స్వెటర్‌... బెటర్‌! | Better sweater | Sakshi
Sakshi News home page

స్వెటర్‌... బెటర్‌!

Published Sat, Feb 4 2017 11:57 PM | Last Updated on Tue, Sep 5 2017 2:54 AM

స్వెటర్‌... బెటర్‌!

స్వెటర్‌... బెటర్‌!

‘‘ఎలాగూ కాసిన్ని రోజుల్లో చలికాలం వెళ్లిపోబోతోంది. పెద్ద పెద్ద వాళ్లకు ట్విట్టరు కామెంట్‌ పెట్టడం అన్నది ఎలాగైతే స్టేటస్‌కు సంబంధించిన అంశమో.... మనలాంటి మధ్యతరగతి వాళ్లకు సై్టలుకొట్టే స్టేటస్‌ను ప్రసాదిస్తుందిరా స్వెట్టర్‌! కానీ ఆ భోగం, వైభోగం ఇంకా కొద్ది రోజులే కదా’’ అంటూ ఏదో తాత్విక ధోరణిలో మాట్లాడుతూ, బాధపడుతూ ఉండగా మా రాంబాబు గాడిని కలిశాను నేను.

‘‘ఏమైంద్రా అంత బాధగా ఉన్నావ్‌?’’ అడిగా.
‘‘కొన్ని డ్యామేజీల నుంచి సైలెంటుగా పరువును కాపాడే అతి గొప్ప వస్త్రవిశేషమైన స్వెట్టరుకు ఇవే నా జేజేలు’’ అంటూ కాస్త ఆవేశపడ్డాడు రాంబాబు. ‘‘స్వెట్టరు వేసుకునేది గడగడ వణికించే చలిలో కాస్త వేడిగా. కంఫర్ట్‌గా ఉండటం కోసం. అంతే. దాంతో దక్కే పరువేమిట్రా బాబూ కొత్తగా?’’ అడిగా. ‘‘నీకు తెలియదు ఉరుకో. స్వెటర్‌ పరువు కాపాడే తీరే వేరురా. నాకు కొన్ని షర్ట్స్‌ ఉన్నాయి. వాటిల్లో కొన్నింటికి చంకలో కాస్త కుట్లు ఊడిపోయి ఉండటమో,  మధ్య బటన్‌ ఊడితగలడటమో వంటి అనర్థాలు జరిగి కొంత కొంత లోపాలుండటంతో తక్షణం తొడగలేని చొక్కాలవి.

 అయితే ఆ చొక్కల బొక్కలను కప్పేస్తూ ఎలాగూ మన స్వెట్టరు తొడిగేస్తాం కాబట్టి మన స్వెటర్‌ చలి నుంచి రక్షించడం అన్న ప్రాథమిక బాధ్యతను మాత్రమే గాక... పరువు పోకుండానూ అనుబంధ బాధ్యతలనూ నిర్వహిస్తుంటుంది. అంతటి సౌకర్యం ఉన్న ఆ స్వెట్టరును నాల్రోజుల్లో మూలకు పడేయాల్సి వస్తోంది కదా అని కాస్త విచారంగా ఉంది. నిజానికి దాన్ని మడతేసి వచ్చే ఏడాది దాకా బీరువాలో పెడుతున్నందుకు కాదు బాధ. అది లేనందువల్ల మరో నాలుగు షర్ట్‌లు.... రిపేరు చేయించే వరకూ అందుబాటులో ఉండవు కదా అన్నదే రా నా దిగులు’’ అన్నాడు రాంబాబు ‘‘పోన్లే ఆ త్వరగా ఆ నాలుగు షర్టులూ రిపేరు చేయించుకో. ఎప్పటికైనా తప్పదు కదా’’ అంటూ ఓదార్చబోయాన్నేనను.

‘‘నో... నో... ఎలాగూ ఆ తర్వాత కూడ మన కల్చరల్‌ ఎలిమెంటు అయిన ఆ మహనీయ స్వెటర్‌ను అలాగే కంటిన్యూ చేద్దామని నా ఉద్దేశం’’ అన్నాడు వాడు. ‘‘అది మన కల్చరల్‌ ఎలిమెంటా?’’ఆశ్చర్యంగా అడిగా. ‘‘అవును రా... స్వెటర్‌ మన సంప్రదాయ వస్త్ర విశేషం. సాంస్కృతిక చిహ్నం’’ ఏమాత్రం తొణక్కుండా జవాబిచ్చాడు.

‘‘అదెలా? స్వెటర్‌ అన్నది విదేశీయుల వస్త్రవిశేషం కదా’’
‘‘అప్పుడెప్పుడో పూర్వకాలం నుంచి గొంగడి కప్పుకోవడం అన్నది మన సంస్కృతిలో భాగం. పశువులను కాయడానికి వెళ్లేవాళ్లూ, పొలానికి కాపలా పడుకునేవారూ గొంగడిని వాడటం నీకు తెలియదా? మరప్పుడు అది మన సాంస్కృతిక, సాంప్రదాయక వస్త్రవిశేషం కాకుండా ఎలా ఉంటుంది’’ ‘‘గొంగడి మాట నేను మాట్లాడటం లేదు. నువ్వు స్వెటర్‌ను మన సంప్రదాయ వస్త్రం అంటున్నావు కదా. ఆ విషయం నాకు అర్థం కావడం లేదు’’

‘‘పిచ్చివాడా... స్వెటర్‌ అంటే ఏమనుకుంటున్నావు. గొంగడి తాను తీసుకొని చొక్కా రూపంలో కుట్టిస్తే అది స్వెటర్‌ అయినట్టే కదా! నీకో సత్యం చెబుతా విను. కుట్టిస్తే స్వెటర్‌... వదిలేస్తే గొంగళి... కావాలనుకుంటే ఇప్పట్నుంచి గద్దర్‌గారు గొంగళికి ప్రత్యామ్నాయంగా స్వెటర్‌ వాడొచ్చు. అంతగా తొడుక్కోవడం ఇష్టం లేదనుకో. హ్యాపీగా భుజం మీద వేసుకోవచ్చు. అప్పుడది అచ్చం గొంగళిలాగే కనిపిస్తుంది. కాకపోతే బ్లాక్‌ కలర్‌ గొంగళి క్లాత్‌తో కుట్టిస్తే మేలు. నాకు ఇంకో ఆలోచన కూడా వచ్చింది రా. అదే జరిగి ఉంటే అసలు కురుక్షేత్ర మహాభారత యుద్ధమే జరిగి ఉండేదికాదు’’‘‘ఏమిట్రా... ఇతిహాసాన్నే నివారించేంత అంత గొప్ప ఐడియా?’’ అంతులేని ఆశ్చర్యంతో అడిగా.

‘‘ఏం లేదురా.... ఒరేయ్‌... అలనాటి వస్త్రాపహరణం టైమ్‌లో ద్రౌపది గనక స్వెటర్‌ తొడుక్కొని ఉండి ఉన్నట్లయితే, లాగడానికి కొంగూ ఉండదు. గుంజడానికి చెంగూ దొరకదు. దాంతో దుశ్శాసనుడు అసలు వస్త్రాపహరణమే చేయలేకపోయేవాడు. దాంతో పాండవులకు అవమానమూ, మనకు మహాభారత యుద్ధమూ తప్పేవి. పైగా ఇన్సిడెంటు జరిగింది ఢిల్లీలోనే కాబట్టి అక్కడ కూలింగ్‌ ఎక్కువగానే ఉండేది కదా. ద్రౌపదికి అటు చలీ తప్పేది... ఇటు పాండవులకు అవమానమూ తప్పేది. దాంతో యుద్ధమూ తప్పేది’’ చెప్పాడు రాంబాబు. ‘‘ఒరేయ్‌... ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుందని విన్నాను...  గానీ నీ ఐడియా యుద్ధాన్నే తప్పించేదని ఇప్పుడే నాకు తెలిసింది రా. కానీ ఇలా తప్పుడు ఇమేజినేషన్స్‌ చేస్తుంటే నీ ఇమేజి దెబ్బతింటుంది చూడు’’ అంటూ హెచ్చరించాడు వాణ్ణి.
– యాసీన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement