గోరంత దీపం
ఇంటర్వ్యూ
హీరోయిన్ అంటే స్లిమ్‌గా ఉండాలి, మోడ్రన్‌గా రెడీ అవ్వాలి, గ్లామర్ ఒలకబోయాలి అంటారంతా. కానీ వీటిలో ఏదీ అవసరం లేదు, టాలెంట్ చాలు అంటుంది అవికా గోర్. మిగతా హీరోయిన్లంతా గ్లామర్ క్వీన్‌సలా మెరుస్తుంటే... తాను మాత్రం సంప్రదాయబద్ధంగా ఉంటూనే సంచలనాలు సృష్టిస్తానని నమ్మకంగా చెబుతోంది. తెలుగు చలన చిత్ర రంగంలో గోరంత దీపంలా వెలుగుతోన్న అవిక చెప్పిన మరిన్ని కబుర్లు చదవండి...
* మీ బ్యాగ్రౌండ్..?
నేను ముంబైలో పుట్టాను. నాన్న ఇన్వెస్ట్‌మెంట్ రంగంలో ఉన్నారు. అమ్మ నేచురోపతి డాక్టర్. అమ్మానాన్నలకు నేనొక్కదాన్నే.
* నటనపై ఆసక్తి ఎలా వచ్చింది?
ఎనిమిదేళ్ల వయసులో ఓ షాపింగ్ మాల్‌కి వెళ్లిన ప్పుడు, అక్కడి మ్యూజిక్‌కి నేను డ్యాన్స్ చేయడం మొద లెట్టాను. అప్పుడు ఎవరో నాన్నతో... ‘భలే డ్యాన్స్ చేస్తోంది, తనని యాక్టర్‌ని చేయండి’ అన్నారట. నాన్నకి కూడా అభ్యంతరం లేకపోవడంతో నన్ను నటిని చేయడానికి ఇష్టపడ్డారు. తర్వాత ‘బాలికావధు (చిన్నారి పెళ్లికూతురు)’ సీరియల్‌తో నా కెరీర్ ప్రారంభమైంది.
* దక్షిణాదిన చాన్స్ ఎలా వచ్చింది?
‘చిన్నారి పెళ్లికూతురు’తో నేను ఇక్కడ కూడా బాగా పాపులర్ అయ్యాను. అందుకే ‘ఉయ్యాల జంపాల’లో ఆఫర్ వచ్చింది. అంతకు ముందు హిందీ, తమిళం, గుజరాతీ, రాజస్థానీ చిత్రాల్లో కూడా అవకాశాలు వచ్చాయి. కానీ కొన్ని సన్నివేశాలు అభ్యంతరకరంగా ఉన్నాయి. అలాంటివి చేయడం ఇష్టం లేక ఒప్పుకోలేదు. కానీ తెలుగులో ఆ సమస్య లేదు. ‘ఉయ్యాల జంపాల’ క్లీన్ మూవీ. పైగా నా వయసుకు తగిన క్యారెక్టర్. దాంతో వెంటనే ఓకే అనేశా.
* ‘ససురాల్ సిమర్‌కా (మూడుముళ్లు)’ సీరియల్లో భార్యగా, కోడలిగా చేశారు. ఇంత చిన్న వయసులో అంత బరువైన పాత్ర ఎందుకు ఎంచుకున్నారు?
వయసు ఎంతయితే ఏంటి! నేనా పాత్రకి సూటవుతాను కాబట్టి వాళ్లు తీసుకున్నారు. చేయగలనన్న నమ్మకం నాకుంది కాబట్టి నేను చేశాను. ఈ వయసులో అమితాబ్‌గారు ‘పా’లో చిన్న పిల్లాడిగా చేయలేదా? ఆయన కంటే ఎంతో చిన్నదైన విద్యాబాలన్ ఆయనకు తల్లిగా చేయలేదా? యాక్టర్ అన్న తర్వాత అన్నీ చేయాలి. క్యారెక్టర్ డిమాండ్ చేస్తే ప్రెగ్నెంట్‌గా నటించడానికి కూడా రెడీ నేను.
* అందులో రొమాంటిక్ సీన్లు కూడా చేశారు..?
నటించడానికి సిద్ధపడిన తర్వాత నవ రసాలూ పండించాలిగా! అది నటన అని గుర్తున్నంత వరకూ ఇబ్బందిగా ఉండదు. అయినా సీరియల్‌లో ఎంత రొమాన్‌స ఉంటుంది చెప్పండి! పైగా అది అసభ్యంగా కూడా ఉండదు. ఉంటే నేను చేసేదాన్ని కాదు.
* మోడ్రన్‌గా ఉండటానికి ఇష్టపడరెందుకని?
పొట్టి పొట్టి స్కర్టులు, నిక్కర్లు సౌకర్యంగా అనిపించవు నాకు. కుర్తీ, గాగ్రా, చీర వంటివే బాగుంటాయి. అవే ఇష్టపడతాను, ధరిస్తాను.
* ఒకవేళ క్యారెక్టర్ డిమాండ్ చేస్తే?
నటన నా ప్రాణం. దానికోసం ఎంతయినా కష్టపడతాను. అయితే నా కుటుంబంతో కలిసి చూడలేని విధంగా నా సినిమా ఉండకూడదు. ఆ విషయంలో మాత్రం నో కాంప్రమైజ్.
* ఇప్పుడున్న హీరోయిన్లతో పోలిస్తే లావుగా ఉన్నారు. సన్నబడాలని లేదా?
అది నేను చేసే పాత్ర మీద ఆధారపడి ఉంటుంది. పాత్ర కోసం బరువు తగ్గాలంటే తగ్గుతా లేకపోతే పెరుగుతా. నిజానికి నాకు కాజోల్ అంటే ఇష్టం. అందుకే ఆమెలా బొద్దుగా ఉండటానికే ఇష్టపడతా.
* మీలో మార్చుకోవాలనుకునేది ఏదైనా ఉందా?
నేను ఫుడ్ లవర్‌ని. బాగా తింటాను. కంట్రోల్ చేసుకోకపోతే కెరీర్‌కి దెబ్బవుతుం దని అమ్మ చెబుతూంటుంది. అప్పుడు నిజమే కదా అనుకుంటా. తర్వాత మళ్లీ మామూలే.
* ఎవరినైనా ప్రేమించారా?
చిన్నప్పుడు ‘ఇష్క్ విష్క్’ సినిమా చూసి షాహిద్ కపూర్‌తో ప్రేమలో పడ్డాను.
* మరి ఇప్పుడు?
ప్రేమలో పడేంత, డేటింగ్ చేసేంత వయసు నాకింకా రాలేదు.
* ఫ్యూచర్ ప్లాన్స్?
ఏమున్నాయి! ప్రస్తుతానికి మంచి ఆఫర్‌స ఉన్నాయి. తెలుగులో చేస్తున్నా. హిందీలో కూడా ఓ సినిమాలో చాన్‌స వచ్చింది. రెండు చోట్లా సక్సెస్ కావాలన్నదే లక్ష్యం.