ఒక లక్కీ సెంటిమెంట్...! | Bollywood stars to follow lucky sentiment formula | Sakshi
Sakshi News home page

ఒక లక్కీ సెంటిమెంట్...!

Published Sun, Oct 5 2014 2:25 AM | Last Updated on Sat, Sep 2 2017 2:20 PM

ఒక లక్కీ సెంటిమెంట్...!

ఒక లక్కీ సెంటిమెంట్...!

పంచామృతం: అదృష్టాన్ని నమ్ముకోనక్కర్లేదు. అయితే ఒక్కోసారి అదృష్టమే మనల్ని నమ్ముకొంటుంది. విజయం దిశగా నడిపిస్తుంది. మరి ఆ అదృష్టాన్ని అలా కలిసి వచ్చేలా చేసే కొన్ని సంఘటనలనూ మనం గుర్తిస్తాం. వాటినే సెంటిమెంట్స్‌గా భావిస్తూ పాటిస్తూ ఉంటాం. మరి ఇలాంటి సెంటిమెంట్లకు పెద్ద పెద్ద వాళ్లు కూడా అతీతులు కాదు.  అవి విజయాన్ని తెచ్చిపెడతాయనేది వారి విశ్వాసం. అలాంటి వారిలో కొందరు... వారి సెంటిమెంట్లు...
 
 షారూక్ ఖాన్...
 కింగ్‌ఖాన్‌ది కారు నంబర్ విషయంలో సెంటిమెంట్. కొత్త కారు కొనాలనిపించినప్పుడు ఏ మోడల్ కొనాలి, అందులోని ప్రత్యేకతలు ఏమిటి? అనే విషయాల కన్నా ఆర్టీఏ అధికారులను సంప్రదించి తనకు 555 నంబర్ కేటాయించగలరా? అనే విషయాన్ని వాకబు చేస్తాడట షారూక్. భారీ మొత్తం చెల్లించి మరీ ఆ నంబర్‌ను తీసుకోవడానికి షారూక్ వెనుకాడడని సమాచారం. ఒకవేళ ప్రస్తుతానికి 555 నంబర్ అందుబాటులో ఉండదని ముంబై ఆర్టీఏ అధికారులు చెబితే కారు కొనడాన్నే వాయిదా వేసేస్తాడంతే!
 
 సల్మాన్ ఖాన్...
 చేతికి ధరించే బ్రాస్‌లైట్‌ను సెంటిమెంట్‌గా భావిస్తాడు సల్మాన్. షూటింగ్ సమయంలో అడ్డు అనిపిస్తే తప్ప ఎప్పుడూ ఇది సల్మాన్‌చేతికి ఉంటుంది. తండ్రి సలీమ్‌ఖాన్ సల్లూకు దీన్ని బహుమతిగా ఇచ్చాడట. ఒకసారి దీన్ని పొగొట్టుకొన్న సల్మాన్‌కు ఇది తిరిగి దొరికేంత వరకూ మనసు కుదుటపడలేదని ఈ హీరో సన్నిహితులు అంటారు. అలాగే తనకు ఇష్టమైన వాళ్లకు కూడా కలిసొస్తుందనే హామీని జత చేస్తూ సల్లూ ఇలాంటి బ్రాస్‌లైట్‌ను బహుమతిగా ఇస్తుంటాడట.
 
 సచిన్ టెండూల్కర్...
 క్రికెట్ నుంచి రిటైర్ అయినప్పటికీ సచిన్ టెండూల్కర్ ఆట తీరును భారతీయ క్రికెట్ ఫ్యాన్స్ మరిచిపోలేరు. మరి క్రికెట్‌లో రాణించడానికి అతని శక్తిసామర్థ్యాలు, కృషిలే కారణం అనుకొన్నా.. టెండూల్కర్‌కు మాత్రం కొన్ని సెంటిమెంట్లు ఉన్నాయి. బ్యాటింగ్‌కు దిగే ముందు ముందుగా ఎడమకాలికి ప్యాడ్ కట్టుకోవడం టెండూల్కర్ అలవాటు. అలా చేస్తే సచిన్‌కు కొత్త ఆత్మవిశ్వాసం కలుగుతుందని ఆయనతో డ్రెస్సింగ్‌రూమ్‌ను పంచుకొన్న సభ్యులు చెబుతారు.
 
 టైగర్ వుడ్స్...
 ప్రసిద్ధ గోల్ఫ్ ఆటగాడు, ఆ ఆట ద్వారా అత్యంత ఎక్కువ సొమ్మును ఆర్జిస్తున్న వ్యక్తిగా గుర్తింపు ఉన్న టైగర్ వుడ్స్‌కు ఎరుపు రంగు అంటే సెంటిమెంట్. వాడే వస్తువుల విషయంలో ముందుగా ఎరుపుకు ప్రాధాన్యం ఇచ్చే వుడ్స్ గోల్ఫ్ మ్యాచ్  సందర్భంగా కూడా జేబులో ఎర్రటి గుడ్డను పెట్టుకొని బరిలోకి దిగుతాడు. అది తోడుంటే తనకు తిరుగుండదనేది వుడ్స్ విశ్వాసం.
 
 ఆమీర్ ఖాన్...
 పనిలో పర్ఫెక్షనిస్టుగా పేరు పొందిన ఆమీర్‌కు సెంటిమెంట్లు, సంప్రదాయాలు ఉన్నాయి! మరి ఆమీర్ వాటిని నమ్ముతున్నాడో లేదో కానీ.. పాటించడం అయితే జరుగుతోంది. క్రిస్‌మస్ సందర్భంగా విడుదలయ్యే సినిమాలు హిట్ కావడమే ఆమీర్ విషయంలో సెంటిమెంట్. 2007నుంచి ఇది మొదలైంది. ఆ సంవత్సరం తారేజమీన్ పర్ విడుదల అయ్యి సూపర్‌హిట్ అయ్యింది. ఆ తర్వాతి ఏడాది క్రిస్‌మస్ సందర్భంగా గజినీ వచ్చింది. మళ్లీ క్రిస్‌మస్‌కు త్రీ ఇడియట్స్, లాస్ట్ ఇయర్ క్రిస్‌మస్‌కు ధూమ్-3. ఈ విధంగా ఆమీర్‌కు క్రిస్‌మస్ సెంటిమెంట్ కలిసొస్తోంది. దాన్ని ఫాలో అవుతూ ఈ ఏడాది కూడా క్రిస్‌మస్‌కు ‘పీకే’ సినిమాను విడుదల చేయనున్నారు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement