వృశ్చికం రాశి ఫలాలు | Ugadi Panchangam 2019 | Scorpio Horoscope 2019-20 in Telugu - Sakshi
Sakshi News home page

వికారినామ సంవత్సర (వృశ్చిక రాశి) రాశిఫలాలు

Published Sun, Mar 31 2019 12:25 AM | Last Updated on Tue, Apr 2 2019 6:33 PM

2019 To 2020  Scorpio Zodiac Sign Horoscope - Sakshi

ఈ రాశివారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది. ద్వితీయంలో శని కేతువుల సంచారం, ద్వితీయ, తృతీయ స్థానాలలో గురు సంచారం, అష్టమంలో రాహు సంచారం, గురు శుక్ర మౌఢ్యమిలు, గ్రహణాలు ప్రధానమైన ఫలితాలను నిర్దేశిస్తున్నాయి. విద్య, సాంస్కృతిక, వైజ్ఞానిక రంగాలలో, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అనుకూల ఫలితాలు సాధిస్తారు. వాహనసౌఖ్యం ఏర్పడుతుంది. గృహనిర్మాణం చేస్తారు. పాత శత్రువులే నూతన కోణంలో తారసపడతారు. వారిని ఎదుర్కొనవలసి ఉంటుంది. స్త్రీలతో వైరం వద్దు. సాధ్యమైనంతవరకు చర్చలు వాయిదా వేయడం, తప్పుకోవడం మంచిది. వివాదాస్పదమైన విషయాలన్నీ మధ్యవర్తుల సహాయ సహకారాలతో, రాజకీయ పరపతితో పరిష్కారం అవుతాయి. మహోన్నత ఆశయాలను ఉన్నతస్థాయి వ్యక్తులే కాక, సామాన్య జనం వల్ల కూడా సాధించవచ్చునని నిరూపిస్తారు. సంతాన క్రమశిక్షణ విషయంలో సంవత్సర ద్వితీయార్ధంలో ఇబ్బందికరమైన సంఘటనలు జరుగుతాయి. తెలివితేటలతో వాటిని సరిదిద్దగలుగుతారు. ఎముకలకు సంబంధించిన అనారోగ్యం ఇబ్బంది పెడుతుంది. జల, వాయు, ఆహార కాలుష్యం వలన స్వల్ప ఇబ్బందులు కలవరపెడతాయి. మీ కుటుంబసభ్యులు, ఆత్మీయులు మీ పరపతిని స్వప్రయోజనాలకు వాడుకోవడం జరుగుతుంది. మీ నిజాయతీ, శ్రమ, మంచితనం, వృత్తి పట్ల అంకితభావం నోటి దురుసుతనం వలన మసిబారే అవకాశం ఉంది. మీ సహనానికి పరీక్షలు ఎదురవుతాయి. బంధువర్గంలో భేదాభిప్రాయం తొలగిపోవటం వలన ముఖ్యమైన బాధ్యతలని తేలిగ్గా నెరవేర్చే వీలు కుదురుతుంది. రాజకీయ లబ్ధి పొందుతారు. వ్యవసాయం, జలసంబంధిత విషయాలు అనుకూలిస్తాయి. మీకు అండదండలుగా ఉండే అధికారులకు స్థానచలనం కలుగుతుంది. తదుపరి వచ్చే అధికారుల వలన అంతకంటే ఎక్కువ మేలు జరుగుతుంది. ఇప్పటి మీ ఉన్నతస్థితికి కారణం వారసత్వంగా ఆస్తులు, భూములు లభించటమే కారణం అని, ఆస్తి రావలసిన దానికన్నా అధికంగా రావడం వల్లనే బాగుపడ్డారనే వదంతులు వ్యాపిస్తాయి. వృత్తిలో మీకు లభించవలసిన ప్రమోషన్ల కోసం అంతర్గత పోరాటం తప్పనిసరి అవుతుంది. మీకు న్యాయం జరుగుతుంది. ప్రింటింగ్‌ సమాచార సాధనాల ఖర్చు, స్టేషనరీ ఖర్చులు అధికం అవుతాయి.

