కథ: రచయిత | a story about lyrics and script writing | Sakshi
Sakshi News home page

కథ: రచయిత

Published Sun, Feb 23 2014 4:22 AM | Last Updated on Sat, Sep 2 2017 3:59 AM

కథ: రచయిత

కథ: రచయిత

 ఐదేళ్ల కింద ఒక సంఘటన జరిగింది. అది నా జీవితాన్ని ఒక మలుపు తిప్పింది. నేను తొలి యవ్వనంలో ఉన్నప్పుడే ‘సాహిత్యం’ నా జీవిత ధ్యేయం అనుకున్నాను. నా రచనల వల్ల గొప్ప కీర్తీ రాలేదు, పెద్ద ధనవంతుడినీ కాలేదు. కాని, నేను పంపిన ప్రతి రచనా అచ్చవుతూ ఉండేది. ఫలితంగా కొంత పారితోషికం అందుతూ ఉండేది. రోజులు దొర్లిపొయ్యేవి.
 
 ఆ రోజుల్లోనే నేను పెళ్లి చేసుకున్నాను. నా సంపాదనతో సంసారం సాగుతుందన్న నమ్మకం కలిగాకే  చేసుకున్నాను. ఇక అప్పటినుండి ఒక పద్ధతి ప్రకారం రచనలు చేయసాగాను. ఏ పత్రికకు పంపితే త్వరగా అచ్చవుతుంది, ఏ పత్రిక ఎంత పారితోషికమిస్తుంది వంటి విషయాలన్నీ ఆలోచించి రచనలు పంపేవాణ్ని. అదే విధంగా జీతం అందినట్లు నికరంగా కొంత ఆదాయం వస్తూ ఉండేది. ఆ డబ్బుతో నేను, నా భార్య హాయిగా కాలం గడిపేవాళ్లం. పెళ్లయిన తొలి రోజుల్లో ఉండే ఉత్సాహం వేరే విధంగా ఉంటుంది. పెళ్లయిన పాఠకులకు ఆ విషయం తెలిసే ఉంటుంది. మేఘాలు ఆత్మీయంగా అనిపిస్తాయి. గాలి మృదువుగా తాకుతుంది. పెళ్లయిన తొలి రోజుల్లోని వెచ్చదనం, ప్రేమ, మనసును శుభ్రంగా కడిగేస్తాయి.
 
 అలాంటి ఆనందమయమైన రోజుల్లో నా సృజనాత్మకతనంతా జోడించి ఓ కథ రాశాను. దాని పేరు ‘అతని భార్య ముద్దుల చెల్లెలు’. అది రాస్తున్నప్పుడే నా ఆత్మవిశ్వాసం పెరిగింది. రాసిన తరువాత నా భార్యను కూచోబెట్టి వినిపించాను. ‘అద్భుతమైన కథ’ అందామె. అందులోని విషాదం భరించలేక కళ్లనీళ్లు పెట్టుకుంది. ‘‘ఈమధ్య కాలంలో ఇంత గొప్ప కథ రాలేదు. ఇది మీకు మంచి పేరు తెస్తుంది’’ అంది.
 ఆ మరునాడే కథను పత్రికకు పంపాను. నా కథల్లో మంచివాటిని ప్రచురించిన సుప్రసిద్ధ పత్రిక అది. వెంటనే సంపాదకుడి నుండి ఉత్తరం వచ్చింది. ఉత్తరం నిండా ప్రశంసలే! కథ చదవగానే సంపాదకుడికి కళ్లలో నీళ్లు తిరిగాయట. చిన్నప్పుడు ఎప్పుడో వాళ్ల నాన్న కొడితే ఏడవడమే గానీ, ఆ తరువాత నలభై ఏళ్లలో ఆయన ఎప్పుడూ ఏడవలేదట.
 
