‘‘ఆంధ్రదేశంలో తెలుగు వాళ్లు తమిళనాడుకు వలస పోవడానికి ఎన్నో రాజకీయ, సాంఘిక, మత కారణాలు కలవు. అందులో తురక రాజులు రాజ్యాంగం చేసేట ప్పుడు మన ఆడవాళ్లపై కన్ను పడి ఆశపడే కారణం చేత ఆ రాజుల చేతులో పడి మానాన్ని పోగొట్టుకోవడానికి ఇష్టపడక దక్షిణం దిక్కుకు పయనమై వచ్చేస్తిరి. ఆంధ్రదేశం నుండి అలా వచ్చేట ప్పుడు మావాళ్ల అనుభవాలు, పడిన కష్టాలు, మా ముత్తాత, అవ్వ, తాతలు వారి బిడ్డలకు, మనవళ్లు, మనవరాళ్లకు కథలు కథలుగా చెప్పేవారు. ఇట్ట ఆది నుంచి వచ్చిన కథలు మా అవ్వ నాకు చిన్నప్పుడు చెప్పేది. అట్టా ఆ కథను మళ్లీ మళ్లీ ఎన్ని సార్లు విన్నానో లెక్కలేదు. ఉత్తరాన్నుంచి ఎనిమిది వందల ఏళ్ల క్రిందట వలస వచ్చి ఇక్కడ అడవులను నరికి నేలను సాగులోనికి తెచ్చిన మా పెద్దల కథే గోపల్లె’’ అంటూ తమిళ సాహితీ లోకంలో ‘కీరా’ గా సుప్రసిద్ధులైన కీ.రాజనారాయణన్ తమ తెలుగు జాతి మూలాలను గూర్చి ‘గోపల్లె’ నవలకు సంతరించిన ముందుమాటలో విశదం చేశారు.
కీ. రా. పూర్తి పేరు రాయంకుల కృష్ణరాజు నారా యణ పెరుమాళ్ రామానుజ నాయకర్. ఎనిమిది శతాబ్దాల క్రిందట ఉత్తరాన ఉన్న ఆంధ్రప్రాంతం నుంచి తమిళనాడు పాండ్య మండలం (కరిచల్‌కాడు: నల్లరేగడి నేల)కు వలస వెళ్లిన కుటుంబానికి చెందిన వారు. వీరు తూత్తుకూడి జిల్లా కోవిల్పట్టి మండలం, ఇడై చేవల్ గ్రామంలో 1923 సెప్టెంబర్ 16న శ్రీకృష్ణ రామానుజం, లక్ష్మీ అమ్మ దంపతులకు జన్మించారు. 1965 నుంచి రచనా వ్యాసంగం ప్రారంభించి 1976లో ‘గోపల్లె గ్రామం’, దానికి కొనసాగింపుగా ‘గోపల్లె పురత్తు మక్కళ్’ పేరిట రెండో నవలను వెలువరించారు. నాటి గోపల్లె శతాబ్దాల కాలంలో పరిణామం చెందుతూ స్వాతంత్య్రోద్యమ కాలం నాటికి రూపుదిద్దుకున్న విధం ‘గోపల్లె పురత్తు మక్కళ్’ వివరిస్తుంది. దీనికి 1991లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది.
వర్షం లేక ఎండిన నేలతల్లి కథలను అక్షరీకరిం చడంలో కీరా సిద్ధహస్తుడు. వీరివి ఏడు కథాసంపు టాలు, నాలుగు నవలలు, మూడు వ్యాస సంకల నాలు అచ్చయినాయి. 1982లో వీరు తమిళ మాండ లిక పద నిఘంటువును రూపొందించారు. 1984లో ఆయన ‘‘కరిసై కథైగళ్’’ సంపుటానికి సంపాదకునిగా వ్యవ హరించారు. తమిళనాడు టెక్స్›్టబుక్ కార్పొరేషన్ (టీఎన్‌టీబీ) దీన్ని ఆంగ్లంలోకి అనువ దింపజేసి హార్పర్ కోల్లిన్స్ వారిచే ముద్రింపజేసింది. ఆ పుస్తకం మార్చి 2021లో వెలుగుచూసింది.
‘గోపల్లె’లో కథా సంవిధానం పఠితకు విశ్రాం తిని కలిగిస్తుంది. విషాదంలో అద్భుత మాయావాద రసం రంగరించి ‘గోపల్లె’ నవలను తీర్చిదిద్దారు. భారతీయ సంస్కృతి, వైదిక విజ్ఞానం, భారతీయ ఆత్మ ఆవిష్కరణ నవల అంతటా పరుచుకొని ఉంటుంది. కథలో అతీతం, వర్తమానం కలిసి నడుస్తూ ఉంటాయి. పాశ్చాత్య సాహితీ విమర్శకులు చెప్పిన ‘మాజికల్ రియలిజం’, మహాభారతంలో వేదవ్యాసుడు ఆవిష్కరించిన అద్భుత రసావిష్కరణ ‘గోపల్లె’లో ఆవిష్కరించటం విశేషం. ‘గోపల్లె’ గ్రామం నవలను నంద్యాల నారాయణ రెడ్డి, ‘గోపల్లె పురత్తు మక్కళ్’ను ఆచార్య శ్రీపాద జయప్రకాశ్ తెలుగులోకి అనువదించారు. 1989లో పాండిచ్చేరి విశ్వవిద్యా లయం తమ ఫోక్ టేల్స్ డాక్యుమెంటేషన్ అండ్ సర్వే సెంటర్ శాఖకు కీరాను డైరెక్టర్‌గా నియమించి గౌరవించింది.
‘గోపల్లె’ నవలకు శరీరం తమిళమైతే ఆత్మ తెలుగు అన్నారాయన. ‘తెలుగు రాతల్ని (అక్షరాల్ని) చేత్తో తాకితే చాలుబా, అదే నిండా భాగ్యం’ అనే నిండైన తెలుగు భాషాభిమాని. ‘నాయన’, ‘భీష్మా చార్య’ అని తమిళులు ఆప్యాయంగా పిలుచుకున్న రాజనారాయణన్ ఈ మే 17న కన్నుమూశారు. ఆ సాహితీ మూర్తికి ఇదే అశ్రునివాళి.
వ్యాసకర్త ప్రముఖ సాహితీవేత్త.
డాక్టర్ తుర్లపాటి రాజేశ్వరి
మొబైల్: 90787 43851
Comments
Please login to add a commentAdd a comment