వ్యాపార విస్తరణలో భార్యవైపు సహాయ సహకారాలు లభిస్తాయి. చాలా విషయాలలో నిక్కచ్చిగా వ్యవహరిస్తారు. కూతురు విషయంలో విశేషమైన అభిమానం, మినహాయింపులు ఉంటాయి. కష్టాలు భయపెడతాయి కానీ పడదోయవు. సహచరవర్గం ఉన్నతస్థానాలలో ఉంటారు. సహాయ సహకారాలు అందించడానికి వాళ్ళకు స్వాతంత్య్రం ఉండదు. మీ ప్రతి విజయానికి మరొకరిని కారణంగా చూపిస్తారు. విలాసవంతమైన జీవితం గడుపుతారు. సలహాలు చెప్పే మేధావులుగా రాణిస్తారు. ముఖ్యస్థానాలలోని వారికి సర్వస్వం మీరే అవుతారు.  నిందలు ప్రచారంలోకి వస్తాయి. సొంత రహస్యాలను సొంత మనుషులు బయట పెట్టనంత వరకు ఇబ్బందులు రావు. విదేశీ వ్యవహారాలు, షేర్ల బిజినెస్‌ల విషయంలో అధిక శ్రమ అవసరం. ఉన్నతాధికారుల వద్ద మంచి అభిప్రాయం, అభిమానం సంపాదించుకుంటారు. మిమ్ములను కూలదోయాలని కుట్రలు పన్నే వర్గం విజయం సాధిస్తారేమోనన్న దిగులు ఉంటుంది. బాల్యమిత్రులు, బంధువర్గంలోని వాళ్ళతో ఏర్పడిన విభేదాలు వృత్తి ఉద్యోగాలపై ప్రభావం చూపిస్తాయి. స్త్రీ దేవతామూర్తుల ఆరాధన వల్ల విశేషమైన మేలు జరుగుుతుంది. ఆర్థికంగా సంవత్సర ప్రథమార్ధం అంత ప్రోత్సాహకరంగా ఉండదు. విద్యాసంబంధిత విషయాలకు ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగంలోనూ, వృత్తిలోనూ ప్రమాదకరమైన వ్యవహారాలను విజయవంతంగా ఎదుర్కొంటారు. విదేశాలకు సంబంధించిన వ్యహారాలు లాభిస్తాయి. పెద్దవాళ్ళతో, సమాజంలో పరపతి కలిగిన వారితో విభేదాలు ఏర్పడతాయి. నిర్మోహమాటమైన మీ మాటలు, చేతలు మిమ్మల్ని రక్షిస్తాయి. మీడియా వల్ల మానసిక వేదనకు గురి అవుతారు. నైతికధర్మం కలిగి సర్వదా మీ యందు ప్రేమానురాగాలు కలిగిన వ్యక్తులు మీ దృష్టిలో పడతారు. వాళ్ళకి ఇన్నాళ్ళు సహాయపడలేక పోయినందుకు విచారించి తగిన న్యాయం చేస్తారు. ఇందువల్ల మీ వర్గం బలోపేతం అవుతుంది. ప్రతిష్ఠాత్మకమైన సదస్సులు, విందులు నిర్వహించి మీ కార్యదక్షతను నిరూపించుకుంటారు. స్పెక్యులేషన్‌ లాభిస్తుంది. పన్నులు వసూలు చేసే అధికారుల వల్ల వేధింపులకు గురయ్యే అవకాశం ఉంది. భాగస్వాములతో వివాదాలు వస్తాయి. భూముల వల్ల అధికలాభం పొందుతారు. ఉద్యోగంలో బదిలీ వేటు ఆఖరి క్షణంలో తప్పుతుంది. బెట్టింగులు, కోడిపందాలు, పేకాటలకు దూరంగా ఉండండి. పదిమందికి బాగోగులు చెప్పే స్థానంలో ఉన్న మీరు మీకంటే చిన్నవాళ్ళతో నీతులు చెప్పించుకోవలసిన పరిస్థితులు ఏర్పడకుండా జాగ్రత్తపడండి.