 సంపాదకుడి ఉత్తరం మా జీవితానికి కొత్త వెలుగుల్ని ప్రసాదించింది. ఆకాశం మరింత అందంగా, మరింత ఎత్తుగా కనిపించసాగింది. ఆహారం మరింత రుచిగా ఉండసాగింది. ఆ కథ ప్రచురణ జరిగింది. పాఠకులు జేజేలు పలికారు. ఇతర పత్రికలవాళ్లు కూడా ఈ కథను గురించి రాశారు. మహోన్నతమైన సాహిత్యంగా అభివర్ణించారు. కథా రచయితగా నా స్థానం సుస్థిరమైంది. అలా ఒకటి రెండు నెలలు గడిచిపోయాయి. మూడో నెలలో ఎప్పుడూ లేని ఎదురు దెబ్బొకటి తగిలింది. నా కథొకటి తిరిగొచ్చింది.
 తిప్పి పంపింది ఎవరో కాదు, నా కథల్ని ప్రచురించి నాకో స్థానాన్ని ఇచ్చిన సుప్రసిద్ధ పత్రికా సంపాదకుడే! ఏమైంది ఈసారి? అని ఆలోచిస్తూండగానే నా కథ స్క్రిప్టు మధ్యలోంచి అతడి ఉత్తరం కింద పడింది. అందులో సారాంశం ఇలా ఉంది.
 
 ‘‘మీరు పంపిన ఈ సరికొత్త కథ బావుంది. కానీ ఇటీవల ప్రచురించిన మీ కథ ‘అతడి భార్య ముద్దుల చెల్లెలు’ ఉన్న స్థాయిలో ఇది లేదు. మీ గురించి, మీ స్థాయి గురించి మా పాఠకులకు ఒక అవగాహన ఏర్పడింది. దాన్ని మేము తారుమారు చేయదల్చుకోలేదు.’’ నా గొంతు ఆరిపోయింది. రచన ప్రారంభించిన తొలి దశలో కూడా నా రచనలేవీ తిరిగివచ్చేవి కావు. కాని, రచయితగా ఇంత ఎత్తుకు ఎదిగాక తిరిగిరావడం జీర్ణించుకోలేకపోయాను. నేను, నా భార్య నిశ్శబ్దంగా ఉండిపోయాం. తిరిగి వచ్చిన కథని వెంటనే మరో పత్రికకు పంపాను. ఆశ్చర్యమేమంటే అక్కడి నుండి కూడా కథ తిరుగుటపాలో తిరిగొచ్చింది. పైగా ఆ సంపాదకుడి అభ్యర్థనను మోసుకొచ్చింది.
 
 ‘‘మీరు ప్రఖ్యాత కథారచయితలు. ‘అతడి భార్య ముద్దుల చెల్లెలు’ కథ అమోఘం! ఆ స్థాయిగల కథ ఏదైనా పంపండి. ఈ కథ తిప్పి పంపడానికి మనస్కరించడం లేదు. కాని తప్పని పరిస్థితి. అర్థం చేసుకుని మా అభ్యర్థనను మన్నించండి.’’ ఈ కథలో లోపం ఏమిటీ? మరోసారి జాగ్రత్తగా చదివి చూద్దాం అనింది నా భార్య. అంతా బాగానే ఉంది అని అనిపించింది. ‘‘మీరు లోగడ రాసిన ఏ కథకూ ఇది తీసిపోదు. అయితే ‘అతడి భార్య ముద్దుల చెల్లెలు’ కథలాగా ఇది విషాదాంతం కాదు. అందువల్ల అంతటి సంచలనం సృష్టించలేదు’’ అని అందామె.
 
 ‘‘ప్రతి కథా సంచలనం సృష్టించాలంటే ఎలా? అదొక సంఘటన ఆధారంగా ప్రత్యేక పరిస్థితుల్లో రాసింది’’  అన్నాను. ఒక గొప్ప విజయం సాధించానన్న గర్వంతో ఈ కథని నిర్లక్ష్యంగా రాశానా అనే అనుమానం కలిగింది. అదే విషయం నా భార్యను అడిగాను. ఆమె నా కథలకు మొదటి శ్రోతే కాదు, మంచి విమర్శకురాలు కూడా! కథలో ఎక్కడా ఏమాత్రం లోపం లేదనీ, అలాంటి ఆలోచనలు అనవసరమనీ ధృవీకరించింది. దాంతో ఆ కథను పక్కన పెట్టి మరో కొత్త కథ సాపు ప్రతి సిద్ధం చేశాను. ప్రచురించే అవకాశం ఆ సుప్రసిద్ధ పత్రికకే ఇద్దామని దానికి పంపించాను. గోడకు కొట్టిన బంతిలా తిరిగి రావడమే కాదు, సంపాదకుడి మిత్రవాక్యం కూడా మోసుకొచ్చింది. ‘‘మీ కథ ‘అతడి భార్య ముద్దుల చెల్లెలు’ ప్రచురించిన సంచిక కోసం పాఠకులు ఇంకా ఉత్తరాలు రాస్తున్నారు. పాత సంచిక కావాలని కొందరు, పునర్ముద్రించమని కొందరు అడుగుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ స్థాయి లేని ఈ కథ ప్రచురించడం బాగుండదు. మరో గొప్ప కథ రాసి పంపించండి. పాఠకులు ఎదురుచూస్తున్నారు’’ అని!
 
 ఎటూ పాలుపోక వరుసగా మరో నాలుగు పత్రికలకి పంపాను. ఒకరి తర్వాత ఒకరు దాదాపు అలాంటి అభిప్రాయాన్నే వెలిబుచ్చారు. ఒక గొప్ప విజయం వెనుక ఇంత పరాజయం ఉంటుందని ఊహించలేదు. రచనలు అచ్చు కావడం లేదు. చేతికి డబ్బు అందడం లేదు. ‘అతడి భార్య ముద్దుల చెల్లెలా! నువ్వు నా బతుకును వీధిన పడేశావు కదే!’
 
 ‘ఒక గొప్ప కథ రాయడానికి కొన్ని కొన్ని పరిస్థితులు దోహదం చేస్తాయి. అలాంటి పరిస్థితులు, అలాంటి ఆలోచనలు పునరావృతం కావాలని కోరుకోవడంలో అర్థం ఉందా? ఆ కథ నేను పెళ్లయిన తొలి రోజుల్లో రాశాను. అలాంటి కథ మళ్లీ రాయాలంటే మళ్లీ పెళ్లి చేసుకోవాలా? చేసుకున్నా తొలి అనుభవం ఎలా వస్తుంది? మలి అనుభవం తొలి అనుభవం వలె ఎలా ఉంటుంది? ఈ సంపాదకులకు బుద్ధి లేదు. పాఠకులకూ బుద్ధి లేదు’ అని గొణుక్కున్నాను.
 
 ఒకరోజు మధ్యాహ్నం వీధిలో నడుస్తూ ఉండగా, బార్బెల్ కనిపించాడు. నేను రచన ప్రారంభించిన తొలి దశలో ఆయనకు కవిగా, రచయితగా మంచి పేరుండేది. ఆ రోజుల్లో అప్పుడప్పుడూ ఆయన సలహాలు తీసుకుంటూ ఉండేవాడిని. చాలా కాలం తర్వాత అతను కనిపించేసరికి ప్రాణం లేచొచ్చింది. అతణ్ని చూస్తే బీదతనంతో మగ్గిపోతున్నాడని తెలుస్తూనే ఉంది. కాని అతని ముఖంలో చిరునవ్వు వెలుగుతూనే ఉంది.
 ‘‘ఏమోయ్! మంచి ఊపులో ఉన్నావ్. ఎక్కడ విన్నా నీ పేరే వినబడుతోంది. కాని ఏమిటిదీ? ఇంత దిగాలుగా ఉన్నావూ?’’ అన్నాడు బార్బెల్. నేను నా కథనంతా వివరంగా చెప్పాను. దానికతడు పెద్దగా నవ్వి, ‘‘నా గది ఇక్కడికి దగ్గరే. ఓసారి వస్తావా? నీతో కొంచెం మాట్లాడాలి’’ అన్నాడు. ‘సరే’ అని అతనితో బయలుదేరాను. మురికివాడలో చాలా చిన్న గది. ఆ గదిలోని మంచం మీద కప్పుకునే దుప్పటి కూడా లేదు. వార్తాపత్రికలు మందంగా అంటించి, దుప్పటిలా చేయబడి ఉంది. మరోవైపు కొన్ని పుస్తకాలు, ఇంకోచోట మేకులు తయారుచేసే యంత్రం ఉన్నాయి.
 
 ‘‘నేనొకప్పుడు పెద్ద పేరున్న కవిని’’ అని అన్నాడు... తాడుతో వేలాడదీసిన కాగితం చూపిస్తూ.
 ‘‘భలేవారు. నాకు తెలియదా ఏం? మీ కవిత ‘నిచ్చెన’ నాకు కంఠతా వచ్చేసింది’’ అన్నాను నేను వినయంగా.
 
 ఆ పెద్దాయన కళ్లు ఆనందంతో మెరిశాయి. ‘‘ఇదిగో ఈ కాగితం అదే! నా బతుకును సర్వనాశనం చేసిన ఆ కవితను ఇలా ఉరితీశాను’’ అని నవ్వాడు. అచ్చయిన నిచ్చెన కవిత పేజీ చూరుకు వేలాడుతోంది. ‘‘నేనూ నీలాంటి పరిస్థితే ఎదుర్కొన్నాను. ఏం చేయాలో తోచక వేరే బతుకుదెరువు చూసుకున్నాను. ప్రస్తుతం మేకులు తయారుచేసి అమ్ముకుంటూ పొట్టపోసుకుంటున్నాను’’ అని చెప్పాడు బార్బెల్. ఎలా బతకవలసినవాడు ఎలా బతుకుతున్నాడు? కళల్ని కళాకారుల్ని ఆదుకునేవారే లేరా? బార్బెల్  నుండి సెలవు తీసుకుని బయలుదేరాను. ఇల్లు చేరేసరికి జ్వరం వచ్చినట్లయ్యింది. నా భార్య గాబరాపడి విషయమేమిటని అడిగింది. గొప్ప కవిత్వం రాసి, దీన స్థితిలో బతుకుతున్న బార్బెల్ విషయం చెప్పాను.
 
 ‘‘మనమూ ఇక మేకులు తయారుచేసుకోవాలేమో. నేనైతే ఆ పనిలో మీకు సహాయపడగలను’’ అంది నవ్వుతూ. లోన విషాదం తొలుస్తున్న నవ్వని మా ఇద్దరికీ తెలుసు. వీలైనంత త్వరగా ఏదో ఒక పని ప్రారంభించాలి. నాలుగు డబ్బులు సంపాదించాలి. లేకపోతే పస్తులుండాల్సి వస్తుంది. కాలం గడ్డుగా, గుడ్డిగా కదులుతోంది.
 మెదడులో ఆలోచనలు పుంఖానుపుంఖాలుగా మొలకెత్తుతున్నాయి. కలంలో బలం ఏమాత్రం తగ్గలేదు. కొత్త కథలు, వ్యాసాలు తయారవుతూనే ఉన్నాయి. అవి బావుంటున్నాయని నా భార్య ప్రోత్సహిస్తూనే ఉంది. కాని అచ్చేసేవాడే లేడు. రాయడం మాని మరో పని వెతుక్కోవడంలో అర్థం లేదనిపించింది. ఒకరోజు ఆ ప్రముఖ పత్రిక కార్యాలయానికి వెళ్లాను. నా మంచి కథలన్నీ ప్రచురించి అతను, అతని పత్రికా లాభపడ్డారు కదా! ఆ మాత్రం ఆదరం చూపరా యేం? సంపాదక మిత్రుడు తను ఉత్తరంలో రాసిన విషయాలే మళ్లీ రికార్డు వేశాడు.  ‘‘ఏ కొద్దిమంది రచయితలో చేరుకునే మహోన్నత స్థానానికి చేరుకున్నారు. కీర్తి జాజ్వల్యమానంగా ప్రకాశిస్తోం’’దన్నాడు.
 
 ‘‘ప్రకాశం కాదు నయనా! ఆ మంట నన్ను దహిస్తోంది’’ అని వాస్తవాన్ని కక్కుకున్నాను. బతుకు భారమైపోయిందనీ, రచనలు అచ్చువేసి పారితోషికం ఇప్పించకపోతే రెండు మరణాలు ఖాయమనీ చెప్పాను.
 సంపాదకుడు మంచి మనిషి. విషయం గ్రహించాడు. సీరియస్‌గా ఆలోచించాడు. పరిష్కారమూ చూపాడు. ‘‘మీరు ఇటీవల రాసిన కొత్త కథలన్నీ ప్రచురించడానికి నాకు అభ్యంతరం లేదు. పారితోషికం కావాలంటే ముందుగా ఇప్పించడానికి కూడా అభ్యంతరం లేదు. అది మీ పేరుతో వేయాలంటేనే ఇబ్బందులున్నాయి. ఏదైనా కలంపేరుతో అచ్చేయమంటే వేసేస్తాను’’ అన్నాడు ధీమాగా. నా కీర్తి కాపాడాలని అతని తాపత్రయం. కాని మరో పేరుతో రచనలు ఇవ్వాలనగానే నా మనసులో ఎందుకో కలుక్కుమంది. అయినా గత్యంతరం లేదు. కీర్తి చాలా గొప్పది. కాని అది ఒక్కోసారి తిండి పెట్టదు. దాహం తీర్చదు. ఉండటానికి నీడనివ్వదు. ఆ కీర్తిని అలాగే భద్రపరిచి, అనామకుడిగా ఏదో ఒక పేరుతో పాఠకులకు పరిచయం కావడానికి సిద్ధపడ్డాను.
 
 రచనలన్నీ వరుస క్రమంలో సంపాదక మిత్రుడికి అంద జేశాను. అవి నా పేరుతో కాక, మరో కొత్త పేరుతో అచ్చు కాసాగాయి. ఇతర పత్రికలకు కూడా కొత్త పేరుతోనే రచనలు పంపసాగాను. వాళ్లు కూడా ప్రచురణ ప్రారంభించారు. నాలుగు వైపుల నుండి డబ్బులు రావడం ప్రారంభమైంది. అలా రెండు మూడేళ్లు గడిచాయి. మాకో బాబు పుట్టాడు. కొత్తగా పెళ్లి కావడంలో ఏ ఆనందం ఉందో, కొత్తగా తల్లిదండ్రులు కావడంలో కూడా అలాంటి ఆనందమే ఉందనుకుంటాను. ఆ ఉత్సాహంలో ఒక మంచి కథ రాద్దామని కూర్చున్నాను. ఎంతో భిన్నమైన కథ వచ్చింది. కథనం కూడా కొత్తగా, తాజాగా ఉంది. అద్భుతమైన శిల్ప నైపుణ్యం రాస్తున్నప్పుడే తెలిసిపోయింది. కథ వినిపించడానికి నా భార్యను పిలిచాను.
 
