వ్యక్తిగతం: నేను పెళ్లి చేసుకోవచ్చా?
డాక్టర్! నా వయసు 30 ఏళ్లు. పెళ్లి కాలేదు. కొన్నినెలలుగా సెక్స్‌పరమైన ఆలోచనలే రావడం లేదు. నేను శృంగారానికి పనికి వస్తానా? పెళ్లి చేసుకోవచ్చా? నా వేదన తొలగిపోయే మార్గం చూపగలరు.
- కె.బి.కె., హైదరాబాద్
సాధారణంగా పురుషుల్లో 18 నుంచి 28 ఏళ్ల వరకు పదేళ్లపాటుగా సెక్స్‌పరమైన కోరికలు, అంగస్తంభన ఎక్కువగా ఉంటాయి. ఈ వయసు దాటిన వారిలో సాంఘికపరమైన సమస్యలు ఉదా: ఉద్యోగ భద్రత, ఆర్థికపరమైన ఒత్తిళ్ల వల్ల అంగస్తంభన తగ్గుతుంది. వీర్యం పరిమాణం కూడా తగ్గిపోవడం చాలామందిలో కనిపిస్తుంది. అంతమాత్రాన వాళ్లకు లైంగిక సామర్థ్యం ఉండదని చెప్పడానికి వీలులేదు. శృంగారం పట్ల మీ ఆలోచనలు యాంత్రికంగా మారిపోవడం వల్ల మీకు ఈ సమస్య వచ్చి ఉండవచ్చు. సెక్స్ సామర్థ్యం డెబ్బయి ఏళ్ల వరకు కూడా ఉంటుంది. మీరు ఒకసారి హార్మోన్ పరీక్షలు చేయించుకోండి. అవసరమైతే పైప్ టెస్ట్ చేయించాల్సి ఉంటుంది. అన్ని పరీక్షలూ మామూలుగానేవుంటే మీరు నిర్భయంగా పెళ్లి చేసుకోవచ్చు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
నాకు 34 ఏళ్లు. పెళ్లయి నాలుగేళ్లు. ఇంకా పిల్లలు లేరు. ఈమధ్య ఎడమ వృషణంలో కొద్దిగా నొప్పి ఉంటోంది. సాయంత్రాల్లో ఈ నొప్పి ఎక్కువవుతోంది. వేరికోసిల్ అన్నారు. వీర్యకణాల సంఖ్య ఐదు మిలియన్స్ అని తేలింది. ఆపరేషన్ అక్కర్లేకుండా వేరికోసిల్ మందులతో నయం కాదా? వీర్యకణాల సంఖ్య పెరగడానికి మందులు ఏవైనా సూచించగలరు.
- ఎం.జె.ఆర్., విజయవాడ
వేరికోసిల్ అనేది వృషణంలోంచి చెడురక్తం తీసుకువెళ్లే రక్తనాళాల వాపు. దీనివల్ల రక్తం అక్కడే నిలిచిపోయి, వృషణం వేడెక్కడంవల్ల వీర్యకణాల సంఖ్య తగ్గుతుంది. ఎక్కువ మందిలో ఇది కారణం లేకుండా ఎడమవైపు ఎక్కువగా కనిపిస్తుంటుంది. దీనిని సర్జరీతోనే సరిచేయాల్సి ఉంటుంది. ఒకవేళ పిల్లలు పుట్టనివారిలో గ్రేడ్-2, గ్రేడ్-3 వేరికోసిల్ ఉండి వీర్యకణాల సంఖ్య తక్కువగా ఉంటే అప్పుడు కూడా సర్జరీ చేయవలసిందే! దానికి భయపడవలసిందేమీలేదు.
నాకు నలభై ఏళ్లు. ఇటీవల రక్తపరీక్షలో హెపటైటిస్-సి బయటపడింది. నన్ను చూసిన డాక్టర్ దీనికి మందు ఏమీ లేదన్నారు. అందుకే, ఏ రక్త పరీక్ష చేయాలన్నా, ఇంజెక్షన్ ఇవ్వాలన్నా చాలా జాగ్రత్త వహిస్తున్నారు. నేను ఒకే ఒక్కసారి, పదేళ్ల కిందట ఒక వేశ్యను కలిశాను. శారీరకంగా ఏ ఇబ్బందీ లేదు. హెపటైటిస్ వల్ల ప్రాణభయం ఏమైనా ఉందా? నేను నా భార్యతో మామూలుగానే శృంగారంలో పాల్గొనవచ్చా?
