టీవీక్షణం : సీతామాలక్ష్మివి పాత కష్టాలే!
సినిమా రంగంలో నిలబడటం అంత తేలిక కాదు. కానీ టెలివిజన్ అలా కాదు... కాసింత గ్లామర్, ఇంకాసింత టాలెంట్ ఉంటే చాలు, నెత్తిన పెట్టుకుంటుంది. అందుకే సినిమాల్లో ఫెయిలైన శ్రద్ధా ఆర్య సీరియల్స్‌లో రాణిస్తోంది.
పలు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ చిత్రాల్లో నటించింది శ్రద్ధ. గొడవ, కోతిమూక, రోమియో, తింగరోడు, బాలరాజు ఆడి బామ్మర్ది చిత్రాలతో మనకు బాగా పరిచయం. కానీ గుర్తు చేసుకుంటే గుర్తు రావడం వేరు, గుర్తుండిపోవడం వేరు. శ్రద్ధ మొదటి రకం నటిగానే మిగిలిపోయింది. నటిగా ఇక్కడ మునిగిపోయిన ఆమె... ఆ మధ్య సడెన్‌గా సీరియల్స్‌లో తేలింది. ఇప్పటికి రెండు సీరియల్స్ చేసింది. ఇప్పుడు ‘తుమ్హారీ పాఖీ’ చేస్తోంది. లైఫ్ ఓకే చానెల్లో ప్రసారమయ్యే ఈ సీరియల్‌లో... పర స్త్రీ వ్యామోహంలో పడిన భర్తని తన వైపు తిప్పుకునేందుకు తపన పడే భార్యగా నటన అదరగొడుతోందనే చెప్పాలి. ిసినిమారంగం నిరుత్సాహపర్చినా, సీరియళ్లు మాత్రం తన ప్రతిభకు పట్టం కడుతున్నందుకు సంతోషపడుతోంది శ్రద్ధ!
సీతామాలక్ష్మివి పాత కష్టాలే!
టీఆర్పీల కోసం చానెళ్లు పరుగులు పెడుతున్నాయి. రోజుకో సీరియల్‌ని రంగంలోకి దింపుతున్నాయి. రకరకాల కథలు, రక్తి కట్టించే కథనాలతో ఇతర చానెళ్లను అధిగమించాలని చూస్తున్నాయి. అయితే ఈ పోటీలో పడి... పాత కథలకు కొత్త మేకప్ వేసి పట్టుకొస్తున్నాయి అప్పుడప్పుడూ. మాటీవీలో ప్రసారమవుతోన్న సీతామాలక్ష్మి సీరియల్‌ని చూస్తే అదే అనిపిస్తోంది.
ఓ మధ్య తరగతి భర్తకి ఇల్లాలు సీతామాలక్ష్మి. ఉత్తమురాలు, సౌమ్యురాలు. మంచి భార్య, మంచి కోడలు. భర్త పనిచేసే కంపెనీ యజమాని కళ్లు ఆమె మీద పడతాయి. ప్లేబోయ్ అయిన అతగాడు ఎలాగైనా సీతను పొందాలని రకరకాల ప్లాన్లు వేస్తుంటాడు. ఆ ప్రయత్నంలో భాగంగా సీత భర్తను ఇబ్బందులు పెడుతుంటాడు.
ఇలాంటి కథతో గతంలో బోలెడన్ని సినిమాలు, సీరియళ్లు వచ్చాయి. అయినా మళ్లీ అదే కథ, అవే కష్టాలు. ప్రవల్లిక, నాగేంద్రబాబు, భరణీశంకర్‌లు తమ అద్భుత నటనతో రక్తి కట్టిస్తున్నా... ఈ పాత సారా ప్రేక్షకులకి ఎంతని కిక్ ఇస్తుంది!
ఇప్పటి వరకూ రకరకాల క్రైమ్ షోలు వచ్చాయి. కానీ ‘ఇష్క్ కిల్స్’ మాత్రం కాస్త డిఫరెంట్. స్టార్స్ ప్లస్‌లో ప్రసారమయ్యే ఈ క్రైమ్ సిరీస్‌లో కేవలం ప్రేమ మూలంగా జరిగిన దారుణాలు మాత్రమే చూపిస్తారు. ఒక వ్యక్తి ఓ అమ్మాయిని ప్రేమించడం, ఆమె ఇంకొకరిని ప్రేమించడం, ఇతడు పగ తీర్చుకోవడం... తను ప్రేమించినవాడు మరో అమ్మాయిని ప్రేమించడంతో అతడి కోసం ఆ పిల్ల జీవితాన్ని నాశనం చేయడం... భార్యాభర్తల మధ్య మరో స్త్రీయో, పురుషుడో ప్రవేశించి కాపురాలు కూల్చడం... ఇలాంటివన్నీ చూపిస్తుంటారు. బాలీవుడ్ దర్శకుడు విక్రమ్‌భట్ ఈ షోకి డెరైక్టర్ కావడంతో మసాలా ఎక్కువే ఉంది. ప్రస్తుతానికి అందరూ ఆస్వాదిస్తున్నా... ఆ ఘాటును ఎన్నాళ్లు భరిస్తారో మరి!