 ఆమె చంటివాణ్ని పక్క గదిలో పడుకోబెట్టి, నిండా ఉన్ని దుప్పటి కప్పి, నా ఎదురుగా వచ్చి కూర్చుంది. వెచ్చగా ఉండటానికి కుర్చీలు, నెగడు దగ్గరికి లాక్కున్నాం. భావగర్భితంగా రాసిన ఆ కథను భావయుక్తంగా చదివాను. అంతసేపూ మౌనంగా విన్న నా భార్య, ‘అద్భుతం’ అంది. ‘‘అతని భార్య ముద్దుల చెల్లెలు కథ ఎంత గొప్పగా వచ్చిందో ఇదీ అంతే గొప్పగా ఉంది’’ అని కూడా అంది.  కానీ, ఆ కథ మమ్మల్ని ఎంతటి కటిక దారిద్య్రంలోకి నెట్టిందో ఒకసారి కళ్లముందు తిరిగి, ఇద్దరం గంభీరమైపోయాం. ఇదే అచ్చయితే, ఈ మారుపేరుకు కూడా మరణం తప్పదేమో అని భయపడ్డాం. ఇప్పుడు మేమిద్దరమే కాదు, చంటివాడు కూడా ఉన్నాడు.
 ‘‘మిమ్మల్ని చూసి గర్వపడుతున్నాను.  కాని జాగ్రత్త! ఆత్మస్థైర్యం కోల్పోవద్దు. గతంలోని పరిస్థితి పునరావృతమైతే ఏం చేయడం అనేది ముందే ఆలోచించుకుందాం’’ అంది. ఆ రాత్రి నేనిక ఏమీ మాట్లాడలేదు. ఉదయమే లేచి కొత్తగా రాసిన గొప్ప కథని కవర్లో పెట్టాను. బజారుకు వెళ్లి ఇనుప సామానువాడి దగ్గర రేకుడబ్బా ఒకటి కొన్నాను. కవరు డబ్బాలో పెట్టి దాన్ని అక్కడే వెల్డింగ్ చేయించాను. ఇంటికి తిరిగొచ్చి అటక మీది నుంచి ట్రంకు పెట్టె కిందకి దించాను.
 
 ‘‘ఏమోయ్! మంచి ఊపులో ఉన్నావ్. ఎక్కడ విన్నా నీ పేరే వినబడుతోంది. కాని ఏమిటిదీ? ఇంత దిగాలుగా ఉన్నావూ?’’ అన్నాడు బార్బెల్. నేను నా కథనంతా వివరంగా చెప్పాను.
 
 ‘‘ఏం చేస్తున్నారూ?’’ అంటూ వచ్చింది నా భార్య.
 ‘‘నిన్న రాసిన కొత్త కథ గొప్పగా ఉందన్నావే? ఆ కథను కవర్లో పెట్టి, కవర్‌ను రేకు డబ్బాలో పెట్టి వెల్డింగ్ చేయించాను. ఇక ఆ రేకు డబ్బా ఈ ట్రంకు పెట్టెలో పెట్టి తాళం వేస్తున్నాను’’ అని చెబుతూ, ‘‘రేపు బజారుకెళ్లినప్పుడు తాళం చెవి నదిలోకి విసిరేస్తాను’’ అంటూ తాళం చెవిని యేం చేయబోతున్నానో కూడా చెప్పాను.
 ‘‘అయ్యో! అలా ఎందుకూ?’’
 ‘‘ఎందుకంటే...’’ దీర్ఘం తీస్తూ ఆమెను దగ్గరికి లాక్కు న్నాను. ఆమె భుజాల మీద చేతులుంచి కళ్లలోకి చూశాను.
 ‘‘ట్రంకు పెట్టెలోని రేకు డబ్బాలో, రేకు డబ్బాలోని కవర్లో ఒక మహోన్నతమైన సాహిత్యపు గుళిక ఉందని నీకూ, నాకూ, ఆ తర్వాత మన అబ్బాయికీ తప్ప మరెవరికీ తెలియగూడదు. నా మరణానంతరం ఎవరైనా నా రచనల కోసం వస్తే, వారికి ఇది దొరుకుతుంది. నా అసలు పేరుతో ఈ అముద్రిత కథను అచ్చేసుకుంటారు. ఇప్పుడు మారుపేరుతో రాస్తున్న కథలు కూడా నావేనని తెలుసుకుంటారు. అప్పుడొచ్చే కీర్తి మన కుటుంబానికి ఏ విధంగానూ కీడు చేయలేదు. అందుకే ఈ జాగ్రత్త!’’ అని చెప్పాను.
 నా భార్య కళ్లలో సంతోషం, సంతృప్తి చూశాను.
 (సంక్షిప్త కథ)
 - ఇంగ్లిష్ మూలం: ఫ్రాంక్ ఆర్.స్టాక్‌టన్
 తెలుగు అనువాదం: డా॥దేవరాజు మహారాజు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement