
అతిలోక సుందరి మనసులో ఏముంది?
విశ్లేషణం
పూల రెక్కలు, కొన్ని తేనె చుక్కలు... రంగరిస్తివో, ఇలా బొమ్మ చేస్తివో... అసలు భూలోకం ఇలాటి సిరి చూసి ఉంటదా? కనక ఈ చిత్రం స్వర్గానికి చెంది ఉంటదా?... అని కవి పొగిడిన అతిలోక సుందరి శ్రీదేవి. ఆమె సౌందర్యం గురించి ఎవరూ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఆ అందాలరాశి మనసులో ఏముందో ఎవరికీ తెలీదు. తెలుసుకోవాలని ఆసక్తి అభిమానులందరికీ ఉంటుంది. కానీ ఎలా? ఆమెను కలిసి మాట్లాడి తెలుసుకునే అవకాశం అందరికీ రాదుగా.. మాట్లాడినా ఆమె మనసులో మాట చెప్తుందని గ్యారంటీ లేదుగా... అందుకే ఆమె హావభావాలను, మాటలను విశ్లేషించి మీకందిస్తున్నాం. ఇది కేవలం గోరంత మాత్రమే సుమా!
రిజర్వ్‌డ్ బ్యూటీ
శ్రీదేవి మాట్లాడేటప్పుడు గమనిస్తే గొంతు మంద్రస్థాయిలో ఉంటుంది. ఆమె మాటల్లో థింక్, ఫీల్, నో, సెన్సిటివ్, గెట్ లాంటి అనుభూతి ప్రధానమైన పదాలు ఎక్కువగా వినిపిస్తాయి. దీన్నిబట్టి ఆమెది ఫీల్ ప్రధానమైన వ్యక్తిత్వం అనిపిస్తుంది. కానీ ఆమె కనుల కదలికలు దాన్ని ధ్రువీకరించవు. ఆమె చూపు నేరుగా ఉంటుంది. ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు, ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు కంటి కదలికలు చాలా తక్కువగా ఉంటాయి. వారివైపు నేరుగా చూస్తారు. దీన్నిబట్టి ఆమె ఎదుటివ్యక్తిని గౌరవిస్తారని, వారు చెప్పేది ఆసక్తిగా ఉంటారని, తన సమాధానాల్లోనూ నిజాయితీగా ఉంటారని చెప్పవచ్చు. అయితే శ్రీదేవి గుంభనమైన వ్యక్తి. తన వ్యక్తిగత విషయాలను పంచుకోవడానికి అంతగా ఇష్టపడరు. తానెంతవరకు చెప్పాలనుకుంటున్నారో అంతవరకే చెప్తారే తప్ప, అంతకుమించి తెలుసుకోవాలని ప్రయత్నిస్తే.. ఒక నవ్వు నవ్వేసి వదిలేస్తారు. ఆ విషయం ఎలా తెలుసంటారా? మాట్లాడేటప్పుడు ఆమె చేతి వేళ్లను ఒకదానిలో ఒకటి బిగించి పట్టుకుని ఉంటారు, చేతి కదలికలు కూడా తక్కువగా ఉంటాయి. నవ్వు కూడా ఫోర్స్‌డ్‌గా ఉంటుంది. పెదవుల మీద మెరిసే నవ్వు కళ్లలో కనిపించదు. ఇవన్నీ పబ్లిక్‌లో ఆమె రిజర్వ్‌డ్‌గా ఉంటారని వెల్లడిస్తాయి.
ఫస్ట్ తెలుగు, నెక్స్ట్ తమిళ్
శ్రీదేవి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో పలు చిత్రాల్లో నటించిన విషయం అందరికీ తెలిసిందే. అలాగే చెన్నైలో పుట్టి, బోనీకపూర్‌ను పెళ్లాడి ముంబయిలో కాపురం పెట్టారు. మరి ఆమెకు ఏ భాషంటే ఇష్టమంటే చెప్పడం కష్టం. కానీ తెలుగంటే ఆమెకు మమకారం ఉంది. ఏ భాషంటే మీకిష్టమని ప్రశ్నించినప్పుడు ‘ఫస్ట్ తెలుగు, నెక్ట్స్ తమిళ్’ అని చెప్పేటపుడు ‘తెలుగు’ అన్న పదాన్ని నొక్కిచెప్పడంలో ఆ విషయం అర్థమవుతుంది. దాదాపు మూడు శతాబ్దాలపాటు వెండితెరపై ప్రేక్షకులను అలరించిన తర్వాత 15 సంవత్సరాలపాటు తిరిగి చూడకపోవడం... మీడియాతో కూడా పెద్దగా మాట్లాడకపోవడం... కుటుంబ జీవితానికి తానెంత ప్రాధాన్యం ఇచ్చారో వెల్లడిస్తుంది. వెండితెరపై తాను చేసిన పాత్రలో తానెంతగా ఒదిగిపోయారో, నిజజీవితంలో భార్య, తల్లి పాత్రల్లోనూ అంతగా ఒదిగిపోవడం ఆమె గొప్పతనం. ఏళ్లపాటు సినీ పరిశ్రమకు దూరంగా ఉన్నప్పటికీ... తనకు ఖ్యాతిని తెచ్చిపెట్టిన అందాన్ని, శరీర సౌష్టవాన్ని చక్కగా కాపాడుకున్నారు. మలిసారి ప్రవేశంలోనూ అంతే అందంతో ఆకట్టుకున్నారు.
నవతరం అమ్మ
‘‘ఏదీ కావాలని జరగదు, మనం కావాలని తీసుకునే నిర్ణయాలవల్లే ఏదైనా జరుగుతుంది’’, ‘‘ఈ కాలం పిల్లలకు ఏమీ చెప్పాల్సిన అవసరంలేదు. వాళ్లు వెరీ ఫోకస్‌డ్ అండ్ ఇంటలెక్చువల్’’... అని చెప్పడంలో జీవితం పట్ల, నవతరంపట్ల శ్రీదేవి అభిప్రాయమేమిటో మనకు తెలుస్తుంది. తన కుమార్తె జాహ్నవి హీరోయిన్ కావడం తనిష్టమైనా, తల్లిగా తాను బాగా చదువుకోవాలని, పెళ్లి చేసుకోవాలని కోరుకుంటున్నానని చెప్పడంలో శ్రీదేవి అమ్మ మనసు అర్థమవుతుంది. ప్రస్తుతం తాను అందాలతారకంటే అమ్మగానే ఎక్కువ ఆనందం పొందుతున్నారని తెలుస్తుంది.
-విశేష్, సైకాలజిస్ట్