాలను సరిదిద్దుకోవడానికి ప్రయత్నించి విజయం సాధిస్తారు. మనోహరమైన మాటల విన్యాసంతో ఎదుటివారిని ఆకట్టుకుంటారు. కుటుంబంలోనూ, స్నేహితులతోనూ ఐకమత్యం సాధించడానికి మీరు చేసిన ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఎంత ఆదాయం ఉన్నా కొన్ని సందర్భాలలో ఆర్థికంగా సర్దుబాటు చేసుకోవడానికి ఇబ్బందిపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రభుత్వపరమైన కాంట్రాక్టులు, లీజులను తక్కువ ధరకే దక్కించుకుంటారు. వ్యాపార విస్తరణ చేయడానికి నూతన భాగస్వాములను కలుపుకుంటారు. నిజంగా ఇబ్బందులలో ఉన్నవారికి ఆర్థిక సహాయం చేస్తారు. ముఖ్యమైన విషయాలలో భాగస్వాములతో లేక కుటుంబసభ్యులతో అభిప్రాయభేదాలు చోటుచేసుకుంటాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అధిక ఒత్తిడి, శ్రమ కలిగి ఉంటారు. చాలా విషయాలలో ఒంటరిపోరాటం చేయక తప్పదు. మీ ప్రమేయం లేకుండానే మిమ్మల్ని వివాదంలోకి లాగే యత్నాలు మీ శత్రువర్గం చేయటం జరుగుతుంది. జాగ్రత్త వహించండి. ప్రతి విషయంలోనూ సైంధవుడిలా అడ్డుపడుతున్న అధికారికి స్థానచలనం కలుగుతుంది. స్థిరంగా మీ కార్యక్రమాలను చేసుకోగలుగుతారు.

దూరప్రాంత వ్యాపారాలకు సంబంధించి మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి, లాభాలు పొందుతారు. వైద్యవిద్యను అభ్యసించాలన్న మీ అభిలాష నెరవేరుతుంది. ప్రింటింగ్, ప్రచార సంబంధిత విషయాలు మీకు అనుకూలంగా లాభిస్తాయి. మీ ప్రయోజనాలను స్థిరంగా కాపాడుకోగలుగుతారు. దురుసుగా మాట్లాడి, చొరవగా చొచ్చుకుపోయే వ్యక్తుల వల్ల మీ ప్రయోజనాలు దెబ్బతినే అవకాశం ఉంది. కొన్ని సందర్భాలలో ముఖ్యమైన వ్యక్తులు చెప్పుడు మాటలు విని మీ నుండి కనీస వివరణ కోరకుండా ఏకపక్ష నిర్ణయాలు చేస్తారు. శుభకార్యాలలో ఉత్సాహంగా పాల్గొంటారు. కుటుంబంలో ఐక్యత మీ ఆనందానికి, పురోభివృద్ధికి కారణం అవుతుంది. కుటుంబ సమస్యలు తీరి ఊరట చెందుతారు. సంతానం భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని ధనాన్ని పొదుపు చేయాలని భావిస్తారు. జీవిత భాగస్వామితో సంప్రదింపులు జరిపేటప్పుడు సంయమనం పాటించడం మంచిది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వల్ల లాభపడతారు. విలువైన కాలాన్ని మీకు అనుకూలంగా మలచుకుంటారు. నిజమైన స్నేహబంధాలను వృద్ధి చేసుకోవడానికి ప్రాముఖ్యతనిస్తారు. సమాజంలో ఉపయుక్తమైన వారితో మిత్రత్వం ఏర్పరచుకుంటారు. క్రమశిక్షణాయుతమైన మీ పద్ధతుల వల్ల లాభపడతారు. రాత్రిపూట చేసే దీర్ఘాలోచనలు ఫలిస్తాయి. ప్రజాసంబంధాలు పెంచుకోవడానికి వివిధ మార్గాలు అనుసరిస్తారు. రహస్య రాయబారాలు ఫలిస్తాయి. న్యాయస్థానాల ద్వారా చట్టబద్ధంగా కొందరితో విడిపోయే అవకాశం ఉంది. మీ సన్నిహిత వర్గం దురాశకు పోయి నష్టపోవడం జరుగుతుంది. చాలా విషయాలలో మంచి వ్యక్తిగా, మాట తప్పని వ్యక్తిగా మిమ్మల్ని మీరు నిరూపించుకుంటారు. వైజ్ఞానిక రంగంలో ఉన్నవారికి, డాక్టర్లకు, లాయర్లకు, బోధనా రంగంలో ఉన్నవారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. రియల్‌ ఎస్టేట్‌ రంగంలోని వారికి కాలం కలిసివస్తుంది. ప్రభుత్వం నుండి రావలసిన బిల్స్‌ రావడానికి ఎక్కువ సమయం పడుతుంది. జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో మానసికమైన ఒత్తిడి ఏర్పడవచ్చు. అసమర్థులకు మీరు అండగా ఉన్నారన్న ఆరోపణలు, అపోహలు రావచ్చు. సన్నిహితులు వారించినా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. సంఘంలో మీకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకోవడానికిగాను అవిశ్రాంతంగా శ్రమిస్తారు. స్త్రీల సహాయ సహకారాలు లభిస్తాయి. ముఖ్యంగా ప్రతి విషయంలోనూ గంటలు, గంటలు ఆలోచించే విధానానికి స్వస్తి చెబుతారు. సమస్యలు పొడిగించకుండా వెనువెంటనే నిర్ణయాలు తీసుకోవడం వల్ల కొన్ని సందర్భాలలో లాభపడతారు. ధాన్యం వ్యాపారులకు, తోలు ఉత్పత్తుల వ్యాపారాలు, తక్కువ వ్యవధిలో సాగే తాత్కాలిక వ్యాపారాలు, జల సంబంధమైన వ్యాపారాలు, ఆహార సంబంధమైన వ్యాపారాలు కలిసి వస్తాయి. గృహం లేక స్థలం కొనుగోలు యత్నాలు ఫలిస్తాయి.

స్త్రీలకు ప్రత్యేకం: ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి.  స్వయం ఆర్థిక పరిపుష్టి సాధిస్తారు. సంపాదించిన ధనాన్ని సద్వినియోగం చేస్తారు. కళా, సాహిత్య రంగాలలో ప్రతిభని పెంచుకోగలుగుతారు. ఆత్మీయులతో, జీవితభాగస్వామితో అభిప్రాయభేదాలు వచ్చే అవకాశం ఉంది. ఇష్టంలేని వ్యక్తులతో చట్టబద్ధంగా విడిపోతారు. వృత్తి ఉద్యోగాలపరంగా నూతన అవకాశాలు కలిసివస్తాయి. ధనాన్ని పొదుపు చేస్తారు. లాభాన్ని పెట్టుబడిగా పెడతారు. వినోదానికి ఎక్కువగా ప్రాధాన్యతనిస్తున్నారని మీపై ఆరోపణలు వస్తాయి. కొన్ని పుకార్లు తాత్కాలికంగా ఇబ్బంది పెడతాయి. కీలక సమయంలో సహోదరవర్గం సహాయపడతారు. అడుగడుగునా సమస్యలను అధిగమించవలసి వస్తుంది. ఆటంకాలు చాలా వస్తాయి. ఇంటికి అవసరమైన ఖరీదైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వాహన యోగం ఏర్పడుతుంది. ఖరీదైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఒంటరిగా ప్రతి కార్యక్రమాన్నీ నిర్వహించడం మేలు. ప్రేమవివాహాలకు సంబంధించిన కీలకమైన నిర్ణయాలు తీసుకోవలసి వస్తుంది. విద్యాపరంగా విశేషించి సాంకేతికవిద్యలో బాగా రాణిస్తారు. పోటీపరీక్షలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటారు. మీ పట్టుదల విజయవంతమైన ఫలితాలను ఇస్తుంది. పునర్వివాహం చేసుకునే ఉద్దేశం ఉన్నవారికి ఆ ప్రయత్నాలు ఫలిస్తాయి. రాజకీయ పదవి లభిస్తుంది. వివాహంకాని వారికి వివాహప్రాప్తి, సంతానంలేని వారికి సంతానప్రాప్తి. మీ శక్తిసామర్థ్యాలకు తగిన గుర్తింపు, గౌరవప్రదమైన పురస్కారాలు లభిస్తాయి. మీ పిల్లలపై ఇతరులు చూపే మమకారం కృత్రిమంగా తోస్తుంది. జ్యేష్ఠ సంతానం విషయంలో మీరు తీసుకున్న జాగ్రత్తలు సత్ఫలితాలను ఇస్తాయి. బంధువుల మధ్య, స్నేహితుల మధ్య సయోధ్య కుదర్చడానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కోరుకున్న ఉద్యోగం లభించడం మీ మానసిక ఆనందానికి కారణం అవుతుంది. యోగా, మెడిటేషన్‌ పట్ల దృష్టి కేంద్రీకరిస్తారు. మొండి బకాయిలు వసూలవుతాయి. అప్పులు తీరుస్తారు. సాంస్కృతిక, క్రీడారంగాలలో విశేషంగా రాణిస్తారు.  రాజకీయ పలుకుబడి ఏర్పడుతుంది. తల్లిదండ్రుల అభిమతానికి అనుగుణంగా నడుచుకుంటారు. ఫైనాన్షియల్‌ స్కీమ్‌లకు సంబంధించిన విషయాలలో దూరంగా ఉండండి. శాడిస్టు అధికారుల వల్ల కొద్దికాలం ఇబ్బందిపడతారు. ఫాస్ట్‌ఫుడ్‌ వ్యాపారం, బేకరీలు, హాస్టల్స్, బ్యూటీపార్లర్స్, స్టేషనరీ, సుగంధ ద్రవ్య వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. సంవత్సర ద్వితీయార్ధంలో వృత్తి ఉద్యోగాల్లో అనుకూల మార్పులు ఉంటాయి. ఇతర భాషలలో కూడా ప్రావీణ్యత సాధించగలిగితే మరిన్ని మంచి ఫలితాలను అందుకోగలమని భావిస్తారు. కఠినమైన బాధ్యతలను విజయవంతంగా నిర్వహిస్తారు.  కళ్ళు అలసటకు లోను కాకుండా జాగ్రత్తలు తీసుకోండి. కార్యాలయంలో సమస్యలు సమసిపోతాయి. చాలా విషయాలలో గతంలో కంటే సానుకూల వాతావరణం ఏర్పడుతుంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement