
అభిమన్యుడు
శ్రీకృష్ణుడి చెల్లెలు సుభద్రకీ మేనబావ అర్జునుడికీ పుట్టిన అభిమన్యుడిలో అటు మేనమామ శ్రీకృష్ణుడి ఉజ్జ్వలమైన గుణాలూ ఇటు పితృపాదులైన పాండవు లందరి గుణాలూ గుదిగుచ్చినట్టు అవుపిస్తాయి. యుధిష్ఠిరుడి ధర్మ పరాక్రమమూ శ్రీకృష్ణుడి ధర్మశీలమూ భీమసేనుడి వీరోచితమైన కర్మతత్వమూ అర్జునుడి రూపమూ పరాక్రమమూ విలు విద్యా నైపుణ్యమూ నకుల సహదేవుల వినయశీలమూ అభిమన్యుడిలో రూపుగట్టి అవుపిస్తాయి. ‘అభి’ అంటే, అభిముఖంగా అని అర్థం; ‘మన్యు’వంటే దీప్తీ ఉత్సాహ మూను. మన్యువంటే కోపమనే అర్థం కూడా ఉంది.
చైతన్యమంతా లక్ష్యంమీద కేంద్రీకృతమై, లోపలి శత్రువుల మీదా బయటి శత్రువుల మీదా అదుపునూ సంయమనాన్నీ కనబరిచే తీవ్రమైన మనోభావమే అభిమన్యుత్వమంటే. తీవ్రంగా కేంద్రీకృతమై, అంటే దృఢమైన ధారణతో అంతటినీ ప్రకాశింప జేసే మనస్సు తాలూకు ధ్యానస్థితినే అభిమన్యు స్థితి అంటారు. దుర్యోధనుడు ద్రోణుణ్ని సేనా పతిగా చేసినప్పుడు, ‘ధర్మరాజును సజీవంగా పట్టుకొని తీసుకు రావాలి’ అని వరం అడిగాడు. ‘నేను యుధిష్ఠిరుణ్ని పట్టి తెస్తే, తరువాత ఏం చేద్దామని?’ అని ద్రోణుడు అడిగాడు. ‘మళ్లీ జూదమాడించి అడవులకు పంపుదామని. దానితో నాకు ఈ రాజ్యం చాలా కాలం ఉంటుంది.
అతన్ని చంపితే, తతిమ్మా పాండవులు మాలో ఎవర్నీ మిగలకుండా చంపేస్తారు. అంచేతనే అతనిచేత జూదమాడించి తిరిగి అడవులకు పంపించడమే నా ధ్యేయం’ అని దుర్యోధనుడు అనగానే, ద్రోణుడి మనస్సు చివుక్కుమంది. వరం ఇచ్చాడు గనక సర్ది చెప్పాడు. ‘ఎవడో ఒకడు, అర్జునుణ్ని రణానికి ఆహ్వానించి, మరో ప్రదేశానికి తీసుకొని పోతే, అతన్ని జయించి గానీ అర్జునుడు తిరిగిరాడు గనక, ఆ మధ్య కాలంలో ధర్మరాజును పట్టి ఇస్తాను’ అని ద్రోణుడు అన్నమాటను విని త్రిగర్త దేశాధిపతి సుశర్మ, సత్యరథుడూ సత్యవర్మా సత్యవ్రతుడూ సత్యేషువూ సత్యకర్మా అనే ఐదుగురు తమ్ముళ్లతో సహా అర్జునుణ్ని పక్కకు తీసుకొనిపోయి యుద్ధం చేస్తానని ముందుకు వచ్చాడు. ఈ ఆరుగురూ నలభై వేలమంది రథికులతో సహా చచ్చిపోయేంత దాకా అర్జునుడితో యుద్ధం చేస్తామని సంశప్తక శపథం చేశారు.
ద్రోణుడి సైన్యాధిపత్యంలోని మొదటి రెండు రోజులూ ధర్మరాజును పట్టుకోవడం కుదరనే లేదు. మొదటిరోజు ద్రోణుడు గరుడ వ్యూహాన్ని పన్నాడు. యుధిష్ఠిరుణ్ని భయం వెన్నాడింది. అయితే, ధృష్టద్యుమ్నుడి భరోసాతో రణాన్ని కొనసాగించాడు. ద్రోణుడి యుద్ధ పద్ధతిని చూసి దుర్యోధనుడు మురిసిపోయాడు. కర్ణుడు మాత్రం భీముడి గురించి భయపడుతూనే ఉండాలని హితవు చెబుతూనే ఉన్నాడు. అర్జునుడు సంశప్తక సైన్యంలో చాలా మందిని చంపేశాడు. నరకుడి కొడుకు భగదత్తుణ్నీ అతని భీకరమైన ఏనుగునీ కూడా వైష్ణవాస్త్రంతో చంపేశాడు.
రెండు రోజులైపోయినా తనకిచ్చిన వరాన్ని నెరవేర్చలేదని దుర్యోధనుడు ద్రోణుడితో నిష్ఠూరంగా మాట్లాడాడు. ద్రోణుడికి చాలా బాధవేసింది. ‘ఈ రోజు దేవతలకు అభేద్యమైన ఒక వ్యూహాన్ని పన్నుతాను. ఏదో ఒక యోగంతో అర్జునుణ్ని దూరంగా వెళ్లేలా చెయ్యి. ఎవడో ఒక మహాయోద్ధ అంతం కావడం ఖాయం ఈ రోజున’ అన్నాడు. సంశప్తక గణాలు మళ్లీ అర్జునుణ్ని చాలా దూరం తీసుకుపోయాయి.
మూడో రోజున చక్ర వ్యూహాన్ని పన్ని, ఆ చక్రపు ఆకుల మీదుగా అతి తేజస్వులైన చాలామంది రాజ కుమారుల్ని మోహరించాడు ద్రోణుడు. ఆ సైన్యానికి ముఖభాగంలో తానే నిలబడ్డాడు. జయద్రథుడూ అశ్వత్థామా అతని పక్కనే స్థాణువుల్లా నిలుచున్నారు. ఈ విధంగా వ్యూహాన్ని రచించిన ద్రోణుణ్ని ఎదుర్కో వడం అర్జునుడు లేని తరుణంలో మరొకడి వల్ల కాదని ఆలోచించి యుధిష్ఠిరుడు ఆ భారాన్నంతనీ కుర్రాడే అయినా దిట్ట అయిన సౌభద్రుడి భుజ స్కందాల మీద ఉంచాడు.
‘నాన్న నాకు ఈ చక్రవ్యూహాన్ని భేదించడమే ఉపదేశించాడు. కానీ ఏదైనా ఆపత్తి వచ్చి పడితే, ఆ వ్యూహం నుంచి బయటపడడమెలాగో నాకు చేతగాదు’ అని అభిమన్యుడన్నప్పుడు ‘నువ్వు వ్యూహాన్ని భేదిస్తే చాలు, నీ వెన్నంటి మేమందరం దానిలోకి చొరబడతాం. అందరూ నీ వెన్ను కాస్తూ ఉంటారు’ అంటూ యుధిష్ఠిరుడూ భీముడూ అతనికి ధైర్యం చెప్పారు. అభిమన్యుడు తన సారథి సుమిత్రుణ్ని తన కర్ణికారధ్వజాన్వితమైన రథాన్ని ముందుకు నడపమని ప్రచోదించాడు. అతను చక్రవ్యూహ ద్వారం నుంచి లోపలికి చొరబడినప్పుడు, యుధిష్ఠిరుడూ భీముడూ శిఖండీ సాత్యకీ నకుల సహదేవులూ ధృష్టద్యుమ్నుడూ విరటుడూ మొదలైనవాళ్లందరూ అభిమన్యుడి వెనక ఉండి రక్షించాలని ముందుకు ఉరికారు. కానీ సైంధవుడు పాండవుల్ని వ్యూహంలోకి చొరబడకుండా ఒక గట్టి గోడలాగ అడ్డు పడ్డాడు. ఇలాగ ఆపగలగడానికి కారణం అతనికి శివుడిచ్చిన వరం.
ద్రౌపదిని అపహరించుకుపోతూంటే భీమసేనుడూ అర్జునుడూ వచ్చి సైంధవుణ్ని ఓడించి బాగా అవమాన పరిచారు. ఆ అవమానంతో బాధపడుతూ శివుడి గురించి తపస్సు చేశాడు జయద్రథుడు. శివుడు ప్రత్యక్షమైనప్పుడు.. ‘నేను పాండవులను యుద్ధంలో అడ్డుకొని ఆపగలగాలి’ అని వరం కోరుకున్నాడు. ‘అర్జునుణ్ని తప్ప తతిమ్మా నలుగుర్నీ నువ్వు ఆపగలుగుతావు’ అని శివుడు వరమిచ్చాడు.
అప్పుడిచ్చిన ఆ వర ప్రభావం కొద్దీ ఈ రోజున సైంధవుడు అభిమన్యుడి వెనక వెళ్లబోతూన్న పాండవుల్ని ఆపగలిగాడు. కానీ ఆ వరమే అతని చావుకు బీజాన్ని వేసింది. ఈ అడ్డుకోవడం వల్లనే వ్యూహంలోకి చొరబడిన అభిమన్యుడు ఒంటరిగా పోరాడవలసి వచ్చింది, తిరిగి రాలేకపోయాడు కూడా. దానికి మూల్యాన్ని సైంధవుడు చెల్లించవలసి వచ్చింది.వ్యూహంలోకి చొరబడుతూనే ఒంటరి వాడైన సుభద్రాకుమారుడు తీక్షణమైన బాణాల జడివానతో కౌరవ సేనలకు ఊపిరాడకుండా చేసి, వాళ్లనందర్నీ పారిపోదామనిపించేలాగ నీరసపరిచాడు.
ఆమీద శల్యుణ్ని మూర్ఛితుడిగా చేయడంతో శల్యభ్రాత దాడిచేశాడు. అతని తలా మెడా చేయీ కాలూ విల్లూ గుర్రమూ గొడుగూ ధ్వజమూ అన్నీ ఒక్కసారిగా కోసి ముందుకు సాగిపోయాడు అసహాయ శూరుడైన అభిమన్యుడు. శ్రీకృష్ణుణ్నించీ అర్జునుణ్నించీ నేర్చిన అస్త్రాలను శ్రీకృష్ణా ర్జునుల్లాగానే అంత నేర్పుతోనూ ఉపయో గిస్తూ ద్రోణుడి సేనను గడగడలాడిం చాడు. ద్రోణుణ్నీ కర్ణుణ్నీ కృపాచార్యుణ్నీ అశ్వత్థామనీ కృతవర్మనీ బృహద్బలుణ్నీ దుర్యోధనుణ్నీ భూరిశ్రవసుణ్నీ శకునినీ ఇతర రాజుల్నీ రాజకుమారుల్నీ బాణాల్ని వేసి వేసారిపోయేలాగ చేశాడు.
అది చూసి ద్రోణుడు ‘ఈ అభిమన్యుడికి మరో వీరుడెవడూ సమానుడు కాలేడు, అతను తలచు కున్నాడంటే మన మొత్తం సేనను నాశనం చేయగలడు’ అంటూంటే దుర్యోధనుడు కర్ణ దుశ్శాసనులతో... ‘ఆచార్యుడు అభిమన్యుణ్ని చంపుదామనుకోవటం లేదు, మీరందరూ కలిసి అతని మీద దాడిచెయ్యండి’ అంటూ ఉసిగొలిపాడు. ఆ మాట విని దుశ్శాసనుడూ కర్ణుడూ అభి మన్యుడి మీదకు దూసుకొనిపోయారు. అభిమన్యుడు దుశ్శాసనుణ్ని దెబ్బతీశాడు. అది చూసి కర్ణుడు విక్రమించాడు గానీ, అతణ్ని ఒకేసారి డెబ్భై మూడు బాణాలతో కొట్టి, వ్యూహంలోంచి వెలుపలికి పోవ డానికి ప్రయత్నం చేశాడు. ఎండిపోయిన అడవిలో అగ్ని వ్యాపించినట్టుగా అభి మన్యుడు శత్రువుల్ని కాలుస్తూ కౌరవ సేన మధ్యలో దుర్నిరీక్ష్యంగా నిలుచున్నాడు.
బిక్కచచ్చి వణికిపోతూన్నవాళ్లను ఊరడిస్తూ ‘నేను అభిమన్యుణ్ని ప్రాణాలతో పట్టుకుంటాను చూడండి’ అంటూ శల్యుడి కొడుకు రుక్మరథుడు ముందుకు వచ్చాడు. అతను అభిమన్యుడి భుజాలను మూడు మూడు బాణాలతో వేధించాడు. బదులుగా అభిమన్యుడు రుక్మరథుడి విల్లు విరగ్గొట్టి, అతని భుజాలనూ తలనూ ఒకేసారి కోసి భూమ్మీద పడేశాడు. అప్పుడు చక్రవ్యూహపు ఆకుల స్థానాల్లో ఉన్న యుద్ధ దుర్మదులైన రాజపుత్రులు ఒక్కపెట్టున అర్జునుడి కొడుకును శర వర్షంతో ముంచెత్తారు. అది చూసి దుర్యోధనుడు ఆనందిస్తూ ‘అభిమన్యుడి పని ఇక అయిపోయింది’ అనుకున్నాడు. కానీ అభిమన్యుడు గాంధర్వాస్త్రాన్ని వేసి రథమాయను ప్రదర్శించాడు. ఆ రాజ పుత్రులందరూ ముక్కముక్కలైపోయారు.
ఇలా భగ్నమైన సైన్యవర్గాన్ని చూసి, ద్రోణుడూ అశ్వత్థామా బృహద్బలుడూ కృపుడూ కర్ణుడూ కృతవర్మా విపరీతమైన కోపంతో అభిమన్యుడి మీద విరుచుకు పడ్డారు. కానీ వాళ్లందర్నీ అభిమన్యుడు ఇట్టే విముఖులుగా చేసేశాడు. అప్పుడు దుర్యోధనుడి కొడుకు లక్ష్మణుడు అభి మన్యుణ్ని ఎదుర్కొన్నాడు. కొడుక్కోసం దుర్యోధనుడు పక్కనే నిలుచున్నాడు. లక్ష్మణుడు సుభద్ర కొడుకు భుజాలమీదా ఛాతి మీదా బాణాలతో దెబ్బ తీశాడు. బదులుగా కుబుసం విడిచిన పాములాగ బుసకొడుతూ ఒక భల్లాన్ని లక్ష్మణుడి మీద విసిరాడు అభిమన్యుడు. ఆ భల్లం దుర్యోధనుడు చూస్తూండగానే లక్ష్మణుడి తలను మొండెం నుంచి వేరు చేసేసింది.
దుర్యోధనుడు పుత్ర శోకంతో ఆక్రో శించాడు. ద్రోణుడిక్కూడా అర్జునుడికీ అభిమన్యుడికీ మధ్య ఏ రకమైన తేడా కనిపించలేదు. కర్ణుడేమో నిశ్చేష్ఠుడై పోయాడు. అప్పుడు కర్ణుడితో ద్రోణుడు ‘అభిమన్యుడి కవచం దుర్భేద్యం. అర్జునుడికి నేను చెప్పిన కవచ ధారణ విధిని ఇతను పాటించాడు. కానీ ఇతని విల్లు విరగ్గొట్టి నారిని ఛేదించవచ్చు. ఇతని గుర్రాల్నీ అటూ ఇటూ వెనక నుంచి కాపాడుతూన్న సారథుల్ని నాశనం చేయ వచ్చు’ అని ఉపాయాన్ని చెప్పాడు.
కర్ణుడు వెంటనే ఆ ఉపాయాన్ని అమలుపరుస్తూ రథాన్నీ ధనుస్సునీ విరగ్గొట్టాడు; కృతవర్మ గుర్రాలను చంపాడు; కృపుడు వెనకనున్న రక్షకులిద్దర్నీ కూల్చాడు. ఆ మీద ద్రోణుడితో సహా అందరూ కలిసి అతన్ని బాణవర్షంలో ముంచెత్తారు. అతని శరీరం రక్తసిక్తమైపోయింది. అయినా ధైర్యాన్ని విడవకుండా చక్రాన్ని తీసుకొని అపర శ్రీకృష్ణుడిలాగ విక్రమించాడు. కానీ అన్యాయంగా ఆరుగురు కలిసి అతని చక్రాన్ని ముక్కలు చేశారు. ఆమీద గదను తీసుకొని అభిమన్యుడు వాళ్లమీదకు ఉరికాడు. అశ్వత్థామ తాలూకు నాలుగు గుర్రాల్నీ పార్శ్వ రక్షకుల్నీ చంపాడు; శకుని తమ్ముడు కాలికేయుణ్ని నేలకొరికేలాగ మోదాడు; అతని డెబ్భై ఏడు మంది అనుచరుల్నీ సంహరించాడు.
అప్పుడు దుశ్శాసనుడి కొడుకు కోపంతో గదను తీసుకొని సౌభధ్రుడి మీద దాడిచేశాడు. తలమీద గదతో మోది అభిమన్యుణ్ని చంపేశాడు. పద్మ సరస్సును కకావికలు చేసిన వనగజంలాగ మొత్తం కౌరవ సైన్యంతో మూడు చెరువుల నీళ్లు తాగించి, అంతమందీ అధర్మంగా ఒకేసారి దాడి చేయడంతో... దుశ్శాసనుడి కొడుకు చేతిలో నేలకు ఒరిగిపోయాడు అభిమన్యుడు. సంసార చక్రవ్యూహంలో చిక్కుకొన్నా... అత్యంతమైన ధారణతోనూ సమాధితోనూ చివరదాకా పోరాడిన ఒక మహా సాధకుడి వారసుడిగా అభిమన్యుడి పేరు చిరస్థాయిగా నిలిచి ఉంటుంది.