అమ్మాయి నచ్చితే జాతకం కుదరకపోవడం, జాతకం కుదిరితే అమ్మాయి నచ్చకపోవడం, ఇవన్నీ బాగుంటే అమ్మాయి తరఫువారు సంబంధం వద్దు అనడం, దగ్గరి దాకా వచ్చిన సంబంధాలు వెనక్కి వెళ్ళిపోవడం మానసిక వేదనకు కారణం అవుతాయి. ఎట్టకేలకు ఒకమంచి సంబంధం కుదురుతుంది. విద్యాసంబంధ విషయంలో,   పోటీపరీక్షల సంబంధ విషయంలో ఎంతో శ్రమించి మంచి ఫలితాలు సాధిస్తారు. పబ్లిక్‌ సర్వీస్‌ కమీషన్‌ పరీక్షలు, బ్యాంక్‌ పరీక్షలు, టీచర్‌ పరీక్షలు మొదలైన వాటికి ఎంపిక అవుతారు. ఐఏఎస్‌., ఐపీఎస్, ఐఐటీ వంటి ప్రతిష్ఠాత్మకమైన వాటికి ఎంపిక అవుతారు. సమాజంలో గౌరవాన్ని పెంచుకోగలుగుతారు. నలుగురికి సహాయపడాలనుకునే మీ మనస్తత్వానికి తగిన విధంగా  భగవంతుడు మంచి ఫలితాలను అందిస్తాడు. రాజకీయ వ్యూహాలు లాభిస్తాయి. రాజకీయంగా వచ్చిన నూతన బాధ్యతలను వినూత్నంగా నిర్వహిస్తారు. శత్రువర్గాన్ని లెక్కచేయరు. మోసం చేస్తున్న వ్యక్తులను, సంస్థలను ప్రజాబలంతో ఎదుర్కొంటారు. అందరికీ న్యాయం జరిగేలా కృషి చేస్తారు. ఆరోగ్య సంబంధిత విషయాలలో, సెల్ఫ్‌ డ్రైవింగ్‌ విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. సహోదర సహోదరీవర్గానికి గోప్యంగా సహాయం చేస్తారు. సన్నిహితులు, మిత్రులు మీ ద్వారా సహాయం పొందుతారు. నూతన వ్యాపారం కలిసిస్తుంది. ప్రస్తుతం చేస్తున్న వ్యాపారంలో మార్పులు చేస్తారు. దీర్ఘకాలిక ఋణాలు తీర్చివేస్తారు. మానసిక ప్రశాంతత కలిగి ఉంటారు. మీకు రావలసిన ధనం మాత్రం సులభంగా చేతికి అందదు. కుటుంబంలో అశాంతి వాతావరణం లేకుండా మీకు మీరుగా చాలా వరకు సర్దుకుపోతారు. స్త్రీల వల్ల చికాకులు, విభేదాలు సంభవిస్తాయి. మీ ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యాసంస్థలకు, సేవాసంస్థలకు ప్రఖ్యాతి లభిస్తుంది. ప్రతి విషయాన్నీ రెండు వైపులా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. కొన్ని విషయాలలో నిర్ణయం తీసుకోకపోవడమే మంచి నిర్ణయం అని భావిస్తారు. అభిప్రాయాలు కుదరక కొంతమంది వ్యక్తులతో శాశ్వతంగా లేక చట్టబద్ధంగా విడిపోవడం జరుగుతుంది. అత్యవసరంగా సంతకాలు చేయాల్సిన పరిస్థితి వస్తే నిపుణుల సలహాలు తీసుకుని సంతకాలు చేయండి. ప్రేమవివాహాలు కలిసిరావు. పునర్వివాహం కోసం ప్రయత్నించే వారికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. కాంట్రాక్టులు, సబ్‌–కాంట్రాక్టులు, లైసెన్స్‌లు, లీజు పొడిగింపు వంటి అంశాలు వివాదస్పదం అవుతాయి. ప్రతి చిన్న విషయానికి పలుకబడి ఉపయోగించవలసి వస్తుంది. రాజకీయ నాయకుల జోక్యం అనివార్యం అవుతుంది. కొన్ని విషయాలలో మొండిగా ప్రవర్తిస్తారు. కొన్ని విషయాలలో సమయోచితమైన నిర్ణయాలు తీసుకుంటారు. మందుల వ్యాపారులకు, వైద్యులకు, లోహపు వ్యాపారులకు, కూరగాయల వ్యాపారులకు, చేతివృత్తి పనివారికి, విద్యారంగంలో ఉన్నవారికి, పరిశోధనారంగంలో ఉన్నవారికి, ఆహారధాన్యాల వ్యాపారులకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది. వస్త్రవ్యాపారం చేసేవారికి ఫలితాలు మద్యస్థంగా ఉన్నాయి. కళా, సాహిత్య రంగాలలో మంచి ప్రఖ్యాతి లభిస్తుంది. మీడియాపరంగా ఖ్యాతి లభిస్తుంది. హోల్‌సేల్, రిటైల్‌ వ్యాపారులకు అనుకూలంగా ఉంది. నిర్మాణరంగంలో ఉన్నవారికి అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. కోళ్ళఫారాలు, పశువుల పెంపకం లాభిస్తాయి. వ్యాపారాన్ని విస్తరింప చేస్తారు. సిబ్బందికి మీ మనస్తత్వం అర్థంకాక విధిలేని పరిస్థితులలో మిమ్మల్ని అంటిపెట్టుకుని ఉంటారు. గ్రూపు రాజకీయాలకు దూరంగా ఉండటం మేలని గ్రహిస్తారు. రావలసిన ధనం చేతికి అందుతుంది. అన్యభాషలు నేర్చుకునే అవకాశం లభిస్తుంది. కొన్ని సందర్భాలలో చదివిన చదువుకు, చేసే ఉద్యోగానికి సంబంధం ఉండదు. కొత్త బాధ్యతలను సరిగ్గా నిర్వర్తించలేకపోతున్నారని ఆరోపణలు వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వం నుండి రావలసిన బిల్స్, చెక్స్, క్లెయిమ్స్‌ సరైన సమయంలో రాకపోవడం వల్ల ఋణాలు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. వైరివర్గం చర్యల వల్ల ఉద్యోగంలో బదిలీ సూచిస్తుంది. సమాజంలో మీ ప్రతిష్ట పెంచే విధంగా ఓ మంచి అవకాశం వస్తుంది. ఖరీదైన వస్తువుల పట్ల జాగ్రత్త అవసరం. చోరభయం పొంచి వుంది. మాటల చాతుర్యంతో అందరినీ ఆకట్టుకుని పనులు పూర్తి చేసుకుంటారు. తెలివిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునే వ్యక్తులు దగ్గరవుతారు. భూముల క్రయవిక్రయాలలో లాభపడతారు. సంవత్సర ప్రథమార్ధంలో వృత్తి ఉద్యోగాలపరంగా మంచి స్థానం లభిస్తుంది. తరతమ భేదం లేకుండా అందరికీ సహాయం చేస్తారు. మీ సన్నిహితవర్గాన్ని బలోపేతం చేసుకుంటారు. 

స్త్రీలకు ప్రత్యేకం: ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ సంవత్సరం బాగుంది. విద్యారంగంలో అనుకూల ఫలితాలు ఉన్నాయి. మంచి మార్కులు వస్తాయి. పోటీ పరీక్షలలో మంచి మార్కులు వచ్చినా ఇంటర్వ్యూలలో మాత్రం చేదు అనుభవాలు ఎదురవుతాయి. ఎట్టకేలకు మిమ్మల్ని అదృష్టం వరిస్తుంది. స్వయం శక్తితో ఉద్యోగం సాధిస్తారు. సన్నిహిత బంధువుల విమర్శలు బాధించినా పైకి లెక్కచేయనట్లు ఉంటారు. మీ నుండి ఎలాంటి వ్యతిరేకత లేకపోయినా ముఖ్యమైన వాళ్ళు మీ నుండి దూరంగా వెళ్ళిపోతారు. మిమ్మల్ని ఉద్దేశ్యపూర్వకంగా ఇబ్బందిపెట్టే వాళ్లను వదిలించుకోవాలని నిర్ణయించుకుంటారు. చాలా సందర్భాలలో మీకు ఇష్టంలేని విషయంపైనే చర్చించవలసి వస్తుంది. మీరు ఓ ప్రశాంతమైన దారిలో వెళుతుంటే మిమ్మల్ని మరో మార్గంలోకి నడిపించడానికి మీ మిత్రులు ప్రయత్నిస్తారు. మీ మీద ఎటువంటి ప్రలోభాలు పనిచేయవు. జీవితాశయాన్ని సాధిస్తారు. రాజకీయ పదవిప్రాప్తి. మీ మీద ఉన్న బాధ్యతలను సక్రమంగా నెరవేర్చుతారు. కొన్ని పనులు మీరు అనుకున్నట్లుగా జరుగుతాయి. గతంలో లభించిన రాజకీయపదవి వల్ల లాభపడతారు. మీకున్న అవకాశాలను ఉపయోగించుకొని పదిమందికీ ఉపయోగుపడే పనులు చేస్తారు. విలువైన బంగారు ఆభరణాలు, స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. అవివాహితులైన వారికి వివాహకాలం. సంతానం లేని వారికి సంతానప్రాప్తి కలుగుతుంది. పునర్వివిహా ప్రయత్నాలకు అనుకూలకాలం. వృత్తి ఉద్యోగాలపరంగా మీరు తీసుకున్న నిర్ణయాలు వివాదాస్పదం అవుతాయి. ఎవరు ఎంతగా భయపెట్టినా జంకకుండా మీ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తారు. వెన్నుచూపి పారిపోవటం మీ చరిత్రలో లేదు అని నిరూపిస్తారు. దివారాత్రులు వృత్తి ఉద్యోగాలలో శ్రమించినా గుర్తింపు రాని ఉద్యోగాలను మానేసి మరొక చోట ఉద్యోగం చూసుకుందామని భావిస్తారు. చిన్న చిన్న వ్యాపారాలు చేసి లాభాలు గడిస్తారు. ప్రభుత్వ స్కీములు మీకు ఉపయోగపడతాయి. తనఖా పెట్టిన వస్తువులను విడిపిస్తారు. ప్రతిష్ఠాత్మకమైన విద్యాలయాలలో సీటు లభిస్తుంది. కోరుకున్న చదువును అభ్యసించగలుగుతారు. విదేశాలలో చదువుకోవాలని చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి. కీళ్ళనొప్పులు, చెవి, ముక్కు, గొంతు వంటివి బాధిస్తాయి. కోర్టు వ్యవహారాలలో మీకు న్యాయం జరుగుతుంది. కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకుంటారు. దూరప్రాంతంలో ఉన్న ఆత్మీయుల నుంచి  సహాయ సహకారాలు లభిస్తాయి. పిల్లల పెంపకం విషయంలో భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తుతాయి. సహోదర సహోదరీ వర్గానికి రహస్యంగా ఆర్థిక సహాయం చేస్తారు. బ్యూటీపార్లర్స్‌ లాభాల బాటలో నడుస్తాయి. పుట్టింటి యోగక్షేమాలు విచారించడం పెద్ద నేరంగా పరిగణించబడుతుంది. మీరు ఫోన్‌లలో, సెల్‌ఫోన్‌లలో ఏం మాట్లాడుతున్నారో తెలుసుకోవాలని మీ ఇంట్లోవారే పరిశోధిస్తారు. ఈ సంవత్సరం ప్రథమార్ధం, ద్వితీయార్ధం రెండూ బాగున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement