మన మూలికలతో మెరుగ్గా జీవిద్దాం! | 'Ancient Living' products manufacturer | Sakshi
Sakshi News home page

మన మూలికలతో మెరుగ్గా జీవిద్దాం!

Published Sun, Mar 1 2015 1:01 AM | Last Updated on Sat, Jun 2 2018 7:27 PM

మన మూలికలతో మెరుగ్గా జీవిద్దాం! - Sakshi

మన మూలికలతో మెరుగ్గా జీవిద్దాం!

ప్రకృతికి దూరంగా బిజీబిజీగా పరుగులు తీస్తున్న ఆధునికత ఆరోగ్యాన్ని బలి తీసుకుంటోంది. అందచందాల కోసం కృత్రిమ మెరుగులతో సరిపుచ్చుకుంటూ సంతృప్తి పడుతోంది. ఈ క్రమంలో బిజీబిజీ గజిబిజి బతుకుల ఆధునిక తరానికి మన నేల సహజసిద్ధంగా ప్రసాదించిన ‘మన’మూలికలను చేరువ చేసే ప్రయత్నం పరిశ్రమగా రూపుదిద్దుకుని, పలువురికి ఉపాధినిస్తోంది.
 
హైదరాబాద్‌లోని జీడిమెట్ల పారిశ్రామిక ప్రదేశంలో ఉంది శ్రీనివాస ఇండస్ట్రియల్, ఆగ్రో ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. పదివేల చదరపు గజాల వైశాల్యంలో యాభై లక్షల పెట్టుబడితో నిర్మించిన దీనిలో అనేక యూనిట్లు పనిచేస్తున్నాయి. వాటర్ కూలింగ్ ప్లాంట్, కోల్డ్ స్టోరేజ్, డీ మినరల్ ప్లాంట్, మిక్సింగ్ ట్యాంక్, ప్లానెటరీ మిక్సర్, హోమోజినైజర్... వంటి  యంత్రాలు పనిచేస్తున్నాయి. పెదవులకు రాసే లిప్‌బామ్ నుంచి సబ్బులు, షాంపూలు, మసాజ్ ఆయిల్, గదిని పరిమళాలతో నింపేసే క్యాండిల్ వేపరైజర్, ఎసెన్షియల్ ఆయిల్, ఫేస్‌ప్యాక్‌ల లాంటి 50, 60 రకాల ఉత్పత్తులు తయారవుతున్నాయి. ‘ఏన్షియెంట్ లివింగ్’ పేరుతో పారిశ్రామికవేత్త కల్యాణి నడుపుతున్న పరిశ్రమ ఇది.
 
జీతం అందుకోవడం నుంచి...
కల్యాణి పుట్టింది హైదరాబాద్. చదివింది ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్. చదువయ్యాక ఉద్యోగం చేశారామె. పెళ్లి తర్వాత బెంగళూరులో కాపురం. సంతృప్తిగా సాగుతున్న జీవితంలో ఏదో అసంతృప్తి. ‘నాకు ప్రకృతి సహజమైన జీవనం ఇష్టం. మన సంస్కృతి మీద గౌరవం. ప్రాచీన జీవన విధానంలో ఆరోగ్యకరమైన సౌందర్యం ఉండేది. అన్‌వాంటెడ్ హెయిర్ పోవడానికి కస్తూరి పసుపు, మేని లావణ్యానికి దోహదం చేసే సాధనాల వంటివెన్నో ఉన్నాయి. ఎటువంటి దుష్ర్పభావాలూ లేని మన మూలికలను, వాటిలోని ఔషధగుణాలను వదిలేసి కృత్రిమ సౌందర్య సాధనాల మాయలో పడిపోతున్నాం. ఇదే మా నాన్నతో చెప్పినప్పుడు చాలా ప్రోత్సహించారు. అలా 2011లో నాతోపాటు నలుగురు ఉద్యోగులతో మొదలైన నా పరిశ్రమలో ఇప్పుడు 30 మంది ఉద్యోగులున్నారు’ అంటారు కల్యాణి.
 
మార్కెట్ తెలిస్తే...
కృత్రిమ సౌందర్యసాధనాలు స్వైర విహారం చేస్తున్న  తరుణంలో హానికారక రసాయనాలు లేని ఉత్పత్తులను తయారు చేయాలనుకోవడం సాహసమే. ‘నా ఉత్పత్తులను ప్రజల్లోకి తీసుకెళ్లడం అంత సులభం కాదని నాకు తెలుసు. అందుకే పరిమితంగానే తయారు చేస్తున్నాను. వినియోగదారుల్లో అవగాహన కల్పించడానికి ఆర్గానిక్ ఉత్పత్తుల గురించి వివరణాత్మకమైన కరపత్రాన్ని కూడా ముద్రించాను. అందులో భృంగరాజ్, మెంతులు, ఆమ్ల, మందార వంటి వాటిలో ఉండే సుగుణాలను వివరిస్తున్నాను. అంతకంటే ఎక్కువగా దైనందిన జీవితంలో ఆర్గానిక్ ఉత్పత్తులను ఎందుకు వాడాలనే విషయాన్ని వివరిస్తున్నాను. కస్టమర్ల నుంచి ఫీడ్‌బ్యాక్ కోరుతూ మా ఫోన్ నంబర్లు ఇస్తున్నాం. ఇదే నా ప్రచారాస్త్రం’ అంటారామె.
 
ఉత్పత్తి మొదలై నాలుగేళ్లు నిండినా ప్రకటనలు కనిపించకపోవడం గురించి మాట్లాడుతూ ‘ప్రకటనల హోర్డింగులకు డబ్బు వృథా చేయను. ప్రస్తుతం ఆర్గానిక్ స్టోర్స్‌కు సప్లయ్ చేస్తున్నాను. ఆన్‌లైన్‌లోనూ మార్కెట్ చేస్తున్నాను. స్పాలు, విమానాశ్రయాలు మా ఉత్పత్తులను ఉపయోగిస్తున్నాయి’ అన్నారామె. వన మూలికలను సమృద్ధిగా అందించిన నేల మనది. ఆ నేలలో జీవిస్తూ ఆరోగ్యంగా బతికే అవకాశాన్ని కోల్పోవద్దు- అనేది కల్యాణి సందేశం.
 రిపోర్టింగ్: వాకా మంజులారెడ్డి
 ఫొటో: రాజేశ్ రెడ్డి

 
‘తైల పాక్ విధి’ ప్రక్రియతో ఆయిల్స్ చేస్తున్నాం. సల్ఫేట్స్, పారాబెన్స్, సింథటిక్ ఫ్రాగ్నన్స్ లేకుండా షాంపూలు తయారు చేస్తున్నాం. తమిళనాడు, కేరళ, రాజస్థాన్, కశ్మీర్ వంటి అనేక చోట్ల నుంచి ముడిసరుకు సేకరిస్తున్నాం. దేశం బయటి నుంచి ఒక్కటి కూడా తీసుకోలేదు.
 - బొప్పన కల్యాణి ,‘ఏన్షియెంట్ లివింగ్’ ఉత్పత్తుల తయారీదారు. ఫోన్: 9550753535

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement