
హ్యూమరం : తుపాను తరువాత
తుపాను వచ్చి పోయింతరువాత అధికారులొచ్చి వాలారు. మునిగి తేలకుండా ఉన్నవాళ్లు, తేలిన తరువాత కూడా మునిగిపోయినవాళ్ల లెక్కలు తీశారు. బతికి చచ్చినవాళ్లు, చస్తూ బతికేవాళ్ల పేర్లు రాసుకున్నారు. ఇళ్లూ వాకిలీ పోయి కిటికీలు మాత్రమే మిగిలినవాళ్లు, కిటికీలతో సహా కొట్టుకుపోయినవాళ్ల జాబితాలు తీశారు. తీరిగ్గా హైదరాబాద్ వెళ్లి నష్టం అంచనాకు కమిటీ వేశారు. స్టార్‌హోటళ్లలో సభ్యులు సమావేశమై అసలు తుపాన్లు ఎందుకొస్తాయనే విషయంపై ఇంకో కమిటీ వేశారు. సముద్రాలు ఉన్నంతకాలం తుపాన్లు వస్తూనే ఉంటాయని, సముద్రాలను లేకుండా చేయడం సాధ్యం కాదు కాబట్టి తీర ప్రాంతాల్లో ప్రజల్నే లేకుండా చేస్తే తుపాను వచ్చినా నష్టమేమీ ఉండదని ఆ కమిటీ తేల్చి చెప్పింది.
ఈ నివేదికపై కొంతమంది నిపుణులు చర్చించి, ప్రజలకు నేరుగా ఏమి చెప్పినా అర్థం కాదని, తమకు మంచి చేయాలని చూసేవారిని శత్రువులుగా పరిగణించడం ప్రజల ప్రాథమిక ధర్మమని వివరించారు. ప్రజలను ఖాళీ చేయించడం సాధ్యం కాదు కాబట్టి పెద్ద తుపానంటూ వస్తే సమస్య పరిష్కారమవ్వడమే కాకుండా జనాభా కూడా తగ్గిపోతుందని అన్నారు. తుపాను రాకపోతే తుపాను సృష్టించడం కోసం ఒక శాఖను సృష్టించి, దానికి వెయ్యి కోట్లు నిధులిచ్చారు. తుపాను వచ్చినా రాకపోయినా ఆ పేరుతో నిధుల్ని భోంచేయడం ప్రభుత్వాలు పుట్టినప్పటినుండీ ఉన్న ఆచారం కాబట్టి అన్ని తుపాను కమిటీల్లోనూ తమకు కూడా ప్రాతినిధ్యం ఇవ్వాలని ప్రతిపక్షాలు వాదించి ధర్నాకు దిగాయి.
అధికారంలో ఉంటే తినడం న్యాయమే కాని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా తినాలని చూస్తే, స్థూలకాయం వస్తుందని కోట్లాది రూపాయలు ఖర్చు చేసి ప్రభుత్వం ప్రకటనలిచ్చింది. ఇదిలా ఉండగా, తినడానికి తిండి లేదని తుపాను బాధితులు అలో లక్ష్మణా అని అరిచారు. లక్ష్మణుడనే తీవ్రవాద నాయకుడు ప్రజలకు నాయకత్వం వహిస్తున్నాడని అనుమానించిన ఇంటెలిజెన్స్ వర్గాలు రంగంలోకి దిగాయి. అదిగో పులి, ఇదిగో లక్ష్మణుడు అని టీవీలవాళ్లు బ్రేకింగ్‌లు ఇచ్చారు. ఇంతలో మళ్లీ తుపానొచ్చింది. జనం వణికి చచ్చారు. పోయినవాళ్లు పోగా మిగిలినవాళ్ల కోసం కమిటీలు దిగి కంప్యూటర్లు, కాలిక్యులేటర్లతో లెక్కలు మొదలెట్టాయి.
- జి.ఆర్.మహర్షి
మహర్షిజం
ఫ్యాక్షన్ సామెత:
బాంబునైనా భయభక్తులతో విసరాలి.
అమెరికా స్పెషల్:పులిగోరు పతకాన్ని పులికే అమ్మగలదు.
కోడి గజగజ వణికేదెప్పుడు?
తందూరి చికెన్‌ను చూసినప్పుడు.
పీక కోసేటప్పుడు స్వర్గాన్ని గురించి
వర్ణించడమే రాజకీయం!
ప్రజలు:
టౌన్ బస్సెక్కి ఢిల్లీ చూడాలనుకునేవాళ్లు.
నాయకులు:
ఢిల్లీ చూపిస్తామని వాగ్దానం చేసి గల్లీ దాటకుండా చేసేవాళ్లు.
కాంగ్రెస్ నాయకుల ప్రత్యేకత:
రాష్ట్రంలో రిహార్సల్స్ చేసి ఢిల్లీలో డైలాగులు మరిచిపోతారు.