జర జాగ్రత్త!
స్మార్ట్‌ఫోన్స్ కొంత మేలు చేస్తూనే ఉన్నా... చాలా సందర్భాల్లో పిల్లల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయనీ, వాటిని పరిమితంగా వాడాలనీ, పిల్లల విషయంలో మరింత జాగ్రత్త పాటించాలని హెచ్చరిస్తున్నారు పరిశోధకులు. కేవలం స్మార్ట్‌ఫోన్ మాత్రమే గాక... డిజిటల్ టెక్నాలజీని ఉపయోగిస్తున్న ఆధునిక ఉపకరణాలన్నింటి విషయంలోనూ అప్రమత్తంగా ఉండాలని పేర్కొంటున్నారు. డ్యూక్ యూనివర్సిటీకి చెందిన స్టాన్‌ఫోర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీకి చెందిన మానసిక నిపుణులు ఇటీవల స్మార్ట్ ఫోన్‌లు, ఇతర ఆధునిక ఉపకరణాలతో పిల్లలపై పడుతున్న ప్రభావంపై తాజాగా ఒక అధ్యయనం నిర్వహించారు.
ఇందులో కొన్ని సానుకూలమైన అంశాలున్నాయి. స్మార్ట్ ఫోన్లు, ఆధునిక ఉపకరణాలు వాడే పిల్లల్లో అధికంగా యాంగై్జటీకి గురికావడం తక్కువ. కానీ కొన్ని అంశాలు మాత్రం ఆందోళనగొల్పేవిగా ఉన్నాయంటున్నారు అధ్యయనవేత్తలు. ‘‘సాంకేతికతను వాడుకోవడం తప్పు కాదు. అయితే దాన్ని అతిగా వాడటం వల్ల పిల్లల్లో మానసికమైన అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. అందులో చాలా ముఖ్యమైనవి ప్రవర్తనకు సంబంధించినవి’’ అంటూ హెచ్చరిస్తున్నారు ఈ అధ్యయనంలో పాలుపంచుకున్న మానసిక నిపుణులు.