- జె.ఎస్., వైజాగ్
హెపటైటిస్ వైరస్‌లో ఎ, బి, సి అని మూడు రకాలు ఉంటాయి. ఇందులో హెపటైటిస్-బి, హెపటైటిస్-సి... రక్తమార్పిడి వల్లగానీ, సంభోగించడం వల్లగానీ ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తాయి. ఈ మూడు వైరస్‌లు వెంటనే శరీరానికి ఏ సమస్యా కలిగించకపోయినా, ఒకసారంటూ వచ్చాక ఎప్పటికీ శరీరంలోనే ఉండిపోతాయి. మనిషిలో రోగనిరోధకశక్తి తగ్గినప్పుడు ఈ హెపటైటిస్-బి, హెపటైటిస్-సి వైరస్‌లు పచ్చకామెర్లు వచ్చేలా చేస్తాయి. కొంతమందిలో హెపటైటిస్-సి అన్నది పది పదిహేనేళ్లపాటు దీర్ఘకాలికంగా కాలేయంలో ఉండి సిర్రోసిస్‌ను కలగజేస్తుంది.
అందువల్ల హెపటైటిస్-బి, హెపటైటిస్-సిలను ప్రమాదకరమైన వైరస్‌లుగా పరిగణిస్తారు. మీరు హెపటైటిస్-సి శరీరంలోకి ప్రవేశించిందంటున్నారు గనక, అది ప్రమాదకరంగా పరిణమించకుండా గ్యాస్ట్రోఎంటరాలజిస్టును సంప్రదించండి. దాన్ని నియంత్రించేలా ఆయన వైద్యం చేస్తారు. ఇక, తక్షణం మీ భార్యకు కూడా హెపటైటిస్-సి పరీక్ష చేయించండి. ఆమెకు ఆ సమస్య లేకపోతేగనక ముందుజాగ్రత్తగా వ్యాక్సిన్ వేయించాలి. వ్యాక్సిన్ కోర్సు పూర్తయ్యేవరకూ మీరు శృంగార సమయంలో కండోమ్ ఉపయోగించాలి.
నా వయసు 34. నా భార్యకు 30. మాకు ఇద్దరు పిల్లలు. ఇటీవల మా శృంగార జీవితం సవ్యంగా సాగడం లేదు. కార్యంలో పాల్గొన్న ప్రతిసారీ నాకు పురుషాంగంలోనూ, నా భార్యకు యోనిలోనూ మంట వస్తోంది. ఈ మంట వల్ల ఒక్కోసారి రెండు, మూడు నెలలపాటు సెక్స్‌కు దూరంగా ఉంటున్నాము. మంట దూరమయ్యేదెలా?
- యు.పి.ఆర్., కర్నూలు
కొన్నిసార్లు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వల్ల మాత్రమే గాకుండా క్లమిడియా, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా ఇలా మంట వచ్చే ప్రమాదం ఉంది. అయితే, సమస్య నిర్ధారణ కోసం రక్తం, మూత్ర పరీక్షలు చేయించాల్సివుంటుంది. ఆరు వారాల పాటు దానికి తగిన యాంటీబయాటిక్స్ వాడాల్సివుంటుంది. ఈ గడువు- అంటే ఈ ఆరు వారాల పాటు మాత్రం శృంగారంలో పాల్గొనేప్పుడు మీరు కండోమ్ ధరించండి. దాంతో ఈ సమస్యను నియంత్రించవచ్చు. చింతించాల్సిన అవసరం లేదు.
డా. వి.చంద్రమోహన్,
యూరోసర్జన్, ఆండ్రాలజిస్ట్,
ప్రీతి యూరాలజీ - కిడ్నీ హాస్పిటల్,
కెపిహెచ్‌బి, హైదరాబాద్
మీ సందేహాలను పంపవలసిన చిరునామా: వ్యక్తిగతం, ఫన్‌డే, సాక్షి తెలుగు దినపత్రిక, 6-3-249/1, రోడ్ నం.1, బంజారాహిల్స్, హైదరాబాద్ - 34. vyaktigatam.sakshi@gmail.com